యువత అడిగే ప్రశ్నలు
నిజాయితీగా ఎందుకు ఉండాలి?
కొంతమంది నిజాయితీగా ఎందుకు ఉండరు?
కొంతమందికి, నేటి ప్రపంచంలో నిజాయితీగా ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదనిపిస్తోంది. వాళ్లు ఎలా ఆలోచిస్తారంటే:
‘అమ్మానాన్నలకు అబద్ధం చెప్పకపోతే, నా పని అయిపోతుంది.’
‘ఈ పరీక్షలో కాపీ కొట్టకపోతే, నేను ఫెయిల్ అయిపోతాను.’
‘ఈ వస్తువును దొంగిలించకపోతే, కష్టపడి డబ్బులు పోగేసుకోవాలి.’
‘అయినా ఇందులో తప్పేముంది, ఎవ్వరూ నిజాయితీగా ఉండట్లేదు కదా?’ అని కొంతమంది అడుగుతారు.
“లేదు, నిజాయితీగా ఉండేవాళ్లు ఉన్నారు” అనేదే ఆ ప్రశ్నకు సమాధానం. చాలామంది, నిజాయితీ మంచిదని నమ్ముతున్నారు, వాళ్లది గుడ్డి నమ్మకం కాదు. అలా నమ్మేవాళ్లలో చాలామంది యువతీయువకులు కూడా ఉన్నారు. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని బైబిలు చెప్తోంది. (గలతీయులు 6:7) ఇంకోమాటలో చెప్పాలంటే, మనం చేసే ప్రతీ పనికి ఫలితం ఉంటుంది, అది మంచైనా, చెడైనా.
ఉదాహరణకు, అబద్దాలు చెప్పడం వల్ల వచ్చిన కొన్ని చెడు ఫలితాల్ని చూడండి.
“నేను ఆ అబ్బాయితో మాట్లాడలేదని అమ్మకు అబద్ధం చెప్పాను. నేను చెప్పేది నిజం కాదని అమ్మకి తెలిసిపోతోంది. అయితే, అలా మూడుసార్లు జరిగేసరికి మా అమ్మకు కోపం వచ్చింది. అంతే, రెండు వారాల పాటు నన్ను ఎక్కడికి వెళ్లనివ్వలేదు, నా ఫోన్ ముట్టుకోనివ్వలేదు, ఒక నెలపాటు టి.వి. కూడా చూడనివ్వలేదు. ఆ తర్వాత నేనెప్పుడూ అమ్మానాన్నలకు అబద్ధం చెప్పలేదు.”—అనిత.
ఆలోచించండి: మళ్లీ అమ్మ దగ్గర నమ్మకం సంపాదించుకోవడానికి అనితకు ఎందుకు టైం పట్టింది?
బైబిలు ఇలా చెప్తోంది: “మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.”—ఎఫెసీయులు 4:25.
“నేనొక విషయంలో అమ్మానాన్నలకు అబద్ధం చెప్పాను. అలా అప్పటికి తప్పించుకుని, మళ్లీ అడిగినప్పుడు చూసుకుందాంలే అనుకున్నాను. కానీ వాళ్లు దాని గురించి మళ్లీ అడిగినప్పుడు, నేను చెప్పింది నాకే గుర్తులేదు. ఎందుకంటే, జరిగినదానికీ నేను అల్లిన కథకూ అస్సలు సంబంధమే లేదు. మీరు ముందే నిజం చెప్పేస్తే, మీకు ఆ సమస్య ఉండదు!”—ఆంథోనీ.
ఆలోచించండి: ఆంథోనీ ఏమి చేసివుంటే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చుండేది కాదు?
బైబిలు ఇలా చెప్తోంది: “అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.”—సామెతలు 12:22.
“నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను ఏవేవో కల్పించి ప్రతీ విషయాన్నీ, చాలా ఆకర్షణీయంగా చెప్తుంది. గోరంతల్ని కొండంతలు చేసి చెప్తుంది, అసలు విషయాన్ని దాచేస్తుంది. తనంటే నాకు ఇష్టం, అందుకే తను చెప్పేది కరెక్టా కాదా అని నేనెక్కువగా ఆలోచించను. కానీ తనను, తను చెప్పేవాటిని నమ్మాలంటే మాత్రం చాలా భయం.”—ఈవ.
ఆలోచించండి: గోరంతలు కొండంతలు చేసి చెప్పడం వల్ల, చిన్నచిన్న అబద్ధాలు ఆడడం వల్ల ఈవన్ స్నేహితురాలికి ఎలాంటి పేరు వచ్చింది?
బైబిలు ఇలా చెప్తోంది: ‘మేము అన్ని విషయాల్లో యోగ్యంగా [“నిజాయితీగా,” NW] ప్రవర్తించాలని కోరుకుంటున్నాం.’—హెబ్రీయులు 13:18.
పగిలిన పునాది మొత్తం బిల్డింగ్‌నే పాడుచేస్తుంది; అలాగే, నిజాయితీ లేనితనం మీ మంచిపేరును చెడగొడుతుంది
నిజాయితీగా ఉండడం ఎందుకు మంచిది?
నిజాయితీగా ఉండడం వల్ల మీకు వచ్చే కొన్ని మంచి ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం.
“నా ముందు నడుస్తున్న ఒకామె డబ్బులు కింద పడిపోయాయి. నేను ఆమెను పిలిచి ఆ డబ్బులు తీసి ఆమెకు ఇచ్చాను. ఆమె చాలా సంతోషించి, ‘నువ్వు చాలా మంచోడివి బాబూ, ఈ రోజుల్లో చాలామంది ఇలా నిజాయితీగా ఉండట్లేదు’ అంది. మంచి పని చేసినందుకు ఎవరైనా మెచ్చుకుంటే చాలా బావుంటుంది!”—వివియన్.
ఆలోచించండి: ఆ అబ్బాయి నిజాయితీని చూసి ఆమె ఎందుకంత ఆశ్చర్యపోయింది? నిజాయితీగా ఉండడం వల్ల వివియన్‌కు వచ్చిన లాభం ఏమిటి?
బైబిలు ఇలా చెప్తోంది: “ఎల్లవేవల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.”—కీర్తన 106:3.
“మా ఇంట్లో వాళ్లందరం, బిల్డింగ్‌ల బాగోగులు చూసుకునే పనిచేస్తాం. మేము ఆఫీస్ శుభ్రం చేసేటప్పుడు ఒక్కోసారి, నేల మీద ఏదైనా కాయిన్ (డబ్బు) దొరుకుతుంది. అప్పుడు, మేము దాన్ని అక్కడున్న టేబుల్ మీద పెట్టేస్తాం. మేమంత నిజాయితీగా ఉన్నందుకు, అక్కడ ఉద్యోగం చేస్తున్న ఒకామె చిరాకుపడుతున్నట్టుగా, ‘అది చిన్న కాయినే కదా!’ అంటుంది. మీకో విషయం చెప్పనా, ఆమెకు ఎప్పుడూ, మేమంటే ఎంతో నమ్మకం.”—జూలియా.
ఆలోచించండి: జూలియా మరో బిల్డింగ్‌లో పని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, నిజాయితీ విషయంలో ఆమెకున్న పేరు ఎలా ఉపయోగపడుతుంది?
బైబిలు ఇలా చెప్తోంది: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను … కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.”—2 తిమోతి 2:15.
“నేను పనిచేసింది 64 గంటలే కానీ నాకు 80 గంటల పనికి తగిన జీతంతో చెక్ అందింది. ఎవరికీ చెప్పకుండా ఆ డబ్బును వాడేసుకోవడం పెద్ద సమస్య కాదు, కానీ అది నావల్ల కాలేదు. దాన్ని తీసుకెళ్లి అక్కౌంట్స్ చూసుకునే మేనేజర్‌కి చూపించాను, ఆమె చాలా సంతోషించి, థాంక్స్ చెప్పింది. నిజానికి ఆ కంపెనీ లాభాల బాటలో నడుస్తోంది, కానీ అది దొంగిలించిన డబ్బుతో సమానమనిపించి నేను దాన్ని ఉంచుకోలేదు.”—బెతనీ.
ఆలోచించండి: ఒక కంపెనీ దగ్గర డబ్బులు దొంగిలించడం, ఒక మనిషి దగ్గర డబ్బులు దొంగిలించడమంత పెద్ద తప్పు కాదా?
బైబిలు ఇలా చెప్తోంది: “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.”—సామెతలు 3:32.