యువత అడిగే ప్రశ్నలు
ఈమె నాకు తగిన వ్యక్తేనా?
ఎవర్నైనా చూసినప్పుడు ఇతన్ని లేదా ఈమెని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మీకు అనిపించిందా? అయితే వాళ్లు మీకు తగినవాళ్లో కాదో ఎలా తెలుస్తుంది?
వాళ్లవైపు మిమ్మల్ని ఆకర్షిస్తున్న విషయాలను మించి చూడడం చాలా ప్రాముఖ్యం. బహుశా అందంగా కనిపించే అమ్మాయి నమ్మకమైన వ్యక్తి కాకపోవచ్చు, అలాగే చాలామంది ఇష్టపడే అబ్బాయికి మంచి విలువలు లేకపోవచ్చు. మీరు ఎవరితోనైతే హాయిగా ఉండగలరో అంటే మీ వ్యక్తిత్వానికి, మీరు పెట్టుకున్న లక్ష్యాలకు తగిన వ్యక్తినే మీరు ఎంచుకోవాలి.—ఆదికాండము 2:18; మత్తయి 19:4-6.
పైకి కనిపించే వాటినే చూడకండి
మీరు ఇష్టపడే వ్యక్తిలో పైకి కనిపించే లక్షణాలనే కాదు, వాళ్లు వాస్తవంగా ఎలాంటి వాళ్లో తెలుసుకోండి. అవతలి వాళ్లలో కేవలం మీరు చూడాలనుకునే మంచి లక్షణాలను మాత్రమే చూడకుండా జాగ్రత్తపడండి. అందుకు సమయం తీసుకోండి. ఆ వ్యక్తి అసలు స్వభావం ఏమిటో తెలుసుకోండి.
డేటింగ్ చేసే చాలామంది పైకి కనిపించే వాటిని మాత్రమే చూస్తారు. ముందుగా ఇద్దరి మధ్యా ఒకేలా ఉన్న విషయాలపై వాళ్లు దృష్టి పెడతారు. ఉదాహరణకు “మనం ఒకేలాంటి సంగీతాన్ని ఇష్టపడతాం.” “మన ఇద్దరం చేయడానికి ఇష్టపడే పనులు కూడా ఒక్కటే.” ఇక వెంటనే “మన ఇద్దరం అన్నిటిలోనూ ఒక్కటే” అని నిర్ణయించేసుకుంటారు. కానీ మీరు పైకి కనిపించే ఆకర్షణీయమైన వాటిని మాత్రమే చూడకూడదు. ‘హృదయపు అంతరంగ స్వభావమును’ వివేచనతో చూడాలి. (1 పేతురు 3:4; ఎఫెసీయులు 3:15-18) మీ అభిప్రాయాలు ఎంత ఎక్కువగా కలుస్తున్నాయనే కాదు కలవని విషయాలు ఉంటే ఏమి చేస్తారు అనే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే గమనించాల్సిన సంగతులు బయటపడతాయి.
ఉదాహరణకు ఈ కింది వాటిని చూడండి:
అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు అతడు/ఆమె ఏం చేస్తారు? తమ ఆలోచనే సరైనదని ఒప్పించడానికి ప్రయత్నిస్తారా? “కోపంతో అరవడం” లేక “బూతులు తిట్టడం” లాంటివి చేస్తారా? (గలతీయులు 5:19, 20; కొలొస్సయులు 3:8) లేకపోతే తప్పొప్పుల సమస్య లేనప్పుడు అవతలి వాళ్ల అభిప్రాయాలకు, వాళ్ల సంతోషానికి విలువ ఇచ్చి శాంతిని కాపాడతారా?—యాకోబు 3:17.
ఆ వ్యక్తి ఇతరులను మాటలతో ఒప్పిస్తూ, తనతో తప్ప మరెవరితోనూ మాట్లాడకూడదు అనుకుంటూ, లేదా అసూయ పడుతూ ఉంటారా? మీ జీవితంలో ప్రతీ క్షణాన్ని వాళ్లకు లెక్క అప్పజెప్పాలని మీమీద పెత్తనం చేస్తారా? దీని గురించి నికోల్ ఇలా అంటున్నాడు, “డేటింగ్ చేస్తున్న జంటల్లో కొంతమంది, తమ జత ప్రతీక్షణం తాను ఎక్కడ ఉన్నది, ఏం చేస్తున్నది పదేపదే తమకు ‘చెప్పకపోవడాన్ని’ సహించలేరు. దాని గురించి గొడవ పడుతుంటారని నేను విన్నాను. అది మంచిది కాదు.” —1 కొరింథీయులు 13:4.
మీరు ఇష్టపడే వ్యక్తి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు? కొంతకాలంగా తన గురించి తెలిసిన సంఘంలోని మంచి ఆధ్యాత్మిక సహోదరసహోదరీలను అడిగి తెలుసుకోవడం మంచిది. అలా ఆమె/అతను “నిజంగా ఎలాంటి వాళ్లో” మీకు తెలుస్తుంది.—అపొస్తలుల కార్యములు 16:1, 2.