యువత అడిగే ప్రశ్నలు
ఎవరైనా నా గురించి పుకార్లు చెప్తుంటే నేనేమి చేయాలి?
అది ఎందుకు బాధపెడుతుంది
కొన్ని పుకార్లు తీవ్రంగా ఉంటాయి. ఉదాహరణకు మీ పేరును పాడు చేయాలనే ఉద్దేశంతో కావాలనే మీ గురించి అద్ధాలు చెప్పడం. కాని కొన్ని పుకార్లు అంత పెద్దవి కాకపోయినా, అవి మిమ్మల్ని బాధపెడతాయి. ముఖ్యంగా మీకు బాగా దగ్గర వాళ్లు అలా చేసినప్పుడు మీరు ఎక్కువ బాధపడతారు.—కీర్తన 55:12-14.
నేను ఇతరులను పట్టించుకోనని నా స్నేహితురాలు నేను లేనప్పుడు వేరేవాళ్లకు చెప్పినట్టు నాకు తెలిసింది. నాకు చాలా బాధేసింది. తను నా గురించి అలా ఎందుకు చెప్తుందో నాకు అర్థంకాలేదు.”—యాష్‌లీ.
వాస్తవం: మీ గురించి పుకార్లు పుట్టించింది మీ దగ్గరి స్నేహితులైనా కాకపోయినా ఇతరులు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారనే విషయాన్ని మీరు ఏమాత్రం సరదాగా తీసుకోలేరు.
ఇందులో చెడు వార్త—మీరు వాటిని పూర్తిగా తప్పించుకోలేరు
చాలా కారణాలనుబట్టి ప్రజలు పుకార్లు పుట్టిస్తారు. అందులో ఇవి కూడా ఉన్నాయి:
సహజంగా ఉండే ఆసక్తి: మానవులందరూ సంఘ జీవులు. అందుకే సహజంగానే మనం ఒకరితో ఒకరం(ఒకరి గురించి మరొకరం) మాట్లాడుకుంటాం. బైబిలు కూడా ఇతరుల మీద ‘వ్యక్తిగత శ్రద్ధ’ చూపించమని ప్రోత్సహిస్తుంది.—ఫిలిప్పీయులు 2:4
“ఇతరుల గురించి మాట్లాడుకోవడం ఎప్పుడూ చాలా సరదాగా ఉంటుంది.”—బియాంక.
“అందరి జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం, దాని గురించి ఇతరులకు చెప్పడం నాకు ఇష్టమని నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకు ఇలా చేస్తానో నాకే తెలీదు, బహుశా సరదా కోసమే అనుకుంటా.”—కాతీ.
ఉన్న సమయాన్ని ఎలా వాడాలో తెలీక. బైబిలు కాలాల్లో, కొంతమంది ప్రజలు “ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు.” (అపొస్తలులు కార్యములు 17:21) అది ఈరోజుల్లో కూడా నిజం.
“కొన్నిసార్లు ఆసక్తికరమైన విషయాలేమీ లేనప్పుడు ప్రజలు వాటిని సృష్టించి వాటి గురించి ఏదో ఒకటి ఇతరులతో మాట్లాడతారు.”—జోయెనా.
ఇతరులకంటే తక్కువ వాళ్లమనే భావన. బైబిలు మనల్ని మంచి కారణంతోనే ఇతరులతో పోల్చుకోవద్దని హెచ్చరిస్తుంది. (గలతీయులు 6:4) విచారకరంగా, కొంతమంది ప్రజలు ఇతరులతో పోల్చుకొని బాధపడి దాని కారణంగా చెడు పుకార్లు ప్రచారం చేస్తుంటారు.
సాధారణంగా చెడు పుకార్లు, అవి చెప్పేవాళ్ల గురించి తెలియజేస్తాయి.వాళ్లు లోలోపల ద్వేషంతో ఉన్నవాళ్లు. అందుకే ఈ పుకార్లు పుట్టిస్తున్నారు. ఆ వ్యక్తి కన్నా తామే మంచి వాళ్లమని సంతృప్తి పడడానికి పుకార్లు ప్రచారం చేసి సంతోషం పొందుతారు.”—ఫిల్.
వాస్తవం: నచ్చినా నచ్చకపోయినా, ప్రజలు ఇతరుల గురించి మాట్లాడతారు. —మీరు కూడా.
ఇందులో మంచి వార్త—మీరు కృంగిపోకుండా వాటిని చక్కగా ఎదుర్కోవచ్చు.
మీ మీద అసలు పుకార్లే రాకుండా చేసుకోలేకపోయినా వాటికి ఎలా ప్రతిస్పందించాలో మాత్రం మీరు నిర్ణయించుకోవచ్చు. వాటిని నేర్చుకుంటే మీ మీద పుకార్లు వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కోవడానికి మీ దగ్గర కనీసం రెండు మార్గాలు ఉంటాయి.
1వ మార్గం: పట్టించుకోకండి. ఒక మంచి పద్ధతి ఏమిటంటే, వాటిని పట్టించుకోకండి. ముఖ్యంగా అవి సరదా కోసం చేసిన రూమర్లైతే అసలే పట్టించుకోవద్దు. ఈ బైబిలు సలహాను అన్వయించుకోండి: “ఆత్రపడి కోపపడవద్దు.”—ప్రసంగి 7:9.
నేను ఒక అబ్బాయితో డేటింగ్ చేస్తున్నానని పుకారు వచ్చింది. అయితే ఆ అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. అర్థంపర్థం లేని ఇలాంటి పుకార్లను నేను పట్టించుకోను.”—అలీజ్.
“మంచి పేరుంటే ఎలాంటి పుకార్లనైనా తిప్పికొట్టవచ్చు. మీమీద చెడ్డ పుకారు వచ్చినా, మీకున్న మంచి పేరువల్ల దాన్ని ఎక్కువమంది నమ్మరు. మీ గురించిన అసలు నిజమేంటో ఎప్పటికైనా అందరూ తెలుసుకుంటారు.”—అలిస.
టిప్: (1) మీ గురించి ఏమి చెప్పారో (2) అది మిమ్మల్ని ఎంత బాధపెట్టిందో రాసుకోండి. అయితే మీరు దాన్ని సులభంగా మర్చిపోవాలంటే బైబిలు చెప్పే విషయాలను మీ ’హృదయములో ధ్యానించుకోండి.’—కీర్తన 4:4.
2వ మార్గం: మీ గురించి ఎవరైతే పుకార్లు పుట్టించారో వాళ్లతో నేరుగా మాట్లాడండి. కొన్ని సందర్భాలలో, మీ మీద పుట్టించిన పుకార్లు మరీ తీవ్రంగా ఉంటే దాన్ని ఎవరు మొదలు పెట్టారో వాళ్లతో తప్పకుండా మాట్లాడండి.
“మీమీద పుకార్లు పుట్టించిన వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెప్పిన దానివల్ల చివరకు ఏమి జరుగుతుందో వాళ్లు అర్థం చేసుకునేలా సహాయం చేయండి. అంతేకాకుండా, దాని గురించి చర్చించుకోండి. ఇలా చేస్తే సమస్య పోతుందని నేను భావిస్తున్నాను.”—అలీజ్.
మీ మీద పుకార్లు పుట్టించిన వాళ్లతో మాట్లాడే ముందు ఈ క్రింది బైబిలు సూత్రాలను అన్వయించుకోండి. అలాగే ఇక్కడున్న ప్రశ్నలు కూడా వేసుకోండి.
“సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.” (సామెతలు 18:13) ‘అసలేమి జరిగిందో నిజంగా నాకు తెలుసా? ఎవరైతే నా మీద పుకార్లు చెప్పారో, అతడు లేదా ఆమె వాళ్లు విన్న విషయం గురించి తప్పుగా అర్థం చేసుకున్నారేమో?’
“వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” (యాకోబు 1:19) ‘పుకార్లు పుట్టించే ఆ వ్యక్తి దగ్గరకు ఈ సమయంలో వెళ్లడం సరైనదేనా? ఈ విషయంలో నేను సరైన విధంగా ప్రవర్తిస్తున్నానా? లేదా కొన్ని రోజులు గడిచిన తర్వాత లేదా నా కోపం తగ్గాక వాళ్లను కలవడం మంచిదా?’
“మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.” (మత్తయి 7:12) ‘ఒకవేళ మీరే పుకార్లు పుట్టిస్తే అవతలి వాళ్లు మీతో ఎలా మాట్లాడాలని మీరు కోరుకుంటారు? ఈ విషయాన్ని చర్చించేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండాలని నేను ఇష్టపడతాను? ఎలాంటి మాటలు, ప్రవర్తన నా మీద బాగా ప్రభావం చూపిస్తాయి?’
టిప్: పుకార్లు చెప్పేవారితో మాట్లాడేముందు, మీరేమి చెప్పాలనుకుంటున్నారో రాసిపెట్టుకోండి. ఒక వారం లేదా రెండు వారాలు ఆగి, దాన్ని మళ్లీ చదివి ఏమైనా మార్పులు చేయాలనుకుంటే చేయండి. మీ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరితో లేదా పరిణతిగల స్నేహితునితో, మీరేమి మాట్లాడాలనుకుంటున్నారో చర్చించి వాళ్ల సలహా కూడా తీసుకోండి.
వాస్తవం: జీవితంలో చాలా విషయాల్ని మనం జరగకుండా ఆపలేము. అలాగే పుకార్లు కూడా రాకుండా చేయలేము. కాని మీరు వాటిని చక్కగా ఎదుర్కోవచ్చు.