యోహానుకు ఇచ్చిన ప్రకటన 14:1-20
14 నేను చూసినప్పుడు, ఇదిగో! ఆ గొర్రెపిల్ల+ సీయోను పర్వతం+ మీద నిలబడి ఉంది. ఆయన పేరు, ఆయన తండ్రి పేరు+ నొసళ్ల మీద రాయబడిన 1,44,000 మంది+ ఆయనతో పాటు ఉన్నారు.
2 ఆ తర్వాత, పరలోకం నుండి ఒక శబ్దం రావడం నేను విన్నాను. అది అనేక జలాల శబ్దంలా, పెద్ద ఉరుము శబ్దంలా ఉంది. నేను విన్న ఆ శబ్దం తమ వీణలు* వాయిస్తూ, పాడుతున్న గాయకుల స్వరంలా ఉంది.
3 వాళ్లు సింహాసనం ముందు, నాలుగు జీవుల+ ముందు, పెద్దల+ ముందు కొత్త పాట+ లాంటిది పాడుతున్నారు. దేవుడు భూమ్మీది నుండి కొన్న ఆ 1,44,000 మంది+ తప్ప ఇంకెవ్వరూ ఆ పాట నేర్చుకోలేకపోయారు.
4 వీళ్లు స్త్రీలతో సంబంధాలు పెట్టుకోకుండా తమను తాము స్వచ్ఛంగా ఉంచుకున్నారు. నిజానికి వీళ్లు పవిత్రులు.+ వీళ్లు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్లినా సరే, ఆయన వెంట వెళ్తూ ఉంటారు.+ వీళ్లు దేవుని కోసం, గొర్రెపిల్ల కోసం మనుషుల్లో నుండి ప్రథమఫలాలుగా+ కొనబడ్డారు.+
5 వీళ్ల నోళ్లలో ఏ మోసం కనిపించలేదు, వీళ్లు మచ్చలేనివాళ్లు.+
6 అప్పుడు ఆకాశం మధ్యలో* ఎగురుతున్న ఇంకో దేవదూతను నేను చూశాను. అతను భూమ్మీద నివసించేవాళ్లకు అంటే ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు నిత్యసువార్త* ప్రకటిస్తున్నాడు.+
7 అతను పెద్ద స్వరంతో ఇలా అంటున్నాడు: “దేవునికి భయపడండి, ఆయన్ని మహిమపర్చండి. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గంట వచ్చేసింది.+ కాబట్టి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటల్ని* చేసిన+ దేవుణ్ణే ఆరాధించండి.”
8 తర్వాత రెండో దేవదూత వచ్చి ఇలా అన్నాడు: “ఆమె కూలిపోయింది! మహాబబులోను+ కూలిపోయింది.+ లైంగిక పాపం* చేయాలన్న కోరిక* అనే తన మద్యాన్ని దేశాలన్నిటితో ఆమె తాగించింది.”+
9 వాళ్ల వెంట మూడో దేవదూత వచ్చి పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: “ఎవరైనా క్రూరమృగాన్ని,+ దాని ప్రతిమను పూజించి, నొసటిమీద గానీ చేతిమీద గానీ గుర్తు వేయించుకుంటే,+
10 అతను దేవుని కోపం అనే మద్యాన్ని కూడా తాగుతాడు. అది ఘాటైన మద్యం. దేవుడు తన ఆగ్రహం అనే గిన్నెలో దాన్ని పోస్తాడు.+ ఆ వ్యక్తి పవిత్ర దేవదూతల ముందు, గొర్రెపిల్ల ముందు అగ్నిగంధకాలతో+ బాధించబడతాడు.
11 వాళ్లను బాధించే అగ్ని నుండి వచ్చే పొగ యుగయుగాలు పైకి లేస్తుంది.+ వాళ్లకు అంటే క్రూరమృగాన్ని, దాని ప్రతిమను పూజించేవాళ్లకు, దాని పేరుకు సంబంధించిన గుర్తును వేయించుకునేవాళ్లకు+ రాత్రింబగళ్లు విశ్రాంతి ఉండదు.
12 అందుకే పవిత్రులకు, అంటే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసు మీదున్న విశ్వాసానికి కట్టుబడి+ ఉండేవాళ్లకు సహనం అవసరం.”+
13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం విన్నాను: “ఈ మాటలు రాయి: ఇప్పటినుండి ప్రభువు శిష్యులుగా* చనిపోయేవాళ్లు+ సంతోషంగా ఉంటారు. అవును, వాళ్లు చేసిన పనులు వాళ్లతోపాటే వెళ్తాయి కాబట్టి వాళ్లను విశ్రాంతి తీసుకోనివ్వమని దేవుని పవిత్రశక్తి చెప్తుంది.”
14 తర్వాత నేను చూసినప్పుడు, ఇదిగో! ఒక తెల్లని మేఘం కనిపించింది. దానిమీద మానవ కుమారుడి లాంటి ఒక వ్యక్తి+ కూర్చొని ఉన్నాడు. ఆయన తలమీద బంగారు కిరీటం ఉంది, ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
15 ఇంకో దేవదూత ఆలయం* నుండి బయటికి వచ్చి, మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తికి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు: “భూమ్మీది పంట పండింది, కోత కోసే సమయం* వచ్చేసింది కాబట్టి నీ కొడవలితో భూమ్మీది పంట కొయ్యి.”+
16 అప్పుడు మేఘం మీద కూర్చొని ఉన్న వ్యక్తి తన కొడవలితో భూమ్మీది పంటను కోశాడు.
17 ఆ తర్వాత ఇంకో దేవదూత పరలోకంలోని ఆలయం నుండి బయటికి వచ్చాడు. అతని చేతిలో కూడా పదునైన కొడవలి ఉంది.
18 అప్పుడు మరో దేవదూత బలిపీఠం వైపు నుండి వచ్చాడు. అతనికి అగ్ని మీద అధికారం ఉంది. అతను పదునైన కొడవలి పట్టుకొనివున్న దేవదూతకు పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు: “భూమ్మీదున్న ద్రాక్షపండ్లు పండాయి కాబట్టి నీ పదునైన కొడవలితో ద్రాక్షగెలల్ని కోసి సమకూర్చు.”+
19 ఆ దేవదూత తన కొడవలితో భూమ్మీదున్న ద్రాక్షతీగను కోసి ఆ తీగను, దానికున్న పండ్లను దేవుని కోపమనే పెద్ద ద్రాక్షతొట్టిలో పడేశాడు.+
20 ఆ ద్రాక్షతొట్టిని నగరం బయట తొక్కారు. అప్పుడు దానిలో నుండి రక్తం బయటికి వచ్చింది. ఆ రక్తం గుర్రం కళ్లెం అంత ఎత్తు వరకు, దాదాపు 300 కిలోమీటర్ల* దూరం వరకు ప్రవహించింది.
అధస్సూచీలు
^ ఇది ప్రాచీనకాల తంతివాద్యం; ఇప్పటి వీణలాంటిది కాదు.
^ లేదా “తల పైన.”
^ లేదా “శాశ్వతకాల మంచివార్త.”
^ లేదా “బుగ్గల్ని.”
^ లేదా “ఉద్రేకం.”
^ లేదా “ప్రభువుతో ఐక్యంగా ఉండి.”
^ అంటే, ఆలయంలోని అతి పవిత్ర స్థలం.
^ అక్ష., “గంట.”
^ అక్ష., “1,600 స్టేడియా.” అప్పట్లో ఒక స్టేడియం 185 మీటర్లతో (606.95 అడుగులతో) సమానం. అనుబంధం B14 చూడండి.