కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను వేరేవాళ్లతో ఎందుకు కలవలేకపోతున్నాను?

నేను వేరేవాళ్లతో ఎందుకు కలవలేకపోతున్నాను?

 “మీరు ఖచ్చితంగా నలుగురిలో కలిసిపోవాల్సిందే. లేదంటే మీకు ఫ్రెండ్స్‌ ఉండరు, జీవితం ఉండదు, భవిష్యత్తు ఉండదు. మిమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు. మీరు ఒంటరిగా మిగిలిపోతారు.”—కార్ల్‌.

 ఆ మాట వింతగా అనిపిస్తుందా? అనిపించవచ్చు. నిజానికి, కొంతమంది ప్రజలు కార్ల్‌ చెప్పినట్లే జరుగుతుందని భయపడి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు కూడా అంతేనా? అయితే ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

 ప్రజలు ఎందుకు నలుగురిలో కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు?

 •   అందరూ దూరం పెడతారేమో అని భయం. “మా ఫ్రెండ్స్‌ నన్ను పిలవకుండా బయటికి వెళ్లి ఎంజాయ్‌ చేశారు. ఆ ఫోటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టారు. అవి చూసినప్పుడు నేనేం తప్పు చేశాను, వాళ్లు నన్నెందుకు కలుపుకోవట్లేదు అని ఆలోచించీ ఆలోచించీ నాకు పిచ్చెక్కిపోయింది.”—నటాలీ.

   ఒక్కసారి ఆలోచించండి: మీ ఫ్రెండ్స్‌ మిమ్మల్ని దూరం పెడుతున్నట్టు మీకెప్పుడైనా అనిపించిందా? వాళ్లతో కలిసిపోవడానికి మీరేం చేశారు?

 •   అందరికన్నా వేరుగా కనిపిస్తామేమో అని భయం. “మా అమ్మానాన్నలు నన్ను సెల్‌ఫోన్‌ వాడనివ్వరు. వేరే పిల్లలు వచ్చి నా నంబరు అడిగినప్పుడు, నాకు ఫోన్‌ లేదని చెప్తాను. అప్పుడు వాళ్లు, ‘ఏంటీ, ఫోన్‌ లేదా? నీ వయసెంత?’ అనేవాళ్లు. నాకు 13 ఏళ్లు అని చెప్పినప్పుడు వాళ్లు నన్ను జాలిగా చూసేవాళ్లు.”—మేరీ.

   ఒక్కసారి ఆలోచించండి: మీ అమ్మానాన్నలు పెట్టిన ఏ నియమం వల్ల మీరు వేరే పిల్లల కన్నా వేరుగా ఉన్నారు? మీరేం చేయాలనుకుంటున్నారు?

 •   మిగతావాళ్లు ఏడిపిస్తారేమో అని భయం. “తమ పనులు, మాటలు, ఆరాధన వేరుగా ఉన్న పిల్లల్ని స్కూల్లో తోటి పిల్లలు ఇష్టపడరు. వాళ్లతో కలిసిపోకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని ఏడిపిస్తారు.”—ఒలీవియా.

   ఒక్కసారి ఆలోచించండి: తమతో కలిసిపోవట్లేదని తోటి పిల్లలు మిమ్మల్ని ఎప్పుడైనా ఏడిపించారా? అప్పుడు మీరేం చేశారు?

 •   ఫ్రెండ్‌షిప్‌ పాడౌతుందేమో అని భయం. “నేను మా ఫ్రెండ్స్‌తో కలిసిపోవడానికి ప్రయత్నించాను. వాళ్లలాగే మాట్లాడడం మొదలుపెట్టాను, నవ్వడానికి ఏమీ లేకపోయినా నవ్వడం మొదలుపెట్టాను. వేరేవాళ్లను ఆటపట్టిస్తుంటే నేను కూడా వాళ్లతో చేరి ఆటపట్టించాను. తప్పని తెలిసినా అలా చేశాను.”—రేచెల్‌.

   ఒక్కసారి ఆలోచించండి: మీ తోటివాళ్లు మిమ్మల్ని ఇష్టపడడం మీకెంత ప్రాముఖ్యం? వాళ్లతో కలిసిపోవడం కోసం ఎప్పుడైనా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకున్నారా?

 మీరు ఏం తెలుసుకోవాలి?

 •   వేరేవాళ్లని కాపీ కొడితే మీ ప్రయత్నం బెడిసికొట్టవచ్చు. ఎందుకు? ఎందుకంటే మీరు నటిస్తున్నారని ఇతరులకు ఊరికే తెలిసిపోతుంది. బ్రయన్‌ అనే 20 ఏళ్ల అబ్బాయి ఇలా అంటున్నాడు: “నేను నాలా కాకుండా వేరేవాళ్లలా ఉండాలని ప్రయత్నించినప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసిపోవడం నాకు ఇంకా కష్టమైంది. నేను నాలా ఉండడమే మంచిదని అర్థమైంది. ఎందుకంటే మీరు వేరేవాళ్లలా నటిస్తున్నారని వాళ్లకు తెలిసిపోతుంది.”

   ఇలా ప్రయత్నించి చూడండి: మీకు ఏది ముఖ్యమో మరోసారి ఆలోచించుకోండి. ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి’ అని బైబిలు చెప్తుంది. (ఫిలిప్పీయులు 1:10) ‘నాకు ఏది ముఖ్యం? నాలాంటి విలువలు లేనివాళ్లతో కలిసిపోవడమా? లేక నాలా నేనుండడమా?’ అని ప్రశ్నించుకోండి.

   “వేరేవాళ్లలా ఉండాలని ప్రయత్నించడం శుద్ధ దండగ. దానివల్ల ఇతరులు మిమ్మల్ని ఇష్టపడరు, మీరు మెరుగైన వ్యక్తిగా తయారవ్వరు.”—జేమ్స్‌.

 •   వేరేవాళ్లతో కలిసిపోవాలనుకుంటే మీ వ్యక్తిత్వం దెబ్బతినవచ్చు. ఎప్పుడూ వేరేవాళ్లని మెప్పించాలనుకుంటే మీరు వాళ్లకు ఇష్టమైనవే చేస్తుంటారు. “మా ఫ్రెండ్స్‌తో కలిసిపోవడం కోసం నేను ఏది చేయడానికైనా వెనకాడేవాణ్ణి కాదు, ఆఖరికి నా పేరు పాడైనా సరే. కానీ దానివల్ల నేను వేరేవాళ్లు చెప్పినట్లు ఆడే ఆట బొమ్మనయ్యాను” అని జెరెమీ అనే అబ్బాయి అంటున్నాడు.

   ఇలా ప్రయత్నించి చూడండి: మీ విలువలేంటో తెలుసుకుని వాటి ప్రకారం జీవించండి. అంతేగానీ పరిసరాల్ని బట్టి రంగులు మార్చుకునే ఊసరవెల్లిలా ఉండకండి. బైబిలు మంచి కారణంతోనే ఇలా చెప్పింది: “మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నువ్వు ఏదీ చేయవద్దు.”—నిర్గమకాండం 23:2, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

   “సంగీతం, ఆటలు, బట్టలు, సినిమాలు, మేకప్‌లు ఇలా అన్నీ మా ఫ్రెండ్స్‌కి ఇష్టమైనవాటినే ఇష్టపడడం మొదలుపెట్టాను. వాళ్లలా ఉండడానికి ప్రయత్నించాను. నేను నటిస్తున్నానని వాళ్లు పసిగట్టారు. వాళ్లకే కాదు నాకు కూడా తెలుస్తూనే ఉంది. నాకు బాధ, ఒంటరితనం మిగిలాయి, అసలు నేనేంటో నేనే మర్చిపోయాను. నాకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా పోయింది. మనల్ని కలిసే ప్రతీఒక్కరు మనతో కలిసిపోవాల్సిన, మనల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నాను. అంతమాత్రాన ఎవ్వర్నీ ఫ్రెండ్స్‌ చేసుకోకూడదని కాదు; కాస్త ఓపిక పట్టండి. ఇతరులు మీకు ఫ్రెండ్స్‌ అవ్వడానికి, మీరు ఎదగడానికి సమయం పడుతుంది.”—మెలిండ.

 •   వేరేవాళ్లలా ఉండాలనుకుంటే మీ ప్రవర్తన మారిపోవచ్చు. తన బంధువులబ్బాయి విషయంలో అలాగే జరిగిందని చెప్తూ క్రిస్‌ అనే యువకుడు ఇలా అన్నాడు: “అతను కేవలం తన ఫ్రెండ్స్‌తో కలిసిపోవడం కోసం తనకు అలవాటులేని పనుల్ని చేయడం, అంటే డ్రగ్స్‌ తీసుకోవడం మొదలుపెట్టాడు. అతను వాటికి పూర్తిగా బానిసైపోయి, తన జీవితాన్ని పాడుచేసుకున్నాడు.”

   ఇలా ప్రయత్నించి చూడండి: విలువలు లేకుండా మాట్లాడే, ప్రవర్తించే ప్రజలకు దూరంగా ఉండండి. బైబిలు ఇలా చెప్తుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”—సామెతలు 13:20.

   “వేరేవాళ్లతో కలవడానికి ప్రయత్నించడం కొన్నిసార్లు మంచిదే. కానీ సరైనది చేయడాన్ని పణంగా పెట్టి అలా చేయడం తప్పు. మీరు మీలా ఉంటే, మంచి విలువలు ఉన్నవాళ్లు మీకు ఫ్రెండ్స్‌ అవుతారు.”—మెలనీ.

   సలహా: కొత్తవాళ్లను కలుస్తున్నప్పుడు, ఫ్రెండ్స్‌ని చేసుకుంటున్నప్పుడు వాళ్లకు మీలాంటి ఇష్టాలు ఉన్నాయా అని మాత్రమే చూడకండి. వాళ్లకు మీలాంటి విలువలు అంటే ఆధ్యాత్మిక, నైతిక విలువలు ఉన్నాయో లేదో కూడా చూసుకోండి.

  కొన్నిరకాల బట్టలు మీకు సూట్‌ అవ్వవు. అదేవిధంగా మీకున్న విలువల్ని బట్టి కొన్నిరకాల ప్రజలు మీకు సూట్‌ అవ్వరు