కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

సరైన ఆహారం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలి?

సరైన ఆహారం తీసుకోవడం ఎలా అలవాటు చేసుకోవాలి?

 సరైన ఆహారం తీసుకోకపోతే మీ ఆరోగ్యం పాడవ్వవచ్చు. చిన్న వయసులో సరైన ఆహారం తీసుకోనివాళ్లు, పెద్దయ్యాక కూడా అదే అలవాటు కొనసాగిస్తారు. కాబట్టి మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఇప్పుడే అలవాటు చేసుకోవాలి.

 సరైన ఆహారం అంటే ఏమిటి?

 “అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి” అని బైబిలు చెప్తుంది. ఈ సూత్రం ఆహార అలవాట్లకు కూడా వర్తిస్తుంది. (1 తిమోతి 3:11) కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

 •   సరైన ఆహారంలో అన్నిరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. సాధారణంగా ఆహార పదార్థాలను ఐదు రకాలుగా విభజిస్తారు. అవేంటంటే పాల పదార్థాలు, ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు. కొంతమంది వీటిలో ఏదో ఒకరకం ఆహారపదార్థాల్ని లేదా అంతకన్నా ఎక్కువ రకాల ఆహారపదార్థాల్ని పూర్తిగా దూరం పెడతారు. అలా చేస్తే సన్నబడతామని వాళ్లు అనుకుంటారు. కానీ దానివల్ల, శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు అందవు.

   ఇలా చేసి చూడండి: ఆహారంలో ఉండే వివిధ పోషకాల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో పరిశోధన చేయండి లేదా డాక్టర్‌ని అడిగి తెలుసుకోండి. ఉదాహరణకు:

   కార్బోహైడ్రేట్‌లు లేదా పిండిపదార్థాలు శరీరానికి శక్తిని ఇస్తాయి. ప్రోటీన్లు, మీ శరీరం అంటువ్యాధులతో పోరాడడానికి, మీ కణాల నిర్మాణానికి, వాటిని బాగు చేయడానికి సహాయపడతాయి. కొన్ని రకాల కొవ్వు పదార్థాలను సరైన మోతాదులో తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి; అవి శరీరానికి శక్తిని కూడా ఇస్తాయి.

   “నేను తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకుంటాను. అప్పుడప్పుడు చాక్లెట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ తినడం తప్పేమీ కాదు. కాకపోతే, ఎప్పుడూ అవే తింటూ ఉండకూడదు. మితంగా ఉండడం ఎప్పుడూ మంచిదే.”—బ్రెండా.

  అవసరమైన పోషకాలు లేని ఆహారం ఒక కాలు లేని కుర్చీ లాంటిది

 •   సరైన ఆహారం తీసుకోవడమంటే దేన్నీ అతిగా చేయకుండా ఉండడం. అంటే అస్సలు ఏమీ తినకుండా ఉండడం, ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తినేయడం, ఇష్టమైనవాటిని పూర్తిగా మానేయడం లాంటివి చేయకూడదు.

   ఇలా చేసి చూడండి: మీరేమి తింటున్నారో ఒక నెలపాటు జాగ్రత్తగా గమనించండి. ఏమీ తినకుండా ఉండడం గానీ, ఒకేసారి ఎక్కువ తినడం గానీ చేస్తున్నారా? సరైన ఆహారం తినే అలవాటు చేసుకోవాలంటే మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

   “కొన్నిరోజులు ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినేదాన్ని, ఇంకొన్ని రోజులు చాలా తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తినేదాన్ని. చివరికి కేలరీలు లెక్కపెట్టడం ఆపేయాలని, అతిగా తినకూడదని, కడుపు నిండిన వెంటనే తినడం ఆపేయాలని నిర్ణయించుకున్నాను. వీటిని పాటించడానికి సమయం పట్టింది, కానీ ఇప్పుడు సరైన ఆహారం తింటున్నాను.”—హేలీ.

 ఎప్పుడూ సరైన ఆహారమే తినాలంటే ఏం చేయాలి?

 •   ఏం తినాలో ముందే ఆలోచించుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.” (సామెతలు 21:5) మంచి ఆహార అలవాట్లు కలిగి ఉండాలంటే, మీ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తినాలని నిర్ణయించుకోవాలి.

   “ఆరోగ్యకరమైన ఆహారం తినాలంటే దానికి ప్లానింగ్‌ ఉండాలి, ఎక్కువశాతం ఇంట్లో వండిన భోజనమే తినాలి. అది కాస్త కష్టమే అయినా, అందుకు తగిన ప్రతిఫలం మాత్రం తప్పకుండా ఉంటుంది. మీ డబ్బు కూడా మిగులుతుంది.”—థామస్‌.

 •   ఆరోగ్యం పాడుచేసే ఆహారానికి బదులు ఆరోగ్యకరమైన మంచి ఆహారం తినండి. బైబిలు ఇలా చెప్తుంది: ‘తెలివిని భద్రంగా కాపాడుకో.’ (సామెతలు 3:21) ఆరోగ్యకరమైన ఆహారాన్ని మీకు నచ్చే విధంగా తినడానికి, మంచి ఆహార అలవాట్లు పెంచుకోవడానికి తెలివి సహాయం చేస్తుంది.

   “ఆరోగ్యకరమైన ఆహారం తినే విషయంలో రోజుకో మార్పు చేసుకోవడం మొదలుపెట్టాను. ఉదాహరణకు, చాక్లెట్‌ తినే బదులు ఆపిల్‌ తిన్నాను. అలా కొద్ది రోజుల్లోనే చాలా ఆహార అలవాట్లు మార్చుకున్నాను.”—కియా.

 •   మీరు సాధించగల లక్ష్యాలే పెట్టుకోండి. బైబిలు ఇలా చెప్తుంది: “సంతోషంగా భోజనం చేయి.” (ప్రసంగి 9:7) కాబట్టి సరైన ఆహారం తీసుకోవడమంటే, మీకు ఇష్టమైన వాటిని తినకూడదనీ కాదు, ఏం తినాలన్నా ఆలోచించాలనీ కాదు. మీరు బరువు తగ్గడం కన్నా ఆరోగ్యంగా ఉండడం ప్రాముఖ్యం. ఏదైనా లక్ష్యం పెట్టుకునే ముందు మీరు ఎంతవరకు చేయగలరో ఆలోచించుకోండి.

   “ఈమధ్యే నేను దాదాపు 13 కిలోలు తగ్గాను. అందుకోసం నేనెప్పుడూ కడుపు మాడ్చుకోలేదు, ఏదైనా ఒకరకమైన ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టలేదు, స్వీట్లు లాంటి వాటిని తినడం పూర్తిగా ఆపేయలేదు. బరువు తగ్గడం వెంటనే జరిగే పని కాదని, అందుకోసం నా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని గ్రహించాను.”మిలానీ