మార్కు సువార్త 3:1-35
3 యేసు మళ్లీ ఒక సమాజమందిరంలోకి వెళ్లాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన* ఒక వ్యక్తి ఉన్నాడు.+
2 విశ్రాంతి రోజున యేసు అతన్ని బాగుచేస్తే ఆయన మీద నిందలు వేయవచ్చనే ఉద్దేశంతో పరిసయ్యులు ఆయన్నే జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు.
3 యేసు చెయ్యి ఎండిపోయిన* వ్యక్తితో, “లేచి మధ్యలోకి వచ్చి నిలబడు” అన్నాడు.
4 తర్వాత ఆయన వాళ్లను ఇలా అడిగాడు: “విశ్రాంతి రోజున ఏమి చేయడం న్యాయం? మంచి చేయడమా, చెడు చేయడమా? ఏది ధర్మం? ప్రాణం కాపాడడమా, ప్రాణం తీయడమా?”+ దానికి వాళ్లు ఏమీ మాట్లాడలేదు.
5 వాళ్ల హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయో+ చూసి ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన వాళ్లందర్నీ ఒకసారి కోపంగా చూసి, ఆ వ్యక్తితో “నీ చెయ్యి చాపు” అన్నాడు. అతను చెయ్యి చాపాడు, అది బాగైంది.
6 దాంతో పరిసయ్యులు బయటికి వెళ్లి, యేసును చంపడానికి హేరోదు అనుచరులతో*+ కలిసి వెంటనే చర్చలు మొదలుపెట్టారు.
7 అయితే యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరికి బయల్దేరాడు. గలిలయ, యూదయ ప్రాంతాల నుండి చాలామంది ప్రజలు ఆయన వెనక వెళ్లారు.+
8 ఆయన చేస్తున్న ఎన్నో పనుల గురించి విని యెరూషలేము, ఇదూమయ ప్రాంతాల నుండి, యొర్దాను అవతలి నుండి, తూరు, సీదోను పరిసర ప్రాంతాల నుండి కూడా చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు.
9 ప్రజలు తన మీద పడకుండా ఉండాలని ఆయన తన కోసం ఒక చిన్న పడవ సిద్ధంగా ఉంచమని శిష్యులకు చెప్పాడు.
10 ఆయన చాలామందిని బాగుచేశాడు కాబట్టి, పెద్దపెద్ద జబ్బులు ఉన్నవాళ్లంతా ఆయన్ని ముట్టుకోవడానికి+ ఆయన చుట్టూ గుమికూడారు.
11 ఆయన్ని చూసినప్పుడల్లా అపవిత్ర దూతలు*+ కూడా ఆయన ముందు సాష్టాంగపడి, “నువ్వు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవాళ్లు.+
12 కానీ ఆయన, తానెవరో చెప్పొద్దని వాళ్లకు చాలాసార్లు గట్టిగా ఆజ్ఞాపించాడు.+
13 యేసు ఒక కొండ మీదికి వెళ్లి, తాను ఎంచుకున్న వాళ్లను+ తన దగ్గరికి పిలిచాడు, వాళ్లు వచ్చారు.+
14 ఆయన 12 మందితో ఒక గుంపును తయారుచేశాడు,* వాళ్లకు అపొస్తలులు* అనే పేరు కూడా పెట్టాడు. ఆ 12 మంది ఆయన వెంటే ఉండేవాళ్లు, ఆయన వాళ్లను ప్రకటించడానికి పంపాడు;
15 చెడ్డదూతల్ని* వెళ్లగొట్టే అధికారం కూడా ఇచ్చాడు.+
16 ఆయన తయారుచేసిన* గుంపులో ఉన్న 12 మంది+ ఎవరంటే: సీమోను (ఇతనికి ఆయన పేతురు అని పేరు పెట్టాడు),+
17 జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను (వీళ్లకు ఆయన బోయనేర్గెసు అనే పేరు పెట్టాడు. ఆ పేరుకు “ఉరుము పుత్రులు”+ అని అర్థం),
18 అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కననేయుడైన* సీమోను,
19 ఇస్కరియోతు యూదా. ఆ తర్వాత యేసుకు నమ్మకద్రోహం చేసింది ఇతనే.
తర్వాత యేసు ఒక ఇంట్లోకి వెళ్లాడు,
20 మళ్లీ ప్రజలు రావడంతో, వాళ్లకు కనీసం భోజనం చేయడానికి కూడా వీలుకాలేదు.
21 జరుగుతున్న వాటి గురించి ఆయన బంధువులు విన్నప్పుడు, “అతనికి పిచ్చి పట్టింది” అంటూ ఆయన్ని పట్టుకోవడానికి వెళ్లారు.+
22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు కూడా “ఇతనికి బయెల్జెబూలు* పట్టాడు, చెడ్డదూతల నాయకుడి సహాయంతోనే ఇతను చెడ్డదూతల్ని వెళ్లగొడుతున్నాడు” అని అన్నారు.+
23 అందుకు ఆయన వాళ్లను పిలిచి, ఉదాహరణలు* ఉపయోగిస్తూ వాళ్లతో ఇలా అన్నాడు: “సాతాను సాతానును ఎలా వెళ్లగొట్టగలడు?
24 ఒక రాజ్యం దానిమీద అదే తిరగబడి చీలిపోతే, ఆ రాజ్యం నిలవడం అసాధ్యం;+
25 ఒక ఇంట్లోవాళ్లే ఒకరిమీద ఒకరు తిరగబడి విడిపోతే, ఆ ఇల్లు నిలవడం కష్టం.
26 అలాగే, సాతాను కూడా తన మీద తానే తిరగబడి విడిపోతే, అతను నిలవలేడు, నాశనమైపోతాడు.
27 అంతెందుకు, ఎవరైనా ఒక బలవంతుని ఇంట్లో దూరి, అతని వస్తువులు దోచుకోవాలంటే ముందు ఆ బలవంతుణ్ణి కట్టేయాలి. అప్పుడే అతను ఆ ఇల్లంతా దోచుకోగలడు.
28 నేను నిజంగా మీతో చెప్తున్నాను, మనుషులు ఎలాంటి పాపాలు చేసినా, ఎంత అవమానకరంగా మాట్లాడినా అన్నిటికీ క్షమాపణ ఉంటుంది.
29 కానీ, ఎవరైనా పవిత్రశక్తిని దూషిస్తే మాత్రం వాళ్లకు ఎప్పటికీ క్షమాపణ ఉండదు,+ వాళ్ల పాపం ఎప్పటికీ పోదు.”+
30 “ఇతనికి అపవిత్ర దూత పట్టాడు”+ అని వాళ్లు అంటున్నారు కాబట్టి ఆయన అలా అన్నాడు.
31 యేసువాళ్ల అమ్మ, తమ్ముళ్లు+ వచ్చి బయట నిలబడి, ఆయన్ని పిలవమని ఒకతన్ని లోపలికి పంపారు.
32 ఆయన చుట్టూ ప్రజలు కూర్చొని ఉండడం వల్ల వాళ్లు ఆయనతో, “ఇదిగో! మీ అమ్మ, తమ్ముళ్లు బయట ఉన్నారు, వాళ్లు నీ గురించి అడుగుతున్నారు” అని చెప్పారు.
33 కానీ ఆయన వాళ్లతో, “మా అమ్మ ఎవరు? నా తమ్ముళ్లు ఎవరు?” అన్నాడు.
34 ఆ తర్వాత, ఆయన తన చుట్టూ కూర్చొని ఉన్నవాళ్లను చూసి ఇలా అన్నాడు: “ఇదిగో మా అమ్మ, నా తమ్ముళ్లు!+
35 దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి.”+
అధస్సూచీలు
^ లేదా “చచ్చుబడిన.”
^ లేదా “చచ్చుబడిన.”
^ లేదా “మద్దతుదారులతో.”
^ పదకోశంలో “చెడ్డదూతలు” చూడండి.
^ లేదా “నియమించాడు.”
^ లేదా “నియమించిన.”
^ లేదా “ఉత్సాహవంతుడైన.”
^ లేదా “బయెల్జెబూబు.” సాతానుకు ఉన్న ఒక బిరుదు.
^ లేదా “ఉపమానాలు.”