యువత అడిగే ప్రశ్నలు

మల్టీ టాస్కింగ్‌ చేయడం మంచిదేనా?

మల్టీ టాస్కింగ్‌ చేయడం మంచిదేనా?

 మీరు మల్టీ టాస్కింగ్‌ బాగా చేస్తారా?

 మల్టీ టాస్కింగ్‌ అంటే, ఒకేసారి ఎక్కువ పనుల్ని చేయడం. అలా మీరు చేయగలరా? పెద్దయ్యాక టెక్నాలజీని అలవాటు చేసుకున్నవాళ్ల కంటే, చిన్నప్పటి నుండే టెక్నాలజీని వాడడం మొదలుపెట్టినవాళ్లు మల్టీ టాస్కింగ్‌ బాగా చేయగలరని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజమేనా?

 అవును, కాదు

  •   మల్టీ టాస్కింగ్‌ చేయడం వల్ల టైం బాగా మిగులుతుంది.

  •   ప్రాక్టీసు చేస్తే మల్టీ టాస్కింగ్‌ బాగా చేయవచ్చు.

  •   పెద్దవాళ్ల కంటే పిల్లలు మల్టీ టాస్కింగ్‌ బాగా చేస్తారు.

 పైన చెప్పిన వాటికి “అవును” అని మీరు జవాబిస్తే, ఒకేసారి ఎక్కువ పనుల్ని బాగా చేయగలమని అనుకుని మీరు భ్రమపడుతున్నట్టే.

 మల్టీ టాస్కింగ్‌ గురించి అపోహలు

 మీరు ఒకేసారి రెండు పనుల్ని చేయగలమని అనుకుంటున్నారా? బహుశా, మీరు ఆ రెండు పనుల్లో ఏదైనా ఒకదాని మీద అంత దృష్టి పెట్టాల్సిన అవసరం లేకపోతే అలా చేయగలరు. ఉదాహరణకు, మీరు పాటలు వింటూ ఇంటిని శుభ్రం చేస్తుంటే, బహుశా మీరు బాగానే శుభ్రం చేస్తారు.

 అయితే, మీరు శ్రద్ధ పెట్టి చేయాల్సిన రెండు పనుల్ని ఒకేసారి చేస్తే, మీరు రెండిటినీ సరిగ్గా చేయలేకపోవచ్చు. బహుశా అందుకే క్యాథరీన్‌ అనే 22 ఏళ్ల అమ్మాయి ఇలా చెప్తుంది, “నావరకైతే మల్టీ టాస్కింగ్‌ అంటే, ఎక్కువ పనుల్ని మొదలుపెట్టి చివరికి వేటినీ సరిగ్గా చేయలేని సామర్థ్యం.”

 “నేను నా ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నప్పుడు, నా ఫోన్‌కి ఒక మెసేజ్‌ వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతూనే మెసేజ్‌ చేయాలని చూశాను. దానివల్ల నా ఫ్రెండ్‌ ఏం చెప్తున్నాడో పూర్తిగా వినలేకపోయాను, మెసేజ్‌ కూడా అన్నీ తప్పులే టైప్‌ చేశాను.”—కేలెబ్‌.

 టెక్నాలజీ నిపుణురాలైన షర్రీ టర్కెల్‌ ఇలా రాస్తుంది: “మనం ఒకేసారి ఎక్కువ పనుల్ని చేస్తే, . . . ఆఖరికి ఏ పని మీద పూర్తిగా శ్రద్ధ పెట్టలేం. మల్టీ టాస్కింగ్‌ చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది కాబట్టి, మనం పనుల్ని బాగా చేస్తున్నాం అని అనుకుంటాం. కానీ నిజానికి మన పనులన్నీ గందరగోళంగానే ఉంటాయి.” a

 “కొన్నిసార్లు నేను ఒకరితో మెసేజ్‌ చేస్తూనే, మరొకరితో మాట్లాడొచ్చు అనుకున్నాను. కానీ అలా చేయడం వల్ల మెసేజ్‌లో పెట్టాల్సిన విషయాన్ని బయటికి మాట్లాడేశాను, బయటికి మాట్లాడాల్సిన విషయాన్ని మెసేజ్‌లో పెట్టేశాను!”—టమార.

 మల్టీ టాస్కింగ్‌ చేసేవాళ్లు అనవసరంగా ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకు, అలాంటివాళ్లకు హోమ్‌వర్క్‌ పూర్తిచేయడం లేట్‌ అవుతుంది. లేదా పూర్తి చేశాం అనుకున్న హోమ్‌వర్క్‌ని మళ్లీ మొదటి నుండి చేయాల్సి వస్తుంది. ఏరకంగా చూసినా, ఒకేసారి ఎక్కువ పనులు చేయాలని ప్రయత్నించే వాళ్లకు నచ్చిన పనుల్ని చేయడానికి టైం ఉండదు!

 అందుకే సైకియాట్రిస్ట్‌ అలాగే స్కూల్‌ కౌన్సిలర్‌ అయిన థామస్‌ కార్స్‌టింగ్‌ ఇలా అంటున్నాడు: “అసలైతే, మనిషి మెదడు శుభ్రంగా సర్దిన బీరువాలా ఉంటుంది. కానీ, మల్టీ టాస్కింగ్‌ ఎక్కువ చేసేవాళ్ల మెదడు మాత్రం చిందరవందరగా ఉన్న బీరువాలా ఉంటుంది.” b

 “మీరు ఒకేసారి ఎక్కువ పనులు చేయడం వల్ల, ముఖ్యమైన పనుల్ని పట్టించుకోకపోవచ్చు. దానివల్ల ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు, ఎక్కువ టైం పెట్టాల్సి రావచ్చు. మీరు టైం మిగులుతుంది అనుకుంటారు గానీ, నిజం చెప్పాలంటే టైం అంతా వేస్ట్‌ అయిపోతుంది.”—థెరిస్సా.

ఒకేసారి ఎక్కువ పనులు చేయడానికి ప్రయత్నిస్తే, రెండు రోడ్ల మీద ఒకేసారి కారు నడపడానికి ప్రయత్నించినట్టుగా ఉంటుంది

 ఒక మంచి పద్ధతి

  •   ఒకసారి ఒక పని మీదే మనసుపెట్టడం అలవాటు చేసుకోండి. మీరు ఒకేసారి రెండు పనుల్ని, అంటే చదువుతూనే మెసేజ్‌లు పెట్టడం లాంటివి చేస్తుంటే, ఆ అలవాటును మానుకోవడం కష్టంగా ఉండొచ్చు. అయితే, “ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలని” బైబిలు మనకు చెప్తుంది. (ఫిలిప్పీయులు 1:10) అన్ని పనులు ప్రాముఖ్యం కాకపోవచ్చు. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైన పని ఏదో నిర్ణయించుకుని దాన్ని ముందు చేయండి, ఆ పని పూర్తయ్యేవరకు మీ ధ్యాసను అటూఇటూ వెళ్లనివ్వకండి.

     “ఒకదాని మీద మనసుపెట్టలేని మెదడును, ఒకే విషయం మీద ఎక్కువసేపు మనసుపెట్టలేని చంటి పిల్లాడితో పోల్చవచ్చు. మన మెదడుకు తోచింది చేసేయడం తేలికే, కానీ కొన్నిసార్లు మనం దాన్ని అదుపులో పెట్టుకోవాలి.”—మారియా.

  •   ధ్యాసను అటూఇటూ వెళ్లనివ్వకండి. మీకు చదువుకునేటప్పుడు ఫోన్‌ చూడాలని అనిపిస్తుందా? అయితే, దాన్ని వేరే గదిలో పెట్టేయండి. టీవీని ఆపేయండి, అసలు సోషల్‌ మీడియా గురించిన ఆలోచనే మీ మనసులోకి రానివ్వకండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకోండి.’—కొలొస్సయులు 4:5.

     “ఒకసారి ఒక పని మీదే మనసుపెట్టినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. దానివల్ల, నేను రాసుకున్న పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేయగలుగుతున్నాను. అలా నాకు సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది.”—ఆన్య.

  •   ఎవరైనా మాట్లాడుతుంటే శ్రద్ధగా వినండి. ఎదుటివాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ చూడడం మర్యాద కాదు, దానివల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. ఎదుటివాళ్లు మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటారో, మీరూ వాళ్లతో అలాగే ఉండాలని బైబిలు చెప్తుంది.—మత్తయి 7:12.

     “కొన్నిసార్లు నేను మా చెల్లితో మాట్లాడుతున్నప్పుడు, తను ఫోన్‌లో ఏదైనా చూసుకోవడమో లేదా ఎవరికైనా మెనేజ్‌ చేయడమో చేసేది. అది చూసినప్పుడు నాకు ఒళ్లు మండిపోయేది. కానీ నిజం చెప్పాలంటే, నేను కూడా కొన్నిసార్లు అలానే చేస్తాను!”—డేవిడ్‌.

a రిక్లైమింగ్‌ కాన్‌వర్సేషన్‌ పుస్తకం.

b డిస్‌కనెక్టెడ్‌ పుస్తకం.