మార్కు సువార్త 1:1-45
-
బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించడం (1-8)
-
యేసు బాప్తిస్మం (9-11)
-
సాతాను యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం (12, 13)
-
యేసు గలిలయలో ప్రకటనా పని మొదలుపెట్టడం (14, 15)
-
మొట్టమొదటి శిష్యుల్ని పిలవడం (16-20)
-
అపవిత్ర దూతను వెళ్లగొట్టడం (21-28)
-
యేసు కపెర్నహూములో చాలామందిని బాగుచేయడం (29-34)
-
ఎవ్వరూ లేని ప్రదేశంలో ప్రార్థించడం (35-39)
-
కుష్ఠురోగిని బాగుచేయడం (40-45)
1 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు గురించిన మంచివార్త* ఇలా మొదలౌతుంది.
2 యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “(ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు ముందుగా పంపిస్తున్నాను. అతను నీ కోసం మార్గం సిద్ధం చేస్తాడు.)+
3 ‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో* ఒక వ్యక్తి* అరుస్తున్నాడు.”+
4 ప్రవక్త రాసినట్టే, బాప్తిస్మమిచ్చే యోహాను ఎడారిలో ఉంటూ, పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోమని ప్రకటిస్తూ వచ్చాడు.+
5 యూదయ, యెరూషలేము ప్రజలంతా అతని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. వాళ్లు తమ పాపాల్ని అందరిముందు ఒప్పుకుని యొర్దాను నదిలో అతని దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు.*+
6 యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన వస్త్రం వేసుకుని, నడుముకు తోలు దట్టీ కట్టుకునేవాడు;+ మిడతల్ని, అడవి తేనెను తినేవాడు.+
7 అతను ఇలా ప్రకటించాడు: “నా తర్వాత నాకన్నా బలవంతుడు రాబోతున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల తాడు విప్పడానికి కూడా అర్హుణ్ణి కాదు.+
8 నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ ఆయన పవిత్రశక్తితో మీకు బాప్తిస్మం ఇస్తాడు.”+
9 ఆ రోజుల్లో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి, యొర్దాను నదిలో యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నాడు.+
10 ఆయన నీళ్లలో నుండి బయటికి రాగానే ఆకాశం తెరుచుకోవడం, పవిత్రశక్తి పావురం రూపంలో తన మీదికి రావడం ఆయన చూశాడు.+
11 అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది: “నువ్వు నా ప్రియ కుమారుడివి; నిన్ను చూసి నేను సంతోషిస్తున్నాను.”*+
12 వెంటనే ఆయన ఎడారిలోకి వెళ్లేలా పవిత్రశక్తి* ఆయన్ని ప్రేరేపించింది.
13 ఆయన ఎడారిలో 40 రోజులు ఉన్నాడు, అక్కడ సాతాను ఆయన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు.+ ఆయన అడవి జంతువుల మధ్య గడిపాడు, దేవదూతలు ఆయనకు సేవలు చేశారు.+
14 యోహాను బంధించబడ్డాక, యేసు గలిలయకు వెళ్లి+ దేవుని గురించిన మంచివార్త ప్రకటిస్తూ,+
15 “నిర్ణయించిన సమయం పూర్తయింది, దేవుని రాజ్యం దగ్గరపడింది. కాబట్టి పశ్చాత్తాపపడండి,+ మంచివార్త మీద విశ్వాసం ఉంచండి” అని చెప్తూ ఉన్నాడు.
16 ఆయన గలిలయ సముద్ర తీరాన నడుస్తుండగా సీమోను, అతని సహోదరుడు అంద్రెయ+ సముద్రంలో వలలు వేయడం+ చూశాడు, వాళ్లు జాలరులు.+
17 అప్పుడు యేసు వాళ్లతో, “నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరులుగా చేస్తాను” అన్నాడు.+
18 వాళ్లు వెంటనే తమ వలలు వదిలేసి ఆయన వెంట వెళ్లారు.+
19 ఆయన కొంచెం దూరం వెళ్లాక జెబెదయి కుమారుడైన యాకోబును, అతని సహోదరుడైన యోహానును చూశాడు. ఆ సమయంలో వాళ్లు తమ పడవలో ఉండి వలలు బాగుచేసుకుంటున్నారు.+
20 ఆయన వెంటనే వాళ్లను పిలిచాడు. వాళ్లు తమ తండ్రి జెబెదయిని పడవలోనే పనివాళ్ల దగ్గర వదిలేసి ఆయన్ని అనుసరించారు.
21 వాళ్లు యేసుతోపాటు కపెర్నహూముకు వెళ్లారు.
విశ్రాంతి రోజు* మొదలవ్వగానే, ఆయన సమాజమందిరానికి వెళ్లి బోధించసాగాడు.+
22 ఆయన బోధించే తీరు చూసి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆయన శాస్త్రుల్లా కాకుండా అధికారం ఉన్నవాడిలా బోధించాడు.+
23 ఆ సమయంలో, అపవిత్ర దూత* పట్టిన ఒకతను ఆ సమాజమందిరంలో ఉన్నాడు, అతను ఇలా అరిచాడు:
24 “నజరేయుడివైన యేసూ, మాతో నీకేం పని?+ మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని పవిత్రుడివి!”+
25 అప్పుడు యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ, “మాట్లాడకుండా అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు.
26 దాంతో ఆ అపవిత్ర దూత, అతన్ని కిందపడి గిలగిల కొట్టుకునేలా చేసి, పెద్దపెద్ద కేకలు వేస్తూ అతనిలో నుండి బయటికి వచ్చాడు.
27 అప్పుడు ప్రజలంతా చాలా ఆశ్చర్యపోయి, “ఇదేంటి? ఈ బోధ కొత్తగా ఉందే! ఈయన అపవిత్ర దూతల్ని కూడా అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడు, వాళ్లు ఈయన మాట వింటున్నారు” అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
28 ఆ సంఘటనతో ఆయన గురించిన వార్త గలిలయ ప్రాంతమంతా వేగంగా వ్యాపించింది.
29 తర్వాత వాళ్లు సమాజమందిరం నుండి బయల్దేరి యాకోబు, యోహానులతోపాటు సీమోను, అంద్రెయవాళ్ల ఇంటికి వెళ్లారు.+
30 అక్కడ సీమోను అత్త+ జ్వరంతో పడుకొనివుంది. వాళ్లు వెంటనే ఆమె గురించి యేసుకు చెప్పారు.
31 ఆయన ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని లేపాడు. అప్పుడు ఆమె జ్వరం పోయి, వాళ్లకు సేవలు చేయడం మొదలుపెట్టింది.
32 సాయంకాలం సూర్యుడు అస్తమించాక ప్రజలు రోగుల్ని, చెడ్డదూతలు* పట్టిన వాళ్లందర్నీ యేసు దగ్గరికి తీసుకురావడం మొదలుపెట్టారు;+
33 నగర ప్రజలంతా ఆ ఇంటి గుమ్మం ముందే ఉన్నారు.
34 ఆయన రకరకాల రోగాలతో బాధపడుతున్న చాలామందిని బాగుచేశాడు;+ ఎంతోమంది చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు, అయితే ఆయనే క్రీస్తు అని* ఆ చెడ్డదూతలకు తెలుసు కాబట్టి ఆయన వాళ్లను మాట్లాడనివ్వలేదు.
35 ఆయన తెల్లవారుజామున చీకటితోనే లేచి, బయల్దేరి, ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్లి ప్రార్థించడం మొదలుపెట్టాడు.+
36 అయితే సీమోను, అతనితో ఉన్నవాళ్లు ఆయన కోసం వెతకడానికి వెళ్లి,
37 ఆయన కనబడగానే, “అందరూ నీకోసం వెతుకుతున్నారు” అని అన్నారు.
38 కానీ ఆయన వాళ్లతో, “రండి, మనం దగ్గర్లోని పట్టణాలకు ఎక్కడికైనా వెళ్దాం. అక్కడ కూడా నేను ప్రకటించాలి, అందుకే కదా నేను వచ్చాను”+ అన్నాడు.
39 తర్వాత ఆయన గలిలయ అంతటా ప్రయాణిస్తూ సమాజమందిరాల్లో ప్రకటించాడు, చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు.+
40 అక్కడ ఆయన దగ్గరికి ఒక కుష్ఠురోగి కూడా వచ్చాడు. అతను మోకాళ్లూని, “నీకు ఇష్టమైతే, నన్ను శుద్ధుడిగా చేయగలవు” అని ఆయన్ని వేడుకున్నాడు.+
41 ఆయన జాలిపడి చెయ్యి చాపి అతన్ని ముట్టుకుని, “నాకు ఇష్టమే! శుద్ధుడివి అవ్వు” అన్నాడు.+
42 వెంటనే అతని కుష్ఠురోగం పోయి, అతను శుద్ధుడయ్యాడు.
43 యేసు అతన్ని వెంటనే పంపించేస్తూ గట్టిగా ఇలా హెచ్చరించాడు:
44 “జాగ్రత్త, ఎవరికీ ఏమీ చెప్పకు. అయితే వెళ్లి యాజకునికి కనిపించి, శుద్ధుడివి అయినందుకు మోషే ధర్మశాస్త్రం చెప్పినవి అర్పించు.+ ఇది వాళ్లకు సాక్ష్యంగా ఉంటుంది.”+
45 కానీ అతను అక్కడి నుండి వెళ్లిన తర్వాత, ఆ విషయాన్ని అంతటా చాటిస్తూ అందరికీ తెలిసేలా చేశాడు. దానివల్ల యేసు ఏ నగరంలోకీ బహిరంగంగా వెళ్లలేకపోయాడు. అందుకే ఆయన ఎవరూలేని ప్రదేశాల్లో నివసించాడు. అయినాసరే, ప్రజలు నలుమూలల నుండి ఆయన దగ్గరికి వస్తూనే ఉన్నారు.+
అధస్సూచీలు
^ లేదా “సువార్త.”
^ అనుబంధం A5 చూడండి.
^ అక్ష., “వ్యక్తి స్వరం.”
^ లేదా “అతని చేత ముంచబడ్డారు.”
^ అక్ష., “నేను నిన్ను ఆమోదించాను.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ లేదా “సబ్బాతు.”
^ పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
^ లేదా “ఆయన ఎవరో” అయ్యుంటుంది.