కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—1వ భాగం: మీ బైబిలు గురించి తెలుసుకోండి

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—1వ భాగం: మీ బైబిలు గురించి తెలుసుకోండి

 “నేను బైబిలు చదవడానికి ప్రయత్నించాను, కానీ అంత పెద్ద పుస్తకం చదవాలంటే భయమేసింది!”​—బ్రియాన.

 మీకూ అలానే అనిపిస్తుందా? అయితే మీకు ఈ ఆర్టికల్‌ సహాయం చేస్తుంది!

 బైబిల్ని ఎందుకు చదవాలి?

 బైబిల్ని చదవాలంటే మీకు బోర్‌గా అనిపిస్తుందా? ఒకవేళ అలా అనిపిస్తే, మీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బైబిలు అంటే ఏ బొమ్మలూ లేని వెయ్యి కన్నా ఎక్కువ పేజీలున్న ఒక పుస్తకం అని మీరు అనుకోవచ్చు. అంతేకాదు టీవీ, సినిమాలు చూడడంతో పోలిస్తే బైబిలు చదవడం మీకు ఏ మాత్రం ఆసక్తిగా అనిపించకపోవచ్చు.

 కానీ ఇలా ఆలోచించండి: మీకు పురాతనమైన ఒక పెద్ద ఖజానా పెట్టె కనిపిస్తే, దానిలో ఏముందో మీకు చూడాలనిపించదా?

 బైబిలు కూడా ఖజానా పెట్టెలాంటిదే. దాంట్లో, మీకు తెలివినిచ్చే ఎన్నో రత్నాలు ఉన్నాయి. అవి,

 •   మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తాయి

 •   మీ అమ్మానాన్నలతో సరిగ్గా ప్రవర్తించడానికి సహాయం చేస్తాయి

 •   మంచి స్నేహితుల్ని ఎంచుకోవడానికి సహాయం చేస్తాయి

 •   ఒత్తిడిని తట్టుకోవడానికి సహాయం చేస్తాయి

 అంత ప్రాచీన పుస్తకమైన బైబిలు మన కాలానికి ఉపయోగపడుతుందని ఎలా చెప్పవచ్చు? ఎందుకంటే, “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.” (2 తిమోతి 3:16) దానర్థం బైబిల్లో ఉన్న సలహాలన్నీ ఒక శ్రేష్ఠమైన మూలం నుండి వచ్చాయి.

ఖజానా పెట్టెలాంటి బైబిల్లో వెలకట్టలేని తెలివినిచ్చే రత్నాలు ఉన్నాయి

 బైబిల్ని ఎలా చదవాలి?

 ఒక మార్గమేమిటంటే, మొదటినుండి చివరిదాకా చదవడం. అలా చదవడం వల్ల బైబిలు సారాంశం ఏంటో తెలుస్తుంది. బైబిల్ని చదవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు:

 •    బైబిల్లోని 66 పుస్తకాలు ఏ క్రమంలో ఉన్నాయో ఆ క్రమంలో చదవొచ్చు అంటే ఆదికాండము నుండి ప్రకటన వరకు.

 •    కాలక్రమం ప్రకారంగా అంటే బైబిల్లోని సంఘటనలు జరిగిన కాలక్రమం ప్రకారంగా బైబిల్ని చదవొచ్చు.

 సలహా: న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ బైబిల్లోని అనుబంధం A7లో యేసు భూజీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల కాలక్రమ పట్టిక ఉంది.

 రెండో మార్గమేమిటంటే, మీరు ఎదుర్కొంటున్న సమస్యకు సంబంధించిన వృత్తాంతాన్ని ఎంపిక చేసుకొని చదవండి. ఉదాహరణకు:

 •   మీరు నమ్మకమైన స్నేహితుల్ని కనుగొనాలని అనుకుంటున్నారా? అయితే దావీదు, యోనాతానుల కథ చదవండి. (1 సమూయేలు, 18-​20 అధ్యాయాలు) దావీదుతో స్నేహం చేసేలా అతనిలోని ఏ లక్షణాలు యోనాతానును ఆకర్షించి ఉంటాయో తెలుసుకోండి.

 •   శోధనల్ని తట్టుకునే శక్తిని పెంచుకోవాలని అనుకుంటున్నారా? యోసేపు శోధనను ఎలా తట్టుకున్నాడో తెలుసుకోవడానికి ఆయన కథ చదవండి. (ఆదికాండము, 39వ అధ్యాయం) శోధనను తట్టుకోవడానికి అతనికి శక్తి ఎక్కడనుండి వచ్చిందో తెలుసుకోండి.

 •   ప్రార్థన మీకు ఎలా సహాయం చేస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? నెహెమ్యా అనుభవాన్ని చదవండి. (నెహెమ్యా, 1, 2 అధ్యాయాలు) నెహెమ్యా చేసిన ప్రార్థనకు శక్తి ఉందని ఎలా రుజువైందో తెలుసుకోండి.

 సలహా: మీరు బైబిల్ని చదువుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలు నిశ్శబ్ధంగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మీరు చదివే దానిమీద మనసు పెట్టగలుగుతారు.

 మూడో మార్గమేమిటంటే, ఏదైనా ఒక వృత్తాంతాన్ని లేదా కీర్తనను ఎంచుకొని చదవండి. తర్వాత అది మీకు ఎలా వర్తిస్తుందో ఆలోచించండి. చదివిన తర్వాత, ఈ ప్రశ్నలు వేసుకోండి:

 •    యెహోవా దీన్ని బైబిల్లో ఎందుకు రాయించాడు?

 •    యెహోవా వ్యక్తిత్వం గురించి లేదా ఆయన పనులు చేసే విధానం గురించి ఇది నాకు ఏమి తెలియజేస్తుంది?

 •    నేను ఈ సలహాల్ని ఎలా పాటించవచ్చు?

 సలహా: బైబిలు చదవడం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకోండి. మన వెబ్‌సైట్‌లో ఉన్న ‘బైబిలు పఠనం కోసం పట్టిక’ ఉపయోగించి మీరు ఎప్పటి నుండి బైబిలు చదవాలనుకుంటున్నారో ఆ తేదీని రాసుకోండి.