కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

అది స్నేహమా లేక ప్రేమా?—1వ భాగం: ముందే నిర్ధారించుకోండి

అది స్నేహమా లేక ప్రేమా?—1వ భాగం: ముందే నిర్ధారించుకోండి

 మీకు ఒక వ్యక్తి బాగా నచ్చాడు. అతనికి కూడా మీరంటే ఇష్టమని మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే, మీ ఇద్దరు ప్రతీరోజు మెసేజ్‌ చేసుకుంటారు, ఏదైనా పార్టీకి వెళ్లినా, ఫంక్షన్‌కి వెళ్లినా మీరిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు. అంతేకాదు, అతను పంపే కొన్ని మెసేజ్‌లు చాలా రొమాంటిక్‌గా ఉంటాయి.

 అయితే, మీ ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక ప్రేమా, అని తెలుసుకోవడానికి మీరు అతనితో మాట్లాడాలనుకుంటున్నారు. అతనికి మీరంటే ఇష్టమని మీ నమ్మకం. కానీ అతను, “నిన్ను జస్ట్‌ ఒక ఫ్రెండ్‌ అనుకున్నాను. అంతే” అని అన్నాడు.

 మీకు ఎలా అనిపిస్తుంది?

 “నామీద నాకే కోపం వచ్చింది! అతనిమీద ఇంకా కోపం వచ్చింది. అంతకుముందు రోజూ మెసేజ్‌ చేసుకునేవాళ్లం. అతను నామీద చాలా శ్రద్ధ చూపించేవాడు. కాబట్టి నేను కూడా అతణ్ణి ఇష్టపడడం మొదలుపెట్టాను.”—జాస్మిన్‌.

 “డేటింగ్‌ చేస్తున్న ఒక జంటకి, నేనూ ఒకమ్మాయి తోడుగా వెళ్లేవాళ్లం. ఆ జంటతోపాటు మేం కూడా డేటింగ్‌ చేస్తున్నట్లు అనిపించేది. మేమిద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకునేవాళ్లం. తర్వాత మెసేజ్‌లు పంపించుకోవడం మొదలుపెట్టాం. కానీ ఒకరోజు ఆ అమ్మాయి, నన్ను జస్ట్‌ ఒక ఫ్రెండ్‌లా మాత్రమే చూశానని చెప్పింది. అంతేకాదు, ఆమె వేరే ఎవర్నో ఇష్టపడుతోందని తెలిసి నా మనసు ముక్కలైపోయింది.”—రిచర్డ్‌.

 “ఒక అబ్బాయి నాకు రోజూ మెసేజ్‌ చేసేవాడు. కొన్నిసార్లు రొమాంటిక్‌గా మాట్లాడుకునేవాళ్లం కూడా. కానీ, నేను తనను ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు, అతను నవ్వి, ‘నాకు ఇప్పుడు ఎవ్వరితోనూ డేటింగ్‌ చేయాలని లేదు!’ అని అన్నాడు. నేను బోరున ఏడ్చేశాను.”—టమారా.

 ఒక్కమాటలో: మీరు ఒకవ్యక్తిని బాగా ఇష్టపడుతున్నారు. వాళ్లకు కూడా మీరంటే ఇష్టమని మీరు అనుకున్నారు. తీరా ఒకరోజు, వాళ్లకు మీమీద ఇష్టం లేదని తెలిసింది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, వాళ్లు మిమ్మల్ని మోసం చేశారనిపిస్తుంది. అది సహజమే. స్టీవెన్‌ అనే అబ్బాయి ఇలా చెప్తున్నాడు: “నాకు అలా జరిగినప్పుడు, చాలా బాధేసింది, ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఇక అప్పట్నుంచి నేను ఎవ్వర్నీ నమ్మలేకపోతున్నాను.”

 అలా ఎందుకు జరుగుతుంది?

 మెసేజ్‌ల వల్ల, సోషల్‌ మీడియా వల్ల, మీరంటే ఇష్టంలేని వ్యక్తికి కూడా మీరు తొందరగా దగ్గరయ్యే అవకాశం ఉంది. కొంతమంది యౌవనులు ఏమంటున్నారో చూడండి.

 “కొంతమంది టైం పాస్‌ కోసమే మెసేజ్‌లు పంపిస్తుంటారు. కానీ, వాళ్లకు మీమీద ఇష్టం ఉండబట్టే మెసేజ్‌ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. వాళ్లు మీకు ప్రతీరోజు మెసేజ్‌ చేస్తున్నారంటే, వాళ్లకు మీమీద చాలా ప్రేమ ఉందని మీరు పొరబడతారు.”—జెన్నిఫర్‌.

 “బహుశా, ఒక వ్యక్తి నిజంగా ఇష్టం ఉండే మేసేజ్‌ చేస్తుండవచ్చు. కానీ అవతలి వ్యక్తికి మాత్రం, కేవలం మాట్లాడుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలంతే.”—జేమ్స్‌.

 “జస్ట్‌ ‘గుడ్‌నైట్‌’ అని మెసేజ్‌ చేసినా, దాన్ని చదివే వ్యక్తికి అది రొమాంటిక్‌గా అనిపించవచ్చు. కానీ బహుశా దాన్ని పంపిన వ్యక్తి ఏ ఫీలింగ్స్‌ లేకుండా ఊరికే పంపించి ఉండవచ్చు.”—హేలీ.

 “మెసేజ్‌లో జస్ట్‌ ఒక ‘స్మైలీ’ పంపించినా, చదివే వ్యక్తి దాన్ని రొమాంటిక్‌గా తీసుకునే అవకాశం ఉంది. కానీ నిజానికి, అవతలి వ్యక్తి దాన్ని అలాంటి ఉద్దేశంతో కాకుండా, మామూలుగానే పంపించి ఉండవచ్చు.”—ఆలీసియా.

 ఒక్కమాటలో: మెసేజ్‌ పంపినంత మాత్రాన మీమీద ప్రేమ ఉందని ఊహించుకోకండి.

 అది చెప్పడం తేలికే, కానీ పాటించడం కష్టం. ఎందుకంటే, “హృదయం అన్నిటికంటే మోసకరం. దానికి ఘోరమైన రోగం ఉంది” అని బైబిలు చెప్తుంది. (యిర్మీయా 17:9పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మోసకరమైన హృదయం వల్ల మీరు గాలిలో మేడలు కట్టేస్తారు. నిజంగా అవతలి వ్యక్తికి మీమీద ప్రేమ లేదనీ, ప్రేమ ఉందని మీరు ఊహించుకున్నారనీ తెలిసినప్పుడు, ఆ మేడలు ఒక్కసారిగా కూలిపోతాయి.

 మీరేం చేయవచ్చు?

  •   ఆలోచించండి. ఊహల్లో నుండి బయటికి వచ్చి, అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నది ఏంటో, వాస్తవికంగా ఆలోచించండి. ఇలా ప్రశ్నించుకోండి, ‘అతనికి నా మీద ఇష్టం ఉందని అనుకోవడానికి ఏదైనా బలమైన ఆధారం ఉందా?’ మీ ఫీలింగ్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, మీ ఆలోచనా సామర్థ్యాన్ని సరిగ్గా ఉపయోగించలేరు.—రోమీయులు 12:1.

  •   వివేచించండి. అతనికి మీమీద ప్రేమ ఉందని మీకు ఎప్పుడెప్పుడు అనిపించింది? ఆ సందర్భాలన్నిటిలో, ప్రేమ ఉందని అతను చూపించాడా? లేక మీరే ఊహించుకున్నారా? ప్రేమ ఉందని మీకు అనిపించినంత మాత్రాన, అతనికి మీమీద ప్రేమ ఉండాలని లేదు.

  •   తొందరపడకండి. మిమ్మల్ని ఇష్టపడుతున్నానని అవతలి వ్యక్తి స్పష్టంగా చెప్పేంత వరకు, అతనిమీద అతిగా ఇష్టాన్ని పెంచుకోకండి.

  •   నిర్మొహమాటంగా మాట్లాడండి. ‘మాట్లాడేందుకు ఒక సమయం ఉంది’ అని బైబిలు చెప్తుంది. (ప్రసంగి 3:7పరిశుద్ధ బైబల్‌ తెలుగు: ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తనకు మీమీద ప్రేమ ఉందో లేదో అతన్నే అడిగి తెలుసుకోండి. వాలరీ అనే అమ్మాయి ఇలా చెప్తుంది, “ఒకవేళ ఆ వ్యక్తికి మీమీద ప్రేమ లేదని ఇప్పుడు తెలిస్తే, కొంచెమే బాధపడతారు. కానీ, ప్రేమ ఉందని ఊహించుకుని చాలా దగ్గరై పోయాక, ఆ విషయం తెలిస్తే, అప్పుడు మీ గుండె పగిలిపోతుంది.”

 ఒక్కమాటలో: ‘హృదయాన్ని భద్రంగా’ కాపాడుకోమని సామెతలు 4:23 చెప్తుంది. మీరు ఒకవ్యక్తిని ఇష్టపడుతుంటే, అతనికి/ఆమెకు కూడా మీమీద ఇష్టం ఉందోలేదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలా తెలుసుకోకుండానే వాళ్లకు దగ్గరవ్వాలనుకుంటే, రాయి మీద మొక్కను పెంచాలనుకున్నట్లే.

 ఒకవేళ అవతలి వ్యక్తి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని మీరు గ్రహిస్తే,—మీకు డేటింగ్‌ చేసేంత వయసుండి, మీరు దానికి సిద్ధంగా ఉంటే—ఇప్పుడు ఆ వ్యక్తితో సంబంధం కొనసాగించాలా వద్దా అనేది మీ నిర్ణయం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, భార్యాభర్తల అనుబంధం గట్టిగా ఉండాలంటే, వాళ్లిద్దరికీ ఒకే ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉండాలి, ఒకరితో ఒకరు నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలి, నిజాయితీగా ఉండాలి. (1 కొరింథీయులు 7:39) అలాచేస్తే, మంచి ఫ్రెండ్స్‌గా పరిచయమైన ఆ అమ్మాయి, అబ్బాయి మంచి ఫ్రెండ్స్‌లాగే కొనసాగుతారు.—సామెతలు 5:18.