కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—2వ భాగం: బైబిలు చదవడాన్ని ఎలా ఆనందించవచ్చు?

బైబిలు నాకెలా సహాయం చేయగలదు?—2వ భాగం: బైబిలు చదవడాన్ని ఎలా ఆనందించవచ్చు?

 “బైబిల్ని సరిగ్గా చదవడం ఎలాగో తెలియకపోతే చాలా బోర్‌ కొట్టే అవకాశం ఉంది.” అని 18 ఏళ్ల విల్‌ అంటున్నాడు.

 బైబిలు చదవడాన్ని ఎలా ఆనందించాలో మీకు తెలుసుకోవాలనుందా? ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేస్తుంది.

 లేఖనాలకు జీవం పోయండి

 చదివేదానిలో లీనమవ్వండి. ఇలా చేయవచ్చు:

 1.   ఎంచుకోండి. ముందుగా మీరు బైబిల్లో ఏ భాగం చదవాలనుకుంటున్నారో ఎంచుకోండి. అది బైబిల్లోని ఒక సంఘటన కావచ్చు, సువార్త పుస్తకంలోని ఒక భాగం కావచ్చు, లేదా jw.orgలోని “నాటకరూపంలో సాగే బైబిలు పఠనం” నుండి తీసుకున్న ఒక కథ కావచ్చు.

 2.   చదవండి. మీరు ఒక్కరే దాన్ని చదవొచ్చు లేదా ఫ్రెండ్స్‌తో, కుటుంబ సభ్యులతో కలిసి పైకి చదవొచ్చు. ఒకరు వ్యాఖ్యాత (narrator) మాటల్ని, మిగతావాళ్లు వేర్వేరు వ్యక్తుల మాటల్ని చదవొచ్చు.

 3.   కింది సూచనల్లో ఒకదాన్ని లేదా కొన్నిటిని పాటించండి:

  •    కథను వివరించే బొమ్మలు గీయండి. లేదా జరిగిన సంఘటనల్ని చూపించడానికి, వరుసగా కొన్ని సింపుల్‌ బొమ్మలు గీయండి. ఒక్కో సందర్భంలో ఏం జరుగుతుందో కొన్ని మాటలు (captions) రాయండి.

  •    డయగ్రామ్స్‌ గీయండి. ఉదాహరణకు, మీరు ఒక నమ్మకమైన వ్యక్తి గురించి చదువుతుంటే ఆ వ్యక్తి చూపించిన లక్షణాల్ని, చేసిన పనుల్ని వాళ్లు పొందిన ఆశీర్వాదాలతో లింక్‌ చేయండి.

  •    ఒక న్యూస్‌ స్టోరీ తయారుచేయండి. వేర్వేరు కోణాల్లో సంఘటన గురించి రిపోర్ట్‌ చేయండి, ముఖ్యమైన వ్యక్తులతో, ప్రత్యక్ష సాక్షులతో ఇంటర్వ్యూలు చేర్చండి.

  •    కథలోని ఒక వ్యక్తి తెలివితక్కువ నిర్ణయం తీసుకునివుంటే, అలా చేయకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. ఉదాహరణకు, పేతురు యేసును తిరస్కరించడం గురించి ఆలోచించండి. (మార్కు 14:66-72) ఒత్తిడి ఎదురైనప్పుడు అతను ఏం చేసుంటే బావుండేది?

  •    మీకు ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తే, ఒక బైబిలు కథను తీసుకుని సొంతగా ఒక డ్రామా తయారుచేయండి. దాన్నుండి ఏ పాఠాలు నేర్చుకోవచ్చో కూడా చెప్పండి.—రోమీయులు 15:4.

   మీరు బైబిలుకు జీవం పోయవచ్చు!

 పరిశోధన చేయండి!

 మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఒక కథలో ఎన్నో కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటారు. కొన్నిసార్లు ఒక కథలోని ఒకటి లేదా రెండు పదాలు ఎన్నో విషయాలు చెప్తాయి.

 ఉదాహరణకు మత్తయి 28:7, మార్కు 16:7 పోల్చి చూడండి.

 •    యేసు త్వరలో శిష్యులకు, అలాగే “పేతురుకు” కనిపిస్తాడని మార్కు ఎందుకు రాశాడు?

 •  క్లూ: మార్కు ఈ సంఘటనల్ని స్వయంగా చూడలేదు; అతను విషయాల్ని పేతురు నుండి తెలుసుకుని ఉంటాడు.

 •  కొత్త విషయం: యేసు మళ్లీ తనను చూడాలనుకుంటున్నాడని తెలుసుకోవడం పేతురుకు ఎందుకు ఊరటనిచ్చి ఉంటుంది? (మార్కు 14:66-72) యేసు పేతురుకు నిజమైన ఫ్రెండ్‌ అని ఎలా చూపించాడు? యేసులా మీరు కూడా వేరేవాళ్లకు నిజమైన ఫ్రెండ్‌గా ఎలా ఉండవచ్చు?

 మీరు లేఖనాలకు జీవం పోసి, పరిశోధన చేస్తే బైబిలు చదివేటప్పుడు ఎంతో ఆనందాన్ని పొందవచ్చు!