యెహెజ్కేలు 5:1-17

  • యెరూషలేము పతనం సూచన (1-17)

    • ప్రవక్త తలవెంట్రుకల్ని మూడు భాగాలు చేయడం (1-4)

    • యెరూషలేము ఇతర జనాల కన్నా ఘోరంగా తయారవ్వడం (7-9)

    • తిరుగుబాటుదారుల్ని మూడు రకాలుగా శిక్షించడం (12)

5  “మానవ కుమారుడా, నువ్వు మంగలి​కత్తిలా వాడడానికి ఒక పదునైన కత్తి తీసుకో. దానితో నీ తలను, గడ్డాన్ని క్షౌరం చేసుకో; తర్వాత ఒక త్రాసు తీసుకుని ఆ వెంట్రుకల్ని తూచి వాటిని మూడు భాగాలు చేయి.  ముట్టడి రోజులు పూర్తయినప్పుడు+ నువ్వు ఒక భాగాన్ని తీసుకుని నగరం* లోపల అగ్నితో కాల్చేయి. తర్వాత రెండో భాగాన్ని తీసుకొని నగరం చుట్టూ కత్తితో వాటిని నరుకు,+ ఆ తర్వాత మూడో భాగాన్ని గాల్లోకి విసిరేయి, నేను ఖడ్గం తీసి వాటిని తరుముతాను.+  “నువ్వు వాటిలో కొన్ని వెంట్రుకల్ని తీసుకొని నీ వస్త్రం మడతల్లో* కట్టుకో.  ఇంకొన్ని వెంట్రుకలు తీసుకుని వాటిని అగ్నిలో వేసి కాల్చేయి. దానినుండి అగ్ని బయ​ల్దేరి ఇశ్రాయేలు ఇంటివాళ్లందరికీ వ్యాపిస్తుంది.+  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘ఇది యెరూషలేము. నేను దాన్ని జనాల మధ్య ఉంచాను, దాని చుట్టూ దేశాలు ఉన్నాయి.  కానీ అది నా న్యాయనిర్ణయాలకు, శాసనాలకు ఎదురుతిరిగి తన చుట్టూ ఉన్న జనాల కన్నా, దేశాల కన్నా చెడ్డగా ​ప్రవర్తించింది.+ ఎందుకంటే వాళ్లు నా న్యాయనిర్ణయాల్ని తిరస్కరించారు, నా శాసనాల ప్రకారం నడుచు​కోలేదు.’  “అందుకే సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘మీరు నా ​శాసనాల ప్రకారం నడుచుకోకుండా, నా న్యాయనిర్ణయాల్ని పాటించకుండా మీ చుట్టూ ఉన్న జనాల న్యాయనిర్ణయాల్ని అనుసరించి వాటి కన్నా ఘోరంగా తయారయ్యారు+ కాబట్టి,  సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “నగరమా, నేను నీకు విరోధిని అయ్యాను,+ జనాలు ​చూస్తుండగా నేను నీకు తీర్పు తీరుస్తాను.+  నువ్వు చేసిన అసహ్యమైన ​పనులన్నిటిని బట్టి నేను ఇంతకు ముందెప్పుడూ చేయనిది నీకు చేస్తాను, అలాంటిది ఇంకెప్పుడూ చేయను కూడా.+ 10  “ ‘ “కాబట్టి నీలో ఉన్న తండ్రులు తమ కుమారుల్ని తింటారు,+ కుమారులు తమ తండ్రుల్ని తింటారు; నేను నీకు తీర్పుతీర్చి నీలో మిగిలిన వాళ్లందర్నీ అన్నివైపులకు* చెదరగొడతాను.” ’+ 11  “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు: ‘నువ్వు నీ హేయమైన విగ్రహా​లన్నిటితో, నీ అసహ్యమైన పనులన్నిటితో నా పవిత్రమైన స్థలాన్ని అపవిత్రపర్చావు+ కాబట్టి, నా జీవం తోడు, నేను కూడా నిన్ను తిరస్కరిస్తాను;* నా కన్ను జాలిపడదు, నేను కనికరం చూపించను.+ 12  నీలో మూడోవంతు మంది నీ మధ్య తెగులు వల్ల చనిపోతారు లేదా కరువువల్ల నశించిపోతారు. ఇంకో మూడోవంతు మంది నీ చుట్టూ ఖడ్గం వల్ల చనిపోతారు.+ చివరి మూడోవంతు మందిని నేను అన్నివైపులకు* ​చెదరగొడతాను, ఖడ్గం తీసి వాళ్లను తరుముతాను.+ 13  అప్పుడు నా కోపం చల్లారుతుంది, వాళ్లమీద నా ఆగ్రహం తగ్గిపోతుంది, నాకు ఉపశమనం కలుగుతుంది.+ నేను వాళ్ల మీద నా ఆగ్రహం పూర్తిగా వెళ్లగక్కిన తర్వాత, సంపూర్ణ భక్తిని కోరుకునే యెహోవానైన+ నేను వాళ్లతో మాట్లాడానని వాళ్లు తెలుసుకుంటారు. 14  “ ‘నేను నిన్ను పాడుబడ్డ స్థలంగా మారుస్తాను, చుట్టుపక్కల దేశాల మధ్య, దారిలో వెళ్లే వాళ్లందరి కళ్లకు నిందగా చేస్తాను.+ 15  నేను కోపంతో, ఆగ్రహంతో, కఠినమైన శిక్షలతో నీకు తీర్పు తీర్చినప్పుడు నువ్వు చుట్టు​పక్కల దేశాలకు నిందగా, ఎగతాళిగా, హెచ్చరి​కగా, భయంకరంగా తయారౌతావు.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను. 16  “ ‘నేను మిమ్మల్ని నాశనం చేయడానికి కరువు అనే ప్రాణాంతకమైన బాణాల్ని మీ మీదికి పంపిస్తాను. నేను పంపించే బాణాలు మిమ్మల్ని నాశనం చేస్తాయి.+ నేను మీ ఆహార సరఫరాను నిలిపేసి* మీ కరువును తీవ్రతరం చేస్తాను.+ 17  నేను మీ మీదికి కరువును, క్రూరమృగాల్ని పంపిస్తాను,+ అవి మీ పిల్లల్ని చంపేస్తాయి. తెగులు, రక్తపాతం మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, నేను నీ మీదికి ఖడ్గాన్ని రప్పిస్తాను.+ యెహోవానైన నేనే ఈ మాట చెప్పాను.’ ”

అధస్సూచీలు

అక్ష., “ఆమె.”
లేదా “చెంగున.”
అక్ష., “ప్రతీ గాలికి.”
లేదా “నీ సంఖ్య తగ్గిస్తాను.”
అక్ష., “ప్రతీ గాలికి.”
అక్ష., “మీ రొట్టెల కర్రల్ని విరగ్గొట్టి.” ఇవి రొట్టెల్ని నిల్వచేయడానికి ఉపయోగించే కర్రల్ని సూచిస్తుండవచ్చు.