కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A1

బైబిలు అనువాద సూత్రాలు

బైబిల్ని మొదట్లో ప్రాచీన హీబ్రూ, అరామిక్‌, గ్రీకు భాషల్లో రాశారు. ఇప్పుడు పూర్తి బైబిలు లేదా అందులోని కొంతభాగం 3,000 కన్నా ఎక్కువ భాషల్లో ఉంది. బైబిల్ని చదివే చాలామందికి, అది మొదట్లో రాయబడిన భాషలు అర్థంకావు, కాబట్టి వాళ్ల కోసం దాన్ని అనువదించడం అవసరం. బైబిల్ని అనువదిస్తున్నప్పుడు ఏ సూత్రాలు పాటించాలి? పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదాన్ని అనువదిస్తున్నప్పుడు ఆ సూత్రాల్ని ఎలా పాటించారు?

బైబిల్ని మొదట్లో ఆ భాషల్లో రాసినప్పుడు ఏం చెప్పాలనుకున్నారో సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని ఖచ్చితంగా మక్కికిమక్కి అనువదించాలని కొంతమంది అంటారు. అయితే, అన్నిసార్లూ అది నిజం కాదు. అందుకు కొన్ని కారణాలు పరిశీలించండి:

  •  ఏ రెండు భాషల వ్యాకరణం, పదసంపద, వాక్య నిర్మాణం పూర్తిగా ఒకేలా ఉండవు. హీబ్రూ భాష ప్రొఫెసర్‌ ఎస్‌. ఆర్‌. డ్రైవర్‌ ఇలా రాశాడు: “[భాషల] వ్యాకరణం, మూలాల్లో మాత్రమే కాదు, . . . ఒక్కో భాషలో విషయాల్ని వాక్య రూపంలో ఎలా చెప్తారు అనేదానిలో కూడా తేడాలు ఉంటాయి.” ఒక భాషలో ఆలోచించే తీరుకు, ఇంకో భాషలో ఆలోచించే తీరుకు చాలా తేడా ఉంటుంది. “కాబట్టి, వాక్య నిర్మాణం ఒక్కో భాషలో ఒక్కోలా ఉంటుంది” అని ఆ ప్రొఫెసర్‌ అంటున్నాడు.

  •  బైబిల్ని రాసిన హీబ్రూ, అరామిక్‌, గ్రీకు భాషలకు ఉన్న అదే పదసంపద, వ్యాకరణం గల ఆధునిక భాష ఒక్కటి కూడా లేదు; కాబట్టి బైబిల్ని మక్కికిమక్కి అనువదిస్తే అది స్పష్టంగా లేకపోవడమే కాదు ఒక్కోసారి తప్పుడు అర్థాన్ని కూడా ఇవ్వవచ్చు.

  •  ఒక పదాన్ని లేదా పదబంధాన్ని ఏ సందర్భంలో ఉపయోగించారనే దాన్ని బట్టి దాని అర్థం మారవచ్చు.

అనువాదకుడికి ఒక్కోసారి మూలభాషలోని పదాల్ని మక్కికిమక్కి అనువదించే వీలు ఉండవచ్చు, కానీ అది చాలా జాగ్రత్తగా చేయాలి.

మక్కికిమక్కి అనువాదాన్ని తప్పుగా అర్థం చేసుకునే వీలుంది అనడానికి కొన్ని ఉదాహరణలు:

  •  లేఖనాల్లో ‘నిద్రపోవడం,’ ‘నిద్రించడం’ అనే పదాలు మామూలు నిద్రను లేదా మరణ నిద్రను సూచించవచ్చు. (మత్తయి 28:13; అపొస్తలుల కార్యాలు 7:60, అధస్సూచి) కాబట్టి మరణం గురించి చెప్పే సందర్భాల్లో ఆ పదాల్ని ఉపయోగించినప్పుడు, బైబిలు అనువాదకులు ‘చనిపోవడం’ లేదా ‘మరణంలో నిద్రించడం’ అని అనువదించవచ్చు; దానివల్ల ఈ కాలంలో దాన్ని చదివేవాళ్లు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు.—1 కొరింథీయులు 7:39; 1 థెస్సలొనీకయులు 4:13; 2 పేతురు 3:4; అధస్సూచీలు.

  •  ఎఫెసీయులు 4:14 లో అపొస్తలుడైన పౌలు ఉపయోగించిన ఒక పదబంధాన్ని అక్షరార్థంగా అనువదిస్తే, “మనుషుల పాచికల ఆటలో” అని వస్తుంది. ఈ ప్రాచీన నానుడి, పాచికలతో ఇతరుల్ని మోసగించడాన్ని గుర్తుచేస్తుంది. ఈ నానుడిని మక్కికిమక్కి అనువదిస్తే, చాలా భాషల్లో అసలేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కాదు. దాన్ని “మోసం చేసేవాళ్ల” అని అనువదిస్తే స్పష్టంగా అర్థమౌతుంది.

  •  మొదటి పేతురు 1:13 లో అక్షరార్థంగా “మీ మనసు అనే నడుం కట్టుకోండి” అనే అర్థం వచ్చే మాటలు గ్రీకు భాషలో ఉపయోగించారు. తెలుగులో అది సరైన అర్థాన్ని ఇవ్వకపోవచ్చు, కాబట్టి ఈ బైబిల్లో దాన్ని “కష్టపడి పనిచేయడానికి మీ మనసుల్ని సిద్ధం చేసుకోండి” అని అనువదించారు.

  • మత్తయి 5:3

    అక్షరార్థంగా: “ఆత్మ విషయమై దీనులు”

    అసలు అర్థం: “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు”

     ప్రసిద్ధి చెందిన తన కొండమీది ప్రసంగంలో యేసు ఉపయోగించిన ఒక వాక్యాన్ని తరచూ “ఆత్మ విషయమై దీనులైనవారు ధన్యులు” అని అనువదిస్తుంటారు. (మత్తయి 5:3, పరిశుద్ధ గ్రంథము) అయితే “ఆత్మ విషయమై దీనులు” అనే మాట మూలభాషలోని అసలు అర్థాన్ని ఇవ్వదు. ఎందుకంటే, యేసు ఇక్కడ వినయం గురించి చెప్పట్లేదు; బదులుగా, కేవలం భౌతిక అవసరాలు తీర్చుకోవడం వల్ల కాదుగానీ, దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించడం వల్లే ప్రజలు సంతోషంగా ఉంటారని ఆయన బోధిస్తున్నాడు. (లూకా 6:20) కాబట్టి, “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు” లేదా “తమకు దేవుని అవసరం ఉందని గుర్తించినవాళ్లు” అని అనువదిస్తే ఖచ్చితంగా మూలభాషలోని అర్థం వస్తుంది.—మత్తయి 5:3; ద న్యూ టెస్టమెంట్‌ ఇన్‌ మాడర్న్‌ ఇంగ్లీష్‌.

  •  “రోషం” లేదా “అసూయ” అని అనువదించిన హీబ్రూ పదానికి చాలా సందర్భాల్లో, కావల్సినవాళ్లు చేసిన నమ్మకద్రోహాన్ని బట్టి కోప్పడడం లేదా ఇతరులకు ఉన్నవాటిని బట్టి ఈర్ష్యపడడం అని అర్థం వస్తుంది. (సామెతలు 6:34; యెషయా 11:13) అయితే, అదే హీబ్రూ పదాన్ని సానుకూల భావంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు, “ఆసక్తి” అంటే, తన సేవకుల్ని కాపాడే విషయంలో యెహోవా చూపించే ఆసక్తి గురించి లేదా ఆయన ‘సంపూర్ణ భక్తిని కోరుకోవడం’ గురించి చెప్పడానికి ఆ పదాన్ని వాడవచ్చు. (నిర్గమకాండం 34:14; 2 రాజులు 19:31; యెహెజ్కేలు 5:13; జెకర్యా 8:2) అలాగే, దేవుని నమ్మకమైన సేవకులు ఆయన విషయంలో, ఆయన ఆరాధన విషయంలో చూపించే “ఆసక్తి” గురించి చెప్పడానికి, లేదా వాళ్లు ఆయనపట్ల ‘ఎలాంటి నమ్మకద్రోహ ప్రవర్తననూ సహించకపోవడం’ గురించి చెప్పడానికి కూడా ఆ పదాన్ని ఉపయోగించవచ్చు.—కీర్తన 69:9; 119:139; సంఖ్యాకాండం 25:11.

  • యద్‌ అనే హీబ్రూ పదం మామూలుగా “చెయ్యి” అని అనువదించబడింది, అయితే సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని “శక్తి,” “అధీనం,” ‘ఔదార్యం’ లాంటి ఇతర చాలా పదాలతో అనువదించవచ్చు

     సాధారణంగా మనిషి చెయ్యిని సూచించే హీబ్రూ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఆ పదాన్ని “శక్తి,” “అధీనం,” ‘ఔదార్యం’ అని అనువదించవచ్చు. (ద్వితీయోపదేశకాండం 32:27; 2 సమూయేలు 8:3; 1 రాజులు 10:13) నిజానికి, పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదంలో ఈ పదాన్ని 40 కన్నా ఎక్కువ విధాల్లో అనువదించారు.

ఈ కారణాల్ని బట్టి, బైబిల్ని అనువదిస్తున్నప్పుడు మూలభాషలోని ఒక పదాన్ని ప్రతీసారి ఒకే పదంతో అనువదిస్తే సరిపోదని తెలుస్తోంది. మూలభాషలో చెప్పాలనుకుంటున్న విషయాల్ని చక్కగా తెలియజేయడానికి లక్ష్యభాషలో ఏ పదాల్ని ఎంచుకోవాలి అనే విషయంలో అనువాదకుడు మంచి వివేచన చూపించాలి. అంతేకాదు, సమాచారాన్ని తేలిగ్గా చదవగలిగేలా లక్ష్యభాషలోని వ్యాకరణ నియమాలకు తగ్గట్టుగా వాక్యాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

అయితే, వేర్వేరు పదాలతో అనువదిస్తున్నప్పుడు ఇష్టానుసారంగా అర్థాన్ని మార్చకూడదు. విషయం తనకు ఎలా అర్థమైందనే దాన్నిబట్టి బైబిల్ని స్వేచ్ఛగా భావానువాదం చేసే అనువాదకుడు సమాచార అర్థాన్ని మార్చేసే అవకాశముంది. అదెలాగంటే, అనువాదకుడు మూలభాష ఏం చెప్తుందనే విషయంలో తన సొంత అభిప్రాయాన్ని అనువాదంలో చేర్చవచ్చు లేదా అనువదిస్తున్నప్పుడు మూలభాషలోని ముఖ్యమైన వివరాల్ని వదిలేయవచ్చు. అలా అనువదించిన బైబిళ్లు చదవడానికి తేలిగ్గా ఉన్నా, ఒక్కోసారి ఆ అనువాదాల్లోని అతి స్వేచ్ఛ, చదివేవాళ్లు మూలభాషలోని అసలు సందేశాన్ని తెలుసుకోకుండా చేస్తుంది.

మత సిద్ధాంతాల పట్ల అనువాదకుడికి ఉన్న ఇష్టాయిష్టాలు కూడా అతని అనువాదం మీద ఇట్టే ప్రభావం చూపించవచ్చు. ఉదాహరణకు, మత్తయి 7:13 ఇలా చెప్తుంది: “నాశనానికి నడిపించే . . . దారి విశాలంగా ఉంది.” అయితే కొంతమంది అనువాదకులు బహుశా తమ మత సిద్ధాంతాల మీదున్న ఇష్టం వల్ల అక్కడ “నరకం” అనే పదం వాడారు, నిజానికి అక్కడ వాడిన గ్రీకు పదానికి “నాశనం” అని అర్థం.

అంతేకాదు మామూలు ప్రజలు, అంటే రైతులు, కాపరులు, చేపలుపట్టే వాళ్లు రోజూ మాట్లాడుకునే సామాన్య భాషలో బైబిలు రాయబడిందని కూడా బైబిలు అనువాదకుడు గుర్తుంచుకోవాలి. (నెహెమ్యా 8:8, 12; అపొస్తలుల కార్యాలు 4:13) కాబట్టి ఒక మంచి బైబిలు అనువాదం అనేది, అన్ని నేపథ్యాలకు చెందిన మంచి మనసున్న ప్రజలు అందులోని సందేశాన్ని చక్కగా అర్థం చేసుకునేలా ఉంటుంది. సగటు వ్యక్తి ఎప్పుడో ఒక్కసారి వాడే పదాలు ఉపయోగించడం కన్నా స్పష్టంగా ఉన్న, తేలిగ్గా అర్థమయ్యే సాధారణ పదాలు ఉపయోగించడం మంచిది.

చాలామంది బైబిలు అనువాదకులు తమకు లేని స్వేచ్ఛ తీసుకుని ఆధునిక బైబిలు అనువాదాల్లో నుండి దేవుని పేరును, అంటే యెహోవా అనే పేరును తీసేశారు. నిజానికి ప్రాచీన బైబిలు చేతిరాత ప్రతుల్లో ఆ పేరు ఉంది. (అనుబంధం A4 చూడండి.) చాలా అనువాదాలు ఆ పేరును తీసేసి, దాని స్థానంలో “ప్రభువు” లాంటి బిరుదును పెట్టాయి; కొన్ని అనువాదాలైతే అసలు దేవునికి ఒక పేరు ఉందనే విషయం కూడా తెలియకుండా చేశాయి. ఉదాహరణకు, యోహాను 17:26 లో యేసు చేసిన ప్రార్థన కొన్ని అనువాదాల్లో ఇలా ఉంటుంది, “నిన్ను వాళ్లకు తెలియజేసితిని.” అలాగే, యోహాను 17:6 లో “నీవు నాకు అనుగ్రహించిన వాళ్లకు నిన్ను తెలియజేసితిని” అని ఉంటుంది. అయితే యేసు ప్రార్థనను ఉన్నదున్నట్టు అనువదిస్తే, “నీ పేరును వీళ్లకు తెలియజేశాను” అనీ, “నువ్వు నాకు ఇచ్చిన మనుషులకు నీ పేరు వెల్లడిచేశాను” అనీ ఉండాలి.

కొత్త లోక అనువాదం మొదటి ఇంగ్లీషు ఎడిషన్‌ ముందుమాటలో చెప్పినట్టు, “మేము లేఖనాల్ని భావానువాదం చేయలేదు. ఆధునిక ఇంగ్లీషు భాషలోని నానుడులు అనుమతించినంత మేరకు, విషయం వెంటనే అర్థమయ్యే ప్రతీసారి అక్షరార్థంగా అనువదించాలనే లక్ష్యంతో మేము పనిచేశాం.” కాబట్టి కొత్త లోక బైబిలు అనువాద కమిటీ వీలైనప్పుడల్లా మూలభాషలోని శైలికి అద్దంపట్టే పదాలు, పదబంధాలు ఉపయోగించింది; చదవడానికి ఎబ్బెట్టుగా ఉంటుందని లేదా విషయం వెంటనే అర్థంకాదని అనిపించినప్పుడు మాత్రం అలా చేయలేదు. దానివల్ల ఆ బైబిలు చదవడానికి తేలిగ్గా ఉంటుంది, అలాగే చదివేవాళ్లు దేవుడు ప్రేరేపించిన సందేశం ఉన్నదున్నట్టు అనువదించబడిందనే పూర్తి నమ్మకంతో చదవవచ్చు.—1 థెస్సలొనీకయులు 2:13.