మార్కు సువార్త 6:1-56

  • సొంత ఊరివాళ్లు యేసును తిరస్కరించడం (1-6)

  • పరిచర్య కోసం పన్నెండుమందికి నిర్దేశాలు (7-13)

  • బాప్తిస్మమిచ్చే యోహాను మరణం (14-29)

  • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (30-44)

  • యేసు నీళ్ల మీద నడవడం (45-52)

  • గెన్నేసరెతులో రోగుల్ని బాగుచేయడం (53-56)

6  ఆయన అక్కడి నుండి బయల్దేరి తన సొంత ఊరికి వచ్చాడు,+ ఆయన శిష్యులు కూడా ఆయనతో వచ్చారు.  విశ్రాంతి రోజున ఆయన సమాజమందిరంలో బోధించడం మొదలుపెట్టాడు. ఆయన మాటలు విన్న చాలామంది ఎంతో ఆశ్చర్యపోయి ఇలా చెప్పుకున్నారు: “ఇతను ఈ విషయాలన్నీ ఎక్కడ నేర్చుకున్నాడు?+ ఇతనికి ఈ తెలివి, శక్తివంతమైన పనులు చేసే ఈ సామర్థ్యం ఎక్కడి నుండి వచ్చాయి?+  ఇతను వడ్రంగే కదా?+ మరియ కుమారుడే కదా?+ ఇతను యాకోబు,+ యోసేపు, యూదా, సీమోనువాళ్ల+ అన్నయ్యే కదా? ఇతని చెల్లెళ్లు మన మధ్యే ఉన్నారు కదా?” ఆ విధంగా వాళ్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు.  కాబట్టి యేసు వాళ్లతో, “ఒక ప్రవక్తను సొంత ఊరివాళ్లు, బంధువులు, ఇంటివాళ్లు తప్ప అందరూ గౌరవిస్తారు” అన్నాడు.+  అందుకే అక్కడ ఆయన కొందరు రోగుల మీద చేతులుంచి బాగుచేయడం తప్ప మరే శక్తివంతమైన పనీ చేయలేకపోయాడు.  నిజానికి, వాళ్లకు విశ్వాసం లేకపోవడం చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఆయన చుట్టుపక్కల పల్లెటూళ్లకు వెళ్లి బోధించాడు.+  ఆ తర్వాత ఆయన పన్నెండుమందిని పిలిచి వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించడం మొదలుపెట్టాడు,+ అపవిత్ర దూతల్ని* వెళ్లగొట్టే అధికారం వాళ్లకు ఇచ్చాడు.+  అంతేకాదు ప్రయాణానికి చేతికర్రను తప్ప రొట్టెలు గానీ, ఆహారం మూట గానీ, డబ్బు* సంచి గానీ తీసుకెళ్లొద్దని+ ఆజ్ఞాపించాడు.  చెప్పులు వేసుకొమ్మని, రెండు వస్త్రాలు* తీసుకెళ్లొద్దని* చెప్పాడు. 10  ఆయన వాళ్లకు ఇంకా ఇలా చెప్పాడు: “ఎక్కడైనా మీరొక ఇంట్లో అడుగుపెడితే, ఆ ఊరు నుండి వెళ్లిపోయేవరకు ఆ ఇంట్లోనే ఉండండి.+ 11  ఎక్కడైనా ప్రజలు మిమ్మల్ని చేర్చుకోకపోతే లేదా మీరు చెప్పేది వినకపోతే, మీరు అక్కడి నుండి వెళ్లిపోయేటప్పుడు వాళ్లకు సాక్ష్యంగా ఉండడానికి మీ పాదాలకున్న దుమ్ము దులిపేయండి.”+ 12  అప్పుడు వాళ్లు బయల్దేరి, పశ్చాత్తాపపడమని ప్రజలకు ప్రకటించారు,+ 13  చాలామంది చెడ్డదూతల్ని* వెళ్లగొట్టారు,+ ఎంతోమంది రోగులకు నూనె రాసి బాగుచేశారు. 14  యేసు పేరుప్రఖ్యాతులు అంతటా వ్యాపించడంతో, ఆ వార్త హేరోదు రాజు చెవిన కూడా పడింది. ప్రజలు ఆయన గురించి, “బాప్తిస్మమిచ్చే యోహాను మృతుల్లో నుండి బ్రతికించబడ్డాడు, అందుకే ఆయన శక్తివంతమైన పనులు చేయగలుగుతున్నాడు” అని చెప్పుకుంటున్నారు.+ 15  అయితే కొందరు “ఈయన ఏలీయా” అనీ, ఇంకొందరు “ప్రాచీనకాల ప్రవక్తల్లాగే ఒక ప్రవక్త” అనీ అన్నారు.+ 16  కానీ హేరోదు యేసు గురించి విన్నప్పుడు, “నేను తల నరికించిన యోహానే మళ్లీ బ్రతికాడు” అని అన్నాడు. 17  అంతకుముందు హేరోదు తన అన్న ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నాడు, ఆమె కోసం సైనికుల్ని పంపి యోహానును బంధించి చెరసాలలో వేయించాడు.+ 18  ఎందుకంటే యోహాను హేరోదుతో, “నువ్వు నీ అన్న భార్యను పెళ్లి చేసుకోవడం తప్పు”+ అని అంటూ ఉండేవాడు. 19  అందుకే హేరోదియ పగబట్టి యోహానును చంపాలనుకుంది, కానీ చంపలేకపోయింది. 20  ఎందుకంటే యోహాను నీతిమంతుడని, పవిత్రుడని హేరోదుకు తెలుసు+ కాబట్టి హేరోదు అతనికి భయపడి, అతన్ని కాపాడుతూ వచ్చాడు. అతని మాటలు విన్నప్పుడు హేరోదుకు అతన్ని ఏమి చేయాలో అర్థమయ్యేది కాదు, అయినా అతను చెప్పేది సంతోషంగా వినేవాడు. 21  చివరికి హేరోదియ ఎదురుచూసిన అవకాశం రానేవచ్చింది. అది హేరోదు పుట్టినరోజు.+ ఆ రోజు అతను రాజ్యంలోని ఉన్నతాధికారులకు, సహస్రాధిపతులకు,* గలిలయలోని ప్రముఖులకు విందు ఏర్పాటు చేశాడు.+ 22  అప్పుడు హేరోదియ కూతురు వాళ్ల ముందుకొచ్చి నాట్యం చేసి హేరోదును, అతనితో కలిసి భోంచేస్తున్నవాళ్లను సంతోషపెట్టింది. అప్పుడు రాజు ఆ అమ్మాయితో, “నీకేం కావాలన్నా అడుగు, ఇచ్చేస్తాను” అన్నాడు. 23  అంతేకాదు, “నా రాజ్యంలో సగభాగం వరకు ఏది అడిగినా ఇచ్చేస్తాను” అని ప్రమాణం చేశాడు. 24  అప్పుడు ఆమె అక్కడి నుండి వాళ్లమ్మ దగ్గరికి వెళ్లి, “నేను ఏం కోరుకోవాలి?” అని అడిగింది. దానికి వాళ్లమ్మ, “బాప్తిస్మమిచ్చే యోహాను తల అడుగు” అని చెప్పింది. 25  వెంటనే ఆమె త్వరత్వరగా రాజు దగ్గరికి వచ్చి, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను ఒక పళ్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇవ్వు” అని అడిగింది.+ 26  ఆ మాట విన్నప్పుడు రాజుకు తీవ్ర దుఃఖం కలిగింది. కానీ రాజు అప్పటికే ప్రమాణాలు చేసి ఉండడం వల్ల, అతిథులు ఉండడం వల్ల ఆమె కోరికను కాదనలేకపోయాడు. 27  కాబట్టి రాజు వెంటనే ఒక అంగరక్షకుణ్ణి పిలిచి యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతను చెరసాలకు వెళ్లి యోహాను తల నరికి, 28  దాన్ని ఒక పళ్లెంలో పెట్టి తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు, ఆమె దాన్ని తీసుకెళ్లి వాళ్లమ్మకు ఇచ్చింది. 29  యోహాను శిష్యులకు ఆ విషయం తెలిసినప్పుడు, వాళ్లు వచ్చి అతని శరీరాన్ని తీసుకెళ్లి సమాధిలో* పెట్టారు. 30  అపొస్తలులు తిరిగొచ్చి యేసు చుట్టూ చేరి, తాము ఏమేం చేశారో, ఏమేం బోధించారో అన్నీ ఆయనకు తెలియజేశారు.+ 31  అప్పుడు యేసు, “రండి, మనం ఏకాంత ప్రదేశానికి వెళ్దాం, మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు”+ అని వాళ్లతో అన్నాడు. ఎందుకంటే చాలామంది వస్తూపోతూ ఉండడం వల్ల వాళ్లకు తినడానికి కూడా తీరిక లేకపోయింది. 32  అందుకే వాళ్లు ఒక పడవలో ఏకాంత ప్రదేశానికి బయల్దేరారు.+ 33  కానీ ప్రజలు వాళ్లు వెళ్లడం చూశారు, దాంతో ఆ విషయం చాలామందికి తెలిసిపోయింది. అప్పుడు అన్ని నగరాల ప్రజలు పరుగెత్తుకుంటూ వెళ్లి వాళ్లకన్నా ముందే అక్కడికి చేరుకున్నారు. 34  యేసు పడవ దిగినప్పుడు, అక్కడ చాలామంది ప్రజలు ఉండడం చూశాడు, వాళ్లు కాపరిలేని గొర్రెల్లా+ ఉండడంతో వాళ్లమీద జాలిపడ్డాడు.+ అప్పుడు ఆయన వాళ్లకు చాలా విషయాలు బోధించడం మొదలుపెట్టాడు.+ 35  సాయంత్రం కావస్తుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “ఇది మారుమూల ప్రాంతం, పైగా సాయంత్రం కావస్తోంది.+ 36  వాళ్లను పంపించేస్తే, చుట్టుపక్కల ఊళ్లలోకి, గ్రామాల్లోకి వెళ్లి తినడానికి ఏమైనా కొనుక్కుంటారు.”+ 37  దానికి యేసు వాళ్లతో, “మీరే వాళ్లకు తినడానికి ఏమైనా పెట్టండి” అన్నాడు. వాళ్లు, “ఇప్పుడు మమ్మల్ని 200 దేనారాల* రొట్టెలు కొనుక్కొచ్చి, వాళ్లకు పెట్టమంటావా?” అన్నారు.+ 38  అప్పుడు యేసు వాళ్లతో, “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయో వెళ్లి చూడండి!” అన్నాడు. వాళ్లు చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని చెప్పారు.+ 39  అప్పుడు ఆయన ప్రజలందర్నీ పచ్చిక మీద గుంపులవారీగా కూర్చోమని చెప్పాడు.+ 40  వాళ్లంతా 100 మంది చొప్పున, 50 మంది చొప్పున కూర్చున్నారు. 41  అప్పుడు ఆయన ఆ ఐదు రొట్టెల్ని, రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు.*+ తర్వాత ఆయన రొట్టెల్ని విరిచి, ప్రజలకు పంచిపెట్టడానికి శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు. అదేవిధంగా ఆయన రెండు చేపల్ని కూడా అందరికీ పంచిపెట్టమని చెప్పాడు. 42  దాంతో వాళ్లంతా తృప్తిగా తిన్నారు. 43  మిగిలినవాటిని శిష్యులు పోగుచేసినప్పుడు, చేపలు కాక రొట్టె ముక్కలే 12 గంపలు నిండాయి.+ 44  రొట్టెలు తిన్న పురుషులు 5,000 మంది. 45  తర్వాత యేసు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శిష్యుల్ని పడవ ఎక్కించి బేత్సయిదా మీదుగా అవతలి ఒడ్డుకు వెళ్లమన్నాడు. వాళ్లు వెళ్తుండగా ఆయన ప్రజల్ని పంపించేశాడు.+ 46  ప్రజలు వెళ్లిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఒక కొండ మీదికి వెళ్లాడు.+ 47  చీకటిపడే సమయానికి శిష్యుల పడవ సముద్రం మధ్యలో ఉంది, కానీ యేసు ఇంకా కొండ మీదే ఉన్నాడు.+ 48  ఎదురుగాలి వీస్తున్నందువల్ల శిష్యులు పడవ నడపడానికి చాలా కష్టపడడం యేసు చూశాడు. రాత్రి దాదాపు నాలుగో జామున* ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ వాళ్లవైపు వెళ్లాడు; నిజానికి ఆయన వాళ్లను దాటి వెళ్లిపోతున్నట్టు అనిపించింది.* 49  ఆయన అలా సముద్రం మీద నడుచుకుంటూ రావడం శిష్యులు చూసినప్పుడు, “అమ్మో, అదేదో వస్తోంది!” అంటూ కేకలు వేశారు. 50  ఎందుకంటే వాళ్లంతా ఆయన్ని చూశారు, భయపడిపోయారు. కానీ యేసు వెంటనే వాళ్లతో, “భయపడకండి, నేనే!” అన్నాడు.+ 51  తర్వాత ఆయన వాళ్ల పడవ ఎక్కాడు, గాలి ఆగిపోయింది. అది చూసి వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు. 52  ఆయన రొట్టెలతో చేసిన అద్భుతం చూసి కూడా వాళ్లు ఏమీ గ్రహించలేదు, వాళ్ల హృదయాలు ఇంకా అర్థంచేసుకోలేని స్థితిలోనే ఉన్నాయి. 53  వాళ్లు సముద్రం దాటి గెన్నేసరెతు తీరం చేరుకొని అక్కడ పడవకు లంగరు వేశారు.+ 54  అయితే వాళ్లు పడవ దిగిన వెంటనే, ప్రజలు ఆయన్ని గుర్తుపట్టారు. 55  వాళ్లు పరుగెత్తుకుంటూ ఆ ప్రాంతమంతా తిరిగి రోగుల్ని మంచాల* మీద యేసు దగ్గరికి మోసుకొచ్చారు. 56  ఆయన ఏ గ్రామంలోకైనా, నగరంలోకైనా, పల్లెలోకైనా వెళ్లినప్పుడల్లా ప్రజలు రోగుల్ని సంతలకు తీసుకొచ్చి, వాళ్లను ఆయన పైవస్త్రం అంచును మాత్రం ముట్టుకోనివ్వమని బ్రతిమాలేవాళ్లు.+ అలా ముట్టుకున్న వాళ్లంతా బాగయ్యారు.

అధస్సూచీలు

పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
అక్ష., “రాగి.”
లేదా “అదనపు వస్త్రం.”
అక్ష., “వేసుకోవద్దని.”
పదకోశం చూడండి.
వీళ్ల కింద 1,000 మంది సైనికులు ఉండేవాళ్లు.
లేదా “స్మారక సమాధిలో.”
అనుబంధం B14 చూడండి.
అక్ష., “దీవించాడు.”
అంటే, దాదాపు రాత్రి 3 గంటల నుండి దాదాపు ఉదయం 6 గంటల వరకు.
లేదా “వెళ్లిపోబోయాడు.”
రోగుల్ని మోసుకెళ్లే చిన్న పరుపులు.