కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నల 

మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?

మంత్రతంత్రాలు చేయడం, అలాంటి వినోదం చూడడం ప్రమాదకరమా?

 మీకేమనిపిస్తుంది?

  •   రాశి ఫలాలు, వీజా బోర్డులు చూడడం, మాంత్రికుల్ని సంప్రదించడంలో ఏమైనా ప్రమాదం ఉందా?

  •   మంత్రతంత్రాలకు సంబంధించిన కథలు కేవలం మంచికి చెడుకు మధ్య జరిగే పోరాటం గురించి చెప్పే కథలు మాత్రమేనా? వాటివల్ల ఏమైనా ప్రమాదం ఉందా?

 మంత్రతంత్రాలు చాలామందికి ఎందుకు ఆసక్తికరంగా అనిపిస్తాయో, మీరు వాటి విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఈ ఆర్టికల్‌ తెలియజేస్తుంది.

 ఎందుకు ఆసక్తికరంగా అనిపిస్తుంది?

 మంత్రతంత్రాలకు సంబంధించిన వినోదం లాభసాటి వ్యాపారంగా తయారైంది. ముఖ్యంగా సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో, వీడియో గేమ్స్‌లో, పుస్తకాల్లో వాటి గురించి ఎక్కువగా చూపిస్తున్నారు. వాటివల్ల పిల్లలకు, యౌవనస్థులకు జ్యోతిష్యం, దయ్యాలు, రక్తపిశాచాలు, మంత్రతంత్రాలు అంటే బాగా ఆసక్తి పెరిగిపోయింది. దానికి గల కొన్ని కారణాలు ఏంటంటే:

  •   కొంతమందికి దయ్యాలు, ఆత్మలు నిజంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాలని ఉంటుంది

  •   కొంతమందికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది

  •   కొంతమందికి చనిపోయిన తమ ప్రియమైనవాళ్లతో మాట్లాడాలని ఉంటుంది

 పై కారణాలు తప్పేమీ కాదు. ఎందుకంటే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కోరిక అందరికీ ఉంటుంది, అలాగే చనిపోయిన మనవాళ్లను కలవాలని కూడా అనిపిస్తుంది. కానీ, అందులో ఉన్న ప్రమాదాల్ని తెలుసుకోవడం ప్రాముఖ్యం.

 ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

 దయ్యాలతో సంబంధాలు పెట్టుకోవడాన్ని బైబిలు గట్టిగా ఖండిస్తుంది. ఉదాహరణకు:

 ఇలాంటివాళ్లు నీ మధ్య ఉండకూడదు: ... సోదె చెప్పేవాడు, ఇంద్రజాలం చేసేవాడు, శకునాలు చూసేవాడు, మంత్రగాడు, మంత్రం వేసి ఇతరుల్ని బంధించేవాడు, భవిష్యత్తు చెప్పేవాడు, చనిపోయినవాళ్ల దగ్గర విచారణ చేసేవాడు లేదా చనిపోయినవాళ్లను సంప్రదించేవాడు. ఎందుకంటే ఇవి చేసేవాళ్లంతా యెహోవాకు అసహ్యులు.”​ద్వితీయోపదేశకాండము 18:10-12, NW.

 మంత్రతంత్రాల్ని బైబిలు ఎందుకు తీవ్రంగా ఖండిస్తుంది?

  •   మంత్రతంత్రాలు చేస్తే, దయ్యాలతో లేదా చెడ్డదూతలతో సంబంధం పెట్టుకున్నట్టే. కొంతమంది దేవదూతలు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు శత్రువులు అయ్యారని బైబిలు చెప్తుంది. (ఆదికాండము 6:2; యూదా 6) చనిపోయినవాళ్లను సంప్రదించేవాళ్లను, భవిష్యత్తు చెప్పేవాళ్లను, సోదె చెప్పేవాళ్లను, జ్యోతిష్యం చెప్పేవాళ్లను ఉపయోగించి ఆ చెడ్డదూతలు ప్రజల్ని మోసం చేస్తున్నారు. అలాంటివి చేస్తే మనం దేవుని శత్రువులతో చేతులు కలిపినట్టే.

  •   మంత్రతంత్రాలు కొంతమంది మనుషులు భవిష్యత్తు చూడగలరనే అబద్ధాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ, దేవుడు మాత్రమే ఇలా అనగలడు: “ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.”​—యెషయా 46:10; యాకోబు 4:13, 14.

  •   మంత్రతంత్రాలు చనిపోయినవాళ్లు బ్రతికున్నవాళ్లతో మాట్లాడగలరనే అబద్ధాన్ని నమ్మేలా చేస్తుంది. కానీ, బైబిలు ఇలా అంటుంది: “చచ్చినవారు ఏమియు ఎరుగరు ... పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”​—ప్రసంగి 9:​5, 10.

 ఈ కారణాల వల్ల యెహోవాసాక్షులు మంత్రతంత్రాలకు సంబంధించిన వాటికి దూరంగా ఉంటారు. దయ్యాలు, రక్తపిశాచాలు వంటివాటిని చూపించే వినోదానికి కూడా దూరంగా ఉంటారు. మరీయా అనే అమ్మాయి ఇలా అంటుంది: “వినోద కార్యక్రమాల్లో దయ్యాలకు సంబంధించిన అంశాలు ఏమాత్రం ఉన్నా, నేను వాటిని చూడను.” a

ఒక నేరస్తుడు తాను వేరే వ్యక్తని మీరు అనుకునేలా మోసం చేసినట్లే, చెడ్డదూతలు కూడా మీరు చనిపోయిన మీ ప్రియమైనవాళ్లతో మాట్లాడుతున్నారని అనుకునేలా మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారు

 మీరేం చేయవచ్చు?

  •   మంత్రతంత్రాలకు, వాటిని ప్రోత్సహించే వినోదానికి దూరంగా ఉంటూ యెహోవా ముందు ‘మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి’ కృషిచేయాలని తీర్మానించుకోండి.​—అపొస్తలుల కార్యాలు 24:16.

  •   మంత్రతంత్రాలకు సంబంధించినది ఏదైనా మీ దగ్గర ఉంటే దాన్ని పడేయండి. అపొస్తలుల కార్యాలు 19:19, 20 చదివి, ఈ విషయంలో మంచి ఆదర్శం ఉంచిన కొంతమంది మొదటి శతాబ్దపు క్రైస్తవుల గురించి తెలుసుకోండి.

 దీన్ని గుర్తుపెట్టుకోండి: మీరు మంత్రతంత్రాలకు, వాటిని ప్రోత్సహించే వినోదానికి దూరంగా ఉంటే మీరు యెహోవా వైపు నిలబడిన వాళ్లౌతారు. అలా చేస్తే మీరు ఆయన హృదయాన్ని సంతోషపెడతారు!​—సామెతలు 27:11.

a దీనర్థం ఫాంటసీ కథలన్నీ మంత్రతంత్రాలను ప్రోత్సహిస్తాయని కాదు. క్రైస్తవులు తమ బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి మంత్రతంత్రాలను ప్రోత్సహించేవాటికి దూరంగా ఉంటారు.​—2 కొరింథీయులు 6:​17; హెబ్రీయులు 5:​14.