కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను ఎందుకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతుంటాను?

నేను ఎందుకు ఎప్పుడూ తప్పుగా మాట్లాడుతుంటాను?

 “కొన్నిసార్లు నా నోటిని అదుపులో ఉంచుకోగలుగుతాను, కానీ కొన్నిసార్లు మాత్రం మెదడుతో సంబంధం లేకుండా నా నోరు ఇష్టమొచ్చింది మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది!”—జేమ్స్‌.

 “టెన్షన్‌లో ఉన్నప్పుడేమో ఆలోచించకుండా మాట్లాడుతుంటాను. ప్రశాంతంగా ఉన్నప్పుడేమో మాట్లాడాల్సిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతుంటాను. మొత్తానికి ఎప్పుడూ ఏదోకటి తప్పుగా మాట్లాడుతుంటాను.”—మరీ.

 బైబిలు ఇలా చెప్తుంది, “నాలుక ... నిప్పులాంటిదే,” “ఓ పెద్ద అడవిని తగలబెట్టడానికి చిన్న నిప్పురవ్వ చాలు కదా!” (యాకోబు 3:5, 6) మీ మాటల వల్ల తరచూ ఇబ్బందుల్లో పడుతుంటారా? అలాగైతే, ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

 నేను ఎందుకు తప్పుగా మాట్లాడుతుంటాను?

 అపరిపూర్ణత. బైబిలు ఇలా చెప్తుంది, “మనందరం తరచూ పొరపాట్లు చేస్తుంటాం. ఎవరైనా మాట్లాడే విషయంలో పొరపాటు చేయకపోతే అతను పరిపూర్ణుడు.” (యాకోబు 3:2) మానవ బలహీనతల వల్ల నడిచేటప్పుడు ఎలాగైతే తడబడతామో, అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా తప్పులు దొర్లుతాయి.

 “నాకు అపరిపూర్ణ మెదడు, అపరిపూర్ణ నాలుక ఉన్నాయి కాబట్టి, వాటిమీద నాకు పరిపూర్ణ నియంత్రణ ఉందని చెప్పడం మూర్ఖత్వమే అవుతుంది.”—ఆనా.

 అతిగా మాట్లాడడం. బైబిలు ఇలా చెప్తుంది, ‘విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు.’ (సామెతలు 10:19) ఎవరైతే అతిగా మాట్లాడతారో తక్కువగా వింటారో, వాళ్లు తప్పుగా మాట్లాడి ఇతరుల్ని బాధపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

 “మాట్లాడేవాళ్లు ప్రతీసారి తెలివైనవాళ్లు అవ్వరు. భూమ్మీద జీవించిన అత్యంత తెలివైన వ్యక్తి యేసు, ఆయన కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్నాడు.”—జూలియా.

 వెటకారం. బైబిలు ఇలా చెప్తుంది, ‘ఆలోచించకుండా మాట్లాడే మాటలు కత్తిపోట్ల లాంటివి.’ (సామెతలు 12:18, NW) ఆలోచించకుండా మాట్లాడే మాటలకు ఒక ఉదాహరణ వెటకారం. అంటే ఇతరుల్ని బాధపెట్టి, చులకన చేయడానికి అనే మాటలు. వెటకారంగా మాట్లాడేవాళ్లు, “నేను కేవలం సరదాగా అన్నాను” అని చెప్పొచ్చు. కానీ ఇతరుల్ని చులకన చేయడం సరదా విషయం కాదు. “తిట్టడం మానేయండి, అలాగే గాయపర్చే పనులన్నీ ఆపేయండి” అని బైబిలు మనకు చెప్తుంది.—ఎఫెసీయులు 4:​31.

 “చమత్కారంగా మాట్లాడడం నాకు అలవాటు, సరదాగా ఉండడమంటే కూడా నాకిష్టం. దానివల్ల వెటకారంగా మాట్లాడుతుంటాను, తరచూ ఇబ్బందుల్లో పడుతుంటాను.”—ఒక్సాన.

ఒక్కసారి టూత్‌పేస్ట్‌ బయటికి వస్తే దాన్ని తిరిగి ట్యూబ్‌లో పెట్టలేరు. అదేవిధంగా ఒక్కసారి ఏదైనా అనేశాక, మీ మాటల్ని వెనక్కి తీసుకోలేరు

 నోటిని అదుపులో పెట్టుకోవడం

 నోటిని అదుపులో పెట్టుకోవడం అంత తేలిక కాకపోవచ్చు, కానీ బైబిలు సూత్రాల సహాయంతో అది సాధ్యమే. ఉదాహరణకు వీటిని పరిశీలించండి:

 ‘మీరు అనాలనుకున్నది మీ హృదయంలోనే అనుకొని, మౌనంగా ఉండండి.’—కీర్తన 4:4, NW.

 కొన్నిసార్లు అత్యుత్తమ జవాబు, ఏ జవాబూ ఇవ్వకపోవడమే. “నాకు కోపంలో ఉన్నప్పుడు అనిపించినట్టు, కోపం తగ్గాక అనిపించదు. మనసులో ఉన్నది బయటికి అనకుండా మంచిపని చేశానని కోపం తగ్గాక అనిపిస్తుంది” అని లారా అనే యువతి చెప్తుంది. కొన్ని సెకన్ల పాటు మౌనంగా ఉండడం ద్వారా కూడా తప్పుగా మాట్లాడకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోగలుగుతారు.

 “అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా?”—యోబు 12:11.

 మీ మనసులో ఉన్న మాటల్ని ఈ ప్రశ్నల సహాయంతో పరీక్షించుకుంటే ఇబ్బందుల్ని చాలావరకు తప్పించుకోగలుగుతారు:

  •   ఈ మాటల్లో నిజం ఉందా? ఈ మాటలు దయగా ఉన్నాయా? ఇలా అనడం అవసరమా?—రోమీయులు 14:19.

  •   ఇవే మాటలు ఇంకొకరు నన్ను అంటే నాకెలా అనిపిస్తుంది?​—మత్తయి 7:​12.

  •   అవతలి వ్యక్తి అభిప్రాయాల పై నాకు గౌరవముందని ఈ మాటలు చూపిస్తాయా?—రోమీయులు 12:10.

  •   వీటిని చెప్పడానికి ఇది సరైన సందర్భమేనా?—ప్రసంగి 3:7.

 “వినయంతో ఇతరులు మీకన్నా గొప్పవాళ్లని ఎంచండి.”—ఫిలిప్పీయులు 2:3.

 ఆ సలహా, ఇతరుల గురించి మంచిగా ఆలోచించడానికి మీకు సహాయం చేస్తుంది. దానివల్ల మీ నోటిని అదుపులో ఉంచుకుంటారు, మాట్లాడేముందు ఆలోచిస్తారు. ఒకవేళ అప్పటికే మీరు నోరుజారి వాళ్లను బాధపెట్టే మాటలు అనేసినా, వినయం ఉంటే వీలైనంత త్వరగా వెళ్లి వాళ్లను క్షమాపణ అడుగుతారు. (మత్తయి 5:23, 24) కాబట్టి మీ నోటిని అదుపులో ఉంచుకోవడానికి వీలైనంత బాగా కృషిచేయాలని నిర్ణయించుకోండి.