కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను బాగా దృష్టి పెట్టాలంటే ఏం చేయవచ్చు?

నేను బాగా దృష్టి పెట్టాలంటే ఏం చేయవచ్చు?

 నేను ఎందుకు ధ్యాస పెట్టలేకపోతున్నాను?

 “నేను ఇంతకు ముందులా ఎక్కువ పుస్తకాలు చదవలేకపోతున్నాను. చివరికి, పెద్దపెద్ద పేరాలు చదువుతున్నా చిరాకొస్తుంది.”—ఇలేన్‌.

 “నేను ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అది స్లోగా ఉందని నాకు అనిపిస్తే, వెంటనే దాని స్పీడ్‌ పెంచేసి చూస్తాను.”—మిరాండా.

 “నేను ఏదైనా ముఖ్యమైన పని మీద ఉన్నప్పుడు నా ఫోన్‌ మోగితే, నాకు ఎవరు మెసేజ్‌ చేసుంటారా అని వెంటనే ఆలోచిస్తాను.”—జేన్‌.

 టెక్నాలజీ మన ధ్యాస పక్కకు మళ్లేలా చేస్తుందా? దానికి కొంతమంది అవును అని అంటున్నారు. రచయిత అలాగే మేనేజ్‌మెంట్‌ కన్స్‌ల్టెంట్‌ అయిన నికోలస్‌ కార్‌ ఇలా రాశాడు: “మనం ఇంటర్నెట్‌ను ఎంతెక్కువగా వాడితే, అంతెక్కువగా మన మనసు పక్కకు మళ్లే అవకాశాన్ని ఇస్తాం. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని పొందుతాం గానీ, దానిమీద దృష్టి పెట్టలేం.” a

 టెక్నాలజీ వల్ల మీ ధ్యాస పక్కకు మళ్లే అవకాశం ఉంది. అలాంటి మూడు సందర్భాల గురించి ఇప్పుడు చూద్దాం.

 •   మాట్లాడుతున్నప్పుడు. మారియ అనే 22 ఏళ్ల అమ్మాయి ఇలా అంటోంది: “ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునేటప్పుడు కూడా చాలామంది వాళ్ల ఫోనుల్లో గేమ్స్‌ ఆడడం, మెసేజ్‌లు చేయడం లేదా సోషల్‌ మీడియా చూడడం వంటివి చేస్తున్నారు. దానివల్ల, అవతలివాళ్లు ఏం చెప్తున్నారో శ్రద్ధగా వినలేకపోతున్నారు.”

 •   క్లాస్‌లో ఉన్నప్పుడు. డిజిటల్‌ కిడ్స్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది: “క్లాస్‌లో ఉన్నప్పుడు చాలామంది పిల్లలు తమ దగ్గర ఉన్న ఫోన్‌లను, ట్యాబ్‌లను చదువుకోవడానికి ఉపయోగించే బదులు మెసేజ్‌లు చేయడానికి, ఇంటర్నెట్‌ వాడడానికి, వీడియోలు చూడడానికి ఉపయోగిస్తున్నామని ఒప్పుకుంటున్నారు.”

 •   చదువుతున్నప్పుడు. “నా ఫోన్‌ మోగినప్పుడల్లా దాన్ని చూడకుండా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంటుంది” అని 22 ఏళ్ల క్రిస్‌ చెప్తున్నాడు. మీరు కూడా చదువుకునే పిల్లలా? ఒకవేళ మీరు హోమ్‌వర్క్‌ చేస్తున్నప్పుడు ఫోన్‌ల వల్ల మీ ధ్యాస పక్కకు మళ్లితే, గంటలో అవ్వాల్సిన పని మూడు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు.

 ఒక్కమాటలో: టెక్నాలజీ మిమ్మల్ని అదుపు చేస్తూ, మీ ధ్యాస పక్కకు మళ్లేలా చేస్తుంటే ఏదైనా ఒక పని మీద దృష్టి పెట్టడం మీకు కష్టంగా ఉంటుంది.

ఒక విషయం మీద దృష్టి పెట్టలేని మనసు అదుపులేని అడవి గుర్రం లాంటిది, అది మిమ్మల్ని ఎటుపడితే అటు తీసుకువెళ్తుంది

 నా ధ్యాస పక్కకు మళ్లకుండా ఉండాలంటే ఏం చేయవచ్చు?

 •   మాట్లాడుతున్నప్పుడు. బైబిలు ఇలా చెప్తుంది: “మీ గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల మీద కూడా శ్రద్ధ చూపిస్తూ ఉండండి.” (ఫిలిప్పీయులు 2:4) ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వినడం ద్వారా వాళ్లంటే మీకు పట్టింపు ఉందని చూపించండి. వాళ్ల కళ్లల్లోకి చూడండి, మీ ఫోన్‌ వల్ల ధ్యాస పక్కకు మళ్లకుండా చూసుకోండి.

   “మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ చూడాలని అనిపించినా దాన్ని చూడకండి. ఎదుటివ్యక్తి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం ద్వారా వాళ్ల మీద గౌరవం ఉందని చూపించండి.”—థామస్‌.

   సలహా: ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఫోన్‌ మీ కంటికి కనిపించకుండా దూరంగా పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఫోన్‌ మీకు దగ్గర్లో ఉండి మెసేజ్‌ గానీ కాల్‌ గానీ వస్తే, మీ ధ్యాస మాట్లాడుతున్న విషయంమీద కాకుండా పక్కకు మళ్లొచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు.

 •   క్లాస్‌లో ఉన్నప్పుడు. బైబిలు ఇలా చెప్తుంది: “మీరు ఎలా వింటున్నారనే దానిమీద మనసుపెట్టండి.” (లూకా 8:18) బైబిలు చెప్తున్న ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని, ఒకవేళ మీ స్కూల్లో ఇంటర్నెట్‌ వాడే అవకాశం ఉంటే క్లాస్‌లో మెసేజ్‌లు చూడడం, గేమ్స్‌ ఆడడం, చాటింగ్‌ చేయడం లాంటివి చేయకండి. బదులుగా, అక్కడ నేర్పించే వాటి మీద మనసుపెట్టండి.

   “క్లాస్‌ జరుగుతున్నప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టి వినడానికి ప్రయత్నించండి. నోట్స్‌ రాసుకోండి. కుదిరితే క్లాస్‌లో వెనుక కాకుండా ముందు కూర్చోవడానికి చూడండి, దానివల్ల మీ ధ్యాస పక్కకు మళ్లకుండా ఉంటుంది.”—కరెన్‌.

   సలహా: కంప్యూటర్‌లో లేదా ఫోన్‌లో నోట్స్‌ రాసుకునే బదులు బుక్‌లో రాసుకోండి. అలా చేస్తే మీ ధ్యాస త్వరగా పక్కకు మళ్లకుండా ఉంటుందని, నేర్చుకున్న విషయాల్ని బాగా గుర్తుపెట్టుకోగలరని పరిశోధనలో తేలింది.

 •   చదువుతున్నప్పుడు. బైబిలు ఇలా చెప్తుంది: “తెలివిని, అవగాహనను సంపాదించు.” (సామెతలు 4:5) కేవలం టెస్ట్‌ పాస్‌ అవ్వాలని పైపైన చదివేసే బదులు, విషయాన్ని బాగా అర్థం చేసుకుంటూ చదవండి.

   “నేను చదువుతున్నప్పుడు, దానిమీద మనసుపెట్టడానికి నా ట్యాబ్‌ని ఫ్లైట్‌ మోడ్‌లో పెడతాను. మెసేజ్‌లు వచ్చినా చూడను. ఫోన్‌తో ఏదైనా పని ఉంటే దాన్ని రాసిపెట్టుకొని తర్వాత చేస్తాను.”—క్రిస్‌.

   సలహా: మీరు చదువుకునే దగ్గర అంతా చిందరవందరగా లేకుండా క్లీన్‌గా ఉండేలా చూసుకోండి. అలా ఉంటే ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవగలుగుతారు.

a థ షాలోస్‌—వాట్‌ థ ఇంటర్నెట్‌ ఈజ్‌ డూయింగ్‌ టు అవర్‌ బ్రెయిన్స్‌ పుస్తకం.