ఎఫెసీయులు 4:1-32

  • క్రీస్తు శరీరంలో ఐక్యత (1-16)

    • మనుషుల్లో వరాలు (8)

  • పాత వ్యక్తిత్వం, కొత్త వ్యక్తిత్వం (17-32)

4  కాబట్టి ప్రభువు ఖైదీనైన నేను,+ మీరు అందుకున్న పిలుపుకు తగ్గట్టు నడుచుకోమని+ మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను.  అంటే, ఎప్పుడూ వినయంగా*+ సౌమ్యంగా ఉంటూ, ఓర్పు చూపిస్తూ,+ ప్రేమతో ఒకరినొకరు భరించుకుంటూ,+  ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలుగుతూ, పవిత్రశక్తి వల్ల కలిగిన ఐక్యతను కాపాడుకోవడానికి పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉండమని బ్రతిమాలుతున్నాను.+  మీరు ఏ నిరీక్షణ కోసం పిలుపు అందుకు​న్నారో ఆ నిరీక్షణ ఒక్కటే,+ అలాగే శరీరం ఒక్కటే,+ పవిత్రశక్తి ఒక్కటే;+  ప్రభువు ఒక్కడే,+ విశ్వాసం* ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే;  అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయనకు అందరి మీద అధికారం ఉంది, ఆయన అందరి ద్వారా పనిచేస్తున్నాడు, ఆయన శక్తి అందరిలో పనిచేస్తోంది.  క్రీస్తు ఉచిత బహుమతిని పంచి ఇచ్చిన ప్రకారం దేవుడు మనలో ఒక్కొక్కరికి అపారదయను అనుగ్రహించాడు.+  ఎందుకంటే లేఖనం ఇలా చెప్తుంది: “ఆయన పైకి వెళ్తున్నప్పుడు బందీల్ని తీసుకెళ్లాడు; మనుషుల్లో వరాల్ని* ఇచ్చాడు.”+  ఇక్కడ, “ఆయన పైకి వెళ్తున్నప్పుడు” అనే మాటకు అర్థం ఏంటి? ఆయన కిందికి, అంటే భూమ్మీదికి ​వచ్చాడనే కదా. 10  కిందికి వచ్చిన ఆయనే, అన్నిటినీ పూర్తిచేయగలిగేలా ఆకాశమంతటినీ దాటి+ ఎంతో పైకి వెళ్లాడు.+ 11  ఆయన కొందర్ని అపొస్తలులుగా,+ కొందర్ని ప్రవక్తలుగా,+ కొందర్ని మంచివార్త ​ప్రచారకులుగా,*+ కొందర్ని కాపరులుగా, బోధకులుగా+ ఇచ్చాడు. 12  పవిత్రుల్ని సరైన దారిలో పెట్టడానికి,* పరిచర్య పని చేయడానికి, క్రీస్తు శరీరాన్ని* బలపర్చడానికి*+ వాళ్లను ఏర్పాటు చేశాడు. 13  మనందరం విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గురించిన సరైన జ్ఞానం విషయంలో ఒక్కటయ్యేవరకు, సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి సాధించేవరకు+ వాళ్లు ఆ పని చేస్తుంటారు. 14  కాబట్టి మనం ఇకనుండి చిన్నపిల్లల్లా ఉండకూడదు. అంటే, కుయుక్తితో ఇతరుల్ని మోసం చేసేవాళ్ల తప్పుడు బోధల్ని నమ్మి సముద్రపు కెరటాలకు, గాలికి అటూఇటూ కొట్టుకుపోయే పడవలా ఉండకూడదు.+ 15  అయితే, మనం నిజమే మాట్లాడుతూ, ప్రేమతో పురికొల్పబడి మన శిరస్సయిన క్రీస్తు+ కింద అన్ని విషయాల్లో పరిణతి సాధించేవరకు ఎదుగుతూ ఉందాం. 16  ఆయన నుండి శరీరమంతా+ చక్కగా అమ​ర్చబడుతుంది, అవయవాలన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ శరీరానికి అవసరమైనదాన్ని అందిస్తాయి. ప్రతీ అవయవం తన పనిని సరిగ్గా చేస్తే శరీరం బాగా ఎదుగుతుంది, ప్రేమలో బలపడుతుంది.+ 17  కాబట్టి ప్రభువు పేరున నేను మీకు చెప్పేది, మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరిక అన్యజనుల్లా అర్థంపర్థంలేని* ఆలోచనల+ ప్రకారం నడుచుకోకండి.+ 18  తమ అజ్ఞానం వల్ల, మొద్దుబారిన హృదయాల వల్ల వాళ్లు* చీకట్లో ఉన్నారు, దేవుడు ఇస్తానన్న శాశ్వత జీవితానికి దూరంగా ఉన్నారు. 19  వాళ్లు నైతిక విచక్షణను పూర్తిగా కోల్పోయి, అత్యాశతో అన్నిరకాల అపవిత్రమైన పనులు చేస్తూ లెక్కలేనితనంలో*+ మునిగిపోయారు. 20  అయితే క్రీస్తు గురించి మీరు అలా నేర్చుకోలేదు. 21  (మీరు నిజంగా ఆయన మాటలు విని, యేసులో ఉన్న సత్యానికి అనుగుణంగా బోధించబడివుంటే, ఈ విషయం మీకు తెలుసు.) 22  మీరు మీ పాత ప్రవర్తనకు అనుగుణంగా ఉన్న పాత వ్యక్తిత్వాన్ని వదిలేయాలని+ నేర్చుకున్నారు. అది దాని మోసపూరిత కోరికల వల్ల దిగజారుతూ ఉంది.+ 23  అలాగే మీరు కొత్త ఆలోచనా విధానాన్ని* అలవర్చుకుంటూ ఉండాలి;+ 24  నిజమైన నీతికి, విశ్వసనీయతకు అనుగుణంగా దేవుని ఇష్టప్రకారం సృష్టించబడిన కొత్త వ్యక్తిత్వాన్ని ధరించుకోవాలి.+ 25  కాబట్టి, మోసం చేయడం మానేసిన మీరు సాటిమనిషితో* నిజమే మాట్లాడండి.+ ఎందుకంటే మనందరం ఒకే శరీరంలోని అవయవాలం.+ 26  మీకు కోపం వచ్చినా, పాపం మాత్రం చేయకండి,+ సూర్యుడు అస్తమించే లోపే మీ కోపాన్ని తీసేసుకోండి;+ 27  అపవాదికి అవకాశం* ఇవ్వకండి.+ 28  దొంగతనం చేసేవాళ్లు ఇకనుండి దొంగతనం చేయకూడదు; బదులుగా కష్టపడి పనిచేయాలి,+ అవసరంలో ఉన్నవాళ్లకు ఎంతోకొంత ఇవ్వగలిగేలా తమ సొంత చేతులతో నిజాయితీగల పని చేయాలి.+ 29  మీ నోటి నుండి చెడ్డ మాట అనేదే రాకూడదు.+ బదులుగా, వినేవాళ్లకు ప్రయోజనం కలిగేలా అవసరాన్ని బట్టి, బలపర్చే మంచి మాటలే మాట్లాడండి.+ 30  దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి.*+ మీరు విమోచన క్రయధనం* ద్వారా విడుదల పొందే+ రోజు కోసం దేవుడు ఆ పవిత్రశక్తితోనే మీకు ముద్ర వేశాడు.+ 31  మీరు అన్నిరకాల ద్వేషం, అలాగే కోపం, ఆగ్రహం, అరవడం, తిట్టడం, అన్నిరకాల చెడుతనం మానేయండి.+ 32  బదులుగా ఒకరితో ఒకరు దయగా మెలగండి, కనికరం చూపించండి,+ క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి.+

అధస్సూచీలు

లేదా “దీనమనస్సుతో.”
లేదా “సరైన మార్గం.”
లేదా “కానుకల్ని.”
లేదా “సువార్తికులుగా.”
లేదా “పవిత్రులకు శిక్షణ ఇవ్వడానికి.”
అంటే, సంఘాన్ని.
అక్ష., “కట్టడానికి.”
లేదా “వ్యర్థమైన.”
అక్ష., “వాళ్ల మనసులు.”
లేదా “సిగ్గులేని ప్రవర్తనలో.” గ్రీకులో అసెల్జీయ. పదకోశం చూడండి.
లేదా “మనసును నిర్దేశించే శక్తిని.” అక్ష., “మానసిక స్ఫూర్తిని.”
లేదా “పొరుగువాడితో.”
లేదా “చోటు.”
లేదా “దుఃఖపెట్టకండి.”
పదకోశం చూడండి.