మార్కు సువార్త 4:1-41

 • రాజ్యం గురించి ఉదాహరణలు (1-34)

  • విత్తేవాడు (1-9)

  • యేసు ఉదాహరణలు ఉపయోగించడానికి కారణం (10-12)

  • విత్తేవాడి ఉదాహరణను వివరించడం (13-20)

  • దీపాన్ని గంప కింద పెట్టరు (21-23)

  • మీరు కొలిచే కొలత (24, 25)

  • నిద్రపోయిన విత్తేవాడు (26-29)

  • ఆవగింజ (30-32)

  • ఉదాహరణల్ని ఉపయోగించడం (33, 34)

 • యేసు తుఫానును నిమ్మళింపజేయడం (35-41)

4  యేసు మళ్లీ సముద్ర తీరాన బోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున ఆయన దగ్గరికి వచ్చారు. దాంతో ఆయన ఒక పడవ ఎక్కి తీరానికి కాస్త దూరంలో కూర్చున్నాడు, ప్రజలందరూ ఒడ్డున ఉన్నారు.+  ఆయన వాళ్లకు ఉదాహరణలతో* ఎన్నో విషయాలు బోధించడం మొదలుపెట్టి ఇలా అన్నాడు:+  “వినండి, ఇదిగో! ఒకతను విత్తనాలు చల్లడానికి బయల్దేరాడు.  అతను విత్తనాలు చల్లుతుండగా, కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.  ఇంకొన్ని విత్తనాలు అంతగా మట్టి లేని రాతినేల మీద పడ్డాయి, మట్టి ఎక్కువ లోతు లేనందువల్ల అవి వెంటనే మొలకెత్తాయి.  అయితే ఎండ వచ్చినప్పుడు అవి ఎండిపోయాయి, వేరు లేనందువల్ల వాడిపోయాయి.  మరికొన్ని విత్తనాలు ముళ్లపొదల్లో పడ్డాయి, ముళ్లపొదలు పెరిగి వాటి ఎదుగుదలను అడ్డుకోవడంతో అవి ఫలించలేదు.  అయితే కొన్ని మాత్రం మంచినేల మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు ఎక్కువగా ఫలించడం మొదలుపెట్టాయి.”+  తర్వాత ఆయన ఇలా అన్నాడు: “చెవులు ఉన్నవాడు వినాలి.”+ 10  ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండుమంది అపొస్తలులు, ఇంకొంతమంది శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆ ఉదాహరణల గురించి ఆయన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.+ 11  ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుని రాజ్యం గురించిన పవిత్ర రహస్యం+ మీకు ఇవ్వబడింది. కానీ వేరేవాళ్లకు అన్నీ ఉదాహరణలుగానే ఉండిపోతాయి.+ 12  వాళ్లు తమ కళ్లతో చూసినా కనిపించకుండా, చెవులతో విన్నా అర్థంకాకుండా ఉండేందుకే అవన్నీ ఉదాహరణల రూపంలో ఉంటాయి; వాళ్లు ఎప్పటికీ మారరు, వాళ్లకు క్షమాపణ ఉండదు.”+ 13  ఆయన వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “మీకు ఈ ఉదాహరణే అర్థంకాకపోతే, వేరే ఉదాహరణలన్నీ ఎలా అర్థమౌతాయి? 14  “విత్తేవాడు చల్లేది వాక్యం.+ 15  కొందరు, వాక్యం అనే విత్తనం పడిన దారిపక్కన నేల లాంటివాళ్లు. వాళ్లు వాక్యాన్ని వింటారు, కానీ వెంటనే సాతాను వచ్చి+ వాళ్లలో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకెళ్లిపోతాడు.+ 16  ఇంకొందరు రాతినేల లాంటివాళ్లు. వాళ్లు వాక్యం విన్న వెంటనే సంతోషంగా దాన్ని అంగీకరిస్తారు.+ 17  కానీ వాక్యం వాళ్లలో వేళ్లూనుకోదు, అయినా కొంతకాలం కొనసాగుతారు. తర్వాత వాక్యం కారణంగా శ్రమలు గానీ హింసలు గానీ వస్తే, వెంటనే తమ విశ్వాసాన్ని వదిలేస్తారు. 18  మరికొందరు ముళ్లపొదలు ఉన్న నేల లాంటివాళ్లు. వాళ్లు వాక్యం వింటారు,+ 19  కానీ ఈ వ్యవస్థలో* ఉన్న ఆందోళనలు,+ సిరిసంపదలకున్న మోసకరమైన శక్తి,+ రకరకాల కోరికలు+ వాళ్ల హృదయంలోకి చొచ్చుకెళ్లి వాక్యాన్ని అణచివేస్తాయి, దాంతో వాక్యం ఫలించకుండా పోతుంది. 20  చివరిగా, కొందరు మంచినేలలా ఉంటారు. వాళ్లు వాక్యాన్ని వింటారు, సానుకూలంగా స్వీకరిస్తారు, 30 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు ఎక్కువగా ఫలిస్తారు.”+ 21  ఆయన వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “ఎవ్వరూ దీపాన్ని తెచ్చి గంప కిందో మంచం కిందో పెట్టరు కదా, దాన్ని దీపస్తంభం మీదే పెడతారు.+ 22  రహస్యంగా ఉన్న ప్రతీది వెలుగులోకి వస్తుంది, జాగ్రత్తగా దాచివుంచిన ప్రతీది బయటికి వస్తుంది.+ 23  చెవులు ఉన్నవాళ్లు వినాలి.”+ 24  ఆయన వాళ్లకు ఇంకా ఇలా చెప్పాడు: “మీరు వింటున్న దాని మీద మనసుపెట్టండి.+ మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత అవగాహన పొందుతారు,* నిజానికి ఇంకా ఎక్కువే పొందుతారు. 25  ఎవరి దగ్గర ఉందో వాళ్లు ఇంకా ఎక్కువ పొందుతారు,+ కానీ ఎవరి దగ్గర లేదో వాళ్లు తమ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకుంటారు.”+ 26  ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని, ఒక వ్యక్తి నేల మీద విత్తనాలు చల్లడంతో పోల్చవచ్చు. 27  అతను రాత్రి నిద్రపోతూ, పొద్దున లేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తుండగా ఆ విత్తనాలు మొలకెత్తి, పొడుగ్గా పెరుగుతాయి. అదంతా ఎలా జరుగుతుందో అతనికి తెలీదు. 28  నేల దానంతటదే క్రమేణా పంటనిస్తుంది. ముందు కాండం, తర్వాత వెన్నులు, చివరికి ధాన్యం వస్తాయి. 29  అయితే పంట పండగానే కోతకాలం వచ్చిందని అతను కొడవలి పెట్టి కోస్తాడు.” 30  ఆయన ఇంకా ఇలా అన్నాడు: “దేవుని రాజ్యాన్ని మనం దేనితో పోల్చాలి? ఏ ఉదాహరణతో దాన్ని వివరించాలి? 31  అది ఆవగింజ లాంటిది. నేలలో విత్తక ముందు అది భూమ్మీది విత్తనాలన్నిట్లో చాలా చిన్నది.+ 32  కానీ, విత్తిన తర్వాత అది పెరిగి ఇతర కూరమొక్కలన్నిటి కన్నా పెద్దదౌతుంది, దాని కొమ్మలు పొడుగ్గా పెరుగుతాయి, ఆకాశపక్షులు దాని నీడలో ఆశ్రయం పొందుతాయి.” 33  వాళ్లు ఎంతవరకు అర్థం చేసుకోగలరు* అనేదాన్ని బట్టి ఆయన అలాంటి ఎన్నో ఉదాహరణలతో+ వాళ్లకు వాక్యాన్ని బోధించాడు. 34  నిజానికి ఉదాహరణలు ఉపయోగించకుండా ఆయన వాళ్లకు ఏమీ బోధించేవాడు కాదు, కానీ విడిగా తన శిష్యులకు అన్నీ వివరించేవాడు.+ 35  ఆ రోజు సాయంకాలం ఆయన వాళ్లతో, “మనం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అన్నాడు.+ 36  కాబట్టి వాళ్లు ప్రజల్ని పంపించేశాక ఆయన ఉన్న పడవలోనే ఆయన్ని తీసుకెళ్లారు, ఆ పడవతోపాటు వేరే పడవలు కూడా వెళ్లాయి.+ 37  మధ్యలో ఒక పెనుతుఫాను చెలరేగింది, అలలు వచ్చి పడవను ఢీకొడుతూ అందులోకి నీళ్లను ఎగజిమ్ముతున్నాయి. దాంతో పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది.+ 38  కానీ ఆయన, పడవ వెనక భాగంలో దిండు మీద తలవాల్చి నిద్రపోతున్నాడు. అప్పుడు వాళ్లు ఆయన్ని లేపి, “బోధకుడా, చనిపోయేలా ఉన్నాం, నువ్వు పట్టించుకోవా?” అన్నారు. 39  అప్పుడు ఆయన లేచి గాలిని గద్దించి, సముద్రాన్ని “ష్‌! నిశ్శబ్దంగా ఉండు!”+ అన్నాడు. అంతే, గాలి సద్దుమణిగింది, అంతా చాలా ప్రశాంతంగా మారిపోయింది. 40  తర్వాత ఆయన వాళ్లతో, “మీరెందుకు ఇంత భయపడుతున్నారు? ఇప్పటికీ మీలో కొంచెం కూడా విశ్వాసం లేదా?” అన్నాడు. 41  అయితే, తెలియని భయమేదో వాళ్లను అలుముకుంది. వాళ్లు, “అసలు ఈయన ఎవరు? చివరికి గాలి, సముద్రం కూడా ఈయనకు లోబడుతున్నాయి”+ అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.

అధస్సూచీలు

లేదా “ఉపమానాలతో.”
లేదా “యుగంలో.” పదకోశం చూడండి.
లేదా “మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతే పొందుతారు.”
లేదా “వినగలరు.”