మార్కు సువార్త 15:1-47

  • యేసును పిలాతుకు అప్పగించడం (1-15)

  • అందరిముందు ఎగతాళి చేయడం (16-20)

  • గొల్గొతాలో కొయ్యకు దిగగొట్టడం (21-32)

  • యేసు మరణం (33-41)

  • యేసును సమాధి చేయడం (42-47)

15  తెల్లవారగానే ముఖ్య యాజకులు పెద్దలతో, శాస్త్రులతో, నిజానికి మహాసభ వాళ్లందరితో చర్చలు జరిపి, యేసు చేతులు కట్టేసి ఆయన్ని తీసుకెళ్లి పిలాతుకు అప్పగించారు.+  అప్పుడు పిలాతు, “నువ్వు యూదుల రాజువా?” అని యేసును అడిగాడు.+ అందుకు ఆయన, “నువ్వే స్వయంగా ఆ మాట అంటున్నావు కదా” అన్నాడు.+  కానీ ముఖ్య యాజకులు ఆయన మీద ఎన్నో తప్పులు ఆరోపించారు.  పిలాతు మళ్లీ ఆయన్ని ప్రశ్నిస్తూ, “నువ్వేమీ మాట్లాడవా?+ వాళ్లు నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు”+ అన్నాడు.  కానీ యేసు మాత్రం ఇంకేమీ మాట్లాడలేదు, దాంతో పిలాతుకు చాలా ఆశ్చర్యమేసింది.+  పిలాతు ప్రతీ పస్కా పండుగకు ప్రజలు కోరుకున్న ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక.+  ఆ సమయంలో, రాజద్రోహానికి పాల్పడి హత్య చేసిన నేరగాళ్లు చెరసాలలో ఉన్నారు. వాళ్లలో బరబ్బ ఒకడు.  వాడుక ప్రకారం ప్రజలు తమ కోరికను తెలపడానికి పిలాతు దగ్గరికి వచ్చారు.  అప్పుడు పిలాతు, “మీ కోసం యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని వాళ్లను అడిగాడు.+ 10  ఎందుకంటే, ముఖ్య యాజకులు ఈర్ష్యతోనే యేసును తనకు అప్పగించారని పిలాతుకు తెలుసు.+ 11  కానీ ముఖ్య యాజకులు, యేసుకు బదులు బరబ్బను విడుదల చేయమని కోరుకునేలా ప్రజల్ని ఉసిగొల్పారు.+ 12  పిలాతు మళ్లీ ప్రజల్ని, “మరి యూదుల రాజు అని మీరు పిలిచే ఇతన్ని ఏమి చేయాలి?” అని అడిగాడు.+ 13  వాళ్లు మళ్లీ బిగ్గరగా, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* అని అరిచారు.+ 14  కానీ పిలాతు వాళ్లను, “ఎందుకు? ఇతను ఏం తప్పు చేశాడు?” అని అడిగాడు. అయినా వాళ్లు ఇంకా బిగ్గరగా, “అతనికి కొయ్యపై శిక్ష వేయండి!”* అని అరుస్తూ ఉన్నారు.+ 15  అప్పుడు పిలాతు ప్రజల్ని తృప్తిపర్చడానికి బరబ్బను విడుదల చేశాడు; యేసునేమో కొరడాలతో కొట్టించి,+ కొయ్య మీద మరణశిక్ష వేయడానికి సైనికులకు అప్పగించాడు.+ 16  సైనికులు ఆయన్ని అధిపతి భవనం ప్రాంగణంలోకి తీసుకొచ్చారు, తర్వాత సైనికులందర్నీ పోగుచేశారు.+ 17  వాళ్లు ఆయనకు ఊదారంగు వస్త్రం తొడిగి, ముళ్ల కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు; 18  తర్వాత, “యూదుల రాజా, నమస్కారం!”* అని అనడం మొదలుపెట్టారు.+ 19  అంతేకాదు, రెల్లుకర్రతో ఆయన తలమీద కొట్టారు, ఆయన మీద ఉమ్మేశారు, మోకాళ్లూని ఆయనకు వంగి నమస్కారం* చేశారు. 20  ఆయన్ని ఎగతాళి చేశాక, ఆయన ఒంటిమీదున్న ఊదారంగు వస్త్రం తీసేసి, ఆయన పైవస్త్రాలు ఆయనకు వేశారు. తర్వాత, మేకులతో కొయ్యకు దిగగొట్టడానికి ఆయన్ని బయటికి తీసుకెళ్లారు.+ 21  దారిలో, పల్లెటూరి నుండి వస్తున్న కురేనేవాడైన సీమోను వాళ్లకు ఎదురయ్యాడు. అతను అలెక్సంద్రు, రూఫువాళ్ల నాన్న. సైనికులు అతన్ని యేసు హింసాకొయ్యను* మోయమని బలవంతపెట్టారు.+ 22  సైనికులు యేసును గొల్గొతా అనే చోటుకు తీసుకొచ్చారు, గొల్గొతా అనే మాటను అనువదిస్తే, “కపాల స్థలం” అని అర్థం.+ 23  అక్కడ వాళ్లు బోళం* కలిపిన ద్రాక్షారసాన్ని ఆయనతో తాగించాలని చూశారు,+ కానీ ఆయన తాగలేదు. 24  తర్వాత వాళ్లు ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టారు. ఆయన పైవస్త్రాల్లో ఎవరికి ఏది వస్తుందో తెలుసుకోవడానికి చీట్లు* వేసి, వాటిని పంచుకున్నారు.+ 25  ఉదయం దాదాపు 9 గంటలకు* ఆయన్ని మేకులతో కొయ్యకు దిగగొట్టారు. 26  “యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరాన్ని చెక్కించి పెట్టారు.+ 27  అంతేకాదు ఆయన పక్కన ఇద్దరు బందిపోటు దొంగల్ని కూడా కొయ్యలకు వేలాడదీశారు. ఒకతన్ని ఆయన కుడివైపున, ఇంకొకతన్ని ఆయన ఎడమవైపున వేలాడదీశారు.+ 28  *—— 29  ఆ దారిలో వెళ్తున్నవాళ్లు తలలాడిస్తూ, ఆయన్ని దూషిస్తూ+ ఇలా అన్నారు: “అబ్బో, నువ్వు ఆలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కడతావా?+ 30  హింసాకొయ్య* మీద నుండి దిగొచ్చి నిన్ను నువ్వు రక్షించుకో!” 31  శాస్త్రులతో కలిసి ముఖ్య యాజకులు కూడా ఆయన్ని ఎగతాళి చేస్తూ ఇలా మాట్లాడుకున్నారు: “ఇతను వేరేవాళ్లను రక్షించాడు; కానీ తనను తాను రక్షించుకోలేడు!+ 32  ఈ క్రీస్తును, ఈ ఇశ్రాయేలు రాజును హింసాకొయ్య* మీద నుండి దిగి రమ్మనండి చూద్దాం, అప్పుడు నమ్మవచ్చు.”+ ఆయన పక్కన కొయ్యల మీద వేలాడుతున్న దొంగలు కూడా ఆయన్ని నిందిస్తూ ఉన్నారు.+ 33  దాదాపు మధ్యాహ్నం 12 గంటల* నుండి దాదాపు మధ్యాహ్నం మూడింటి* వరకు ఆ దేశమంతా చీకటి కమ్ముకుంది.+ 34  దాదాపు మూడింటికి యేసు బిగ్గరగా, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని అన్నాడు. ఆ మాటల్ని అనువదిస్తే, “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.+ 35  అక్కడ దగ్గర్లో నిలబడి ఉన్నవాళ్లలో కొందరు అది విని, “చూడండి! ఇతను ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 36  అంతలో ఒకతను పరుగెత్తుకెళ్లి ఒక స్పాంజీని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, రెల్లుకర్రకు తగిలించి, తాగడానికి ఆయనకు ఇస్తూ,+ “ఉండండి! ఇతన్ని కిందికి దించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం” అన్నాడు. 37  కానీ, యేసు గట్టిగా కేకవేసి చనిపోయాడు.*+ 38  అప్పుడు ఆలయంలోని తెర*+ పైనుండి కింది వరకు రెండుగా చిరిగిపోయింది.+ 39  యేసుకు ఎదురుగా నిలబడివున్న సైనికాధికారి ఆయన చనిపోయే సమయంలో జరిగిన సంఘటనలు చూసి, “ఖచ్చితంగా ఈయన దేవుని కుమారుడు” అని అన్నాడు.+ 40  కొంతమంది స్త్రీలు కాస్త దూరంలో నిలబడి చూస్తున్నారు. వాళ్లలో మగ్దలేనే మరియ; చిన్న యాకోబు, యోసే అనేవాళ్ల అమ్మ మరియ; సలోమే ఉన్నారు.+ 41  వీళ్లు యేసు గలిలయలో ఉన్నప్పుడు ఆయన వెంటే ఉంటూ ఆయనకు సేవలు చేసేవాళ్లు.+ అక్కడ, యేసుతో కలిసి యెరూషలేముకు వచ్చిన చాలామంది వేరే స్త్రీలు కూడా వాళ్లతోపాటు ఉన్నారు. 42  అప్పటికే సాయంకాలం కావస్తోంది, పైగా అది సిద్ధపడే రోజు, అంటే విశ్రాంతి రోజుకు ముందురోజు. 43  కాబట్టి అరిమతయియకు చెందిన యోసేపు పిలాతు దగ్గరికి వెళ్లాడు. ఈ యోసేపు మహాసభలో గౌరవనీయ సభ్యుడు, అతను దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తూ ఉన్నవాడు. అతను ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరికి వెళ్లి యేసు శరీరాన్ని ఇవ్వమని అడిగాడు.+ 44  కానీ పిలాతు, యేసు చనిపోయాడో లేదో తెలుసుకోవాలనుకుని, సైనికాధికారిని ఆ విషయం అడిగాడు. 45  యేసు చనిపోయాడని పిలాతు సైనికాధికారి దగ్గర నిర్ధారించుకున్నాక ఆయన శరీరాన్ని తీసుకెళ్లడానికి యోసేపుకు అనుమతి ఇచ్చాడు. 46  యోసేపు ఒక నాణ్యమైన నారవస్త్రం కొనుక్కొచ్చాడు; తర్వాత యేసును కిందికి దించి, ఆ వస్త్రాన్ని ఆయనకు చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో* ఆయన్ని పెట్టాడు;+ తర్వాత ఆ సమాధి ద్వారానికి అడ్డుగా ఒక రాయిని దొర్లించాడు.+ 47  మగ్దలేనే మరియ, యోసేవాళ్ల అమ్మ మరియ మాత్రం ఆ సమాధినే చూస్తూ ఉండిపోయారు.+

అధస్సూచీలు

లేదా “అతనికి కొయ్య శిక్ష వేసి చంపేయండి!”
లేదా “అతనికి కొయ్య శిక్ష వేసి చంపేయండి!”
లేదా “జయం!”
లేదా “సాష్టాంగ నమస్కారం.”
పదకోశం చూడండి.
ఈ పదార్థం మత్తు కలిగిస్తుంది.
పదకోశం చూడండి.
అక్ష., “మూడో గంటకు.”
అనుబంధం A3 చూడండి.
పదకోశం చూడండి.
పదకోశం చూడండి.
అక్ష., “ఆరో గంట.”
అక్ష., “తొమ్మిదో గంట.”
లేదా “తుదిశ్వాస విడిచాడు.”
ఇది పవిత్ర స్థలాన్ని, అతి పవిత్ర స్థలాన్ని వేరుచేసే తెర.
లేదా “స్మారక సమాధిలో.”