మొదటి థెస్సలొనీకయులు 2:1-20
2 సహోదరులారా, మేము మీ దగ్గరికి రావడం వృథా అవ్వలేదని మీకు బాగా తెలుసు.+
2 ఎందుకంటే, మేము ఫిలిప్పీలో ఉండగా మొదట్లో బాధలు అనుభవించాం,+ అవమానాలపాలయ్యాం. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయినాసరే, మన దేవుని సహాయంతో మేము ధైర్యం కూడగట్టుకుని, ఎంతో వ్యతిరేకత మధ్య* మీకు దేవుని గురించిన మంచివార్తను ప్రకటించాం.+
3 మేము తప్పుడు ఆలోచనలతోనో, అపవిత్రమైన, మోసపూరితమైన ఉద్దేశాలతోనో మీకు ఉపదేశించట్లేదు.
4 అయితే, మంచివార్తను ప్రకటించే బాధ్యత చేపట్టడానికి దేవుడు మమ్మల్ని అర్హులుగా ఎంచాడు కాబట్టి, మేము మనుషుల్ని సంతోషపెట్టాలని కాకుండా మా హృదయాల్ని పరిశోధించే దేవుణ్ణి+ సంతోషపెట్టాలని మాట్లాడుతున్నాం.
5 నిజానికి, మేము ఎప్పుడూ ముఖస్తుతి చేయలేదని, అత్యాశతో+ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడలేదని మీకు తెలుసు; దీనికి దేవుడే సాక్షి!
6 అంతేకాదు మేము మనుషుల నుండి, అంటే మీ నుండో, ఇతరుల నుండో ఘనత పొందాలని ప్రయత్నించలేదు. కావాలంటే మేము క్రీస్తు అపొస్తలులుగా మీ మీద ఎక్కువ ఖర్చుల భారం మోపవచ్చు.+
7 కానీ మేము, పాలిచ్చే తల్లి తన పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్టు మీతో మృదువుగా వ్యవహరించాం.
8 మీ మీద ఉన్న వాత్సల్యం వల్ల, మీకు దేవుని గురించిన మంచివార్తను చెప్పడమే కాదు, మీకోసం మా ప్రాణాల్ని కూడా ఇవ్వాలని నిశ్చయించుకున్నాం,+ ఎందుకంటే మీరు మాకు చాలా ప్రియమైనవాళ్లు.+
9 సహోదరులారా, మేము ఎంత కష్టపడ్డామో, ఎంత ప్రయాసపడ్డామో మీకు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. మేము దేవుని గురించిన మంచివార్తను మీకు ప్రకటించినప్పుడు, మీలో ఎవ్వరికీ భారంగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టపడి పనిచేశాం.+
10 మేము విశ్వాసులైన మీతో విశ్వసనీయంగా, నీతిగా, నింద లేకుండా నడుచుకున్నాం అనడానికి మీరే సాక్షులు, అలాగే దేవుడు కూడా.
11 తండ్రి తన పిల్లలతో వ్యవహరించినట్టు మేము మీతో వ్యవహరించాం.+ మీకు ఉపదేశాన్ని, ఊరటను, మీలో ప్రతీ ఒక్కరికి సలహాల్ని ఇస్తూ వచ్చాం.+ ఈ విషయం మీకు బాగా తెలుసు.
12 మీరు దేవునికి నచ్చేలా, అంటే మిమ్మల్ని తన రాజ్యంలోకి పిలిచి+ మీకు తన మహిమను ఇచ్చే దేవునికి+ నచ్చేలా నడుచుకోవాలని+ మేము అలా చేశాం.
13 నిజానికి, ఇందుకే మేము మానకుండా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం.+ ఎందుకంటే, మీరు మా దగ్గర దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దాన్ని మనుషుల వాక్యంలా కాకుండా దేవుని వాక్యంలా స్వీకరించారు. అది నిజంగా దేవుని వాక్యమే. ఆ వాక్యమే విశ్వాసులైన మీ మీద గొప్ప ప్రభావం చూపిస్తోంది.
14 ఎందుకంటే సహోదరులారా, యూదయలో క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉన్న దేవుని సంఘాల్ని మీరు ఆదర్శంగా తీసుకున్నారు; వాళ్లు యూదుల చేతుల్లో అనుభవిస్తున్న కష్టాల్నే మీరు మీ సొంత ఊరివాళ్ల చేతుల్లో అనుభవించారు.+
15 ఆ యూదులు చివరికి ప్రభువైన యేసును, ప్రవక్తల్ని కూడా చంపారు,+ మమ్మల్ని హింసించారు.+ వాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టట్లేదు. పైగా, మనుషులందరికీ ప్రయోజనం చేకూర్చే దాన్ని వ్యతిరేకిస్తున్నారు.
16 ఎలాగంటే, అన్యజనులు రక్షణ పొందేలా మేము మంచివార్త ప్రకటిస్తుంటే వాళ్లు అడ్డుకుంటున్నారు.+ ఈ విధంగా, వాళ్ల పాపాలు ఇంకా ఎక్కువౌతున్నాయి. చివరికి దేవుని ఆగ్రహం వాళ్ల మీదికి వచ్చేసింది.+
17 సహోదరులారా, మేము కొంతకాలం మీకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు (మేము మిమ్మల్ని చూడలేకపోయినా మీరు మా హృదయాల్లో ఉన్నారు), మిమ్మల్ని చూడాలనే బలమైన కోరికతో మిమ్మల్ని కలవడానికి అన్నిరకాలుగా ప్రయత్నించాం.
18 అందుకే మేము మీ దగ్గరికి రావాలనుకున్నాం. పౌలు అనే నేను ఒక్కసారి కాదు, రెండుసార్లు అలా రావడానికి ప్రయత్నించాను. కానీ సాతాను మా దారిని అడ్డుకున్నాడు.
19 మన ప్రభువైన యేసు ప్రత్యక్షత సమయంలో ఆయన ఎదుట మా నిరీక్షణ, మా ఆనందం, మా సంతోష కిరీటం ఎవరు? మీరే కదా?+
20 అవును, మీరే మా ఘనత, మా ఆనందం.
అధస్సూచీలు
^ లేదా “సంఘర్షణతో” అయ్యుంటుంది.