కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బూతులు మాట్లాడడం నిజంగా తప్పా?

బూతులు మాట్లాడడం నిజంగా తప్పా?

“నాకు బూతులు వినడం బాగా అలవాటైపోయింది. కాబట్టి అవి విన్నప్పుడు నాకేమనిపించదు. మామూలుగానే ఉంటుంది.”—క్రిస్టఫర్‌, 17.

“నా చిన్నప్పుడు బూతులు ఎక్కువ మాట్లాడేవాడిని. అది అలవాటు చేసుకోవడం చాలా తేలిక కానీ మానుకోవడమే చాలా కష్టం.”—రిబెకా, 19.

 క్విజ్‌

 •   వేరేవాళ్లు బూతులు మాట్లాడినప్పుడు మీకేమనిపిస్తుంది?

  •  నాకు ఏమనిపించదు. మామూలుగా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.

  •  కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఫర్లేదులే అనిపిస్తుంది.

  •  అలా మాట్లాడడం తప్పు అనిపిస్తుంది. వాటిని అస్సలు వినలేను.

 •   మీరు బూతులు మాట్లాడతారా?

  •  అస్సలు మాట్లాడను

  •  అప్పుడప్పుడు మాట్లాడతాను

  •  ఎక్కువగా మాట్లాడతాను

 •   బూతులు మాట్లాడడం అనేది మీ దృష్టిలో ఎలాంటిది?

  •  చాలా చిన్న విషయం, పట్టించుకోవాల్సిన అవసరం లేదు

  •  చాలా పెద్ద విషయం

  దాని గురించి ఆలోచించడం ఎందుకు ప్రాముఖ్యం?

 బూతులు మాట్లాడడాన్ని మీరు చాలా పెద్ద విషయంగా చూస్తున్నారా? ‘కాదు’ అని మీరనవచ్చు. ‘ఆలోచించడానికి ప్రపంచంలో అంతకన్నా పెద్ద విషయాలు చాలానే ఉన్నాయి. అయినా ప్రతీఒక్కరు బూతులు మాట్లాడతారు!’ ఈ మాట నిజమేనంటారా?

 మీరు నమ్ముతారో లేదో, బూతులు మాట్లాడని వాళ్లు చాలామంది ఉన్నారు. అంతేకాదు వేరేవాళ్లకు తెలియని కొన్ని విషయాలు కూడా వాళ్లకు తెలుసు. ఉదాహరణకు,

 •  మీ మాటలు మీరు ఎలాంటి వాళ్లో చెప్తాయి. మీ మనసులో ఏముందో మీ మాటలు చెప్తాయి. ఒకవేళ మీరు బూతులు మాట్లాడితే, ఎదుటివాళ్లు ఏమనుకున్నా మీకేం ఫర్లేదు అనుకునే తత్వం మీదని చూపిస్తున్నట్లే. మీరు నిజంగా అలాంటి వాళ్లేనా?

   బైబిలు ఇలా చెప్తోంది: “నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును.”—మత్తయి 15:18.

  బూతులు అసహ్యకరమైన కాలుష్యం లాంటివి. మీరు లేదా మీ చుట్టూ ఉన్నవాళ్లు దానికి ఎందుకు గురవ్వాలి?

 •  బూతులు మాట్లాడితే ఇతరులు మీ గురించి చెడుగా అనుకుంటారు. కస్‌ కంట్రోల్‌ అనే పుస్తకం ఇలా చెప్తోంది, “మనకు ఎవరు స్నేహితులు అవుతారనేది మన మాటలే నిర్ణయిస్తాయి. అంతేకాదు మన కుటుంబసభ్యులూ తోటి పనివాళ్లూ మనకు ఎంత గౌరవమిస్తారనేది, ఇతరులతో మనకు ఎలాంటి సంబంధం ఉందనేది, మనకు ఎంత పేరు ఉందనేది, మనకు ఉద్యోగం లేదా ప్రమోషన్‌ వస్తుందో లేదో అనేది, మనకు పరిచయం లేనివాళ్లు మనతో ఎలా ఉంటారనేది కూడా మన మాటలే నిర్ణయిస్తాయి.” “ఒకవేళ మీరు బూతులు మాట్లాడకపోతే ఇతరులతో మీకున్న సంబంధం ఇంకా మెరుగవుతుందేమో ఓసారి ఆలోచించుకోండి” అని కూడా ఆ పుస్తకం చెప్తుంది.

   బైబిలు ఇలా చెప్తోంది: “దూషణ . . . విసర్జించుడి.”—ఎఫెసీయులు 4:31.

 •  బూతులు మాట్లాడడం మీరు అనుకన్నంత స్టైల్‌ ఏం కాదు. డాక్టర్‌ అలిక్స్‌ రాసిన హౌ రూడ్‌ అనే పుస్తకం ఏం చెప్తుందంటే, “బూతులు ఎక్కువగా మాట్లాడేవాళ్లతో ఎక్కువసేపు మాట్లాడాలనిపించదు. అంతేకాదు బూతు మాటల్లో అవగాహన, బుద్ధి, తెలివి లేదా తదనుభూతి వంటివి అంతగా కనిపించవు. మీరు బద్ధకంగా, అస్పష్టంగా, ఆలోచనలేకుండా మాట్లాడితే, అది మీ మనసుపై ప్రభావం చూపిస్తుంది.”

   బైబిలు ఇలా చెప్తోంది: “దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.”—ఎఫెసీయులు 4:29.

 మీరేమి చేయవచ్చు?

 •  ఓ లక్ష్యం పెట్టుకోండి. ఒక నెలలోపు లేదా అంతకన్నా తక్కువ సమయంలోపు బూతులు మాట్లాడడం మానేయడానికి మీరెందుకు ప్రయత్నించకూడదు? మీరు ఈ విషయంలో ఎంతవరకు విజయం సాధించారో ఓ చార్టుపై గానీ క్యాలెండరుపై గానీ నోట్‌ చేసుకుంటూ ఉండండి. మీరు అనుకున్నట్లుగా బూతులు మాట్లాడడం మానేయాలంటే బహుశా మీరు కొన్ని పనులు చేయాల్సి రావచ్చు. ఎలాంటి పనులంటే:

 •  మీ మెదడును చెడ్డమాటలతో నింపేసేవాటికి దూరంగా ఉండాలి. బైబిలు ఇలా చెప్తోంది: “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును”. (1 కొరింథీయులు 15:33) “సహవాసము” లేదా స్నేహం అంటే కేవలం మనుషులతో మాత్రమే చేసేది కాదు మీరు సరదా కోసం చేసేవాటితో కూడా ఒకరకంగా స్నేహం చేస్తున్నట్లే. అంటే మీరు చూసే సినిమాలు, మీరు ఆడే వీడియో గేములు, మీరు వినే పాటలు అన్నమాట. 17 ఏళ్లున్న కెన్నత్‌ ఏం చెప్తున్నాడంటే, “మీకిష్టమైన పాటను వింటూ మీరు కూడా పాడడం చాలా తేలిక. కానీ బీట్‌ బాగుండడంతో దానిలో చెడ్డ మాటలు ఉన్నాయనే విషయాన్నే మీరు గమనించరు.”

 •  మెచ్యూర్‌గా ప్రవర్తించాలి: బూతులు మాట్లాడితే మమ్మల్ని పెద్దవాళ్లలా చూస్తారని కొంతమంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బూతులు మాట్లాడకపోతేనే పెద్దవాళ్లలా చూస్తారు. మెచ్యూరిటీ ఉన్నవాళ్లకు, “ఏది తప్పో, ఏది ఒప్పో తేల్చుకునే శక్తి ఉంటుంది” అని బైబిలు చెప్తుంది. (హెబ్రీయులు 5:14) అలాంటి వాళ్లు కేవలం ఇతరుల దగ్గర పేరు సంపాదించడం కోసం తాము పెట్టుకున్న హద్దులను దాటరు.

 నిజానికి, బూతులు తప్పుడు ఆలోచనలతో మన మనసును పాడుచేస్తాయి. అలాంటి మాటలు మాట్లాడేవాళ్లు ప్రపంచంలో ఇప్పటికే చాలామంది ఉన్నారు! “మీరు కూడా వాళ్లతో చేరి ప్రపంచంలో ఉన్న చెడును ఇంకా పెంచకండి. అలాంటి మాటల్ని తగ్గించడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. అప్పుడు మీకూ మంచిగా అనిపిస్తుంది, వేరేవాళ్లు కూడా మీ గురించి మంచిగా అనుకుంటారు” అని కస్‌ కంట్రోల్‌ పుస్తకం చెప్తుంది.