కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాలో ఉందా?

ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలనే స్వభావం నాలో ఉందా?

 ఒకవేళ మీరు

  •    ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంక్‌ రావాలని కోరుకుంటుంటే

  •    పర్ఫెక్ట్‌గా చేయలేనన్న భయంతో ఏదైనా కొత్త పని చేయడానికి వెనకడుగు వేస్తుంటే

  •    ఇతరులు సలహా ఇచ్చినప్పుడు అవమానంలా భావిస్తుంటే

 . . . , అప్పుడు పైన అడిగిన ప్రశ్నకు జవాబు అవును. కానీ అదంత ప్రాముఖ్యమైన విషయమా?

 ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలని కోరుకోవడం తప్పా?

 మీరు చేయగలిగినదంతా చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే, “చేయగలిగినదంతా చేయడానికి, చేయలేనిది కూడా చేయాలనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది. పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం మనకో భారంగా తయారవ్వగలదు. ఎందుకంటే ఎవ్వరూ పర్ఫెక్ట్‌ కాదు” అని పర్ఫెక్షనిజమ్‌​—వాట్స్‌ బ్యాడ్‌ ఎబౌట్‌ బీంగ్‌ టూ గుడ్‌? అనే పుస్తకం చెప్తుంది.

 బైబిలు కూడా అదే చెప్తుంది, ‘అస్సలు పాపం చేయకుండా ఎప్పుడూ మంచి చేసే నీతిమంతుడు భూమ్మీద ఒక్కడు కూడా లేడు.’ (ప్రసంగి 7:20, NW) మనం పరిపూర్ణులం కాదు కాబట్టి, ప్రతీ పనిని పర్ఫెక్ట్‌గా చేయలేకపోవచ్చు.

 ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? అయితే, ప్రతీది పర్ఫెక్ట్‌గా చేయాలనుకునే స్వభావం, ఏ నాలుగు విషయాల మీద ప్రభావం చూపిస్తుందో గమనించండి.

  1.   మిమ్మల్ని మీరు చూసుకునే విధానం. పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే వ్యక్తి, చేరుకోలేని మరీ కష్టమైన లక్ష్యాలు పెట్టుకుంటాడు, ఆఖరికి నిరుత్సాహపడతాడు. ఎలీసా అనే అమ్మాయి ఇలా చెప్తుంది: “వాస్తవానికి, మనం ప్రతీ పనిని పర్ఫెక్ట్‌గా చేయలేం. అలా చేయలేనప్పుడల్లా నిరుత్సాహపడి, చివరికి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం. అప్పుడు ఇంకా కృంగిపోతాం.”

  2.   ఇతరుల సలహాను చూసే విధానం. పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునేవాళ్లు, ఇతరులు సలహా ఇస్తే తమను అవమానించినట్లు భావిస్తారు. “నాకు ఎవరైనా సలహా ఇస్తే భరించలేను” అని జరమీ చెప్తున్నాడు. ఆయన ఇంకా ఇలా అంటున్నాడు: “పర్ఫెక్ట్‌గా ఉండాలని చూసేవాళ్లు తమ పరిమితుల్ని గుర్తించలేరు, ఇతరుల సలహాలను తీసుకోలేరు”.

  3.   మీరు ఇతరుల్ని చూసే విధానం. ప్రతీది పర్ఫెక్ట్‌గా చేయాలనుకునే వాళ్లు, ఇతరుల్ని తరచూ విమర్శిస్తుంటారు. కారణం ఏంటంటే, “పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే వాళ్లు, ఇతరుల నుండి కూడా అదే ఆశిస్తారు. ఎవరైనా వాళ్లు అనుకున్నట్లు లేకపోతే తెగ బాధపడిపోతారు” అని 18 ఏళ్ల యానా చెప్తోంది.

  4.   ఇతరులు మిమ్మల్ని చూసే విధానం. మీరు ఇతరుల నుండి పర్ఫెక్షన్‌ ఆశిస్తే, వాళ్లు మిమ్మల్ని దూరం పెడతారు! అందులో ఆశ్చర్యం లేదు. “పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే వ్యక్తి ఇతరుల నుండి మరీ ఎక్కువ ఆశిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గరికి రావడానికి ఎవ్వరూ ఇష్టపడరు” అని బెత్‌ అనే యువతి చెప్తోంది.

 దీనికి ఏదైనా పరిష్కారం ఉందా?

 బైబిలు ఇలా చెప్తుంది: “మీరు మొండిపట్టు పట్టే ప్రజలు కాదని అందరికీ తెలియనివ్వండి.” (ఫిలిప్పీయులు 4:5) సహేతుకంగా ఉండేవాళ్లు, తమ నుండి అలాగే ఇతరుల నుండి పర్ఫెక్షన్‌ ఆశించకుండా సమతుల్యంగా ఉంటారు.

 “ఇప్పటికే బయట నుండి చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాం. ఇక అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచనతో ఆ ఒత్తిడిని ఇంకా పెంచుకోవడం ఎందుకు? ఆ ఒత్తిళ్లన్నిటిని భరించడం చాలా కష్టం!”​—నైలా.

 ‘అణకువ కలిగి నీ దేవునితో నడువు’ అని బైబిలు చెప్తుంది. (మీకా 6:8, NW) అణకువగల వాళ్లు తమ పరిమితుల్ని గుర్తిస్తారు. వాళ్లు చేయలేని పనుల్ని ఒప్పుకోరు; అలాగే ఏదైనా పని చేయడానికి తమ శక్తికి మించి సమయాన్ని పెట్టరు.

 “నేను చేయగలిగే పనుల్నే ఒప్పుకుంటాను, నా శాయశక్తులా కృషిచేస్తాను. అప్పుడే నా పనుల్ని బాగా చేస్తున్నాననే సంతృప్తి కలుగుతుంది.”​—హేలీ.

 “నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము” అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 9:10) కాబట్టి అన్నీ పర్ఫెక్ట్‌గా చేయాలని చూడొద్దంటే సోమరిపోతుల్లా ఉండమని కాదు. బదులుగా కష్టపడి పనిచేయాలి, ఆ కష్టానికి పైన చెప్పిన సహేతుకత, అణకువ వంటి లక్షణాల్ని జోడించాలి.

 “నాకిచ్చిన పనిని చేయడానికి నా శక్తిమేర కృషిచేస్తాను. ఆ పనిని పర్ఫెక్ట్‌గా చేయలేనని తెలుసు, కానీ ఆ పనిచేయడానికి నేను చేయగలిగినదంతా చేశాననే తృప్తి నాకు చాలు.”​—జాషువ.