కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

మా నాన్న లేదా అమ్మ ఆరోగ్యం బాగోకపోతే?

మా నాన్న లేదా అమ్మ ఆరోగ్యం బాగోకపోతే?

 సాధారణంగా ఆరోగ్య సమస్యలు ముసలితనంలో వస్తాయి. తమ అమ్మానాన్నలు ముసలివాళ్లు అవ్వడానికి ఇంకా చాలా ఏళ్లు పడతాయి. కాబట్టి చాలామంది పిల్లలు తమ అమ్మానాన్నల ఆరోగ్యం పాడైతే ఎలా చూసుకోవాలనే దానిగురించి ఎక్కువగా ఆలోచించరు.

 కానీ మీ చిన్నతనంలోనే మీ నాన్న లేదా అమ్మ ఆరోగ్యం పాడైతే మీరేమి చేస్తారు? అలాంటి సమస్యనే ఎదుర్కొన్న ఇద్దరు యౌవనుల అనుభవాల్ని చదవండి.

 ఎమలైన్‌ జీవిత అనుభవం

 మా అమ్మకు ఏలర్స్‌-డాలాస్‌ సిండ్రోమ్‌ (EDS) అనే దీర్ఘకాల వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఉండడం వల్ల చాలా నొప్పిగా ఉంటుంది. అంతేకాదు కీళ్లు, చర్మం, రక్త నాళాలు దెబ్బతింటాయి.

 ఈ జబ్బుకు మందు లేదు. గత పదేళ్లుగా అమ్మ ఈ వ్యాధితో బాధపడుతోంది ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. కొన్నిసార్లయితే ఆమెకు రక్తం చాలా తక్కువ ఉండేది, బ్రతకడం కూడా కష్టమని అప్పుడు డాక్టర్లు అనేవాళ్లు. ఇంకొన్నిసార్లు ఆమెకు నొప్పి ఎంత ఎక్కువగా ఉండేదంటే, అది తట్టుకోలేక చచ్చిపోతే బాగుండని అనుకునేది.

 నేనూ, మా కుటుంబంలోని అందరూ యెహోవాసాక్షులు. మా సంఘంలోని వాళ్లు మాకు చాలా ఓదార్పునిచ్చారు. మొన్నీమధ్య నా వయసున్న ఓ అమ్మాయి మాకు ఒక గ్రీటింగ్‌ కార్డు పంపించింది. తను మమ్మల్ని ఎంతో ప్రేమిస్తోందని, అవసరమైనప్పుడు తప్పకుండా సహాయం చేస్తానని ఆ కార్డులో రాసింది. అలాంటివాళ్లు స్నేహితులుగా ఉంటే చాలా బాగుంటుంది.

 బైబిలు నాకెంత సహాయపడిందో చెప్పలేను. అందులోని కీర్తన 34:18 వ వచనం నాకు చాలా ఇష్టం. “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు” అని ఆ వచనం చెప్తుంది. నాకు ఇష్టమైన మరో లేఖనం హెబ్రీయులు 13:6, అక్కడిలా ఉంటుంది, “నాకు సహాయం చేసేది యెహోవాయే నేను భయపడను.”

 ముఖ్యంగా నేను చెప్పిన రెండో లేఖనం నాకు చాలా బలాన్నిస్తుంది. మా అమ్మ నాకు దూరమౌతుందేమో అనే ఆలోచన వచ్చినప్పుడల్లా చాలా భయమేస్తుంది. నాకు మా అమ్మంటే చాలా ఇష్టం. ఆమెతో ఉన్న ప్రతీరోజు విషయంలో నేను ఎంతో కృతజ్ఞురాలిని. ముందుముందు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఉండగలనని ఆ లేఖనం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది.

 నాకు ఇంకో భయం ఉంది. అమ్మకు ఉన్న జబ్బు వారసత్వంగా వచ్చేది. మా అమ్మమ్మకు కూడా ఆ జబ్బు ఉండేది. అందుకే ఇప్పుడు నాకు కూడా ఆ జబ్బు వచ్చింది. కానీ నేను భయపడను ఎందుకంటే హెబ్రీయులు 13:6 చెప్తున్నట్లు యెహోవా నాకు ఈ విషయంలో కూడా ‘సహాయకునిగా’ ఉంటాడు.

 అందుకే నేను గతం గురించిగానీ, రానున్న రోజుల గురించి ఆలోచించను. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆలోచిస్తూ కృతజ్ఞతతో ఉంటాను. ఒకప్పుడు మా అమ్మ ఎంత ఆరోగ్యంగా ఉండేదో ఆలోచిస్తే నా గుండె పిండేసినట్లు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు ‘కొంతకాలమే ఉంటాయని’ భవిష్యత్తులో మనం పొందబోయే రోగాలులేని నిత్యజీవంతో పోలిస్తే ఇవి ‘చాలా చిన్నవని’ బైబిలు చెప్తోంది.—2 కొరింథీయులు 4:17; ప్రకటన 21:1-4.

 ఆలోచించండి: నిరుత్సాహపడకుండా ఉండడానికి ఎమలైన్‌కు ఏమి సహాయం చేస్తోంది? కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఎలా ధైర్యంగా ఉండవచ్చు?

 ఎమలీ అనుభవం

 నేను హైస్కూల్‌లో ఉన్నప్పుడు మొదటిసారి నాన్న డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అసలు ఈయన మా నాన్నేనా అని అనిపించేంతగా ఆయనలో మార్పు వచ్చింది. ఇక ఆ తర్వాత బాధ, ఏదో జరిగిపోతోందనే భయం, గుండెదడ ఇలా ఒకదాని తర్వాత మరొకటి నాన్నకు వచ్చాయి. ఇప్పటికి 15 ఏళ్లు గడిచిపోయాయి, ఆయనింకా వాటితో బాధపడుతూనే ఉన్నాడు. ఏమీ జరగకపోయినా ఎప్పుడూ బాధగా అనిపిస్తుంటే నాన్నకు ఎలా ఉంటుందో!

 మేము యెహోవాసాక్షులం, మా సంఘంలోని వాళ్లు మాకు చాలా సహాయం చేస్తారు. మా తోటి సహోదరసహోదరీలు ఎంతో దయగా ఉంటారు, అర్థంచేసుకుంటారు. మా నాన్న వల్ల సంఘానికి ఎలాంటి ఉపయోగం లేదని అనిపించేలా ఎవ్వరూ ఆయనతో ప్రవర్తించలేదు. నాన్న తనకున్న ఆరోగ్య సమస్యను తట్టుకునే విధానం చూసి ఆయనపై నాకున్న ప్రేమ ఇంకా ఎక్కువైంది.

 ఒకప్పుడు మా నాన్న ఎంత బాగుండేవాడో! ఎలాంటి ఆందోళన, భయం, బాధ లేకుండా సంతోషంగా ఉండేవాడు. కంటికి కనిపించని శత్రువులాంటి జబ్బుతో ఆయన రోజూ పోరాడాలనే చేదునిజం నన్ను కాల్చేస్తోంది.

 అయినాసరే, తన లోపల ఉన్న బాధను బయటికి కనిపించనివ్వకుండా ఉండేందుకు నాన్న చాలా కృషిచేస్తాడు. ఈ మధ్య కొన్నిరోజులు ఆయనకు డిప్రెషన్‌ చాలా ఎక్కువైంది. ఆ సమయంలో, ప్రతీరోజు కనీసం కొన్ని వచనాలైనా సరే చదవాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. అది ఆయనకు చాలా బలాన్నిచ్చింది. చదవడానికి వెచ్చించింది కొన్ని నిమిషాలే అయినప్పటికీ అది ఆయనకు చాలా ఉపశమనాన్నిచ్చింది. ఆ సమయంలో మా నాన్నను చూసి నేను చాలా గర్వపడ్డాను.

 నెహెమ్యా 8:10 వ వచనంలోని మాటలు నాకు చాలా నచ్చుతాయి. “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.” ఈ మాటలు అక్షరాలా నిజం. కొన్నిసార్లు నాకు బాధగా, ఏదో లోటుగా అనిపించేది. కానీ రాజ్యమందిరానికి వెళ్లి అన్నీ మీటింగ్స్‌లో చురుగ్గా భాగం వహించినప్పుడు నాకున్న బాధ మాయమైపోయేది. ఆ ఆనందం రోజంతా నాలో ఉండేది. మా నాన్నను చూసి నేను ఒక విషయం నేర్చుకున్నాను, ఎలాంటి కష్టమొచ్చినా, యెహోవా ఎప్పుడూ తోడుగా ఉంటాడని.

 ఆలోచించండి: అనారోగ్యంతో బాధపడుతున్న తన నాన్నకు ఎమలీ ఎలా సహాయం చేసింది? డిప్రెషన్‌తో బాధపడుతున్న వాళ్లకు మీరెలా సహాయం చేయవచ్చు?