యువత అడిగే ప్రశ్నలు
నా హోమ్‌వర్క్ పూర్తి చేయడం ఎలా?
“హోమ్‌వర్క్ చేస్తూ రాత్రి ఒంటి గంట వరకు మేల్కొని ఉండడం చాలా కష్టం. ఆ టైంలో బాగా నిద్రొస్తుంది.”—డేవిడ్.
“కొన్నిసార్లు ఉదయం 4:30 వరకు చదువుతూ ఉంటాను. తర్వాత స్కూల్‌కి వెళ్లడానికి 6 గంటలకే నిద్రలేస్తాను. చాలా చిరాకొస్తుంది.”—థెరెసా.
హోమ్‌వర్క్ కుప్పలుకుప్పలుగా ఉన్నట్టు అనిపిస్తుందా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.
అసలు టీచర్లు హోమ్‌వర్క్ ఎందుకు ఇస్తారు?
హోమ్‌వర్క్ చేస్తే . . .
తెలివితేటలు పెరుగుతాయి
బాధ్యతలు తెలిసొస్తాయి
టైంని చక్కగా ఉపయోగించడం నేర్చుకుంటారు
స్కూల్లో నేర్చుకున్నవి బాగా అర్థమౌతాయి a
“క్లాస్‌లో చెప్పేవి ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయకుండా, నేర్చుకున్నవాటిని మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి, వాటిని ప్రాక్టీస్ చేయడానికే టీచర్లు హోమ్‌వర్క్ ఇస్తారు.”—మేరీ.
ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్ మీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుతాయి (అంటే, చిక్కుముడిలాంటి సమస్యల్ని తేలిగ్గా పరిష్కరించగలుగుతారు). అవి మీ మెదడుకు పదునుపెడతాయి అని కూడా నిపుణులు అంటున్నారు. కాబట్టి హోమ్‌వర్క్ మీ బ్రెయిన్‌కి ఎక్సర్‌సైజ్ లాంటిది.
ఇవన్నీ మీరు గుర్తించినా, గుర్తించకపోయినా హోమ్‌వర్క్‌ని మాత్రం తప్పించుకోలేరు. టీచర్లు మీకు ఇచ్చే హోమ్‌వర్క్‌నైతే మీరు తగ్గించలేరు; కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, దాన్ని చేయడానికి పట్టే టైంని మీరు తగ్గించుకోవచ్చు. ఎలానో తెలుసుకోవాలనుందా?
మీకు ఉపయోగపడే టిప్స్
హోమ్‌వర్క్ చేయడానికి మీరు కష్టపడాల్సిన పనిలేదు, కొంచెం తెలివి ఉపయోగిస్తే చాలు. ఈ టిప్స్ ట్రై చేసి చూడండి
టిప్ 1: ముందే ప్లాన్ చేసుకోండి. “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు [లేదా, ప్లాన్‌లు] ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 21:5) మాటిమాటికీ లేచే పనిలేకుండా హోమ్‌వర్క్ చేయడానికి కావల్సినవన్నీ దగ్గర పెట్టుకోండి.
మీ చూపు అటూ ఇటూ వెళ్లకుండా హోమ్‌వర్క్ మీద ఫోకస్ పెట్టగలిగే చోట కూర్చోండి. కొందరు ఇంట్లో నిశ్శబ్దంగా, మంచి వెలుతురు ఉండే రూమ్‌లో కూర్చుంటారు. ఇంకొందరు లైబ్రరీ లాంటి చోట్లకు వెళ్తారు.
“ఏమేం హోమ్‌వర్క్స్ ఉన్నాయి, వాటిని ఎప్పుడు చేయాలి లాంటివన్నీ ఒక నోట్స్‌లో రాసి పెట్టుకుంటే చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. వాటిలో ఎన్ని పూర్తి చేశారో, ఇంకా ఎన్ని చేయాలో టిక్ పెట్టుకుంటూ ఉంటే టెన్షన్ ఉండదు.”—రిచర్డ్.
టిప్ 2: పద్ధతి ప్రకారం పని చేయండి. ‘అన్నీ పద్ధతి ప్రకారం’ చేయండి అని బైబిలు చెప్తుంది. (1 కొరింథీయులు 14:40) అంటే, ఏవి ఫస్ట్ చేయాలో, ఏవి తర్వాత చేయాలో ఆలోచించుకోండి.
కొందరు కష్టంగా ఉండే హోమ్‌వర్క్స్‌ని ముందు పూర్తి చేసుకుంటారు. ఇంకొందరు ముందు ఈజీగా ఉండే వాటిని గబగబా చేసేసి, అదే ఉత్సాహంతో మిగతావి పూర్తి చేస్తారు. మీకు ఏ పద్ధతి సెట్ అవుతుందో ఆలోచించుకోండి.
“ఏమేం చేయాలి, వాటిలో ఏవి ముందు చేయాలి-ఏవి తర్వాత చేయాలి అని ఒక లిస్టు రాసుకుంటే పని తేలికౌతుంది. అప్పుడు మీకు హోమ్‌వర్క్ తలనొప్పిలా అనిపించదు, దాన్ని ఈజీగా చేసేస్తారు.”—హైడి.
టిప్ 3: పని మొదలుపెట్టండి. “కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉండండి, సోమరులుగా ఉండకండి” అని బైబిలు చెప్తుంది. (రోమీయులు 12:11) హోమ్‌వర్క్ చేయాలి అనుకున్న టైంలో అదే చేయండి. వేరేవాటి జోలికి వెళ్లకండి.
రేపు, ఎల్లుండి అని వాయిదా వేస్తే టైంకి పని పూర్తి అవ్వదు, లేదా చివరి నిమిషంలో హడావిడిగా చేయాల్సి వస్తుంది. హడావిడిలో చేసే పని అంతంతమాత్రంగానే ఉంటుంది, ఏదీ బుర్రలోకి కూడా ఎక్కదు. కాబట్టి వీలైనంత త్వరగా హోమ్‌వర్క్ మొదలుపెడితే కంగారు పడాల్సిన, బాధ పడాల్సిన పరిస్థితి రాదు.
“స్కూల్ నుండి వచ్చిన వెంటనే హోమ్‌వర్క్ చేసేదాన్ని లేదా ప్రాజెక్ట్ ఇచ్చిన వెంటనే దాన్ని మొదలుపెట్టేసే దాన్ని. దానివల్ల తర్వాత నాకు కంగారు ఉండేది కాదు, వేరే పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండేది కాదు.”—సెరీనా.
చిన్న ఐడియా: ఒక టైం పెట్టుకుని, ప్రతీరోజు ఆ టైంకే హోమ్‌వర్క్ చేయండి. అప్పుడు మీలో క్రమశిక్షణ (డిసిప్లిన్) పెరుగుతుంది, హోమ్‌వర్క్ మానకుండా చేయడం అలవాటౌతుంది.
టిప్ 4: పనిమీదే ఫోకస్ పెట్టండి. అటూఇటూ చూడకుండా “తిన్నగా ముందుకు చూడాలి” అని బైబిలు చెప్తుంది. (సామెతలు 4:25) మీ మనసును పక్కకు మళ్లించే వాటికి దూరంగా ఉండండి. ముఖ్యంగా ఫోన్, ఇంటర్నెట్ లాంటి వాటికి.
ఇంటర్నెట్ చూడడం, మెసేజ్‌లు పంపడం లాంటివి చేస్తే గంటలో అవ్వాల్సిన పని రెండు గంటలు అవుతుంది. అదే గనుక, చేస్తున్న పని మీద ఫోకస్ పెడితే ఎక్కువ టెన్షన్ ఉండదు, త్వరగా కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఖాళీ టైం అంతా మీదే.
“ఫోన్‌లు, కంప్యూటర్‌లు, వీడియో గేమ్‌లు, టీవీ లాంటివి పక్కనుంటే ఫోకస్‌గా పనిచేయడం చాలా కష్టం. అందుకే నేను వాటి ముందు కూర్చోను, నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తాను.”—జోయెల్.
టిప్ 5: బ్యాలెన్స్ చేసుకోండి. పట్టుబట్టే వాళ్లుగా ఉండకండి అని బైబిలు చెప్తుంది. (ఫిలిప్పీయులు 4:5) అవసరమైతే స్ట్రెస్ తగ్గించుకోవడానికి కాసేపు బ్రేక్ తీసుకోండి. కాసేపు నడవండి, సైకిల్ తొక్కండి లేదా రన్నింగ్ చేయండి.
హోమ్‌వర్క్ మరీ ఎక్కువైపోతోంది, చేయలేకపోతున్నాను అనిపిస్తే, మీ టీచర్లతో మాట్లాడండి. మీరు నిజంగానే కష్టపడుతున్నారని వాళ్లకు అనిపిస్తే, దాన్ని తగ్గించే అవకాశం ఉంది.
“హోమ్‌వర్క్ ఇచ్చారని బాధపడకండి, టెన్షన్ పడకండి. మీరు చేయగలిగింది మీరు చేయండి. కొన్ని విషయాలకు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు, హోమ్‌వర్క్ కూడా అలాంటిదే.”—జూలియ
ఒకసారి ఆలోచించండి:
హోమ్‌వర్క్ చేయడానికి నాకు ఏమేం కావాలి?
హోమ్‌వర్క్ చేయడానికి నాకు ఏది బెస్ట్ టైం?
నేను ఎక్కడ ఫోకస్‌గా హోమ్‌వర్క్ చేసుకోగలను?
రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేయకూడదంటే ఏం చేయాలి?
ఎలాంటి విషయాలు నా ఫోకస్‌ని పక్కకు మళ్లిస్తాయి?
హోమ్‌వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్, కంప్యూటర్, టీవీ లాంటి వాటి జోలికి పోకూడదంటే నేను ఏం చేయాలి?
హోమ్‌వర్క్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ తగ్గించుకోవడానికి నేను ఏం చేయవచ్చు?
ఎప్పుడూ గుర్తుంచుకోండి: హోమ్‌వర్క్‌లో ఏమేం చేయాలో పూర్తిగా తెలుసుకోండి. ఏవైనా సందేహాలుంటే, స్కూల్‌లో ఉన్నప్పుడే మీ టీచర్‌ని అడగండి.
a జీన్ షామ్ రాసిన స్కూల్ పవర్ అనే పుస్తకం నుండి తీసుకున్నవి.