కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందుమాట

పవిత్ర బైబిలు ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దాని రచయిత గురించి తెలుసుకోవాలంటే మనం దాన్ని చదవాలి. (యోహాను 17:3; 2 తిమోతి 3:16) దానిలోని పేజీల ద్వారా యెహోవా దేవుడు మనుషుల విషయంలో, వాళ్లు నివసిస్తున్న భూమి విషయంలో తన ఉద్దేశం ఏమిటో తెలియజేస్తున్నాడు.—ఆదికాండం 3:15; ప్రకటన 21:3, 4.

ప్రజల జీవితాల మీద బైబిలు చూపించినంత ప్రభావం వేరే ఏ పుస్తకం చూపించలేదు. యెహోవాకున్న ప్రేమ, కరుణ, కనికరం అనే లక్షణాలు చూపించేలా బైబిలు మనల్ని కదిలిస్తుంది. అది, అత్యంత ఘోరమైన కష్టాల్ని కూడా సహించేలా సహాయం చేస్తూ ప్రజల్లో ఆశను నింపుతుంది. ఈ లోకంలోని ఏయే విషయాలు దేవుని పరిపూర్ణ ఇష్టానికి అనుగుణంగా లేవో అది తెలియజేస్తూ ఉంది.—కీర్తన 119:105; హెబ్రీయులు 4:12; 1 యోహాను 2:15-17.

బైబిలు మొదట హీబ్రూ, అరామిక్‌, గ్రీకు భాషల్లో రాయబడి, ఆ తర్వాత వేరే భాషల్లోకి అనువదించబడింది. ఇప్పుడు పూర్తి బైబిలు లేదా అందులోని కొంతభాగం 3,000 కన్నా ఎక్కువ భాషల్లో ఉంది. ఇప్పటివరకు ఉన్న పుస్తకాల్లో అన్నిటికన్నా ఎక్కువ భాషల్లోకి అనువదించబడి, ఎక్కువమందికి అందుబాటులో ఉన్న పుస్తకం అదే. మనం అంతకన్నా తక్కువ ఆశించలేం. ఎందుకంటే బైబిలు ప్రవచనం ఇలా చెప్తుంది: “అన్నిదేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, ఈ రాజ్య సువార్త [బైబిల్లో ఉన్న ముఖ్య సందేశం] భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”—మత్తయి 24:14.

బైబిలు సందేశం ఎంత ప్రాముఖ్యమైందో గుర్తించడం వల్ల మేము మూలపాఠానికి నమ్మకంగా ఉండడంతో పాటు స్పష్టంగా, చదవడానికి తేలిగ్గా ఉన్న అనువాదం తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేశాం. అనువదించేటప్పుడు పాటించిన కొన్ని సూత్రాల గురించి, ఈ అనువాదం ప్రత్యేకతను తెలిపే కొన్ని విషయాల గురించి అనుబంధంలోని “బైబిలు అనువాద సూత్రాలు,” “ఈ అనువాదంలోని ప్రత్యేకతలు,” “బైబిలు మన వరకు ఎలా వచ్చింది?” అనే ఆర్టికల్స్‌లో ఉంది.

యెహోవా దేవుణ్ణి ప్రేమించి, ఆయన్ని ఆరాధించేవాళ్లు దేవుని వాక్య అనువాదం ఖచ్చితంగా, అర్థమయ్యేలా ఉండాలని కోరుకుంటారు. (1 తిమోతి 2:4) అందుకే, కొత్త లోక అనువాదం బైబిల్ని వీలైనన్ని ఎక్కువ భాషల్లోకి అనువదించాలనే మా ఉద్దేశానికి అనుగుణంగా దీన్ని తెలుగు భాషలో కూడా తయారుచేశాం. ప్రియ పాఠకులారా, మీరు దేవుణ్ణి “వెతికి . . . కనుక్కోవాలని” కృషి చేస్తుండగా, పవిత్ర లేఖనాల ఈ అనువాదం మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం.—అపొస్తలుల కార్యాలు 17:27.

కొత్త లోక బైబిలు అనువాద కమిటీ

ఆగస్టు 2013