కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నా భావోద్వేగాల్ని ఎలా అదుపు చేసుకోవాలి?

నా భావోద్వేగాల్ని ఎలా అదుపు చేసుకోవాలి?

“ఒకరోజు చాలా సంతోషంగా ఉంటాను, ఇంకో రోజు బాగా కృంగిపోతాను. నిన్న తేలిగ్గా అనిపించిన విషయాలు ఇవాళ చాలా కష్టంగా అనిపిస్తాయి.”—కరీస.

మీ భావోద్వేగాలు కూడా ఎత్తుపల్లాలు ఉన్న రోడ్డులా ఉన్నట్టు అనిపిస్తుందా? a అయితే, ఈ ఆర్టికల్‌ మీకు సహాయం చేయగలదు!

 అలా ఎందుకు జరుగుతుంది?

 యుక్త వయసులో వచ్చే మార్పుల వల్ల భావోద్వేగాలు వెంటవెంటనే మారడం సహజం. టీనేజీలోకి అడుగుపెట్టాక కూడా, మీ భావోద్వేగాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం అవ్వచ్చు.

 ఎదుగుతున్నప్పుడు హార్మోన్స్‌లో వచ్చే మార్పుల వల్ల, అభద్రతా భావాల వల్ల మీ భావోద్వేగాలు వెంట వెంటనే మారవచ్చు, మీకు అంతా అయోమయంగా ఉండవచ్చు, కానీ అది మామూలే అని గుర్తుంచుకోండి. సంతోషకరమైన విషయం ఏంటంటే, మీరు మీ భావోద్వేగాల్ని అర్థం చేసుకుని వాటిని అదుపులో ఉంచుకోగలరు.

 వాస్తవం: యౌవనంలో ఉన్నప్పుడే భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకుంటే, పెద్దయ్యాక వేర్వేరు పరిస్థితులతో వ్యవహరించడం తేలికౌతుంది.

నిరాశానిస్పృహలు రోడ్డు మీద ఉండే గుంటలు లాంటివి. నేర్పుతో వాటిని తప్పించుకుని, ప్రయాణాన్ని సాఫీగా సాగించవచ్చు

 మీరు చేయగల మూడు పనులు

 మాట్లాడండి. “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును” అని బైబిలు చెప్తుంది.—సామెతలు 17:17.

 “మా కుటుంబానికి సన్నిహిత స్నేహితురాలు ఒకావిడ ఉంది. ఆ ఆంటీ నేను చెప్పేవాటిని చాలా శ్రద్ధగా వింటుంది. అందుకే నేను అన్నీ ఆమెకు చెప్తాను. నా అభిప్రాయం సరైనదైతే ఆంటీ నన్ను మెచ్చుకుంటుంది, సరైనది కానప్పుడు నన్ను సరిదిద్దుతుంది.”—యోలండ.

 టిప్‌: మీ వయసువాళ్లతోనే చెప్పుకునే బదులు మీ అమ్మానాన్నలకో లేదా ఎవరైనా పెద్దవాళ్లకో చెప్పుకోండి. మీ వయసువాళ్లైతే, వాళ్లకూ అలాంటి సమస్యే ఉంటుంది కాబట్టి మీకు సహాయం చేయలేకపోవచ్చు.

 రాసుకోండి. నిరాశానిస్పృహల్లో కూరుకుపోయినప్పుడు, బైబిల్లో ఉన్న యోబు అనే వ్యక్తి ఇలా అన్నాడు: “నేను స్వేచ్ఛగా విలపిస్తాను. నా ప్రాణం చేదెక్కిపోయింది గనుక నేను మాట్లాడతాను.” (యోబు 10:1, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) వేరేవాళ్లతో మాట్లాడితేనే కాదు, రాసుకోవడం ద్వారా కూడా మీ భావాల్ని బయటికి చెప్పుకోవచ్చు.

 “నేను ఎక్కడికి వెళ్లినా నాతోపాటు ఒక చిన్న నోట్‌బుక్‌ తీసుకెళ్తాను. ఏదైనా విషయం నాకు బాధ కలిగించినప్పుడు వెంటనే దాంట్లో రాసుకుంటాను. అలా రాసుకోవడం నాకు ఒక మందులా పనిచేస్తుంది.”—ఇలియానా.

 టిప్‌: ఒక పుస్తకం మీ దగ్గర పెట్టుకుని, మీకు ఎలాంటి భావోద్వేగాలు కలుగుతున్నాయో, ఎందుకు కలుగుతున్నాయో, వాటిని ఎలా అదుపులో పెట్టుకోవచ్చో రాసుకోండి. ఈ ఆర్టికల్‌కి సంబంధించిన వర్క్‌షీట్‌, మీకు ఈ విషయంలో సహాయం చేయగలదు.

 ప్రార్థించండి. “నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అని బైబిలు చెప్తుంది.—కీర్తన 55:22.

 “నేను కృంగిపోయినప్పుడు యెహోవాకు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నా మనసులో ఉన్నదంతా ఆయనతో చెప్పాక చాలా ప్రశాంతంగా ఉంటుంది.”—జాస్మిన్‌.

 టిప్‌: మీరు ఆందోళనతో ఉన్నా, మీకు జరిగిన మూడు మంచి విషయాల గురించి ఆలోచించండి. యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు సహాయం కోసం అడగడంతోపాటు మీరు పొందిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు కూడా చెప్పండి.

a సాధారణంగా యువత ఎదుర్కొనే భావోద్వేగ సమస్యల గురించి ఈ ఆర్టికల్‌ మాట్లాడుతుంది. ఒకవేళ మీరు బైపోలార్‌ డిజార్డర్‌ అనే మానసిక సమస్యతో లేదా మరేదైనా డిప్రెషన్‌తో బాధపడుతుంటే, “డిప్రెషన్‌నుండి నేనెలా బయటపడాలి?” అనే ఆర్టికల్‌ చూడండి.