మత్తయి సువార్త 6:1-34

 • కొండమీది ప్రసంగం (1-34)

  • వేరేవాళ్లకు కనిపించేలా నీతికార్యాలు చేయొద్దు (1-4)

  • ఎలా ప్రార్థించాలి (5-15)

   • మాదిరి ప్రార్థన (9-13)

  • ఉపవాసం (16-18)

  • భూమ్మీద, పరలోకంలో సంపదలు (19-24)

  • ఆందోళనపడడం మానేయండి (25-34)

   • రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి (33)

6  “మనుషులకు కనిపించాలని వాళ్ల ముందు మీ నీతికార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి;+ లేకపోతే పరలోకంలో ఉన్న మీ తండ్రి నుండి మీకు ఏ ప్రతిఫలమూ దక్కదు.  కాబట్టి నువ్వు దానధర్మాలు* చేస్తున్నప్పుడు నీ ముందు బాకా ఊదించుకోవద్దు, వేషధారులు మనుషులచేత మహిమ పొందడం కోసం సమాజమందిరాల్లో, వీధుల్లో అలా చేస్తుంటారు. వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను.  కానీ నువ్వు దానధర్మాలు చేస్తున్నప్పుడు, నీ కుడిచెయ్యి చేసేది నీ ఎడమచేతికి తెలియనివ్వకు.  అలాచేస్తే నీ దానధర్మాలు రహస్యంగా ఉంటాయి. అప్పుడు ప్రతీది* చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.+  “అంతేకాదు, మీరు ప్రార్థించేటప్పుడు వేషధారుల్లా ఉండకండి;+ మనుషులకు కనిపించేలా సమాజమందిరాల్లో, ముఖ్య వీధుల మూలల్లో నిలబడి ప్రార్థించడం వాళ్లకు ఇష్టం.+ వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను.  నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు, నీ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకుని, ఎవరూ చూడలేని* నీ తండ్రికి ప్రార్థించు.+ అప్పుడు ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు.  నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, అన్యజనుల్లా చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పకు; ఎక్కువ మాటలు ఉపయోగిస్తే దేవుడు తమ ప్రార్థన వింటాడని వాళ్లు అనుకుంటారు.  కానీ మీరు వాళ్లలా ఉండకండి; ఎందుకంటే మీరు అడగకముందే మీకేమి అవసరమో మీ తండ్రికి తెలుసు.+  “కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థించాలి:+ “‘పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు+ పవిత్రపర్చబడాలి.*+ 10  నీ రాజ్యం+ రావాలి. నీ ఇష్టం+ పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.+ 11  మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు;+ 12  మాకు అప్పుపడిన* వాళ్లను మేము క్షమించినట్టే, మా అప్పులు* కూడా క్షమించు.+ 13  మమ్మల్ని ప్రలోభానికి లొంగిపోనివ్వకు,+ దుష్టుని నుండి మమ్మల్ని కాపాడు.’+ 14  “మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమిస్తే, మీ పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తాడు;+ 15  మనుషులు మీ విషయంలో చేసిన పాపాల్ని మీరు క్షమించకపోతే, మీ పరలోక తండ్రి కూడా మీ పాపాల్ని క్షమించడు.+ 16  “మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు,+ వేషధారుల్లా బాధగా ముఖం పెట్టుకోకండి;* తాము ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కనబడాలని వాళ్లు తమ ముఖాన్ని వికారంగా పెట్టుకుంటారు.*+ వాళ్లు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందారని నేను నిజంగా మీతో చెప్తున్నాను. 17  అయితే నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నీ తలకు నూనె రాసుకో, నీ ముఖం కడుక్కో. 18  అలాచేస్తే నువ్వు ఉపవాసం ఉంటున్నట్టు మనుషులకు కాదుగానీ, ఎవరూ చూడలేని నీ తండ్రికి మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు ప్రతీది చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. 19  “భూమ్మీద మీ కోసం సంపదలు కూడబెట్టుకోవడం ఆపండి;+ ఇక్కడ చెదలు, తుప్పు వాటిని తినేస్తాయి; దొంగలు కన్నం వేసి దోచుకుంటారు. 20  బదులుగా, పరలోకంలో మీ కోసం సంపదలు కూడబెట్టుకోండి;+ అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ వాటిని తినవు;+ దొంగలు కన్నం వేసి దోచుకోరు. 21  నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. 22  “శరీరానికి దీపం కన్నే+ కాబట్టి, నీ కన్ను ఒకేదానిపై దృష్టి నిలిపితే* నీ శరీరమంతా ప్రకాశవంతంగా* ఉంటుంది. 23  అయితే నీ కన్ను ఈర్ష్యతో నిండిపోతే*+ నీ శరీరమంతా చీకటౌతుంది. నీలో ఉన్న వెలుగు చీకటిగా మారితే, ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా! 24  “ఏ వ్యక్తీ ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. అతను ఒక యజమానిని ద్వేషించి ఇంకో యజమానిని ప్రేమిస్తాడు,+ లేదా ఒక యజమానికి నమ్మకంగా ఉండి ఇంకో యజమానిని చిన్నచూపు చూస్తాడు. మీరు ఒకే సమయంలో దేవునికీ సంపదలకూ దాసులుగా ఉండలేరు.+ 25  “అందుకే నేను మీతో చెప్తున్నాను. ఏమి తినాలా, ఏమి తాగాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏమి వేసుకోవాలా అని మీ శరీరం గురించి+ గానీ ఆందోళన పడడం మానేయండి.+ ఆహారంకన్నా ప్రాణం, బట్టలకన్నా శరీరం విలువైనవి కావా?+ 26  ఆకాశపక్షుల్ని బాగా గమనించండి;+ అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా? 27  మీలో ఎవరైనా ఆందోళన పడడం వల్ల మీ ఆయుష్షును కాస్తయినా* పెంచుకోగలరా?+ 28  అలాగే, బట్టల గురించి మీరు ఎందుకు ఆందోళన పడుతున్నారు? గడ్డిపూలు ఎలా పెరుగుతాయో జాగ్రత్తగా గమనించండి; అవి కష్టపడవు, వడకవు;* 29  కానీ తన పూర్తి వైభవంతో ఉన్న సొలొమోను+ కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. 30  ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిమొక్కలనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే, అల్పవిశ్వాసులారా, ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా? 31  కాబట్టి ‘ఏమి తినాలి?’ ‘ఏమి తాగాలి?’ ‘ఏమి వేసుకోవాలి?’ అనుకుంటూ ఎన్నడూ ఆందోళన పడకండి.+ 32  అన్యజనులు వీటి వెనకే ఆత్రంగా పరుగెత్తుతున్నారు. అయితే మీకు ఇవన్నీ అవసరమని మీ పరలోక తండ్రికి తెలుసు. 33  “కాబట్టి మీరు ఆయన రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు ఇస్తాడు.+ 34  అందుకే రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి,+ రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి, ఏ రోజు సమస్యలు ఆ రోజుకు చాలు.

అధస్సూచీలు

లేదా “పేదవాళ్లకు దానధర్మాలు.” పదకోశం చూడండి.
లేదా “రహస్యంగా.”
లేదా “రహస్యంలో ఉన్న.”
లేదా “పవిత్రంగా ఎంచబడాలి; పవిత్రంగా చూడబడాలి.”
లేదా “మా విషయంలో పాపం చేసిన.”
లేదా “పాపాలు.”
లేదా “తాము కనిపించే తీరును పట్టించుకోరు.”
లేదా “ముఖం పెట్టడం మానేయండి.”
లేదా “నీ కన్ను తేటగా ఉంటే.” అక్ష., “సరళంగా ఉంటే.”
లేదా “వెలుగుమయంగా.”
అక్ష., “చెడ్డదైతే; దుష్టమైనదైతే.” అంటే, చాలా విషయాల కోసం చూస్తుంటే.
అక్ష., “ఒక మూరైనా.” అనుబంధం B14 చూడండి.
లేదా “నేయవు.”