కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

సెక్స్‌ ఆలోచనల్లో మునిగితేలకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు?

సెక్స్‌ ఆలోచనల్లో మునిగితేలకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు?

 “సెక్స్‌ ఆలోచనలు ఎప్పుడు మొదలౌతాయో, ఎలా మొదలౌతాయో తెలీదు. కానీ ఒకసారి మొదలయ్యాయంటే, ఇక వేరే దేనిగురించీ ఆలోచించలేను. ఇంకెవరో నా ఆలోచనల్ని అదుపు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.”—వేరా.

 “రెక్కలు కట్టుకొని ఆకాశంలో పక్షిలా ఎగరడమైనా సాధ్యమౌతుందేమో గానీ, సెక్స్‌ ఆలోచనల్ని అదుపు చేసుకోవడం మాత్రం అసాధ్యం అనిపిస్తుంది.—జాన్‌.

 మీకెప్పుడైనా వీళ్లలా అనిపించిందా? అలాగైతే, ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

 సెక్స్‌ ఆలోచనల్లో ఎందుకు మునిగితేలకూడదు?

 అలెక్స్‌ అనే అబ్బాయి ఇలా అంటున్నాడు: “సెక్స్‌ కోరికల్ని తీర్చుకోవడం తప్పైతే దేవుడు వాటిని మనుషుల్లో ఎందుకు పెడతాడు అని మా మామయ్య అనేవాడు.”

 అలెక్స్‌వాళ్ల మామయ్య చెప్పినదాంట్లో కొంత నిజం ఉంది. దేవుడు మనుషుల్లో సెక్స్‌ కోరికలు పెట్టాడు, కానీ ఒక మంచి కారణంతో పెట్టాడు. దానివల్లే ఈరోజున మానవజాతి ఉనికిలో ఉంది. మరి అలాంటప్పుడు, మనం సెక్స్‌ ఆలోచనల్ని ఎందుకు అదుపు చేసుకోవాలి? రెండు కారణాల్ని పరిశీలించండి:

  •   పెళ్లి చేసుకున్న పురుషునికి, స్త్రీకి మధ్య మాత్రమే సెక్స్‌ ఉండాలన్నది దేవుని ఉద్దేశమని బైబిలు చెప్తుంది.—ఆదికాండం 1:28; 2:24.

     ఆ ప్రమాణాన్ని గౌరవించే అవివాహితులు ఒకవేళ సెక్స్‌ ఆలోచనల్లో మునిగితేలితే, చిరాకే మిగులుతుంది. ఎందుకంటే, ఆ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్లకు ఇంకా పెళ్లి కాలేదు. దానివల్ల వాళ్లు ఆ కోరికలతో రగిలిపోయి, చివరికి ప్రలోభానికి లొంగిపోయి, సెక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. చాలామంది, ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు బాధపడుతున్నామని చెప్పారు.

  •   సెక్స్‌ ఆలోచనల్ని నిగ్రహించుకోవడం నేర్చుకుంటే, మీ జీవితంలో వేరే విషయాల్లో కూడా ఆత్మనిగ్రహం చూపించగలుగుతారు.—1 కొరింథీయులు 9:25.

 ఆత్మనిగ్రహం అనే లక్షణం, మీరు ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సంతోషంగా ఉండడానికి సహాయం చేస్తుంది. నిజానికి, ఒక అధ్యయనంలో ఏం తేలిందంటే, ఆత్మనిగ్రహం ఉన్న పిల్లలు పెద్దయ్యాక అనారోగ్య సమస్యల్ని, డబ్బు విషయంలో ఒత్తిడిని, చట్టపరమైన సమస్యల్ని తక్కువగా ఎదుర్కొంటారు. a

 కానీ అలా ఉండడం ఎందుకు కష్టం?

 ఒకపక్క లోకం చూస్తే, సెక్స్‌ గురించిన ఆలోచనలతో నిండిపోయింది. దానికితోడు, వయసులో వచ్చే హార్మోన్ల ప్రభావం వల్ల మీకు ఆ ఆలోచనల్ని అదుపు చేసుకోవడం కష్టంగా ఉండవచ్చు.

 “దాదాపు టీవీలో వచ్చే ప్రతీ కార్యక్రమం, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొనడం తప్పు కాదన్నట్టు చూపిస్తుంది. అందులో ఉన్న ప్రమాదాల్ని ఏమాత్రం చూపించట్లేదు. దానివల్ల, ఆ కార్యక్రమాల్ని చూసేవాళ్లు సెక్స్‌ ఆలోచనల్లో మునిగితేలుతున్నారు.”—రూత్‌.

 “నేను పనిచేసే చోట, చాలామంది అక్రమ సంబంధాల గురించి, సెక్స్‌లో పాల్గొనడం గురించి అసభ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్నప్పుడు నాకు కూడా కుతూహలం పెరుగుతుంది. వాళ్లు అంత మామూలుగా మాట్లాడేసరికి, అది తప్పు కాదేమో అనిపిస్తుంది.”—నికోల్‌.

 “సోషల్‌ మీడియాలో ఫోటోలు చూస్తున్నప్పుడు, జాగ్రత్తగా ఉండడం కష్టమౌతుంది. అసభ్యకరమైన ఒక్క ఫోటో చూసినా, అది మన మనసులో ముద్ర పడిపోతుంది. దాన్ని మర్చిపోవడం చాలా కష్టం!”—మారియా.

 పైనున్న కారణాల్ని బట్టి, మీకు కూడా బైబిల్లో ఉన్న పౌలు అనే వ్యక్తికి అనిపించినట్టే అనిపించవచ్చు. ఆయన ఇలా అన్నాడు: “నేను సరైనది చేయాలనుకున్నప్పుడు, చెడు చేయడం వైపే మొగ్గుచూపుతున్నాను.”—రోమీయులు 7:21.

తప్పుడు ఆలోచనలు మీ తలమీద గూడుకట్టకుండా చూసుకోండి

 మీరు ఏం చేయవచ్చు?

 మీ మనసును వేరేవాటి మీదికి మళ్లించండి. సెక్స్‌ గురించి ఆలోచించే బదులు ఏదైనా హాబీ పెట్టుకోవచ్చు, ఆటలు ఆడవచ్చు, ఎక్సర్‌సైజ్‌ చేయవచ్చు, ఇంకేదైనా చేయవచ్చు. వేలరీ అనే అమ్మాయి ఏం చెప్తుందంటే, “బైబిలు చదవడం నాకు సహాయం చేస్తుంది. బైబిల్లో చాలా ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి కాబట్టి, వాటితో మీ మనసును నింపుకుంటే ఇంక వేరే విషయాలకు చోటు ఉండదు.”

 నిజమే, సెక్స్‌ గురించి ఆలోచనలు రావడం సహజమే. కానీ ఆ ఆలోచనలు వచ్చాక ఏం చేస్తారనేది మీ చేతుల్లోనే ఉంటుంది. వాటిని తీసేసుకోవాలని మీరు బలంగా కోరుకుంటే, మీరు ఖచ్చితంగా తీసేసుకోగలుగుతారు.

 “నాకు సెక్స్‌ గురించిన ఆలోచనలు రాగానే, వేరే విషయాల గురించి ఆలోచించడం మొదలుపెడతాను. అంతేకాదు, అసలు అలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కారణమేంటో గుర్తించడానికి ప్రయత్నిస్తాను. అది నా ప్లేలిస్టులో ఉన్న పాట కావచ్చు, లేదా నేను చూసిన ఒక చిత్రం కావచ్చు. కాబట్టి వెంటనే వాటిని డిలీట్‌ చేస్తాను.”—హెలినా.

 బైబిలు సలహా: “ఏవి నీతిగలవో, ఏవి పవిత్రమైనవో [లేదా “స్వచ్ఛమైనవో,” అధస్సూచి] . . . వాటి గురించి ఆలోచిస్తూ ఉండండి.”—ఫిలిప్పీయులు 4:8.

 మంచి ఫ్రెండ్స్‌ని ఎంచుకోండి. మీ ఫ్రెండ్స్‌ ఎప్పుడూ సెక్స్‌ గురించే మాట్లాడుతూ ఉంటే, మీరు దాని గురించి ఆలోచించకుండా ఉండడం కష్టమౌతుంది.

 “టీనేజీలో ఉన్నప్పుడు నా ఆలోచనల్ని అదుపు చేసుకోవడం చాలా కష్టమైంది. దానికి పెద్ద కారణం, మా ఫ్రెండ్సే. తప్పుడు కోరికల్ని ప్రోత్సహించేవాళ్లు చుట్టూ ఉన్నప్పుడు, మీరు మీ కోరికల మీదే మనసుపెడతారు. అది అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది.”—శారా.

 బైబిలు సలహా: “తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.”—సామెతలు 13:20.

 చెడు వినోదానికి దూరంగా ఉండండి. ఈరోజుల్లో ఏ రకమైన వినోదం తీసుకున్నా, సెక్స్‌నే ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తోంది. నికోల్‌ ఇలా అంటుంది: “నావరకైతే, ఎక్కువగా పాటల వల్ల నాకు సెక్స్‌ గురించిన ఆలోచనలు వస్తుంటాయి. కొన్నిసార్లు, అదుపు చేసుకోలేనంతగా అవి నాలో పెరిగిపోతాయి.”

 “నేను సెక్స్‌ గురించి ఎక్కువగా చూపించే సినిమాల్ని, టీవీ కార్యక్రమాల్ని చూడడం మొదలుపెట్టాను. దానివల్ల, తెలీకుండానే నా మనసంతా సెక్స్‌ గురించిన ఆలోచనలతో నిండిపోయింది. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందా అని వెనక్కి తిరిగి చూసుకుంటే, కొన్ని సినిమాలు-టీవీ కార్యక్రమాలు కారణమని అర్థమైంది. కాబట్టి వాటిని చూడడం మానేశాను. అప్పటినుండి నేను సెక్స్‌ గురించి అంత ఎక్కువ ఆలోచించట్లేదు. వినోదాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటే, తప్పుడు కోరికలతో పోరాడడం తేలికౌతుంది.”—జోయన్‌.

 బైబిలు సలహా: “లైంగిక పాపం, అన్నిరకాల అపవిత్రత, అత్యాశ అనేవాటి ప్రస్తావన కూడా మీ మధ్య రానివ్వకండి.”—ఎఫెసీయులు 5:3.

 ఒక్కమాటలో: సెక్స్‌ కోరికలు కలగాలని, వాటిని అదుపు చేసుకోకూడదని, ఒకవేళ మనం అదుపు చేసుకోవాలనుకున్నా మనవల్ల కాదని కొంతమంది అంటారు. కానీ బైబిలు అలా చెప్పట్లేదు. మనం మన ఆలోచనల్ని అదుపు చేసుకోగలం అని చెప్పడం ద్వారా, నిజానికి బైబిలు మనుషుల్ని గౌరవిస్తుంది.

 బైబిలు సలహా: “కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకుంటూ ఉండాలి.ఎఫెసీయులు 4:23.

a పెళ్లయ్యాక కూడా ఆత్మనిగ్రహం అవసరం అవుతుంది కాబట్టి, పెళ్లి కాకముందే దాన్ని అలవర్చుకోవడం ప్రాముఖ్యం.