మార్కు సువార్త 14:1-72
-
యాజకులు యేసును చంపడానికి కుట్రపన్నడం (1, 2)
-
యేసు మీద పరిమళ తైలం పోయడం (3-9)
-
యూదా యేసును అప్పగిస్తానని చెప్పడం (10, 11)
-
చివరి పస్కా (12-21)
-
ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం (22-26)
-
యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (27-31)
-
గెత్సేమనేలో యేసు ప్రార్థించడం (32-42)
-
యేసు బంధించబడడం (43-52)
-
మహాసభ ముందు విచారణ (53-65)
-
యేసు తెలీదని పేతురు చెప్పడం (66-72)
14 ఇంకో రెండు రోజుల్లో+ పస్కా పండుగ,+ పులవని రొట్టెల పండుగ+ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, శాస్త్రులు కుయుక్తితో ఆయన్ని పట్టుకుని* చంపడానికి అవకాశం కోసం చూస్తున్నారు;+
2 అయితే, “పండుగ సమయంలో వద్దు, ప్రజల్లో అలజడి రేగవచ్చు” అని వాళ్లు అనుకున్నారు.
3 ఆయన బేతనియలో సీమోను అనే కుష్ఠురోగి ఇంట్లో భోంచేస్తున్నప్పుడు, ఒకామె పాలరాతి* బుడ్డి పట్టుకొని అక్కడికి వచ్చింది. అందులో చాలా ఖరీదైన అసలుసిసలు జటామాంసి* పరిమళ తైలం ఉంది. ఆమె ఆ బుడ్డి మూత పగలగొట్టి, ఆ తైలాన్ని ఆయన తలమీద పోయడం మొదలుపెట్టింది.+
4 అది చూసి కొందరు కోపంతో ఇలా చెప్పుకున్నారు: “ఈమె ఈ పరిమళ తైలాన్ని ఎందుకు వృథా చేస్తోంది?
5 ఈ తైలాన్ని 300 దేనారాల* కన్నా ఎక్కువకు అమ్మి, ఆ డబ్బును పేదవాళ్లకు ఇవ్వొచ్చు కదా!” వాళ్లు ఆమె మీద చాలా కోప్పడ్డారు.*
6 కానీ యేసు ఇలా అన్నాడు: “ఆమెను ఏమనకండి. ఎందుకు ఆమెను ఇబ్బందిపెడుతున్నారు? ఆమె నా విషయంలో మంచి పనే చేసింది.+
7 పేదవాళ్లు ఎప్పుడూ మీతోనే ఉంటారు,+ మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వాళ్లకు సహాయం చేయవచ్చు. కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను.+
8 ఆమె చేయగలిగింది ఆమె చేసింది; ఆమె పరిమళ తైలాన్ని ముందే నా మీద పోసి నా శరీరాన్ని సమాధి కోసం సిద్ధం చేసింది.+
9 నేను నిజంగా మీతో చెప్తున్నాను, ప్రపంచంలో సువార్త ప్రకటించే ప్రతీ చోట+ ఆమె చేసిన ఈ పని గురించి కూడా చెప్పుకుంటూ ఆమెను గుర్తుచేసుకుంటారు.”
10 అయితే పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్లి, యేసును వాళ్లకు ఎలా అప్పగించాలనే విషయం గురించి వాళ్లతో మాట్లాడాడు.+
11 అతను చెప్పింది విన్న ముఖ్య యాజకులు సంతోషపడి, అతనికి వెండి నాణేలు ఇస్తామని మాటిచ్చారు.+ కాబట్టి అతను యేసును అప్పగించే అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు.
12 ఆచారం ప్రకారం పస్కా బలిని అర్పించే+ పులవని రొట్టెల పండుగ+ మొదటి* రోజున యేసు శిష్యులు, “నువ్వు పస్కా భోజనం తినడానికి మమ్మల్ని ఎక్కడ ఏర్పాట్లు చేయమంటావు?”+ అని ఆయన్ని అడిగారు.
13 అప్పుడు ఆయన ఇద్దరు శిష్యుల్ని పంపిస్తూ ఇలా చెప్పాడు: “మీరు నగరంలోకి వెళ్లండి. అక్కడ నీళ్లకుండ మోసుకెళ్తున్న ఒకతను మీకు ఎదురౌతాడు. అతని వెనక వెళ్లండి.+
14 అతను ఏ ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంటి యజమానితో, ‘ “నేను నా శిష్యులతో కలిసి పస్కా భోజనం చేయడానికి గది ఎక్కడ ఉంది?” అని బోధకుడు అడుగుతున్నాడు’ అని అనండి.
15 అప్పుడు అతను ఒక పెద్ద మేడగది చూపిస్తాడు. ఆ గదిలో కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి, అక్కడ మనకోసం ఏర్పాట్లు చేయండి.”
16 ఆ ఇద్దరు శిష్యులు బయల్దేరి నగరంలోకి వెళ్లి, సరిగ్గా యేసు చెప్పినట్టే జరగడం చూసి, పస్కా కోసం ఏర్పాట్లు చేశారు.
17 సాయంకాలమయ్యాక, ఆయన పన్నెండుమందితో కలిసి అక్కడికి వచ్చాడు.+
18 వాళ్లు భోంచేస్తున్నప్పుడు యేసు, “నేను నిజంగా మీతో చెప్తున్నాను, నాతో కలిసి భోంచేస్తున్న మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు” అని చెప్పాడు.+
19 అప్పుడు వాళ్లు దుఃఖపడి ఒకరి తర్వాత ఒకరు, “నేను కాదు కదా?” అని ఆయన్ని అడిగారు.
20 అందుకు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీ పన్నెండుమందిలో ఒకరు, అంటే నాతోపాటు గిన్నెలో చెయ్యి ముంచేవాడే నన్ను అప్పగిస్తాడు.+
21 మానవ కుమారుడు తన గురించి లేఖనాల్లో రాసివున్నట్టుగానే వెళ్లిపోతున్నాడు. కానీ ఎవరు మానవ కుమారుణ్ణి అప్పగిస్తారో అతనికి శ్రమ! అంతకన్నా, అతను పుట్టకపోయుంటేనే అతని పరిస్థితి బావుండేది.”
22 వాళ్లు తింటూ ఉండగా ఆయన ఒక రొట్టె తీసుకొని, ప్రార్థించి, దాన్ని విరిచి వాళ్లకు ఇస్తూ, “ఇది తీసుకోండి; ఇది నా శరీరాన్ని సూచిస్తోంది”+ అన్నాడు.
23 తర్వాత ఆయన ఒక గిన్నె తీసుకొని, కృతజ్ఞతలు చెల్లించి, వాళ్లకు ఇచ్చాడు; వాళ్లందరూ దానిలోది తాగారు.+
24 ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇది, అనేకమంది కోసం+ చిందించబోతున్న నా ‘ఒప్పంద రక్తాన్ని’*+ సూచిస్తోంది.
25 నేను నిజంగా మీతో చెప్తున్నాను, దేవుని రాజ్యంలో కొత్త ద్రాక్షారసం తాగేంతవరకు నేను ఇక ద్రాక్షారసం అస్సలు తాగను.”
26 చివర్లో, వాళ్లు స్తుతిగీతాలు* పాడి, ఒలీవల కొండకు వెళ్లారు.+
27 అప్పుడు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరందరూ నన్ను వదిలేసి వెళ్లిపోతారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: ‘నేను కాపరిని కొడతాను,+ గొర్రెలు చెదిరిపోతాయి.’+
28 అయితే నేను బ్రతికించబడిన తర్వాత, మీకన్నా ముందు గలిలయకు వెళ్తాను.”+
29 అయితే పేతురు, “అందరూ నిన్ను వదిలి వెళ్లినా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్లను”+ అన్నాడు.
30 దానికి యేసు అతనితో ఇలా అన్నాడు: “నేను నిజంగా నీతో చెప్తున్నాను, ఇవాళే, ఈ రోజు రాత్రే, కోడి రెండుసార్లు కూయక ముందే నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు అంటావు.”+
31 కానీ పేతురు పదేపదే ఇలా అంటూ ఉన్నాడు: “నేను నీతోపాటు చనిపోవాల్సివచ్చినా సరే, నువ్వెవరో తెలీదని అననే అనను.” మిగతావాళ్లు కూడా అదే మాట అన్నారు.
32 తర్వాత వాళ్లు గెత్సేమనే అనే చోటుకు వచ్చారు. ఆయన శిష్యులతో, “నేను వెళ్లి ప్రార్థన చేసుకుంటాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి”+ అన్నాడు.
33 ఆయన పేతురును, యాకోబును, యోహానును తనతోపాటు తీసుకెళ్లాడు.+ అప్పుడు ఆయనలో తీవ్రమైన ఆవేదన,* ఎంతో కలవరం మొదలయ్యాయి.
34 ఆయన వాళ్లతో, “నా ప్రాణం పోయేంత తీవ్రమైన దుఃఖం కలుగుతోంది.+ మీరు ఇక్కడే ఉండి, మెలకువగా ఉండండి” అన్నాడు.
35 ఆయన కాస్త ముందుకు వెళ్లి మోకాళ్లూని, సాధ్యమైతే ఆ పరిస్థితి తనకు రాకూడదని ప్రార్థించడం మొదలుపెట్టాడు.
36 ఆయన ఇలా అన్నాడు: “నాన్నా,* తండ్రీ,+ నీకు అన్నీ సాధ్యమే; ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయి. అయినా, నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.”+
37 ఆయన తిరిగొచ్చేసరికి వాళ్లు నిద్రపోతున్నారు, అప్పుడు ఆయన పేతురుతో ఇలా అన్నాడు: “సీమోనూ, నిద్రపోతున్నావా? కనీసం ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేవా?+
38 మీరు ప్రలోభంలో పడిపోకుండా ఉండేలా+ మెలకువగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉండండి. మనసు* సిద్ధమే* కానీ శరీరమే బలహీనం.”+
39 ఆయన తిరిగెళ్లి మళ్లీ ఆ మాటలే చెప్తూ ప్రార్థించాడు.+
40 ఆయన తిరిగొచ్చేసరికి వాళ్లు నిద్రపోతున్నారు. నిద్రమత్తుతో వాళ్ల కళ్లు బరువెక్కాయి, కాబట్టి ఆయనకు ఏం చెప్పాలో వాళ్లకు తోచలేదు.
41 ఆయన మూడోసారి వచ్చి వాళ్లతో ఇలా అన్నాడు: “ఇలాంటి సమయంలో మీరు నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటున్నారా! ఇక చాలు! సమయం వచ్చింది!+ ఇదిగో, మానవ కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడు!
42 లేవండి, వెళ్దాం. ఇదిగో! నన్ను అప్పగించేవాడు దగ్గరికి వచ్చేశాడు.”+
43 వెంటనే, ఆయన ఇంకా మాట్లాడుతుండగానే, పన్నెండుమందిలో ఒకడైన యూదా అక్కడికి వచ్చాడు. అతనితోపాటు ఒక గుంపు కూడా వచ్చింది. వాళ్ల చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. వాళ్లను ముఖ్య యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపించారు.+
44 యేసును అప్పగించబోతున్న యూదా ముందుగానే వాళ్లకు ఒక గుర్తు చెప్పాడు: “నేను ఎవర్ని ముద్దుపెట్టుకుంటానో, ఆయనే యేసు. మీరు ఆయన్ని బంధించి, భద్రంగా తీసుకెళ్లండి.”
45 అతను నేరుగా యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆప్యాయంగా ఆయనకు ముద్దుపెట్టాడు.
46 అప్పుడు వాళ్లు ఆయన్ని పట్టుకొని, బంధించారు.
47 అయితే, ఆయన పక్కన ఉన్నవాళ్లలో ఒకతను తన కత్తి దూసి ప్రధానయాజకుని దాసుడి చెవిని తెగనరికాడు.+
48 కానీ యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు బందిపోటు దొంగను పట్టుకోవడానికి వచ్చినట్టు కత్తులతో, కర్రలతో నన్ను పట్టుకోవడానికి వచ్చారా?+
49 నేను రోజూ ఆలయంలో బోధిస్తూ మీతోనే ఉన్నా+ మీరు నన్ను పట్టుకోలేదు. అయినా లేఖనాలు నెరవేరడానికే ఇలా జరిగింది.”+
50 అప్పుడు శిష్యులందరూ ఆయన్ని వదిలేసి పారిపోయారు.+
51 అయితే, నాణ్యమైన నారవస్త్రం వేసుకున్న ఒక యువకుడు ఆయనకు కొంచెం వెనక నడుస్తూ ఉన్నాడు. వాళ్లు అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు
52 అతని వస్త్రం ఊడిపోయింది, అతను ఒంటిమీద బట్టలు లేకుండానే* పారిపోయాడు.
53 తర్వాత వాళ్లు యేసును ప్రధానయాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు.+ ముఖ్య యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశమయ్యారు.+
54 అయితే పేతురు కాస్త దూరంగా ఉండి ఆయన్ని వెంబడిస్తూ, ప్రధానయాజకుడి ఇంటి ప్రాంగణం వరకూ వచ్చాడు. అతను ఆ ఇంటి పనివాళ్లతో కలిసి మంట దగ్గర కూర్చొని చలికాచుకుంటూ ఉన్నాడు.+
55 ముఖ్య యాజకులు, మహాసభ వాళ్లందరూ యేసును చంపించడానికి సాక్ష్యాల కోసం చూస్తూ ఉన్నారు, కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.+
56 నిజానికి, చాలామంది ఆయనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పారు.+ కానీ ఒకరు చెప్పినదానికి, ఇంకొకరు చెప్పినదానికి పొంతన కుదరలేదు.
57 అంతేకాదు, కొంతమంది ముందుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఇలా తప్పుడు సాక్ష్యం చెప్పారు:
58 “ ‘చేతులతో కట్టిన ఈ ఆలయాన్ని నేను పడగొట్టి, చేతులతో కట్టని ఇంకో ఆలయాన్ని మూడు రోజుల్లో నిర్మిస్తాను’ అని ఇతను అనడం మేము విన్నాం.”+
59 కానీ ఈ విషయంలో కూడా ఒకరు చెప్పినదానికి, ఇంకొకరు చెప్పినదానికి పొంతన కుదరలేదు.
60 తర్వాత ప్రధానయాజకుడు వాళ్ల మధ్య లేచి నిలబడి యేసును, “నువ్వేమీ మాట్లాడవా? నీకు వ్యతిరేకంగా వీళ్లు చెప్తున్న సాక్ష్యాల గురించి నువ్వు ఏమంటావు?” అని అడిగాడు.+
61 కానీ ఆయన అసలేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.+ ప్రధానయాజకుడు మళ్లీ ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టి, “నువ్వు సర్వోన్నతుని కుమారుడివైన క్రీస్తువా?” అని అడిగాడు.
62 దానికి యేసు, “అవును, నేను క్రీస్తునే; మానవ కుమారుడు+ శక్తిమంతుడైన దేవుని కుడిచెయ్యి దగ్గర కూర్చొనివుండడం,+ ఆకాశ మేఘాలతో రావడం మీరు చూస్తారు”+ అని అన్నాడు.
63 అప్పుడు ప్రధానయాజకుడు తన బట్టలు చింపుకొని ఇలా అన్నాడు: “ఇక మనకు సాక్షులతో పనేంటి?+
64 ఆ దైవదూషణ మీరే విన్నారు కదా. మీరేమంటారు?”* వాళ్లంతా ఆయన మరణశిక్షకు అర్హుడని తీర్పు తీర్చారు.+
65 కొంతమంది ఆయన మీద ఉమ్మి వేశారు.+ ఆయన ముఖానికి ముసుగేసి పిడికిళ్లతో గుద్ది, “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచించు!” అన్నారు. తర్వాత సభా భటులు ఆయన్ని చెంపమీద కొట్టి అక్కడి నుండి తీసుకెళ్లారు.+
66 పేతురు, కింద ప్రాంగణంలో ఉండగా, ప్రధానయాజకుడి పనమ్మాయిల్లో ఒకామె అక్కడికి వచ్చింది.+
67 పేతురు చలికాచుకుంటుండగా ఆ పనమ్మాయి అతనివైపు పరిశీలనగా చూసి, “నువ్వు కూడా నజరేయుడైన ఆ యేసుతో ఉండేవాడివి కదా?” అంది.
68 కానీ పేతురు ఒప్పుకోకుండా, “ఆయన ఎవరో నాకు తెలీదు, నువ్వేం మాట్లాడుతున్నావో కూడా నాకు అర్థంకావట్లేదు” అన్నాడు. ఆ తర్వాత పేతురు బయటిగుమ్మం వైపుకు* వెళ్లాడు.
69 అక్కడ కూడా ఆ పనమ్మాయి అతన్ని చూసి, అక్కడ నిలబడి ఉన్నవాళ్లతో, “ఈయన వాళ్లలో ఒకడు” అని చెప్పడం మొదలుపెట్టింది.
70 ఈసారి కూడా పేతురు ఒప్పుకోలేదు. కాసేపటికి, అక్కడ నిలబడి ఉన్నవాళ్లు మళ్లీ పేతురుతో, “ఖచ్చితంగా నువ్వు కూడా వాళ్లలో ఒకడివే. ఎందుకంటే నువ్వు గలిలయవాడివి” అని అనడం మొదలుపెట్టారు.
71 కానీ పేతురు తనను తాను శపించుకుంటూ, ఒట్టుపెట్టుకుంటూ, “మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి నాకు తెలీదు!” అని అనడం మొదలుపెట్టాడు.
72 సరిగ్గా అప్పుడే కోడి రెండోసారి కూసింది,+ “కోడి రెండుసార్లు కూయక ముందే నేనెవరో తెలీదని నువ్వు మూడుసార్లు అంటావు” అని యేసు తనతో అన్న మాటలు పేతురుకు గుర్తొచ్చాయి.+ అప్పుడు పేతురు దుఃఖం కట్టలు తెంచుకుంది, అతను కుమిలికుమిలి ఏడ్చాడు.
అధస్సూచీలు
^ లేదా “బంధించి.”
^ అనుబంధం B14 చూడండి.
^ లేదా “ఆమెతో కోపంగా మాట్లాడారు; ఆమెను తిట్టారు.”
^ మత్తయి 26:17 అధస్సూచి చూడండి.
^ లేదా “నిబంధన రక్తాన్ని.”
^ లేదా “కీర్తనలు.”
^ లేదా “దిగ్భ్రాంతి.”
^ ఇక్కడ “అబ్బా” అనే హీబ్రూ లేదా అరామిక్ పదం ఉంది. ఇది పిల్లలు తమ తండ్రిని పిలిచేటప్పుడు ఉపయోగించే పదం.
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “ఉత్సాహంగానే ఉంది.”
^ లేదా “చాలీచాలని బట్టలతోనే; లోపలి వస్త్రంతోనే.”
^ లేదా “మీకేం అనిపిస్తుంది?”
^ లేదా “ముఖమంటపంలోకి.”