కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

డిప్రెషన్‌ నుండి నేనెలా బయటపడాలి?

డిప్రెషన్‌ నుండి నేనెలా బయటపడాలి?

 మీరేం చేస్తారు?

ఈ కింది అనుభవాల్ని చూడండి:

జెనిఫర్‌కి ఏదీ సంతోషాన్ని ఇవ్వడంలేదు. ఏ కారణం లేకుండానే ఆమె ప్రతీరోజు వెక్కివెక్కి ఏడుస్తోంది. ఎవ్వరితో కలవదు, సరిగ్గా తినదు. నిద్రపోలేకపోతోంది, దేనిమీదా మనసు పెట్టలేకపోతోంది. ‘నాకేమి అవుతోంది? నేను మళ్లీ మామూలు మనిషిని అవుతానా?’ అని జెనిఫర్‌కు అనిపిస్తోంది.

మార్క్‌కు స్కూల్లో మంచి పేరు ఉండేది. కానీ ఇప్పుడు అతనికి స్కూల్‌ అంటేనే నచ్చట్లేదు, మార్కులు కూడా తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు చాలా సరదాగా ఆడే ఆటల్ని ఇప్పుడు ఆడడానికి శక్తి చాలట్లేదు. అతనికి ఏమైందో మార్క్‌వాళ్ల ఫ్రెండ్స్‌కు అర్థంకావట్లేదు. అతని అమ్మానాన్నల్లో భయం పెరుగుతోంది. మార్క్‌ ఎప్పటికైనా మారతాడా లేక ఇలానే ఉండిపోతాడా?

మీకూ అప్పుడప్పుడు జెనిఫర్‌లాగా, మార్క్‌లాగా అనిపిస్తోందా? ఒకవేళ అనిపిస్తే ఏమి చేయవచ్చు? మీరు ఈ రెండింటిని ప్రయత్నించవచ్చు:

  1. మీ అంతట మీరే ఆ సమస్యను జయించండి

  2. మీకు నమ్మకం ఉన్న పెద్దవాళ్లతో మాట్లాడండి

మీకు వేరేవాళ్లతో మాట్లాడాలని అనిపించదు కాబట్టి ఆప్షన్‌ A బాగుందని అనిపించవచ్చు. కానీ అది మంచి నిర్ణయమే అంటారా? బైబిలు ఇలా చెప్తోంది: ‘ఒక్కరి కన్నా ఇద్దరు ఉండడం మంచిది. వాళ్లలో ఒకరు పడిపోతే, తోటివ్యక్తి అతన్ని పైకి లేపుతాడు. కానీ ఒంటరిగా ఉన్నవాడు పడిపోతే, అతన్ని ఎవరు పైకి లేపుతారు?’—ప్రసంగి 4:​9, 10, NW.

మీరు అర్థం చేసుకోవడానికి చిన్న ఉదాహరణ: నేరాలు ఎక్కువగా జరిగే ప్రదేశంలో మీరు తప్పిపోయారు అనుకుందాం. చుట్టూ చీకటి, ఏ మూల చూసినా మీకు పరిచయంలేని వాళ్లే కనిపిస్తున్నారు. అప్పుడు మీరేమి చేస్తారు? ఎవరి సహాయం తీసుకోకుండా కూడా మీ అంతట మీరే బయటపడడానికి ప్రయత్నించవచ్చు. కాకపోతే, మీకు బాగా నమ్మకమున్న వ్యక్తి సహాయం తీసుకోవడం తెలివైన పని కాదంటారా?

డిప్రెషన్‌ కూడా, ప్రమాదకరమైన ప్రదేశం లాంటిదే. నిజమే, అప్పుడప్పుడు కాసేపు బాధ అనిపిస్తుంది, ఆ తర్వాత మామూలు అయిపోతుంది. ఒకవేళ మామూలు అవ్వలేకపోతే ఎవరో ఒకరి సహాయం తీసుకోవడం మంచిది.

బైబిలు సూత్రం: “వేరుండగోరువాడు . . . లెస్సైన జ్ఞానమునకు విరోధి.”​—సామెతలు 18:1.

ఆప్షన్‌ B వల్ల అంటే మీ నాన్నతోనో, అమ్మతోనో లేదా మీరు నమ్మే ఎవరైనా పెద్దవాళ్లతోనో మాట్లాడడం వల్ల ఒక లాభం ఉంది. అదేమిటంటే, మీలాంటి పరిస్థితిని అధిగమించిన అనుభవం వాళ్లకు ఉంటుంది కాబట్టి వాళ్ల అనుభవం మీకు సహాయం చేస్తుంది.

మీరిలా అనవచ్చు: ‘కానీ నాకెలా అనిపిస్తుందో మా అమ్మానాన్నలకు అస్సలు అర్థంకాదు.’ వాళ్లకు అర్థం కాదని మీకు ఖచ్చితంగా తెలుసా? వాళ్లు టీనేజీలో ఎదుర్కొన్న పరిస్థితులు ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న లాంటివి కాకపోవచ్చు. కానీ వాళ్లలో కూడా మీలాంటి భావాలే కలిగివుండవచ్చు. వాటినుండి బయటపడే మార్గం వాళ్లకు తెలిసుండవచ్చు.

బైబిలు సూత్రం: “వృద్ధులయొద్ద జ్ఞానమున్నది, దీర్ఘాయువువలన వివేచన కలుగుచున్నది.”​—యోబు 12:12.

విషయమేమిటంటే: మీరు మీ నాన్నతోనో, అమ్మతోనో లేదా మీరు నమ్మే ఎవరైనా పెద్దవాళ్లతోనో మనసువిప్పి మాట్లాడితే మీకు ఉపయోగపడే సలహా దొరికే అవకాశం ఉంటుంది.

డిప్రెషన్‌తో బాధపడడం, ప్రమాదకరమైన ప్రదేశంలో తప్పిపోవడం లాంటిది. దాన్నుండి బయటపడాలంటే సహాయం అవసరం

 అది ఒకవేళ అనారోగ్య సమస్య అయితే?

ఒకవేళ మీరు ప్రతీరోజు డిప్రెషన్‌లోకి వెళ్తుంటే అది అనారోగ్య సమస్య అయ్యుండవచ్చు. మీకు డాక్టరు సహాయం అవసరం కావచ్చు.

సాధారణంగా టీనేజీ వయసువాళ్లలో భావోద్వేగ మార్పులకు సంబంధించిన కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. పిల్లల్లో కనిపించే డిప్రెషన్‌ లక్షణాలు కూడా కాస్త అలాగే ఉన్నట్లు కనిపిస్తాయి. కాకపోతే వాటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండవచ్చు, ఆ లక్షణాలు పదేపదే కనిపిస్తుండవచ్చు. కాబట్టి మీ డిప్రెషన్‌ మరీ ఎక్కువగా ఉంటుంటే, చాలాకాలం పాటు ఉంటుంటే మీ అమ్మానాన్నలతో మాట్లాడి డాక్టరు దగ్గరికి వెళ్లడం మంచిది.

బైబిలు సూత్రం: “ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు వైద్యుడు అవసరంలేదు, రోగులకే అవసరం.”​—మత్తయి 9:​12.

ఒకవేళ మీరు తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్నారని డాక్టర్లు నిర్ధారిస్తే సిగ్గుపడకండి. యౌవనుల్లో ఇలాంటి సమస్య సహజమే. చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. నిజమైన స్నేహితులు మిమ్మల్ని చిన్నచూపు చూడరు.

టిప్‌: ఓపిగ్గా ఉండండి. డిప్రెషన్‌ నుండి బయటపడడానికి సమయం పడుతుంది. ఈలోపు, కొన్ని రోజులు సంతోషంగా అనిపిస్తుందని, కొన్నిరోజులు బాధగా కూడా అనిపిస్తుందని గుర్తుంచుకోండి. *

 బాగవ్వడానికి చేయాల్సిన పనులు

డాక్టరు సహాయం అవసరమైనా కాకపోయినా, తరచుగా కలిగే బాధ నుండి బయటపడడానికి మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, క్రమంగా వ్యాయామం (exercise) చేయండి, ఆరోగ్యకరమైన ఆహారం తినండి, కంటినిండా నిద్రపోండి. ఇలా చేస్తే మీ పరిస్థితి బాగవుతుంది. (ప్రసంగి 4:6; 1 తిమోతి 4:8) ఏదైనా పుస్తకంలో మీకు ఎలా అనిపిస్తుందో, వాటినుండి బయటపడేందుకు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలో, వాటిలో ఏవి చేయలేకపోయారో, ఏవి సాధించారో రాసుకోవడం కూడా మంచిది.

మీరు డాక్టరు సహాయం తీసుకోవాల్సినంత తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నా లేక కొంతకాలంపాటు ఉండే సమస్యను ఎదుర్కొంటున్నా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. అదేంటంటే, ఇతరుల సహాయం తీసుకోవడం వల్ల, అలాగే బాగవ్వడానికి మీరు కూడా ప్రయత్నించడం వల్ల డిప్రెషన్‌ నుండి బయటపడవచ్చు.

 సహాయం చేయగల బైబిలు లేఖనాలు

  • “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”​—కీర్తన 34:18.

  • “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”​—కీర్తన 55:22.

  • “నీ దేవుడనైన యెహోవానగు నేను​—⁠భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.”​—యెషయా 41:13.

  • “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి.”​—మత్తయి 6:​34.

  • ‘అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి; అప్పుడు, మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి మీ హృదయాలకు కాపలా ఉంటుంది.’​—ఫిలిప్పీయులు 4:​6, 7.

^ పేరా 20 చనిపోవాలనే ఆలోచనలు కలుగుతుంటే మీరు నమ్మే పెద్దవాళ్లతో వెంటనే మాట్లాడండి. మరింత సమాచారం కోసం ఇంగ్లీషులో అందుబాటులో ఉన్న తేజరిల్లు! పత్రిక 2014, ఏప్రిల్‌ సంచికలో “నేనెందుకు బ్రతకాలి?” (“Why Go On?”) అనే శీర్షికతో వచ్చిన నాలుగు భాగాల ఆర్టికల్‌ చదవండి.