మొదటి కొరింథీయులు 7:1-40

  • పెళ్లికానివాళ్లకు, పెళ్లయినవాళ్లకు ​సలహాలు (1-16)

  • దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే కొనసాగాలి (17-24)

  • పెళ్లికానివాళ్లు, విధవరాళ్లు (25-40)

    • పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ప్రయోజనాలు (32-35)

    • “ప్రభువును అనుసరించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి” (39)

7  మీరు అడిగినవాటి గురించి ఇప్పుడు రాస్తున్నాను. పురుషుడు స్త్రీని ముట్టకపోవడం* మంచిది;  కానీ, లైంగిక పాపాలు* ఎక్కువౌతున్నాయి కాబట్టి, ప్రతీ పురుషునికి సొంత భార్య ఉండాలి,+ ప్రతీ స్త్రీకి సొంత భర్త ఉండాలి.+  భర్త తన భార్య అవసరాన్ని* తీర్చాలి. అలాగే భార్య కూడా తన భర్త అవసరాన్ని తీర్చాలి.+  భార్యకు తన సొంత శరీరం మీద అధికారం లేదు, భర్తకే ఆ అధికారం ఉంది; అలాగే భర్తకు కూడా తన సొంత శరీరం మీద అధికారం లేదు, భార్యకే ఆ అధికారం ఉంది.  ప్రార్థనకు సమయం కేటాయించగలిగేలా, ఇద్దరూ కలిసి ఒక మాట అనుకొని కొంత సమయం దూరంగా ఉండాలనుకుంటే తప్ప ఒకరికొకరు అస్సలు దూరంగా ఉండకండి. కానీ మీరు నిగ్రహించుకోలేనప్పుడు, సాతాను మిమ్మల్ని శోధిస్తూ ఉండకుండా మళ్లీ కలుసుకోండి.  అయితే, నేను దీన్ని ఒక ఆజ్ఞలా చెప్పట్లేదు; మీరు పాటించాలనుకుంటే పాటించవచ్చు.  నిజానికి, అందరూ నాలా ఉండాలని నా కోరిక. అయినా, దేవుడు ప్రతీ ఒక్కరికి వాళ్లకంటూ ఒక బహుమతిని ఇచ్చాడు;+ ఒకరికి ఒక బహుమతిని ఇస్తే, ఇంకొకరికి ఇంకో బహుమతిని ఇచ్చాడు.  పెళ్లికానివాళ్లకు, విధవరాళ్లకు నేను చెప్పేదేమిటంటే, మీరు నాలా ఉంటే మీకు మంచిది.+  కానీ నిగ్రహం లేకపోతే పెళ్లిచేసుకోండి. లైంగిక కోరికలతో రగిలిపోవడం కన్నా పెళ్లిచేసుకోవడమే మంచిది.+ 10  ఇప్పుడు నేను పెళ్లయినవాళ్లకు నిర్దేశాలిస్తున్నాను, నిజానికి నేను కాదు, ప్రభువే ఇస్తున్నాడు. ఏమనంటే, భార్య తన భర్త నుండి విడిపోకూడదు.+ 11  ఒకవేళ విడిపోతే పెళ్లిచేసుకోకుండా ఉండాలి లేదా భర్తతో తిరిగి సమాధానపడాలి;* అలాగే భర్త తన భార్యను వదిలేయకూడదు.+ 12  అయితే ఇతరులకు నేను చెప్తున్నాను, అవును, ప్రభువు కాదు నేనే చెప్తున్నాను.+ ఒక సహోదరునికి అవిశ్వాసియైన భార్య ఉండి, ఆమెకు అతనితో కలిసి ఉండడం ఇష్టమైతే, అతను ఆమెను వదిలేయకూడదు; 13  అలాగే ఒక స్త్రీకి అవిశ్వాసియైన భర్త ఉండి, అతనికి ఆమెతో కలిసి ఉండడం ఇష్టమైతే, ఆమె అతన్ని వదిలేయకూడదు. 14  ఎందుకంటే, అవిశ్వాసియైన భర్త తన భార్యతో ఉన్న బంధం వల్ల పవిత్రపర్చబడతాడు. అలాగే అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన తన భర్తతో ఉన్న బంధం వల్ల పవిత్రపర్చబడుతుంది; లేదంటే, మీ పిల్లలు అపవిత్రులౌతారు. ఇప్పుడైతే వాళ్లు పవిత్రులు. 15  అవిశ్వాసియైన వ్యక్తి విడిపోవాలనుకుంటే,* విడిపోనివ్వండి; అలాంటి పరిస్థితుల్లో సహోదరుడు గానీ, సహోదరి గానీ ఖచ్చితంగా తన భాగస్వామితో కలిసి ఉండాలని ఏమీ లేదు. దేవుడు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండడానికి పిలిచాడు.+ 16  ఓ స్త్రీ, నీ భర్తను రక్షిస్తావో లేదో నీకేం తెలుసు?+ ఓ పురుషుడా, నీ భార్యను రక్షిస్తావో లేదో నీకేం తెలుసు? 17  అయితే, ప్రతీ ఒక్కరు యెహోవా* తమకు ఇచ్చిన భాగానికి తగ్గట్టు, తాము పిలుపు అందుకున్న స్థితికి తగ్గట్టు నడుచుకోవాలి.+ అందుకే నేను ఈ నిర్దేశాన్ని అన్ని సంఘాలకు ఇస్తున్నాను. 18  సున్నతి చేయించుకున్న వ్యక్తి దేవుని పిలుపు అందుకున్నాడా?+ అయితే అతను సున్నతిని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సున్నతి చేయించుకోని వ్యక్తి దేవుని పిలుపు అందుకున్నాడా? అయితే అతను సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు.+ 19  సున్నతి చేయించుకున్నామా లేదా అన్నది ముఖ్యం కాదుగానీ,+ దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం.+ 20  దేవుడు ప్రతీ ఒక్కర్ని ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే వాళ్లు కొనసాగాలి.+ 21  దాసులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచాడా? దాని గురించి ఆందోళన పడకండి;+ అయితే విడుదల పొందే అవకాశం మీకుంటే దాన్ని చేజార్చుకోకండి. 22  ఎందుకంటే దాసులుగా ఉన్నప్పుడు పిలుపు అందుకున్న ప్రభువు శిష్యులు, ప్రభువుకు చెందిన స్వతంత్రులు* అవుతారు;+ అలాగే స్వతంత్రులుగా ఉన్నప్పుడు పిలుపు అందుకున్నవాళ్లు క్రీస్తు దాసులు అవుతారు. 23  దేవుడు మిమ్మల్ని ఎంతో ఖరీదు పెట్టి కొన్నాడు;+ మనుషులకు దాసులుగా ఉండడం మానేయండి. 24  సహోదరులారా, దేవుడు ప్రతీ ఒక్కర్ని ఏ స్థితిలో ఉండగా పిలిచాడో, వాళ్లు దేవుని ముందు ఆ స్థితిలోనే కొనసాగాలి. 25  పెళ్లికానివాళ్ల* విషయానికొస్తే, వాళ్ల గురించి ప్రభువు నాకు ఏ ఆజ్ఞా ఇవ్వలేదు. కానీ, ప్రభువు కరుణను పొందిన నమ్మకమైన వ్యక్తిగా నా అభిప్రాయం+ చెప్తున్నాను. 26  మనం కష్టకాలాల్లో ఉన్నాం, కాబట్టి ఒక వ్యక్తి తానున్న స్థితిలోనే కొనసాగడం మంచిదని నాకనిపిస్తోంది. 27  నీకు భార్య ఉందా? అయితే ఆమె నుండి విడిపోవాలని చూడకు.+ నీకు భార్య లేదా? అయితే పెళ్లి చేసుకోవాలని చూడకు. 28  ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా, అది పాపమేమీ కాదు. పెళ్లికానివాళ్లు* పెళ్లి చేసుకుంటే, అందులో పాపమేమీ లేదు. అయితే పెళ్లి చేసుకునేవాళ్లకు శరీర సంబంధమైన శ్రమలు వస్తాయి. మీకు ఆ శ్రమలు రాకుండా చూడాలన్నదే నా ప్రయత్నం. 29  అంతేకాదు సహోదరులారా, కొంచెం సమయమే మిగిలి ఉంది.+ ఇప్పటినుండి భార్య ఉన్నవాళ్లు భార్య లేనట్టు ఉండాలి. 30  ఏడుస్తున్నవాళ్లు ఏడ్వనట్టు, సంతోషిస్తున్నవాళ్లు సంతోషించనట్టు, కొనుక్కునేవాళ్లు కొన్నవి తమవి కానట్టు ఉండాలి. 31  ఈ లోకాన్ని ఉపయోగించుకునేవాళ్లు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోకం తీరుతెన్నులు మారుతున్నాయి. 32  నిజానికి, మీకు ఏ ఆందోళనా ఉండకూడదు అన్నదే నా కోరిక. పెళ్లికాని వ్యక్తి ప్రభువును సంతోషపెట్టాలని కోరుకుంటాడు కాబట్టి ప్రభువుకు సంబంధించిన విషయాల గురించే ఆలోచిస్తాడు. 33  కానీ పెళ్లయిన వ్యక్తి తన భార్యను సంతోషపెట్టాలని అనుకుంటాడు కాబట్టి లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాడు.+ 34  అతని మనసు రెండువైపులకు లాగుతూ ఉంటుంది. అయితే పెళ్లి చేసుకోని స్త్రీలు, కన్యలు తమ శరీరం, మనసు పవిత్రంగా ఉండేలా ప్రభువు సేవకు సంబంధించిన విషయాల గురించే ఆలోచిస్తారు.+ కానీ, పెళ్లయిన స్త్రీ తన భర్తకు ఇష్టమైనవి చేయాలనుకుంటుంది కాబట్టి లోక సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తుంది. 35  నేను మీ మంచికోసమే ఈ విషయాలు చెప్తున్నాను, మిమ్మల్ని కట్టడిచేయాలని కాదు. సరైనది చేసేలా మిమ్మల్ని పురికొల్పడానికి, మీ ధ్యాస పక్కకు మళ్లకుండా ఎప్పుడూ ప్రభువు సేవ చేసేలా మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ విషయాలు చెప్తున్నాను. 36  అయితే, పెళ్లికాని ఒక వ్యక్తికి తన లైంగిక కోరికల్ని అణుచుకోలేకపోతున్నానని* అనిపిస్తే, మరిముఖ్యంగా అతనికి యౌవనప్రాయం దాటిపోయుంటే, అలాంటి పరిస్థితిలో అతను పెళ్లిచేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు; అతను పాపం చేసినట్టు కాదు.+ 37  అదే ఒక వ్యక్తి తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, తనను తాను అదుపులో ఉంచుకోగలనని అనుకొని, పెళ్లి చేసుకోకూడదని* తన మనసులో గట్టిగా నిర్ణయించుకొని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే అతనికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.+ 38  అలాగే, పెళ్లి చేసుకునేవాళ్లకు* కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి, కానీ పెళ్లి చేసుకోనివాళ్లకు ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.+ 39  భర్త బ్రతికున్నంత కాలం భార్య అతనికి కట్టుబడి ఉండాలి.+ ఒకవేళ అతను చనిపోతే,* ఆమె ఎవర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్లను పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. కానీ, ప్రభువును అనుసరించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి.+ 40  అయితే నా అభిప్రాయం ఏమిటంటే, ఆమె మళ్లీ పెళ్లిచేసుకోకుండా ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది; నాకు కూడా దేవుని పవిత్రశక్తి ఉందని నమ్ముతున్నాను.

అధస్సూచీలు

అంటే, స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకోకపోవడం.
ఇక్కడ గ్రీకులో పోర్నియా అనే పదానికి బహువచనం ఉపయోగించారు. పదకోశం చూడండి.
అంటే, లైంగిక అవసరాల్ని.
లేదా “సఖ్యత కుదుర్చుకోవాలి.”
లేదా “వెళ్లిపోవాలనుకుంటే.”
అనుబంధం A5 చూడండి.
లేదా “స్వతంత్రులుగా చేయబడినవాళ్లు.”
ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం, ఎప్పుడూ లైంగిక సంబంధం పెట్టుకోని యువకుల్ని, యువతుల్ని సూచిస్తోంది.
ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం, ఎప్పుడూ లైంగిక సంబంధం పెట్టుకోని యువకుల్ని, యువతుల్ని సూచిస్తోంది.
లేదా “తన అవివాహ స్థితి విషయంలో సరిగ్గా ప్రవర్తించట్లేదని.”
లేదా “తన అవివాహ స్థితిని కాపాడుకోవాలని.”
లేదా “పెళ్లితో తమ అవివాహ స్థితిని పోగొట్టుకునేవాళ్లకు.”
అక్ష., “మరణంలో నిద్రిస్తే.”