కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను బాప్తిస్మం తీసుకోవాలా?​—1వ భాగం: బాప్తిస్మానికి అర్థం

నేను బాప్తిస్మం తీసుకోవాలా?​—1వ భాగం: బాప్తిస్మానికి అర్థం

 ప్రతీ సంవత్సరం, యెహోవాసాక్షుల కుటుంబాల్లో పెరిగిన చాలామంది యువతీయువకులు బాప్తిస్మం తీసుకుంటారు. మీరు కూడా బాప్తిస్మం గురించి ఆలోచిస్తున్నారా? అలా అయితే మీరు సమర్పణకు, బాప్తిస్మానికి అర్థం ఏంటో తెలుసుకోవాలి.

 బాప్తిస్మం అంటే ఏంటి?

 బైబిల్లో బాప్తిస్మం అనే మాట, నీళ్లు చిలకరించడాన్ని కాదుగానీ నీళ్లలో పూర్తిగా ముంచడాన్ని సూచిస్తుంది. అలా ముంచడానికి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంది.

  •   నీళ్లలో మునిగినప్పుడు, ఇక నుండి మీరు మీ ఇష్టం ప్రకారం జీవించరని అందరికీ చూపిస్తారు.

  •   నీళ్లలో నుండి పైకి వచ్చినప్పుడు, మీరు దేవుని ఇష్టం చేయడానికి కొత్త జీవితం మొదలుపెట్టారని చూపిస్తారు.

 బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, మంచిచెడులు నిర్ణయించే అధికారం యెహోవాకే ఉందని మీరు గుర్తిస్తున్నట్లు నలుగురికీ చూపిస్తారు, అలాగే ఎప్పుడూ ఆయన కోరినట్లు జీవిస్తారని మీరు ఇష్టపూర్వకంగా చేసుకున్న వాగ్దానాన్ని అందరికీ తెలియజేస్తారు.

 ఆలోచించండి: మీ జీవితమంతా యెహోవాకు ఎందుకు లోబడాలి? 1 యోహాను 4:19, ప్రకటన 4:11 చూడండి.

 సమర్పణ అంటే ఏంటి?

 బాప్తిస్మం తీసుకునే ముందు మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకోవాలి. అది ఎలా చేయాలి?

 మీరు ప్రార్థనలో, ఎప్పుడూ యెహోవా సేవ చేస్తారని ఆయనకు మాటిస్తారు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఇతరులు ఏమి చేసినా, మీరు మాత్రం యెహోవా కోరేదే చేస్తారని ఆయనకు చెప్తారు.

 మీరు సమర్పించుకున్నారని ఇతరులకు తెలియజేయడానికి బాప్తిస్మం తీసుకుంటారు. దానివల్ల, మీరు ఇకనుండి మీ సొంతం కారని, యెహోవాకు చెందినవాళ్లని ఇతరులు తెలుసుకుంటారు.—మత్తయి 16:24.

 ఆలోచించండి: మీరు యెహోవాకు చెందినవాళ్లు అయినప్పుడు మీ జీవితం ఎందుకు ఇంకా బాగుంటుంది? యెషయా 48:17, 18, హెబ్రీయులు 11:6 చూడండి.

 బాప్తిస్మం ఎందుకు ముఖ్యం?

 తన శిష్యులు అవ్వాలంటే బాప్తిస్మం తీసుకోవాలని యేసు చెప్పాడు. (మత్తయి 28:19, 20) కాబట్టి నేడు కూడా క్రైస్తవులు తప్పనిసరిగా బాప్తిస్మం తీసుకోవాలి. నిజానికి, రక్షణ పొందాలంటే బాప్తిస్మం తీసుకోవడం తప్పనిసరి అని బైబిలు చెప్తుంది.—1 పేతురు 3:21.

 అయితే, ముఖ్యంగా యెహోవా మీద మీకున్న ప్రేమ, కృతజ్ఞత వల్లే మీరు బాప్తిస్మం తీసుకోవాలి. ‘యెహోవా నాకు చేసిన మంచి అంతటికీ నేను ఆయనకు ఏమి ఇవ్వను? యెహోవా పేరున ప్రార్థిస్తాను. యెహోవాకు నా మొక్కుబళ్లు చెల్లిస్తాను’ అని రాసిన కీర్తనకర్తలా మీరు భావించాలి.—కీర్తన 116:12-14.

 ఆలోచించండి: యెహోవా మీకు ఎలాంటి మంచి చేశాడు? అందుకోసం మీరు ఆయనకు ఏమి ఇవ్వగలరు? ద్వితీయోపదేశకాండం 10:12, 13, రోమీయులు 12:1 చూడండి.