యువత అడిగే ప్రశ్నలు
ఆన్‌లైన్‌లో నన్ను ఎవరైనా ఏడ్పిస్తే ఏం చేయాలి?
మీరు తెలుసుకోవాల్సినవి
ఇంటర్నెట్ వచ్చాక ఏడ్పించడం ఈజీ అయిపోయింది. “ఏడ్పిస్తున్నది ఎవరు అనేది తెలీదు కాబట్టి, మంచి పిల్లలు కూడా ఇంటర్నెట్‌లో ఏదిపడితే అది అంటున్నారు” అని సైబర్‌సేఫ్ అనే పుస్తకం చెప్తోంది.
ఎక్కువగా ఎలాంటివాళ్లను ఏడ్పిస్తుంటారో తెలుసా? నలుగురిలో ఎక్కువగా మాట్లాడనివాళ్లను, కాస్త వేరుగా ఉన్నారని అనిపించేవాళ్లను, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండేవాళ్లను.
ఆన్‌లైన్‌లో వేధింపులకు గురయ్యేవాళ్లు చాలా కృంగిపోతారు. వాళ్లు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు, డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు, కొంతమందైతే ఆత్మహత్య కూడా చేసుకున్నారు.
మీరేం చేయవచ్చు?
ముందు, ’వాళ్లు నిజంగా నన్ను ఏడ్పిస్తున్నారా?’ అని ఆలోచించండి. కొంతమంది ముందూవెనకా ఆలోచించకుండా ఏదోకటి అనేస్తారు, నిజానికి మనల్ని బాధపెట్టడం వాళ్ల ఉద్దేశం అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ అలా జరిగితే, బైబిల్లో ఉన్న ఈ తెలివైన సలహాను మనం పాటించవచ్చు:
“త్వరగా కోపం తెచ్చుకోకు, ఎందుకంటే అది తెలివితక్కువవాళ్లకు గుర్తు.”—ప్రసంగి 7:9, అధస్సూచి.
ఒకవేళ ఎవరైనా కావాలని ఆన్‌లైన్‌లో వేధిస్తుంటే, అవమానిస్తుంటే, లేదా బెదిరిస్తుంటే వాళ్లు మిమ్మల్ని సైబర్ బుల్లీయింగ్ చేస్తున్నారని లేదా ఏడ్పిస్తున్నారని అర్థం.
అలా ఎవరైనా మిమ్మల్ని ఏడ్పిస్తే, మీరు ఎలా స్పందిస్తారు అనేదాని బట్టి పరిస్థితి మామూలు అవ్వచ్చు లేదా ఇంకా ఘోరంగా తయారవ్వచ్చు అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఇచ్చిన సలహాల్లో వేటినైనా ప్రయత్నించి చూడండి.
ఏడ్పించేవాళ్లను పట్టించుకోకండి. బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానం గలవాడు తన మాటల్ని అదుపులో ఉంచుకుంటాడు, వివేచన గలవాడు ప్రశాంతంగా ఉంటాడు.”—సామెతలు 17:27.
ఈ సలహా ఎందుకు పనిచేస్తుందంటే: “మిమ్మల్ని రెచ్చగొట్టడమే ఏడ్పించేవాళ్ల ముఖ్య ఉద్దేశం. ఏడ్పిస్తున్నారు కదా అని మీరు రెచ్చిపోతే, చివరికి వాళ్లదే పైచేయి అవుతుంది” అని సైబర్‌బుల్లీయింగ్ అండ్ సైబర్‌త్రెట్స్ అనే పుస్తకంలో నాన్సీ విల్లార్డ్ రాసింది.
ఒక్క మాటలో చెప్పాలంటే: కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడమే మంచిది.
బుద్ధి చెప్పాలనే ఆవేశాన్ని అణచుకోండి. బైబిలు ఇలా చెప్తోంది: “మీకు ఎవరైనా హానిచేస్తే తిరిగి వాళ్లకు హానిచేయకండి, ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే తిరిగి వాళ్లను అవమానించకండి.”—1 పేతురు 3:9.
ఈ సలహా ఎందుకు పనిచేస్తుందంటే: “కోపం బలహీనుల లక్షణం, మీరు కోప్పడితే అవతలి వాళ్లు ఇంకా ఎక్కువ ఏడ్పిస్తారు” అని సైబర్-సేఫ్ కిడ్స్, సైబర్-సావీ టీన్స్ అనే పుస్తకం అంటోంది. ఆవేశపడి తిరిగి మీరు ఏదైనా అంటే, చూసేవాళ్ల దృష్టిలో ఏడ్పించేవాళ్లు చేసిన తప్పే మీరూ చేసినట్లు అవుతుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే: పెట్రోల్ పోసి మంటను పెద్దది చేయకండి.
తెలివిగా ప్రవర్తించండి. “చెడును నీ మీద విజయం సాధించనివ్వకు” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 12:21) సమస్యను ఇంకా పెద్దది చేయకుండానే, మీరు ఏడ్పించేవాళ్ల ఆట కట్టించవచ్చు.
ఎలా అంటారా?
మెసేజ్‌లు పంపిస్తున్న వాళ్లను బ్లాక్ చేయండి. “ఆ మెసేజ్‌లు చూడకపోతే అసలు బాధపడే పరిస్థితి రాదు” అని మీన్ బిహైండ్ ద స్క్రీన్ అనే పుస్తకం చెప్తోంది.
చదవకపోయినా, ఆధారాలను మాత్రం సేవ్ చేసి పెట్టుకోండి. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి పంపిన మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు, వాయిస్ మెసేజ్‌లు లేదా ఇంకేవైనా ఉంటే సేవ్ చేసుకోండి.
మిమ్మల్ని వేధించడం ఆపమని చెప్పండి. మీ ఫీలింగ్స్ బయటపెట్టకుండా సూటిగా ఇలా ఏమైనా అనండి:
“ఇలాంటి మెసేజ్‌లు ఇంకోసారి పంపకండి.”
“మీరు పెట్టిన పోస్ట్‌లు డిలీట్ చేయండి.”
“మీ అంతట మీరే ఆపితే మంచిది, లేదంటే నేనే దాన్ని ఆపించాల్సి వస్తుంది.”
కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మీ బలహీనతల గురించి కాకుండా, బలాల గురించి ఆలోచించండి. (2 కొరింథీయులు 11:6) రోడ్డు మీద ఎలాగైతే అమాయకంగా కనిపించేవాళ్లను ఏడ్పిస్తారో, ఇంటర్నెట్‌లో కూడా అలానే ఏడ్పిస్తారు.
పెద్దవాళ్లకు ఎవరికైనా చెప్పండి. ముందు మీ అమ్మానాన్నలకు చెప్పండి. మీకు ఏ వెబ్‌సైట్ నుండి లేదా యాప్ నుండి మెసేజ్‌లు వస్తున్నాయో ఆ వెబ్‌సైట్ వాళ్లకు లేదా యాప్ వాళ్లకు రిపోర్ట్ చేయవచ్చు. వేధింపులు హద్దు మీరిపోతుంటే, మీ అమ్మానాన్నలను తీసుకెళ్లి మీ స్కూల్లో రిపోర్ట్ చేయవచ్చు, పోలీసులకు చెప్పవచ్చు, కొన్ని సందర్భాల్లో లాయర్ల సలహా కూడా తీసుకోవచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే: మీరు కొన్ని పనులు చేస్తే వేధింపులను ఆపవచ్చు లేదా వేధింపుల వల్ల మీకు కలిగే బాధను తగ్గించుకోవచ్చు.