మత్తయి సువార్త 5:1-48

 • కొండమీది ప్రసంగం (1-48)

  • యేసు కొండమీద బోధించడం మొదలుపెట్టడం (1, 2)

  • తొమ్మిది సంతోషాలు (3-12)

  • ఉప్పు, వెలుగు (13-16)

  • ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు వచ్చాడు (17-20)

  • కోపం (21-26), వ్యభిచారం (27-30), ​విడాకులు (31, 32), ఒట్టు వేయడం (33-37), ప్రతీకారం (38-42), శత్రువుల్ని ప్రేమించడం (43-48) గురించి సలహా

5  యేసు ఆ ప్రజల్ని చూసినప్పుడు ఒక కొండ మీదికి వెళ్లి కూర్చున్నాడు; ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.  అప్పుడు యేసు వాళ్లకు ఇలా బోధించడం మొదలుపెట్టాడు:  “దేవుని నిర్దేశం తమకు అవసరమని గుర్తించేవాళ్లు* సంతోషంగా ఉంటారు,*+ ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది.  “దుఃఖించేవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు ఓదార్చబడతారు.+  “సౌమ్యులు*+ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు భూమికి వారసులౌతారు.+  “నీతి కోసం ఆకలిదప్పులు గలవాళ్లు*+ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు తృప్తిపర్చబడతారు.+  “కరుణ చూపించేవాళ్లు+ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లమీద ఇతరులు కరుణ చూపిస్తారు.  “స్వచ్ఛమైన హృదయం+ గలవాళ్లు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుణ్ణి చూస్తారు.  “శాంతిని నెలకొల్పేవాళ్లు*+ సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లు దేవుని పిల్లలు* అనబడతారు. 10  “నీతి కోసం హింసించబడేవాళ్లు సంతోషంగా ఉంటారు,+ ఎందుకంటే పరలోక రాజ్యం వాళ్లది. 11  “మీరు నా శిష్యులు అనే కారణంతో ప్రజలు మిమ్మల్ని నిందించి,+ హింసించి,+ మీ గురించి అబద్ధంగా అన్నిరకాల చెడ్డమాటలు మాట్లాడినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు.+ 12  పరలోకంలో మీకోసం గొప్ప బహుమానం+ వేచివుంది కాబట్టి సంతోషించండి, ఆనందంతో గంతులు వేయండి;+ ఎందుకంటే వాళ్లు అంతకుముందున్న ప్రవక్తల్ని కూడా ఇలాగే హింసించారు.+ 13  “మీరు లోకానికి ఉప్పు లాంటివాళ్లు, కానీ ఉప్పు దాని రుచి* కోల్పోతే, దానికి మళ్లీ ఉప్పదనం ఎలా వస్తుంది? అది మనుషులు తొక్కేలా బయట పారేయడానికి తప్ప దేనికీ పనికిరాదు. 14  “మీరు లోకానికి వెలుగు లాంటివాళ్లు.+ కొండమీద ఉన్న నగరం అందరికీ కనిపిస్తుంది. 15  ప్రజలు దీపాన్ని వెలిగించి గంప కింద పెట్టరు కానీ దీపస్తంభం మీద పెడతారు, అప్పుడది ఇంట్లో ఉన్న వాళ్లందరికీ వెలుగిస్తుంది.+ 16  అలాగే, మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి,+ అప్పుడు వాళ్లు మీ మంచిపనులు+ చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరుస్తారు.+ 17  “నేను ధర్మశాస్త్రాన్ని గానీ, ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చానని అనుకోకండి. నేను వాటిని రద్దు చేయడానికి కాదు, నెరవేర్చడానికే వచ్చాను.+ 18  నేను నిజంగా మీతో చెప్తున్నాను. ఆకాశం, భూమి నాశనమైనా, ధర్మశాస్త్రమంతా పూర్తిగా నెరవేరేవరకు దానిలోని చిన్న అక్షరంగానీ, పొల్లుగానీ తప్పిపోదు.+ 19  కాబట్టి ఎవరైనా దీనిలోని అతిచిన్న ఆజ్ఞల్లో ఒకదాన్ని మీరి, అలా చేయమని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో అందరికన్నా తక్కువవాడిగా ఎంచబడతాడు. అయితే ఎవరైనా ఈ ఆజ్ఞలు పాటిస్తూ, వాటిని ఇతరులకు బోధిస్తే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఎంచబడతాడు. 20  మీరు శాస్త్రుల కన్నా, పరిసయ్యుల కన్నా ఎక్కువ నీతిగా ఉండకపోతే,+ మీరు పరలోక రాజ్యంలోకి అస్సలు ప్రవేశించరని నేను మీతో చెప్తున్నాను.+ 21  “‘హత్య చేయకూడదు,+ ఎవరైనా హత్య చేస్తే అతను న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది’ అని పూర్వీకులకు చెప్పబడిందని మీరు విన్నారు కదా.+ 22  అయితే నేను మీతో చెప్తున్నాను, తన సహోదరుని మీద మనసులో కోపం పెట్టుకునే ప్రతీ వ్యక్తి+ న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది; తన సహోదరుణ్ణి ఘోరంగా అవమానిస్తూ మాట్లాడేవాడు అత్యున్నత న్యాయస్థానం ముందు హాజరవ్వాల్సి ఉంటుంది; తన సహోదరుణ్ణి ‘పనికిమాలిన మూర్ఖుడా’ అని తిట్టేవాడు మండే గెహెన్నాలో* పడేయబడతాడు.+ 23  “కాబట్టి, నువ్వు బలిపీఠం దగ్గరికి నీ అర్పణను తెస్తున్నప్పుడు,+ నీ సహోదరుడు నీ వల్ల నొచ్చుకున్నాడని అక్కడ నీకు గుర్తొస్తే, 24  బలిపీఠం ఎదుటే నీ అర్పణను విడిచిపెట్టి వెళ్లి ముందు నీ సహోదరునితో సమాధానపడు;* తర్వాత తిరిగొచ్చి నీ అర్పణను అర్పించు.+ 25  “నువ్వు నీ ప్రతివాదితో న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఉన్నప్పుడే, త్వరగా అతనితో రాజీపడు. లేకపోతే అతను నిన్ను న్యాయమూర్తికి అప్పగిస్తాడు, న్యాయమూర్తి భటుడికి అప్పగిస్తాడు; నిన్ను చెరసాలలో వేస్తారు. 26  నువ్వు చివరి నాణెం* చెల్లించేంత వరకు అక్కడి నుండి బయటికి రానేరావని నేను నిజంగా నీతో చెప్తున్నాను. 27  “‘వ్యభిచారం చేయకూడదు’ అని చెప్పబడిందని+ మీరు విన్నారు కదా. 28  కానీ నేను మీతో చెప్తున్నాను, ఒక స్త్రీ మీద కోరిక కలిగేలా అదేపనిగా ఆమెను చూస్తూ ఉండేవాడు+ అప్పటికే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేశాడు.+ 29  కాబట్టి నీ కుడి కన్ను నీతో పాపం చేయిస్తుంటే,* దాన్ని పీకేసి దూరంగా పడేయి.+ నీ శరీరమంతా గెహెన్నాలో* పడేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు.+ 30  అలాగే, నీ కుడిచెయ్యి నీతో పాపం చేయిస్తుంటే,* దాన్ని నరికేసి దూరంగా పడేయి.+ నీ శరీరమంతా గెహెన్నాలో* పడేయబడడం కన్నా నీ అవయవాల్లో ఒకదాన్ని పోగొట్టుకోవడం నీకు మేలు.+ 31  “అంతేకాదు, ‘తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెకు విడాకుల పత్రం ఇవ్వాలి’ అని చెప్పబడింది కదా.+ 32  అయితే నేను మీతో చెప్తున్నాను, లైంగిక పాపం* అనే కారణాన్ని బట్టి కాకుండా వేరే కారణంతో తన భార్యకు విడాకులు ఇచ్చే ప్రతీ వ్యక్తి, ఆమెను వ్యభిచారం చేసే ప్రమాదంలోకి నెడుతున్నాడు. ఈ విధంగా విడాకులు ఇవ్వబడిన స్త్రీని పెళ్లి చేసుకునే వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.+ 33  “అంతేకాదు, ‘నువ్వు ప్రమాణం చేస్తే దాన్ని తప్పకూడదు,+ నువ్వు యెహోవాకు* చేసుకున్న మొక్కుబళ్లు చెల్లించాలి’ అని పూర్వీకులతో చెప్పబడిందని+ మీరు విన్నారు కదా. 34  అయితే నేను మీతో చెప్తున్నాను, అసలు ఒట్టే వేయొద్దు;+ పరలోకం తోడు అని ఒట్టు వేయొద్దు, అది దేవుని సింహాసనం; 35  భూమి తోడు అని ఒట్టు వేయొద్దు, అది ఆయన పాదపీఠం;+ యెరూషలేము తోడు అని ఒట్టు వేయొద్దు, అది మహారాజు నగరం.+ 36  నీ ప్రాణం తోడు* అని ఒట్టుపెట్టుకోవద్దు, నువ్వు ఒక్క వెంట్రుకను కూడా తెల్లగానైనా నల్లగానైనా చేయలేవు. 37  మీ మాట “అవును” అంటే అవును, “కాదు” అంటే కాదు అన్నట్టే ఉండాలి.+ వీటికి మించింది ఏదైనా, అది దుష్టుని నుండి వచ్చేదే.+ 38  “‘కంటికి కన్ను, పంటికి పన్ను’ అని చెప్పబడిందని+ మీరు విన్నారు కదా. 39  అయితే నేను మీతో చెప్తున్నాను, చెడ్డవాణ్ణి ఎదిరించవద్దు, బదులుగా నిన్ను కుడి చెంప మీద కొట్టేవాడికి ఎడమ చెంప కూడా చూపించు.+ 40  ఎవరైనా నిన్ను న్యాయస్థానానికి తీసుకెళ్లి నీ లోపలి వస్త్రాన్ని తీసుకోవాలని అనుకుంటే, అతనికి నీ పైవస్త్రాన్ని కూడా ఇచ్చేయి.+ 41  అధికారంలో ఉన్న వ్యక్తి ఒక మైలు* దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో పాటు రెండు మైళ్లు వెళ్లు. 42  ఎవరైనా నిన్ను ఏదైనా అడిగితే ఇవ్వు, నిన్ను అప్పు అడగాలనుకునే* వాళ్లకు ముఖం చాటేయకు.+ 43  “‘నీ సాటిమనిషిని* ప్రేమించాలి,+ నీ శత్రువును ద్వేషించాలి’ అని చెప్పబడిందని మీరు విన్నారు కదా. 44  అయితే నేను మీతో చెప్తున్నాను, మీ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండండి,+ మిమ్మల్ని హింసించేవాళ్ల కోసం ప్రార్థిస్తూ ఉండండి,+ 45  అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి పిల్లలుగా* ఉంటారు. ఎందుకంటే ఆయన దుష్టుల మీద, మంచివాళ్ల మీద తన సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు; నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు.+ 46  మిమ్మల్ని ప్రేమించేవాళ్లనే మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం దొరుకుతుంది? పన్ను వసూలుచేసే వాళ్లు కూడా అలా చేస్తున్నారు కదా? 47  మీ సహోదరులకు మాత్రమే మీరు నమస్కారం చేస్తే, మీరేం గొప్ప పని చేస్తున్నట్టు? అన్యజనులు కూడా అలా చేస్తున్నారు కదా? 48  మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా ఆయనలా పరిపూర్ణులుగా* ఉండాలి.+

అధస్సూచీలు

లేదా “ధన్యులు.”
లేదా “పవిత్రశక్తి కోసం యాచించేవాళ్లు.”
లేదా “సాత్వికులు.”
లేదా “నీతిని బలంగా కోరుకునేవాళ్లు.”
అక్ష., “కుమారులు.”
లేదా “శాంత స్వభావం గలవాళ్లు.”
లేదా “సారం.”
యెరూషలేము బయట వ్యర్థ పదార్థాల్ని కాల్చేసే స్థలం. పదకోశం చూడండి.
లేదా “సఖ్యత కుదుర్చుకో.”
అక్ష., “చివరి క్వాడ్రన్స్‌.” అనుబంధం B14 చూడండి.
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
పదకోశం చూడండి.
అక్ష., “నిన్ను తడబడేలా చేస్తుంటే.”
పదకోశం చూడండి.
గ్రీకులో పోర్నియా. పదకోశం చూడండి.
అనుబంధం A5 చూడండి.
అక్ష., “తల తోడు.”
అనుబంధం B14 చూడండి.
అంటే, వడ్డీ లేకుండా అప్పు అడిగే.
లేదా “పొరుగువాణ్ణి.”
అక్ష., “కుమారులుగా.”
లేదా “సంపూర్ణులుగా.”