కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

నన్ను ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?

 ఏడిపించడం చిన్న విషయం అనుకోవడానికి లేదు. ఒక బ్రిటీష్‌ స్టడీ ప్రకారం ఆత్మహత్య చేసుకొని చనిపోయిన యౌవనుల్లో 40 శాతం మంది చావుకు ఏడిపించడం ఒక కారణమని నేషనల్‌ మీడియా చెప్తుంది.

 ఏడిపించడం అంటే ఏమిటి?​

 ఏడిపించడం అంటే శారీరకంగా హింసించడం మాత్రమే కాదు. ఈ కింది చెప్పినవన్నీ ఉండవచ్చు.

 •   మాటలతో హింసించడం. 20 ఏళ్ల సెలె ఇలా అంటుంది, “అమ్మాయిలు కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడతారు. వాళ్లు నాకు పెట్టిన పేర్లు, అన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్లు నాకు విలువే లేదని, నేను ఎవరికీ అక్కర్లేదని, ఎందుకూ పనికిరానని అనిపించేలా చేశారు. నా కన్ను కమిలిపోయేలా కూడా నన్ను కొట్టారు.”

 •   అందరిలో కలవనివ్వకపోవడం. “నా స్కూల్లో వాళ్లు నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు. భోజనం చేసే దగ్గర నేను కూర్చోవడానికి, ఆ టేబుల్లో అస్సలు ఖాళీ లేదన్నట్లు చూపించేవాళ్లు. సంవత్సరమంతా ఏడుస్తూ ఒక్కదాన్నే భోజనం చేశాను” అని 18 ఏళ్ల హ్యాలీ చెప్తుంది.

 •   సైబర్‌బుల్లీయింగ్‌. ఇంటర్నెట్‌ ద్వారా ఎవరినైనా ఏడిపించడాన్ని సైబర్‌బుల్లీయింగ్‌ అంటారు. 14 ఏళ్ల డానియల్‌ ఇలా అంటున్నాడు “కంప్యూటర్‌లో రాసే కొద్ది మాటలతో మీరు ఒకరి పేరుని లేదా వాళ్ల జీవితాన్నే పాడుచేయవచ్చు. వినడానికి అతిశయోక్తిగా అనిపించినా ఇది నిజం.” ఫోన్‌ ద్వారా అసభ్యకరమైన ఫోటోలు లేదా మెసేజ్‌లు పంపించడం కూడా సైబర్‌బుల్లీయింగ్‌ కిందకే వస్తుంది.

 ఎవరైనా వేరేవాళ్లను ఎందుకు ఏడిపిస్తుంటారు?​

 సహజంగా కనిపించే కొన్ని కారణాలు.

 •   వాళ్లు కూడా అలాంటి వాటినే అనుభవించడం వల్ల. “నా తోటివాళ్లు నన్ను ఎంతగా ఏడిపించారంటే నేను విసిగిపోయి వాళ్లలో ఒకడిగా ఉండడం కోసం నేను కూడా ఇతరులను ఏడిపించడం మొదులుపెట్టాను. కానీ తర్వాత వెనక్కు తిరిగి చూసుకుంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది” అని ఆంటోనియో అనే యౌవనుడు అంటున్నాడు.

 •   వాళ్లకు మంచి వాళ్ల ఆదర్శం లేకపోవడం వల్ల. “చాలాసార్లు ఇతరులను ఏడిపించే యౌవనులు, వాళ్ల అమ్మానాన్నలు, అన్నయ్య, అక్క, లేదా మిగిలిన కుటుంబ సభ్యులు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తారు. ఇంకా వాళ్లు కూడా ఇతరులతో అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు” అని లైఫ్‌ స్ట్రాటజీస్‌ ఫర్‌ డీలింగ్‌ విత్‌ బుల్లీస్‌ అనే తన పుస్తకంలో జె. మెక్‌ గ్రా రాశారు.

 •   పైకి చాలా గొప్పవాళ్లలా ప్రవర్తిస్తారు కానీ లోపల మాత్రం తక్కువవాళ్లమని భావిస్తారు. “ఇతరులను ఏడిపించే పిల్లలు పైకి గొప్పవాళ్లలా కనిపిస్తూ, అలా వాళ్ల లోపలున్న తీవ్ర బాధను, అసంతృప్తిని దాచుకుంటారు” అని ది బుల్లీ, ది బుల్లీడ్‌ అండ్‌ ది స్టాండర్‌ అనే పుస్తకంలో బార్బారా కొలొరొసో అనే అమ్మాయి రాసుకుంది.

 ఎక్కువగా ఎవరిని ఏడిపిస్తారు?

 •   ఒంటరిగా ఉండేవాళ్లను. ఇతరులతో చక్కగా మాట్లాడలేని వాళ్లు అందరిలో కలవలేరు. అలాంటి వాళ్లని ఇతరులు ఏడిపించే అవకాశం ఉంది.

 •   ఇతరులకు వేరుగా కనిపించే యౌవనులను. కొంతమంది యౌవనులు కనబడే తీరునుబట్టి, వాళ్ల జాతి లేదా మతాన్నిబట్టి లేదా వాళ్లలో ఉన్న ఏదైనా లోపాన్నిబట్టి ఏడిపిస్తుంటారు. ఏడిపించడానికి వీటిలో ఏదైనా కారణం కావొచ్చు.

 •   ఆత్మవిశ్వాసం లేని యౌవనులను. కొంతమంది యౌవనులు వాళ్ల గురించి వాళ్లు తక్కువగా భావిస్తారు. ఇతరులను ఏడిపించే అలవాటు ఉన్నవాళ్లు ఇలాంటి వాళ్లను తేలిగ్గా కనిపెట్టేస్తారు. వీళ్లు ఎవరేమన్నా ఏమి చేయలేరు కాబట్టి వీళ్లను ఏడిపించడం చాలా సులభం.

 మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే మీరేమి చేయవచ్చు?

 •   దానికి ప్రతిస్పందిచకండి. కేలీ అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “ఏడిపించేవాళ్లు మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశంతోనే అలా చేస్తారు. కానీ దానికి మీరు ప్రతిస్పందిచకపోతే మెల్లమెల్లగా వాళ్లకు మిమ్మల్ని ఏడిపించాలనే ఆసక్తి తగ్గిపోతుంది.” బైబిలు ఇలా చెప్తుంది, “జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.”—సామెతలు 29:11.

 •   ఎదురు తిరగకండి. ప్రతీకారం తీర్చుకోవడం సమస్యను పరిష్కరించకపోగా దాన్ని ఇంకా పెద్దది చేస్తుంది. బైబిలు ఇలా చెప్తుంది, “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు.”—రోమీయులు 12:17; సామెతలు 24:19.

 •   సమస్యకి వీలైనంత దూరంగా ఉండండి. ఏడిపించే ప్రజలకు, అలాంటి అవకాశమున్న పరిస్థితులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి.—సామెతలు 22:3.

 •   ఊహించని విధంగా ప్రతిస్పందించండి. బైబిలు ఇలా చెప్తుంది, “మృదువైన మాట క్రోధమును చల్లార్చును.”—సామెతలు 15:1.

 •   సమయస్ఫూర్తిని చూపించండి. ఉదాహరణకు ఎవరైనా మిమ్మల్ని “చాలా లావుగా ఉన్నావు” అని ఏడిపిస్తున్నారనుకోండి మీరు చాలా తేలిగ్గా తీసుకుంటూ, “అవును కాస్త తగ్గితే బాగుంటుందని నేనూ అనుకుంటున్నాను!” అనేయండి.

 •   అక్కడి నుండి వెళ్లిపోండి. 19 ఏళ్ల నోరా ఇలా అంటుంది, “మౌనంగా ఉండడం, మీరు మానసికంగా చక్కగా ఎదిగిన వ్యక్తని, మిమ్మల్ని ఏడిపించేవాళ్లకన్నా మీరే బలమైనవాళ్లని రుజువు చేస్తుంది. అంతేకాదు మిమ్మల్ని ఏడిపించేవాళ్లకు లేని నిగ్రహశక్తి మీకు ఉందని అది చూపిస్తుంది.”

 •   మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. రీటా అనే అమ్మాయి ఇలా అంటుంది, “మీరు భయపడుతున్నారు లేదా కంగారు పడుతున్నారు అని ఏడిపించేవాళ్లు గమనిస్తే, దాన్ని ఉపయోగించుకొని వాళ్లు మీకున్న ఆ కాస్త ధైర్యాన్ని కూడా పూర్తిగా పోగొట్టేస్తారు.”

 •   ఎవరికైనా చెప్పండి. ఒక సర్వే ప్రకారం ఇంటర్నెట్లో వేధింపులకు గురైన వాళ్లలో సగం కంటే ఎక్కువమంది సిగ్గువల్లనో (ప్రత్యేకించి అబ్బాయిలు) లేదా ఎదురుతిరిగితే ఏమైనా చేస్తారనే భయంతోనో జరిగే విషయాలను ఎవరికీ చెప్పరు. కానీ మీరు రహస్యంగా ఉంచేకొద్దీ వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. ఈ పీడ కల నుండి బయటపడాలంటే మీరు మొదటి అడుగుగా ఎవరికైనా చెప్పాలి.