కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

వేరే భాష ఎందుకు నేర్చుకోవాలి?

వేరే భాష ఎందుకు నేర్చుకోవాలి?

 వేరే భాష నేర్చుకోవడం వల్ల మీరు ఎంత క్రమశిక్షణగలవాళ్లో, ఎంత వినయస్థులో మీకు అర్థమౌతుంది. అలా నేర్చుకోవడం వల్ల ఏమైనా లాభం ఉందా? “ఉంది!” అని చాలామంది యౌవనస్థులు అంటున్నారు. వాళ్లు ఎందుకు వేరే భాష నేర్చుకుంటున్నారో ఈ ఆర్టికల్‌ వివరిస్తుంది.

 ఎందుకు నేర్చుకోవాలి?

 స్కూల్లో మాతృభాషతోపాటు వేరే ఏదైనా భాష ఒక సబ్జెక్టుగా ఉంటుంది కాబట్టి చాలామంది వేరే భాష నేర్చుకుంటారు. ఇంకొంతమంది తమ సొంత ఇష్టం కొద్దీ నేర్చుకుంటారు. ఉదాహరణకు:

  •   ఆస్ట్రేలియాలోని ఆనా అనే అమ్మాయి, వాళ్ల అమ్మ మాతృభాష అయిన లాట్వియన్‌ నేర్చుకోవాలని అనుకుంది. ఆమె ఇలా అంటోంది: “మా కుటుంబమంతా కలిసి లాట్వియా వెళ్లాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఆ భాష నేర్చుకుంటే అక్కడున్న మా బంధువులతో చక్కగా మాట్లాడగలుగుతాను.”

  •   అమెరికాలో ఉంటున్న జీన అనే ఒక యెహోవాసాక్షి, అమెరికన్‌ సంజ్ఞా భాష (ASL) నేర్చుకుని ఇంకా ఎక్కువగా పరిచర్య చేయాలని బెలీజ్‌కు వెళ్లింది. ఆమె ఇలా అంటోంది: “చెవిటివాళ్లతో సంభాషించగలిగేవాళ్లు కేవలం కొద్దిమందే ఉంటారు. వాళ్లకు బైబిలు విషయాలు నేర్పించడానికే నేను సంజ్ఞా భాష నేర్చుకున్నానని చెప్పినప్పుడు వాళ్లు చాలా సంతోషించేవాళ్లు!”

 మీకు తెలుసా? దేవుని రాజ్యం గురించిన మంచివార్త “ప్రతీ దేశానికి, తెగకు, భాషకు” చెందిన ప్రజలకు ప్రకటించబడుతుందని బైబిలు ప్రవచించింది. (ప్రకటన 14:6) ఈ ప్రవచన నెరవేర్పులో భాగంగా, యెహోవాసాక్షుల్లో చాలామంది యౌవనస్థులు తమ దేశంలో లేదా వేరే దేశంలో ప్రకటిస్తూ పరిచర్యను ఇంకా ఎక్కువగా చేయడం కోసం కొత్త భాష నేర్చుకుంటున్నారు.

 ఎలాంటి సవాళ్లు ఉంటాయి?

 కొత్త భాష నేర్చుకోవడం అంత ఈజీ కాదు. కొరీన అనే అమ్మాయి ఇలా అంటోంది, “కొత్త భాష నేర్చుకోవడమంటే కొత్త పదాలు నేర్చుకోవడమే కదా అనుకున్నాను. కానీ పదాలతోపాటు కొత్త సంస్కృతిని, కొత్త ఆలోచనా తీరును కూడా నేర్చుకోవాలని తర్వాత అర్థమైంది. వేరే భాష నేర్చుకోవాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది.”

 కొత్త భాష నేర్చుకోవాలంటే వినయం కూడా కావాలి. స్పానిష్‌ భాష నేర్చుకున్న జేమ్స్‌ అనే యౌవనస్థుడు ఇలా అంటున్నాడు: “మీరు చేసే తప్పుల్ని చూసి నవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే, మాట్లాడేటప్పుడు చాలా తప్పులు వస్తాయి. కానీ అది నేర్చుకోవడంలో భాగం.”

 ఒక్కమాటలో: మీ తప్పుల్ని సరిదిద్దుకోగలిగితే, తప్పులు చేసినప్పుడు సిగ్గుపడకుండా ఉండగలిగితే కొత్త భాష నేర్చుకోవడంలో విజయం సాధిస్తారు.

 టిప్‌: వేరేవాళ్లు మీకన్నా త్వరగా నేర్చుకుంటే నిరాశపడకండి. బైబిలు ఇలా చెప్తోంది: “ప్రతీ వ్యక్తి తాను చేసిన పనుల్ని పరిశీలించుకోవాలి, అంతేగానీ వేరేవాళ్లతో పోల్చుకోకూడదు. అప్పుడు, అతను చేసిన పనుల వల్లే అతనికి సంతోషం కలుగుతుంది.”—గలతీయులు 6:4.

 ఎలాంటి మంచి ఫలితాలు పొందుతాం?

 కొత్త భాష నేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఉదాహరణకు ఒలీవీయ అనే అమ్మాయి ఇలా అంటోంది: “కొత్త భాష నేర్చుకుంటే ఎక్కువమందితో మాట్లాడగలుగుతారు, మీకు కొత్త ఫ్రెండ్స్‌ కూడా దొరుకుతారు.”

 మేరీ అనే అమ్మాయి కొత్త భాష నేర్చుకోవడం వల్ల తన మీద తనకు నమ్మకం పెరిగిందని చెప్తూ ఇలా అంటోంది: “నేను ఏ పని చేసినా నా మీద నాకు అంత నమ్మకం ఉండేది కాదు. కానీ ఇప్పుడు నేను కొత్త భాష నేర్చుకుంటున్నాను. ఒక కొత్త పదం నేర్చుకున్న ప్రతీసారి ఏదో సాధించాననే సంతోషం కలుగుతోంది. కొత్త భాష నేర్చుకోవడం వల్ల నామీద నాకు నమ్మకం పెరిగింది.”

 సంజ్ఞా భాషలో బైబిలు విషయాలు నేర్పించడం వల్ల పరిచర్యలో తన సంతోషం రెట్టింపు అయ్యిందని మొదట్లో చూసిన జీన అనే అమ్మాయి అంటోంది. ఆమె ఇలా అంది: “నేను ప్రజలతో వాళ్ల సొంత భాషలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే సంతోషమే నాకు దొరికే గొప్ప బహుమానం!”

 ఒక్కమాటలో: కొత్త భాష నేర్చుకోవడం వల్ల మీరు కొత్త స్నేహితుల్ని సంపాదించుకోగలుగుతారు, మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది, పరిచర్యను ఆనందిస్తారు. ‘అన్ని దేశాల, గోత్రాల, జాతుల, భాషల’ ప్రజలకు మంచివార్తను ప్రకటించడానికి అది చాలా ముఖ్యం.—ప్రకటన 7:9.