మార్కు సువార్త 13:1-37
13 ఆయన ఆలయంలో నుండి బయటికి వస్తుండగా ఆయన శిష్యుల్లో ఒకతను, “బోధకుడా, ఒకసారి అటు చూడు! ఆ రాళ్లు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా!”+ అన్నాడు.
2 అయితే యేసు అతనితో, “ఈ గొప్ప కట్టడాలు నువ్వు చూస్తున్నావు కదా? రాయి మీద రాయి అనేదే లేకుండా ఇవి పడగొట్టబడతాయి”+ అని చెప్పాడు.
3 ఆయన ఒలీవల కొండ మీద ఆలయం కనిపించే చోట కూర్చొని ఉన్నప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు:
4 “ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ముగింపుకు రాబోతున్నాయని తెలిపే సూచన ఏమిటి? మాతో చెప్పు.”+
5 అందుకు యేసు వాళ్లకు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: “ఎవరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి.+
6 చాలామంది నా పేరుతో వచ్చి, ‘నేనే ఆయన్ని’ అని చెప్పుకుంటూ ఎంతోమందిని తప్పుదారి పట్టిస్తారు.
7 అంతేకాదు మీరు యుద్ధాల గురించి, యుద్ధ వార్తల గురించి విన్నప్పుడు కంగారుపడకండి; ఇవన్నీ జరగాలి, కానీ అంతం అప్పుడే రాదు.+
8 “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి;+ ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో భూకంపాలు వస్తాయి; ఆహారకొరతలు కూడా వస్తాయి.+ ఇవి పురిటినొప్పుల లాంటి వేదనలకు ఆరంభం.
9 “మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రజలు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగిస్తారు,+ సమాజమందిరాల్లో మిమ్మల్ని కొడతారు.+ నా కారణంగా మిమ్మల్ని అధిపతుల ముందు, రాజుల ముందు నిలబెడతారు. అప్పుడు వాళ్లకు సాక్ష్యమిచ్చే అవకాశం మీకు దొరుకుతుంది.+
10 అంతేకాదు అన్నిదేశాల్లో ముందుగా మంచివార్త ప్రకటించబడాలి.+
11 వాళ్లు మిమ్మల్ని అప్పగించడానికి తీసుకెళ్తున్నప్పుడు, ఏమి మాట్లాడాలా అని ముందే ఆందోళన పడకండి; ఆ సమయంలో మీకు ఏమి అనుగ్రహించబడితే అదే మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు పవిత్రశక్తి.+
12 సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి తన బిడ్డను చంపడం కోసం అప్పగిస్తారు, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వాళ్లను చంపిస్తారు.+
13 మీరు నా శిష్యులుగా ఉన్నందుకు అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ అంతం వరకు సహించినవాళ్లే*+ రక్షించబడతారు.+
14 “అయితే, నాశనాన్ని కలగజేసే అసహ్యమైన వస్తువు ఉండకూడని చోట ఉండడం+ మీరు చూసినప్పుడు (చదివే వ్యక్తి వివేచన ఉపయోగించాలి), యూదయలో ఉన్నవాళ్లు కొండలకు పారిపోవడం మొదలుపెట్టాలి.+
15 డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో నుండి ఏదైనా తెచ్చుకోవడానికి కిందికి దిగకూడదు, ఇంట్లోకి వెళ్లకూడదు;
16 పొలంలో ఉన్న వ్యక్తి తన పైవస్త్రం తెచ్చుకోవడానికి వెనక్కి రాకూడదు.
17 ఆ రోజుల్లో గర్భిణులకు, పాలిచ్చే స్త్రీలకు శ్రమ!+
18 అది చలికాలంలో రాకూడదని ప్రార్థిస్తూ ఉండండి;
19 ఎందుకంటే అవి శ్రమతో నిండిన రోజులు;+ దేవుని సృష్టి ఆరంభం నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు, మళ్లీ రాదు కూడా.+
20 నిజానికి, యెహోవా* ఆ రోజుల్ని తగ్గించకపోతే, ఒక్కరు కూడా తప్పించుకోలేరు. కానీ, తాను ఎంచుకున్నవాళ్ల కోసం ఆయన ఆ రోజుల్ని తగ్గించాడు.
21 “ఎవరైనా మీతో, ‘ఇదిగో! క్రీస్తు ఇక్కడ ఉన్నాడు,’ ‘అదిగో! ఆయన అక్కడ ఉన్నాడు’ అని చెప్తే నమ్మకండి.+
22 ఎందుకంటే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు పుట్టుకొచ్చి+ సాధ్యమైతే ఎంచుకోబడిన వాళ్లను కూడా తప్పుదారి పట్టించడానికి సూచనలు, అద్భుతాలు చేస్తారు.
23 కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి.+ నేను అన్ని విషయాలు మీకు ముందే చెప్పేశాను.
24 “కానీ ఆ రోజుల్లో, ఆ శ్రమ తర్వాత సూర్యుడు చీకటిమయమౌతాడు, చంద్రుడు వెలుగు ఇవ్వడు,
25 నక్షత్రాలు ఆకాశం నుండి రాలిపోతాయి; ఆకాశంలోని శక్తులు కదిలించబడతాయి.
26 అప్పుడు మానవ కుమారుడు+ గొప్ప శక్తితో, మహిమతో మేఘాల్లో రావడం ప్రజలు చూస్తారు.+
27 తర్వాత ఆయన దూతల్ని పంపి, నలుదిక్కుల నుండి అంటే భూమి అంచుల నుండి, ఆకాశం అంచుల వరకు దేవుడు ఎంచుకున్న వాళ్లను* సమకూరుస్తాడు.+
28 “అంజూర చెట్టు ఉదాహరణను* గమనించండి: ఆ చెట్టు కొమ్మలు పచ్చగా, లేతగా తయారై చిగురించగానే ఎండాకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది.+
29 అదేవిధంగా, ఈ విషయాలు జరగడం మీరు చూసినప్పుడు ఆయన దగ్గర్లోనే అంటే గుమ్మం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
30 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఇవన్నీ జరిగే వరకు ఈ తరం అస్సలు గతించిపోదు.+
31 ఆకాశం, భూమి గతించిపోతాయి,+ కానీ నా మాటలు ఎప్పటికీ నిలిచివుంటాయి.+
32 “ఆ రోజు గురించి, ఆ గంట గురించి ఎవ్వరికీ తెలీదు. పరలోకంలోని దూతలకు గానీ, కుమారునికి గానీ తెలీదు; తండ్రికి మాత్రమే తెలుసు.+
33 ఆ సమయం* ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు+ కాబట్టి అప్రమత్తంగా, మెలకువగా ఉండండి.+
34 అది, ఒక వ్యక్తి తన దాసులకు ఇంటిమీద అధికారం ఇచ్చి,+ ఎవరెవరు ఏమేమి చేయాలో చెప్పి, అప్రమత్తంగా ఉండమని కాపలాదారుడికి ఆజ్ఞాపించి+ వేరేదేశానికి వెళ్లిపోయినట్టు ఉంటుంది.
35 ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడో, అంటే సాయంకాలం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, తెల్లవారకముందు* వస్తాడో, పొద్దున వస్తాడో మీకు తెలీదు. అందుకే అప్రమత్తంగా ఉండండి.+
36 లేదంటే, అతను అకస్మాత్తుగా వచ్చినప్పుడు మీరు నిద్రపోతూ ఉండడం చూస్తాడు.+
37 నేను మీతో చెప్తున్న మాట అందరితో చెప్తున్నాను: అప్రమత్తంగా ఉండండి.”+
అధస్సూచీలు
^ లేదా “సహించేవాళ్లే.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “తనవాళ్లను.”
^ లేదా “ఉపమానాన్ని.”
^ లేదా “నిర్ణయించబడిన సమయం.”
^ అక్ష., “కోడి కూసే వేళ.”