యువత అడిగే ప్రశ్నలు
నేను ఎలాంటి మ్యూజిక్ వింటున్నాననేది అంత ఆలోచించాల్సిన విషయమా?
“నేను పొద్దున లేవడంతోనే మ్యూజిక్ ఆన్ చేస్తాను. కారు ఎక్కగానే మ్యూజిక్ ఆన్ చేస్తాను. ఇంటి దగ్గర రిలాక్స్ అయ్యేటప్పుడు, క్లీనింగ్ చేసేటప్పుడు, చివరికి చదువుకునేటప్పుడు కూడా మ్యూజిక్ ఆన్‌లోనే ఉంటుంది. నేను ఎప్పుడూ మ్యూజిక్ వింటూనే ఉంటాను.”—కార్ల.
ఆ అమ్మాయిలాగే మీరు కూడా మ్యూజిక్ అంటే చెవికోసుకుంటారా? అయితే, దానివల్ల వచ్చే ప్రయోజనాలను ఎంజాయ్ చేయడానికి, ప్రమాదాల్ని నివారించడానికి, మ్యూజిక్‌ని జ్ఞానయుక్తంగా ఎంచుకోవడానికి ఈ ఆర్టికల్ మీకు సహాయం చేస్తుంది.
ప్రయోజనాలు
మ్యూజిక్ వినడం అనేది భోజనం చేయడం లాంటిది. ఎందుకంటే మ్యూజిక్‌లోనైనా భోజనంలోనైనా మనం ఎంచుకునేది సరైనదై ఉండాలి, సరిపడేంతే ఉండాలి, అప్పుడే దానివల్ల మనకు మంచి జరుగుతుంది. ఈ కింది అంశాలు చూడండి:
మ్యూజిక్ వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
“నాకు ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే, ఇష్టమైన మ్యూజిక్ వింటాను, అప్పుడు వెంటనే రిలీఫ్గా ఉంటుంది.”—మార్క్.
మ్యూజిక్ గతాన్ని గుర్తుచేస్తుంది.
“ఒక్కో పాట వింటుంటే గతంలోని తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ పాట విన్నప్పుడల్లా చాలా సంతోషం కలుగుతుంది.”—షీలా.
మ్యూజిక్ ప్రజల్ని ఐక్యం చేస్తుంది.
“ఒకసారి నేను యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి వెళ్లాను. ఆ సమావేశంలో అందరూ చివరి పాట పాడుతుంటే నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అక్కడున్నవాళ్లందరూ రకరకాల భాషలవాళ్లు, అయినా మ్యూజిక్ మా అందరినీ ఐక్యం చేసింది.”—ట్యామి.
మంచి లక్షణాలు పెంచుకోవడానికి మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది.
“ఒక సంగీత వాయిద్యం (మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్) నేర్చుకుంటే మనలో క్రమశిక్షణ, ఓర్పు పెరుగుతాయి. అది అంత త్వరగా వచ్చేయదు. ఓపిక ఉంటేనే దాన్ని నేర్చుకోగలుగుతాం.”—ఆన.
మీకు తెలుసా? బైబిల్లోని అతిపెద్ద పుస్తకం, కీర్తనలు. దాన్నిండా పాటలే ఉన్నాయి, మొత్తం 150 పాటలు ఉన్నాయి.
ఆహారాన్ని ఎంచుకుని తిన్నట్లే, మ్యూజిక్‌ని కూడా ఎంచుకుని వినండి
ప్రమాదాలు
కలుషిత ఆహారంలాగే, కొన్నిరకాల మ్యూజిక్‌లు కూడా విషం లాంటివి. ఎందుకో చూద్దాం.
చాలా పాటల్లో అసభ్యమైన మాటలు ఉంటాయి.
“బాగా హిట్ అయిన పాటలన్నిట్లో కేవలం సెక్స్ గురించే ఉన్నట్లు అనిపిస్తోంది. వాళ్లు దాన్ని దాచడానికి ఇప్పుడు కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు.”—హన్నా.
బైబిలు ఇలా అంటోంది: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.” (ఎఫెసీయులు 5:3) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను వినే పాటలు, ఆ హెచ్చరికను పాటించనివ్వట్లేదా?’
కొన్ని పాటలు మిమ్మల్ని విచారంలో ముంచేస్తాయి.
“ఒక్కోసారి నేను పడుకుని మ్యూజిక్ వింటూ నిద్రపోకుండా ఉండిపోతాను, ఎందుకంటే ఆ మ్యూజిక్ నిరుత్సాహాన్ని, బాధను కలిగించే విషయాల గురించి ఆలోచించేలా చేస్తుంది. విషాద గీతాల వల్ల బాధాకరమైన ఆలోచనలు వస్తాయి.”—ట్యామీ.
బైబిలు ఇలా అంటోంది: “అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” (సామెతలు 4:23) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను వినే పాటలు, నెగెటివ్‌గా ఆలోచించేలా చేస్తున్నాయా?’
కొన్ని పాటలు మీలో కోపాన్ని రెచ్చగొడతాయి.
“కోపం, అసహ్యం, ద్వేషం నిండిన పాటలు నాకు పొంచివున్న ప్రమాదాల్లాంటివి. అలాంటి పాటలు విన్న తర్వాత, నా మూడ్ మారిపోవడం నేను గమనించాను. మా ఇంట్లోవాళ్లు కూడా అదే గమనించారు.”—జాన్.
బైబిలు ఇలా అంటోంది: “మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.” (కొలొస్సయులు 3:8) మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను వినే పాటలు, నన్ను కోపిష్టిగా, ఎదుటివాళ్ల ఫీలింగ్స్‌ని పట్టించుకోని వ్యక్తిగా తయారుచేస్తున్నాయా?’
ఒక్కమాటలో చెప్పాలంటే, ఏదిపడితే అది వినేయకండి, ఎంచుకుని వినండి. జూలీ అనే టీనేజ్ అమ్మాయి ఆ పని చేయడానికే ప్రయత్నిస్తోంది. “నేను నా దగ్గరున్న పాటల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను, ఏదైనా సరైనది కాదని నేను గుర్తిస్తే, వెంటనే దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. అది అంత ఈజీ కాదు, కానీ అదే సరైన పనని నాకు తెలుసు” అని తను అంటోంది.
టారా అనే యువతి కూడా అలాంటి పనే చేయడం నేర్చుకుంది. ఆమె ఇలా చెప్తోంది: “ఒక్కోసారి రేడియోలో అదిరిపోయే పాట వస్తుంది, కానీ నేను అందులోని లిరిక్స్ విన్నప్పుడు, ఆ పాట వినకూడనిదని స్టేషన్ మార్చేయాలని అర్థమవుతుంది. ఒక మంచి స్వీట్‌ని చిన్నముక్క కొరికి, ఇంక తినకుండా ఉండడం ఎంత కష్టమో, ఆ స్టేషన్ మార్చడం కూడా అంతే కష్టం. కానీ సెక్స్ గురించిన ఒక పాటను రిజెక్ట్ చేసే బలం నాకుంటేనే, పెళ్లికి ముందు సెక్స్ వంటి పనుల్ని రిజెక్ట్ చేసే బలం నాకు ఉంటుంది. మ్యూజిక్ నామీద చూపించే ప్రభావాన్ని నేను తక్కువ అంచనా వేయాలనుకోవట్లేదు.”