మార్కు సువార్త 2:1-28

  • యేసు పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగుచేయడం (1-12)

  • యేసు లేవిని పిలవడం (13-17)

  • ఉపవాసం గురించిన ప్రశ్న (18-22)

  • యేసు ‘విశ్రాంతి రోజుకు ప్రభువు’ (23-28)

2  కొన్నిరోజుల తర్వాత యేసు మళ్లీ కపెర్న​హూముకు వచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నాడనే+ సంగతి చుట్టుపక్కల వాళ్లందరికీ తెలిసిపోయింది.  దాంతో చాలామంది అక్కడికి వచ్చారు; ఆ ఇల్లంతా జనంతో ​నిండిపోయింది, కనీసం వాకిట్లో కూడా చోటు లేదు. యేసు వాళ్లకు దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు.+  అప్పుడు నలుగురు ​మనుషులు పక్షవాతం ఉన్న ఒక వ్యక్తిని ఆయన దగ్గ​రికి మోసుకొచ్చారు.+  అయితే ఇల్లంతా జనంతో కిట​కిటలాడుతున్నందువల్ల వాళ్లు అతన్ని యేసు ముందుకు తీసుకురాలేకపోయారు. అందుకని వాళ్లు యేసు ఉన్న చోట పైకప్పు తీసి, సందు చేసి, పక్షవాతం ఉన్న వ్యక్తిని మంచంతో* పాటు కిందికి దించారు.  యేసు వాళ్ల విశ్వాసాన్ని చూసి,+ పక్షవాతం ఉన్న వ్యక్తితో, “బాబూ, నీ పాపాలు క్షమించబడ్డాయి!” అన్నాడు.+  అయితే, అక్కడ కూర్చున్న శాస్త్రులు కొందరు మనసులో ఇలా అనుకున్నారు:+  “ఈ మనిషి ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడు. పాపాల్ని క్షమించే అధికారం దేవునికి తప్ప ఇంకెవరికి ఉంది?”+  అయితే యేసు వెంటనే వాళ్ల హృదయాలోచనను పసిగట్టి ఇలా అన్నాడు: “మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు?+  పక్షవాతం ఉన్న వ్యక్తితో ‘నీ పాపాలు క్షమించబ​డ్డాయి’ అని చెప్పడం తేలికా? ‘లేచి నీ మంచం తీసుకొని నడువు’ అని చెప్పడం తేలికా? 10  అయితే, భూమ్మీద పాపాలు క్షమించే అధికారం మానవ కుమారునికి*+ ఉందని మీరు తెలుసుకోవాలని ...”+ తర్వాత ఆయన పక్షవాతం ఉన్న వ్యక్తితో ఇలా అన్నాడు: 11  “నేను నీతో చెప్తున్నాను, లేచి, నీ మంచం తీసుకొని మీ ఇంటికి వెళ్లు.” 12  అతను లేచి వెంటనే తన మంచం తీసుకొని అందరూ చూస్తుండగా బయటికి వెళ్లిపోయాడు. దాంతో వాళ్లందరూ ఆశ్చర్యపోయి, “ఇలాంటిది మనం ఎప్పుడూ చూడలేదే” అంటూ దేవుణ్ణి మహిమపర్చారు.+ 13  ఆయన మళ్లీ సముద్ర తీరానికి వెళ్లాడు, ప్రజలంతా ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు, ఆయన వాళ్లకు బోధించడం మొదలుపెట్టాడు. 14  తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్తూ, పన్ను వసూలుచేసే కార్యాలయంలో కూర్చున్న లేవిని* చూశాడు, అతను అల్ఫయి కుమారుడు. యేసు లేవితో, “వచ్చి, నన్ను అనుసరించు” అన్నాడు. అప్పుడు అతను లేచి ఆయన్ని అనుసరించాడు.+ 15  తర్వాత యేసు లేవి ఇంట్లో భోంచేస్తున్నప్పుడు, చాలామంది పన్ను వసూలు​చేసే వాళ్లు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోంచేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు కూడా ఆయన అనుచరులయ్యారు.+ 16  ఆయన పాపులతో, పన్ను వసూలుచేసే వాళ్లతో కలిసి భోజనం చేయడం చూసి పరిసయ్యుల్లోని శాస్త్రులు ఆయన శిష్యులతో, “ఈయన పన్ను వసూలుచేసే వాళ్లతో, పాపు​లతో కలిసి తింటున్నాడేంటి?” అని అంటూ ఉన్నారు. 17  అది విని యేసు వాళ్లతో, “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం. నేను నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు కానీ పాపుల్ని పిలవడానికే వచ్చాను”+ అని అన్నాడు. 18  యోహాను శిష్యులు, పరిసయ్యులు ఉపవాసం ఉంటారు. కాబట్టి వాళ్లు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటారు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు?” అని యేసును అడిగారు.+ 19  అందుకు యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “పెళ్లికుమారుడు+ తమతో ఉండగా, అతని ​స్నేహితులు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉంటుందా? పెళ్లికుమారుడు తమతో ఉన్నంతకాలం వాళ్లు ఉపవాసం ఉండరు. 20  అయితే పెళ్లికుమారుణ్ణి వాళ్ల దగ్గర నుండి తీసుకెళ్లిపోయే రోజులు వస్తాయి,+ అప్పుడు వాళ్లు ఉపవాసం ఉంటారు. 21  ఎవ్వరూ పాత వస్త్రానికి కొత్త గుడ్డముక్కతో అతుకు వేయరు. అలా వేస్తే, కొత్త గుడ్డముక్క ముడుచుకుపోయి, చిరుగు ఇంకా పెద్దదౌతుంది.+ 22  అలాగే, ఎవ్వరూ కొత్త ద్రాక్షారసాన్ని పాత ద్రాక్షతిత్తుల్లో పోయరు. ఒకవేళ పోస్తే, ఆ ద్రాక్షారసం వల్ల ద్రాక్షతిత్తులు పిగిలిపోతాయి. అప్పుడు ద్రాక్షారసం కారిపోతుంది, ద్రాక్షతిత్తులు పాడౌతాయి. అందుకే, కొత్త ద్రాక్షా​రసాన్ని కొత్త ద్రాక్షతిత్తుల్లోనే పోస్తారు.” 23  విశ్రాంతి రోజున యేసు పంటచేలలో నుండి వెళ్తుండగా ఆయన శిష్యులు ధాన్యం వెన్నులు తుంచడం మొదలుపెట్టారు.+ 24  అప్పుడు పరిసయ్యులు ఆయనతో, “ఇదిగో చూడు! విశ్రాంతి రోజున చేయకూడని పనిని వాళ్లెందుకు చేస్తున్నారు?” అని అన్నారు. 25  దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దావీదుకు, అతని మనుషులకు ఆకలేసి, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేనప్పుడు దావీదు ఏమి చేశాడో మీరు చదవలేదా?+ 26  దావీదు దేవుని మందిరంలోకి వెళ్లి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప ఎవ్వరూ తినకూడని సముఖపు రొట్టెలు*+ తిని, తన మనుషులకు కూడా ఇచ్చాడు. ఈ విషయం ముఖ్య యాజకుడైన అబ్యాతారు+ వృత్తాంతంలో మీరు చదవలేదా?” 27  తర్వాత ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “దేవుడు మనిషి కోసమే విశ్రాంతి రోజును ఏర్పాటు చేశాడు+ కానీ, విశ్రాంతి రోజు కోసం మనిషిని చేయలేదు. 28  మానవ కుమారుడు విశ్రాంతి రోజుకు కూడా ప్రభువే.”+

అధస్సూచీలు

రోగుల్ని మోసుకెళ్లే చిన్న పరుపు.
యేసు తన గురించి చెప్పడానికే ఈ పదం వాడాడు. పదకోశం చూడండి.
ఇది మత్తయికి ఇంకో పేరు.
లేదా “సన్నిధి రొట్టెలు.”