మార్కు సువార్త 5:1-43
5 తర్వాత వాళ్లు సముద్రానికి అవతలి వైపున్న గెరసవాళ్ల ప్రాంతానికి వచ్చారు.+
2 యేసు పడవ దిగగానే, అపవిత్ర దూత* పట్టిన ఒకతను సమాధుల* మధ్య నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.
3 అతను సమాధుల మధ్యే తిరుగుతూ ఉండేవాడు, ఆ క్షణం వరకు అతన్ని ఎవ్వరూ గొలుసులతో కూడా బంధించి ఉంచలేకపోయారు.
4 అతన్ని చాలాసార్లు సంకెళ్లతో, గొలుసులతో బంధించారు కానీ ప్రతీసారి అతను ఆ సంకెళ్లను తెంచేసుకొని, గొలుసుల్ని ముక్కలుముక్కలు చేసేవాడు; అతన్ని లొంగదీసేంత బలం ఎవ్వరికీ లేకపోయింది.
5 అతను రాత్రింబగళ్లు సమాధుల్లో, కొండల్లో అరుస్తూ తిరిగేవాడు, రాళ్లతో గాయపర్చుకునేవాడు.
6 అతను దూరం నుండి యేసును చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి ఆయనకు వంగి నమస్కారం చేసి,+
7 “సర్వోన్నత దేవుని కుమారుడివైన యేసూ, నాతో నీకేం పని? నన్ను హింసించనని దేవుని మీద ఒట్టేయి” అని గట్టిగా అరిచాడు.+
8 ఎందుకంటే అంతకుముందు యేసు అతనితో, “అపవిత్ర దూతా, అతనిలో నుండి బయటికి రా” అన్నాడు.+
9 యేసు అతన్ని, “నీ పేరేంటి?” అని అడిగాడు. అతను, “నా పేరు సేన,* ఎందుకంటే మేము చాలామందిమి” అన్నాడు.
10 తర్వాత అతను ఆ దేశం నుండి తమను పంపించేయొద్దని పదేపదే యేసును వేడుకున్నాడు.+
11 ఆ సమయంలో కొండ మీద ఒక పెద్ద పందుల+ మంద మేత మేస్తూ ఉంది.+
12 కాబట్టి ఆ అపవిత్ర దూతలు, “దయచేసి మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్లనివ్వు” అని ఆయన్ని వేడుకున్నారు.
13 అప్పుడు ఆయన వాళ్లను వెళ్లనిచ్చాడు. ఆ అపవిత్ర దూతలు అతనిలో నుండి బయటికి వచ్చి ఆ పందుల్లోకి దూరారు. అప్పుడు 2,000 పందులు ఉన్న ఆ మందంతా అంచు* వరకు పరుగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడి మునిగిపోయింది.
14 దాంతో వాటిని మేపేవాళ్లు పారిపోయి నగరంలో, అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఆ సంగతి చెప్పారు. అది విన్న ప్రజలు జరిగింది చూడడానికి అక్కడికి వచ్చారు.+
15 వాళ్లు యేసు దగ్గరికి వచ్చి, అంతకుముందు అపవిత్ర దూతల సేన పట్టిన వ్యక్తి ఇప్పుడు బట్టలు వేసుకొని స్థిమితంగా కూర్చొని ఉండడం చూశారు, దాంతో వాళ్లు భయపడ్డారు.
16 చెడ్డదూతలు* పట్టిన వ్యక్తి ఎలా బాగయ్యాడో, పందులు ఎలా చచ్చిపోయాయో చూసినవాళ్లు జరిగిందంతా వచ్చినవాళ్లకు చెప్పారు.
17 అప్పుడు వాళ్లు యేసును తమ ప్రాంతం నుండి వెళ్లిపొమ్మని బ్రతిమాలారు.+
18 యేసు పడవ ఎక్కుతుండగా, అపవిత్ర దూతల బారినుండి బయటపడిన వ్యక్తి తాను కూడా వస్తానని ఆయన్ని వేడుకున్నాడు.+
19 కానీ యేసు ఒప్పుకోకుండా, “మీ ఇంటికి వెళ్లి, యెహోవా* నీ కోసం చేసినవాటన్నిటి గురించి, ఆయన నీ మీద చూపించిన కరుణ గురించి నీ బంధువులకు చెప్పు” అన్నాడు.
20 అతను వెళ్లి, యేసు అతనికి చేసినవాటన్నిటి గురించి దెకపొలిలో* ప్రకటించడం మొదలుపెట్టాడు, అది విన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
21 యేసు మళ్లీ పడవలో అవతలి ఒడ్డుకు వెళ్లాడు. ఆయన ఇంకా సముద్ర తీరాన ఉండగానే చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు.+
22 ఇంతలో సమాజమందిర అధికారి ఒకతను అక్కడికి వచ్చాడు. అతని పేరు యాయీరు. యేసు కనబడగానే అతను ఆయన కాళ్ల మీద పడి,+
23 “మా పాపకి బాగా జబ్బు చేసింది.* దయచేసి నువ్వు వచ్చి ఆమె మీద చేతులు ఉంచు,+ ఆమె బాగౌతుంది, బ్రతుకుతుంది” అంటూ ఆయన్ని ఎంతో బ్రతిమాలాడు.
24 అప్పుడు యేసు అతనితో వెళ్లాడు, చాలామంది ఆయన వెనకే వెళ్తూ ఉన్నారు, ప్రజలు ఆయన మీద పడుతూ ఉన్నారు.
25 వాళ్లలో 12 ఏళ్లుగా రక్తస్రావంతో+ బాధపడుతున్న ఒకామె ఉంది.+
26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్లి నానా బాధలు పడింది, తనకున్నదంతా ఖర్చుపెట్టింది. కానీ ఆమె రోగం నయం కాలేదు, ఇంకా ముదిరింది.
27 ఆమె యేసు గురించి విని, అందర్నీ దాటుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి, వెనకనుండి ఆయన పైవస్త్రాన్ని ముట్టుకుంది.+
28 ఎందుకంటే ఆమె, “నేను ఆయన పైవస్త్రాల్ని ముట్టుకుంటే చాలు, నాకు బాగౌతుంది” అని అనుకుంటూ ఉంది.+
29 ఆమె అలా ముట్టుకోగానే ఆమె రక్తస్రావం ఆగిపోయింది, తనను ఎంతో బాధపెట్టిన ఆ రోగం నయమైపోయిందని ఆమెకు అర్థమైంది.
30 వెంటనే యేసుకు తనలో నుండి శక్తి+ బయటికి వెళ్లినట్టు అర్థమైంది, ఆయన వెనక్కి తిరిగి ప్రజల్ని చూస్తూ, “నా పైవస్త్రాల్ని ముట్టుకుంది ఎవరు?” అని అడిగాడు.+
31 అయితే శిష్యులు ఆయనతో, “అందరూ తోసుకుంటూ నీ మీద పడుతుంటే, ‘నన్ను ముట్టుకున్నది ఎవరు?’ అని అడుగుతున్నావేంటి?” అన్నారు.
32 అయినా యేసు తనను ముట్టుకున్నది ఎవరో తెలుసుకోవడానికి చుట్టూ చూశాడు.
33 అప్పుడు, తాను బాగయ్యానని గ్రహించిన ఆ స్త్రీ భయంతో వణికిపోతూ ఆయన ముందుకు వచ్చి, మోకరించి విషయమంతా ఆయనకు చెప్పింది.
34 ఆయన ఆమెతో ఇలా అన్నాడు: “అమ్మా,* నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది. మనశ్శాంతితో వెళ్లు,+ ఇక ఈ రోగం నిన్ను బాధపెట్టదు.”+
35 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిర అధికారి ఇంటినుండి కొంతమంది వచ్చి, “మీ అమ్మాయి చనిపోయింది! ఇక బోధకుణ్ణి ఇబ్బందిపెట్టడం ఎందుకు?” అన్నారు.+
36 కానీ, యేసు వాళ్ల మాటలు విని ఆ అధికారితో, “భయపడకు, విశ్వాసం ఉంచు చాలు” అన్నాడు.+
37 తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును తప్ప ఇంకెవ్వర్నీ తన వెంట రానివ్వలేదు.+
38 వాళ్లు సమాజమందిర అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అంతా గోలగోలగా ఉండడం, ప్రజలు దుఃఖిస్తూ బోరున ఏడుస్తుండడం ఆయన గమనించాడు.+
39 ఆయన లోపలికి వెళ్లి వాళ్లతో, “మీరెందుకు ఏడుస్తున్నారు? ఎందుకు గోల చేస్తున్నారు? పాప చనిపోలేదు, నిద్రపోతోంది అంతే” అన్నాడు.+
40 ఆ మాట వినగానే వాళ్లు ఆయన్ని చూసి వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆయన వాళ్లందర్నీ బయటికి పంపించేసి, పాప తల్లిదండ్రుల్ని, తనతో ఉన్నవాళ్లను తీసుకొని పాప ఉన్న గదిలోకి వెళ్లాడు.
41 తర్వాత ఆయన పాప చెయ్యి పట్టుకొని, “తలీతా కుమీ” అన్నాడు. ఆ మాటను అనువదిస్తే, “పాపా, నీతో చెప్తున్నాను, లే!” అని అర్థం.+
42 వెంటనే పాప లేచి నడిచింది. (ఆమెకు 12 ఏళ్లు.) అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆనందం పట్టలేకపోయారు.
43 కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదని ఆయన వాళ్లకు మరీమరీ చెప్పాడు,*+ తినడానికి పాపకు ఏమైనా పెట్టమని కూడా చెప్పాడు.
అధస్సూచీలు
^ లేదా “స్మారక సమాధుల.”
^ పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
^ మత్తయి 26:53 అధస్సూచి చూడండి.
^ లేదా “నిటారుగా ఉన్న అంచు.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “పది నగరాలున్న ప్రాంతంలో.”
^ లేదా “పాప కొన ఊపిరితో ఉంది.”
^ అక్ష., “కూతురా.”
^ లేదా “గట్టిగా ఆజ్ఞాపించాడు.”