కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?

నేను సమయాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవచ్చు?

 సమయాన్ని ఎందుకు జాగ్రత్తగా వాడుకోవాలి?

 •    సమయం డబ్బులాంటిది. దాన్ని వృథా చేస్తే, అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉండదు. అదే మీరు పొదుపుగా వాడితే, మీకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి కొంత సమయం మిగులుతుంది!

   బైబిలు సూత్రం: “సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.”—సామెతలు 13:4.

   ఒక్క మాటలో: సమయాన్ని జాగ్రత్తగా వాడితే ఎక్కువ తీరిక దొరుకుతుంది

 •    సమయాన్ని జాగ్రత్తగా వాడడం ఒక కళ. పెద్దయ్యాక అది మీకు బాగా ఉపయోగపడుతుంది. సమయాన్ని జాగ్రత్తగా వాడడం ఎంత ముఖ్యమంటే, దాన్నిబట్టి మీ ఉద్యోగం ఉండవచ్చు, పోవచ్చు. అంతెందుకు మీరే ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ లేటుగా వచ్చే వ్యక్తిని పనిలో పెట్టుకుంటారా?

   బైబిలు సూత్రం: “చాలా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్న వ్యక్తి, పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు.”—లూకా 16:10.

   ఒక్క మాటలో: మీరు సమయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుతున్నారనే దాన్నిబట్టి మీరెలాంటి వ్యక్తో తెలుస్తుంది.

 నిజమే, సమయాన్ని జాగ్రత్తగా వాడడం అంత తేలిక కాదు. కొన్ని ఆటంకాలు పరిశీలించండి.

 ఆటంకం #1: ఫ్రెండ్స్‌

 “బయటికి రమ్మని ఫ్రెండ్స్‌ అడిగితే, నాకు నిజంగా టైం లేకపోయినా వాళ్లతోపాటు వెళ్లిపోయేదాన్ని. ‘ఏముందిలే, ఇంటికి వచ్చాక త్వరత్వరగా నా పని చేసుకోవచ్చు’ అనుకునేదాన్ని. కానీ అన్నిసార్లూ అలా కుదర్లేదు, చెప్పాలంటే నా పనిలో చాలా తప్పులు దొర్లేవి.”—సింథియా.

 ఆటంకం #2: టైం తినేసేవి

 “టీవీ ఒక వాక్యూమ్‌ క్లీనర్‌ లాంటిది. కార్యక్రమాలతో, సినిమాలతో అది మిమ్మల్ని లోపలికి లాగేసుకుంటుంది, దాన్ని వదిలించుకోవడం కష్టం.”—ఐవీ.

 “నా ట్యాబ్‌తో గంటలుగంటలు టైం వేస్ట్‌ చేస్తాను. బ్యాటరీ మొత్తం అయిపోయే వరకు దాన్ని వాడి, తర్వాత బాధపడతాను.”—మరీ.

 ఆటంకం #3: వాయిదా వేయడం

 “నేను హోమ్‌వర్క్‌ని, ఇతర పనుల్ని వాయిదా వేస్తుంటాను. పూర్తి చేయాల్సిన పనిని పక్కనపెట్టి, అనవసరమైన వాటికోసం సమయం వృథా చేస్తాను. అది అస్సలు మంచి పద్ధతి కాదు.”—బెత్‌.

సమయాన్ని జాగ్రత్తగా వాడితే ఎక్కువ తీరిక దొరుకుతుంది

 మీరు ఏం చేయవచ్చు?

 1.   మీరు చేయాల్సిన పనుల్ని లిస్టు రాసుకోండి. అంటే ఇంటి పనులు, మీ హోమ్‌వర్క్‌ లాంటివి. ఒక వారంలో, వాటికి ఎంతెంత సమయం అవసరమౌతుందో రాసుకోండి.

   బైబిలు సూత్రం: ‘ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోండి.’—ఫిలిప్పీయులు 1:10.

 2.   ఖాళీ సమయంలో చేయాలనుకుంటున్న పనుల్ని లిస్టు రాసుకోండి. అంటే ఇంటర్నెట్‌ వాడడం, టీవీ చూడడం లాంటివి. ఒక వారంలో, వాటికి మీరు ఎన్నెన్ని గంటలు వెచ్చిస్తారో రాసుకోండి.

   బైబిలు సూత్రం: “మీ సమయాన్ని శ్రేష్ఠమైన విధంగా ఉపయోగించుకుంటూ, ... తెలివిగా మసలుకోండి.”—కొలొస్సయులు 4:5.

 3.   ఒక ప్లాన్‌ తయారుచేసుకోండి. మీరు రాసుకున్న రెండు లిస్టుల్ని ఒకసారి చూసుకోండి. ముఖ్యమైన పనులకు తగినంత సమయం కేటాయించారా? సరదా పనుల కోసం కేటాయించిన సమయాన్ని తగ్గించాలా?

   టిప్‌: ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పనుల్ని రాసుకుని, అయిపోగానే టిక్‌ పెట్టుకోండి.

   బైబిలు సూత్రం: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.”—సామెతలు 21:5.

 4.   ఆచరణలో పెట్టండి. నిజమే, మీరు ఏదైనా ఆహ్వానాన్ని కాదని, ముఖ్యమైన పనులు చేసుకోవాల్సి రావచ్చు. కానీ దానివల్ల మీకు ఎక్కువ తీరిక దొరుకుతుంది, సరదాగా ఎంజాయ్‌ చేయగలుగుతారు. ఆ విషయం మీరే తెలుసుకుంటారు.

   బైబిలు సూత్రం: “కష్టపడి పనిచేసేవాళ్లుగా ఉండండి, కాలయాపన చేస్తూ పనిచేయకండి.”—రోమీయులు 12:11, అధస్సూచి.

 5.   ముందు కష్టపడండి, తర్వాత ఎంజాయ్‌ చేయండి. తార అనే యువతి ఇలా చెప్తుంది: “కొన్నిసార్లు నేను రాసుకున్న లిస్టులో ఏవైనా రెండు పనులు పూర్తిచేశాక, ‘ఓకే, ఇప్పుడు 15 నిమిషాలు టీవీ చూస్తాను, ఆ తర్వాత మళ్లీ పనులు మొదలుపెడతాను’ అనుకుంటాను. తీరా ఆ 15 నిమిషాలు 30 నిమిషాలు అవుతాయి, 30 నిమిషాలు కాస్తా గంట అవుతుంది, అలా నాకు తెలియకుండానే టీవీ చూస్తూ రెండు గంటలు అయిపోతాయి!”

   మరి పరిష్కారం ఏంటి? పనులు పూర్తిచేశాక వినోదానికి సమయం ఇవ్వండి, అంతేకానీ వినోదానికి రోజులో ఎంతోకొంత సమయం ఇచ్చి తీరాల్సిందే అని అనుకోకండి.

   బైబిలు సూత్రం: “తన కష్టార్జితముచేత సుఖపడుటకంటె నరునికి మేలుకరమైనదేదియు లేదు.”—ప్రసంగి 2:24.