కీర్తనలు 69:1-36

  • రక్షించమని ప్రార్థన

    • “నీ మందిరం విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంది” (9)

    • “నాకు త్వరగా జవాబివ్వు” (17)

    • “పుల్లటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు” (21)

సంగీత నిర్దేశకునికి సూచన; “లిల్లీ పువ్వులు” అనే రాగంలో పాడాలి. దావీదు కీర్తన. 69  దేవా, నీళ్లు నన్ను ముంచెత్తుతున్నాయి, నన్ను రక్షించు.+   కాలు నిలపడానికి గట్టినేల లేని లోతైన ఊబిలో నేను కూరుకుపోయాను,+ నేను లోతైన నీళ్లలో మునిగిపోయాను,వరద ప్రవాహానికి కొట్టుకుపోయాను.+   మొరపెట్టీ పెట్టీ నేను అలసిపోయాను;+నా గొంతు బొంగురుపోయింది. నా దేవుని కోసం ఎదురుచూసీ చూసీ నా కళ్లు క్షీణించాయి.+   ఏ కారణం లేకుండా నన్ను ద్వేషించేవాళ్లు+నా తలవెంట్రుకల కన్నా ఎక్కువమంది ఉన్నారు. నన్ను చంపాలని చూసేమోసగాళ్లయిన శత్రువులు* ఎక్కువయ్యారు. నేను దొంగిలించనిదాన్ని బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది.   దేవా, నా తెలివితక్కువతనం నీకు తెలుసు,నా అపరాధం నీకు కనిపిస్తూనే ఉంది.   సర్వోన్నత ప్రభువా, సైన్యాలకు అధిపతివైన యెహోవా,నీ మీద ఆశపెట్టుకునేవాళ్లు నా కారణంగా సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. ఇశ్రాయేలు దేవా,నిన్ను వెదికేవాళ్లు నా కారణంగా అవమానాలపాలు కాకూడదు.   నీ కారణంగా నేను నిందల పాలయ్యాను;+అవమానం నా ముఖాన్ని కప్పేసింది.+   నేను నా సహోదరులకు పరాయివాణ్ణి అయ్యాను,నా తోడబుట్టిన వాళ్లకు పరదేశిని అయ్యాను.+   నీ మందిరం* విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంది,+నిన్ను నిందించేవాళ్ల నిందలు నా మీద పడ్డాయి.+ 10  ఉపవాసం ఉండి నన్ను నేను తగ్గించుకున్నప్పుడు,*దాని గురించి నన్ను నిందించారు. 11  నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు,వాళ్లు నన్ను ఈసడించుకున్నారు.* 12  నగర ద్వారం దగ్గర కూర్చున్నవాళ్లు నా గురించి మాట్లాడుకుంటున్నారు,తాగుబోతులు నా మీద పాటలు పాడుతున్నారు. 13  అయితే యెహోవా,అనుకూలమైన సమయంలో నా ప్రార్థన నీ దగ్గరికి చేరాలి.+ దేవా, నీ అపారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి నాకు జవాబిచ్చి,నువ్వే నిజమైన రక్షకుడివని చూపించు.+ 14  ఊబిలో నుండి నన్ను రక్షించు;నన్ను లోపలికి కూరుకుపోనివ్వకు. నన్ను ద్వేషించేవాళ్ల నుండి,లోతైన నీళ్ల నుండి నన్ను కాపాడు.+ 15  నన్ను వరద ప్రవాహానికి కొట్టుకుపోనివ్వకు,+లోతైన నీళ్లు నన్ను మింగేయనివ్వకు,గొయ్యి* నన్ను లోపలికి లాక్కోనివ్వకు.+ 16  యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ మంచిది, నాకు జవాబివ్వు.+ నీ అపారమైన కరుణను బట్టి నా వైపు తిరుగు,+ 17  నీ సేవకుడి నుండి నీ ముఖం దాచుకోకు.+ నేను కష్టాల్లో ఉన్నాను, నాకు త్వరగా జవాబివ్వు.+ 18  నా దగ్గరికి వచ్చి, నన్ను రక్షించు;నా శత్రువుల నుండి నన్ను విడిపించు. 19  నాకు కలిగిన నింద, సిగ్గు, అవమానం నీకు తెలుసు.+ నా శత్రువులందర్నీ నువ్వు చూస్తున్నావు. 20  నిందలవల్ల నా గుండె బద్దలైంది, నా గాయం నయంకానిది. ఎవరైనా సానుభూతి చూపిస్తారని ఎదురుచూశాను, కానీ ఎవ్వరూ చూపించలేదు,+ఓదార్చేవాళ్ల కోసం చూశాను, కానీ ఒక్కరూ కనిపించలేదు.+ 21  ఆహారానికి బదులు నాకు విషాన్ని* ఇచ్చారు,+దాహం వేసినప్పుడు పుల్లటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు.+ 22  వాళ్ల భోజనం బల్ల వాళ్లకు ఉచ్చుగా తయారవ్వాలి,వాళ్ల సమృద్ధి వాళ్లకు ఉరిగా మారాలి.+ 23  వాళ్ల కళ్లకు చీకటి కమ్మాలి, వాళ్లకు ఏమీ కనబడకూడదు,వాళ్ల కాళ్లు* ఎప్పుడూ గజగజ వణకాలి. 24  వాళ్ల మీద నీ ఉగ్రతను* కుమ్మరించు,నీ కోపాగ్ని వాళ్లను తరిమి పట్టుకోవాలి.+ 25  వాళ్ల పాలెం* నిర్మానుష్యమైపోవాలి;వాళ్ల డేరాల్లో ఒక్క నివాసి కూడా ఉండకూడదు.+ 26  ఎందుకంటే, నువ్వు కొట్టినవాణ్ణి వాళ్లు తరుముతున్నారు,నువ్వు గాయపర్చినవాళ్ల బాధల గురించి మాట్లాడుకుంటున్నారు. 27  వాళ్ల అపరాధానికి వాళ్లకు పూర్తి శిక్ష పడాలి,వాళ్లు నీ దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడకూడదు. 28  జీవగ్రంథంలో* నుండి వాళ్ల పేర్లు తుడిచేయబడాలి,+నీతిమంతులతో పాటు వాళ్ల పేర్లు రాయబడకూడదు.+ 29  నేను కష్టాల్లో ఉన్నాను, బాధపడుతున్నాను.+ దేవా, నీ రక్షణ శక్తితో నన్ను కాపాడు. 30  నేను దేవుని పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను,కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన్ని ఘనపరుస్తాను. 31  అది ఎద్దు కన్నా, కొమ్ములు-డెక్కలు* ఉన్న కోడెదూడ కన్నాయెహోవాను ఎక్కువ సంతోషపెడుతుంది.+ 32  సాత్వికులు దాన్ని చూసి సంతోషిస్తారు. దేవుణ్ణి సేవించే ప్రజలారా, మీ హృదయాలు తెప్పరిల్లాలి. 33  ఎందుకంటే, యెహోవా పేదవాళ్ల మొరను వింటున్నాడు,+బందీలైన తన ప్రజల్ని ఆయన నీచంగా చూడడు.+ 34  భూమ్యాకాశాలు ఆయన్ని స్తుతించాలి,+సముద్రాలు, వాటిలో కదిలేవన్నీ ఆయన్ని స్తుతించాలి. 35  ఎందుకంటే, దేవుడు సీయోనును రక్షిస్తాడు,+యూదా నగరాల్ని మళ్లీ కడతాడు,ఆయన ప్రజలు అక్కడ నివసిస్తారు, దాన్ని* స్వాధీనం చేసుకుంటారు. 36  ఆయన సేవకుల వంశస్థులు దాన్ని వారసత్వంగా పొందుతారు,+ఆయన పేరును ప్రేమించేవాళ్లు+ దానిలో నివసిస్తారు.

అధస్సూచీలు

లేదా “కారణం లేకుండా నాకు శత్రువులైనవాళ్లు.”
అక్ష., “ఇంటి.”
లేదా “నేను ఏడుస్తూ ఉపవాసం ఉన్నప్పుడు” అయ్యుంటుంది.
లేదా “నామీద సామెత చెప్పుకున్నారు.”
లేదా “బావి.”
లేదా “విషపు మొక్కను.”
అక్ష., “తుంట్లు.”
లేదా “ఆగ్రహాన్ని.”
లేదా “ప్రాకారాలుగల పాలెం.”
అక్ష., “సజీవుల గ్రంథంలో.”
లేదా “కొమ్ములు-గిట్టలు.”
అంటే, దేశాన్ని.