మార్కు సువార్త 8:1-38

  • యేసు 4,000 మందికి ఆహారం పెట్టడం (1-9)

  • ఒక సూచన చూపించమని అడగడం (10-13)

  • పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి (14-21)

  • బేత్సయిదాలో గుడ్డివాడు బాగవ్వడం (22-26)

  • పేతురు క్రీస్తును గుర్తించడం (27-30)

  • యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (31-33)

  • నిజమైన శిష్యులు (34-38)

8  ఆ రోజుల్లో, ఇంకొకసారి చాలామంది ప్రజలు యేసు దగ్గరికి వచ్చారు, వాళ్ల దగ్గర తినడానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు:  “ఈ ప్రజల్ని చూస్తే నాకు జాలేస్తోంది.+ మూడు రోజులుగా వాళ్లు నాతోనే ఉన్నారు, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు.+  వాళ్లను ఇలాగే ఆకలితో ఇళ్లకు పంపించేస్తే దారిలోనే కళ్లు తిరిగి పడిపోతారు; కొందరైతే మరీ దూరం నుండి వచ్చారు.”  అయితే శిష్యులు, “ఈ మారుమూల ప్రాంతంలో ఇంతమంది ఆకలి తీర్చడానికి కావాల్సినంత ఆహారం ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు.  అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “ఏడు రొట్టెలు” అని చెప్పారు.+  అప్పుడు ఆయన ప్రజల్ని నేలమీద కూర్చోమని చెప్పాడు. తర్వాత ఆయన ఆ ఏడు రొట్టెల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని విరిచి ప్రజలకు పంచిపెట్టడానికి శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు, వాళ్లు ప్రజలకు పంచిపెట్టారు.+  వాళ్ల దగ్గర కొన్ని చిన్నచేపలు కూడా ఉన్నాయి, ఆయన వాటికోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని ప్రజలకు పంచిపెట్టమని చెప్పాడు.  ప్రజలు తృప్తిగా తిన్నారు, మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేసినప్పుడు ఏడు పెద్ద గంపలు నిండాయి.+  ఈసారి అక్కడ దాదాపు 4,000 మంది పురుషులు ఉన్నారు. తర్వాత యేసు వాళ్లను పంపించేశాడు. 10  వెంటనే ఆయన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, దల్మనూతా ప్రాంతానికి వచ్చాడు.+ 11  పరిసయ్యులు అక్కడికి వచ్చి ఆయనతో వాదించడం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించాలని, ఆకాశం నుండి ఒక సూచన చూపించమని పట్టుబట్టారు.+ 12  ఆయన గట్టిగా నిట్టూర్చి, “ఈ తరంవాళ్లు ఒక సూచన చూపించమని ఎందుకు అడుగుతున్నారు?+ నేను నిజంగా చెప్తున్నాను, ఈ తరంవాళ్లకు ఏ సూచనా ఇవ్వబడదు”+ అన్నాడు. 13  తర్వాత ఆయన వాళ్ల దగ్గర నుండి బయల్దేరి, మళ్లీ పడవ ఎక్కి అవతలి ఒడ్డుకు వెళ్లాడు. 14  అయితే శిష్యులు రొట్టెలు తీసుకురావడం మర్చిపోయారు, పడవలో వాళ్ల దగ్గర ఒక్క రొట్టె తప్ప ఇంకేమీ లేదు.+ 15  ఆయన వాళ్లను సూటిగా హెచ్చరిస్తూ, “అప్రమత్తంగా ఉండండి, పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో, హేరోదు పులిసిన పిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి” అన్నాడు.+ 16  అప్పుడు వాళ్లు తమతోపాటు రొట్టెలు తీసుకురానందుకు ఒకరితో ఒకరు గొడవపడడం మొదలుపెట్టారు. 17  అది గమనించి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “రొట్టెలు లేవని మీరెందుకు గొడవపడుతున్నారు? మీరు ఇంకా గ్రహించలేకపోతున్నారా? మీకు ఇంకా అర్థంకాలేదా? మీ హృదయాలు ఇంకా అర్థంచేసుకునే స్థితికి రాలేదా? 18  ‘మీరు కళ్లు ఉండీ చూడరా? చెవులు ఉండీ వినరా?’ ఒకసారి గుర్తుచేసుకోండి, 19  నేను ఐదు రొట్టెలు+ విరిచి 5,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన రొట్టెముక్కల్ని మీరు ఎన్ని గంపల నిండా పోగుచేశారు?” అందుకు వాళ్లు, “పన్నెండు గంపలు”+ అన్నారు. 20  “నేను ఏడు రొట్టెలు విరిచి 4,000 మంది పురుషులకు పంచిపెట్టినప్పుడు మిగిలిన రొట్టెముక్కల్ని ఎన్ని పెద్ద గంపల నిండా పోగుచేశారు?” అని ఆయన అడిగాడు. అందుకు వాళ్లు, “ఏడు పెద్ద గంపలు”+ అన్నారు. 21  అప్పుడు ఆయన వాళ్లతో, “మీకు ఇంకా అర్థంకాలేదా?” అన్నాడు. 22  ఆ తర్వాత వాళ్లు బేత్సయిదాలో ఆగారు. అక్కడ ప్రజలు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకొచ్చి, అతన్ని ముట్టుకోమని ఆయన్ని బ్రతిమాలారు.+ 23  యేసు ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి బయటికి తీసుకెళ్లాడు. ఆయన అతని కళ్లమీద ఉమ్మి వేసి,+ అతనిమీద చేతులు ఉంచి, “నీకు ఏమైనా కనిపిస్తోందా?” అని అడిగాడు. 24  అతను చుట్టూ చూసి, “నాకు మనుషులు కనిపిస్తున్నారు, కానీ వాళ్లు నడుస్తున్న చెట్లలా ఉన్నారు” అన్నాడు. 25  ఆయన మళ్లీ అతని కళ్లను ముట్టుకున్నాడు. అప్పుడు అతనికి అన్నీ స్పష్టంగా కనిపించాయి. అతనికి చూపు వచ్చింది, అతను ప్రతీది చక్కగా చూడగలిగాడు. 26  యేసు అతనికి, “ఊళ్లోకి వెళ్లకు” అని చెప్పి అతన్ని ఇంటికి పంపించేశాడు. 27  తర్వాత యేసు, ఆయన శిష్యులు ఫిలిప్పీ కైసరయ ప్రాంతంలోని గ్రామాలకు వెళ్లారు. దారిలో ఆయన, “ప్రజలు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు?” అని శిష్యుల్ని అడిగాడు.+ 28  అందుకు వాళ్లు, “బాప్తిస్మమిచ్చే యోహానువని+ చెప్పుకుంటున్నారు. కొందరేమో ఏలీయావని,+ ఇంకొందరేమో ప్రవక్తల్లో ఒకడివని చెప్పుకుంటున్నారు” అని అన్నారు. 29  అప్పుడు ఆయన, “మరి మీరు నేనెవరినని అనుకుంటున్నారు?” అని వాళ్లను అడిగాడు. అందుకు పేతురు, “నువ్వు క్రీస్తువి”+ అని చెప్పాడు. 30  అప్పుడు ఆయన తన గురించి ఎవ్వరికీ చెప్పొద్దని వాళ్లకు గట్టిగా ఆజ్ఞాపించాడు.+ 31  అంతేకాదు, మానవ కుమారుడు ఎన్నో బాధలు పడాలని; పెద్దల చేత, ముఖ్య యాజకుల చేత, శాస్త్రుల చేత తిరస్కరించబడి చంపబడతాడని;+ మూడు రోజుల తర్వాత మళ్లీ బ్రతుకుతాడని బోధించడం మొదలుపెట్టాడు.+ 32  నిజానికి ఆయన ఆ విషయాన్ని సూటిగా చెప్పాడు. కానీ పేతురు ఆయన్ని పక్కకు తీసుకెళ్లి, ఆయన్ని మందలించడం మొదలుపెట్టాడు.+ 33  అప్పుడు ఆయన శిష్యులవైపు తిరిగి వాళ్లను చూసి, పేతురును ఇలా గద్దించాడు: “సాతానా! నా వెనక్కి వెళ్లు. నువ్వు దేవుని ఆలోచనల మీద కాకుండా మనుషుల ఆలోచనల మీద మనసు పెడుతున్నావు.”+ 34  తర్వాత ఆయన శిష్యులతో పాటు ప్రజల్ని పిలిచి వాళ్లతో ఇలా అన్నాడు: “ఒక వ్యక్తి నా శిష్యుడు అవ్వాలనుకుంటే, అతను ఇక తన కోసం తాను జీవించకుండా, తన హింసాకొయ్యను* మోస్తూ నన్ను అనుసరిస్తూ ఉండాలి.+ 35  ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కోసం, మంచివార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.+ 36  నిజానికి, ఒక వ్యక్తి లోకాన్నంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, అతనికి ఏం లాభం?+ 37  ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి ఏం ఇవ్వగలడు?+ 38  వ్యభిచారులు,* పాపులు అయిన ఈ తరంవాళ్ల మధ్య ఎవరైనా నా శిష్యుణ్ణని, నా మాటలు నమ్ముతున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడితే, మానవ కుమారుడు కూడా పవిత్ర దూతలతో కలిసి తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు అతని విషయంలో సిగ్గుపడతాడు.”+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
లేదా “నమ్మకద్రోహులు.”