కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?—1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?

జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?—1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?

 జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?

 దేవుడే అన్నిటినీ సృష్టించాడని మీరు నమ్ముతారా? ఒకవేళ నమ్ముతున్నట్లయితే, మీరే కాదు చాలామంది యువతీయువకులు (అలాగే పెద్దవాళ్లు) కూడా ఇదే నమ్ముతున్నారు. అయితే కొంతమంది మాత్రం పరిణామ సిద్ధాంతాన్ని అంటే ఈ జీవం, విశ్వం వాటంతటవే వచ్చాయని నమ్ముతారు.

 మీకు తెలుసా? దేవున్ని నమ్ముతున్న వాళ్లయినా సరే, నమ్మని వాళ్లయినా సరే తమ నమ్మకాలు ఏమిటో వెంటనే చెప్తారుగానీ, ఎందుకలా నమ్ముతున్నారో మాత్రం వాళ్లకు తెలీదు.

  •   తమ గుడిలో లేదా చర్చిలో చెప్పారు కాబట్టి దేవుడే అన్నీ సృష్టించాడని కొంతమంది నమ్ముతారు.

  •   ఇంకొంతమందేమో తమ స్కూల్లో లేదా కాలేజీలో చెప్పారు కాబట్టే దేవుడు లేడని, జీవం దానంతటదే వచ్చిందని నమ్ముతారు.

 ఈ సిరీస్‌లో వచ్చే ఆర్టికల్‌లు దేవుడే అన్నిటినీ సృష్టించాడనే మీ నమ్మకాన్ని బలపర్చి, దాన్ని వేరేవాళ్లకు వివరించడానికి మీకు సహాయం చేస్తాయి. అయితే ముందు మీరు ఈ ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచించండి:

 దేవుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను?

 ఈ ప్రశ్న గురించి అసలు ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే మనసును, ‘పరీక్షించి తెలుసుకోగలిగే’ సామర్థ్యాన్ని ఉపయోగించమని బైబిలు మనకు చెప్తుంది. (రోమీయులు 12:1, 2) అంటే ...

  •  మీ ఫీలింగ్స్‌ వల్లో (మనకంటే గొప్ప శక్తి ఒకటి ఉందని నాకనిపిస్తుంది)

  •  చుట్టూ ఉన్న వాళ్లను చూసో (మా మతంలో అందరూ ఇలానే నమ్ముతారు)

  •  వేరేవాళ్ల ఒత్తిడి వల్లో (దేవుడు ఉన్నాడని నమ్మమని మా అమ్మానాన్నలు చెప్పారు)

 కాదుగానీ, దేవుడు ఉన్నాడని మీ అంతట మీరు నమ్మాలి. అలా నమ్మడానికి గల కారణాలు కూడా మీకు తెలిసుండాలి.

 ఇంతకీ, దేవుడు ఉన్నాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు? “దేవుడు ఉన్నాడని నేను ఎందుకు నమ్ముతున్నాను?” అనే వర్క్‌షీట్‌ మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. ఈ ప్రశ్నకు మిగతా యువతీయువకులు ఇచ్చిన జవాబులు కూడా మీకు సహాయం చేస్తాయి.

 “మన శరీరం ఎలా పనిచేస్తుందో మా టీచర్‌ చెప్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నాడని నాకు అనిపించింది. శరీరంలో ఉన్న చిన్నచిన్న అవయవాలతో సహా ప్రతీది ఏదో ఒక పనిచేస్తుంది. అవి ఆ పనులు చేస్తున్నాయని కొన్నిసార్లు మనకు కనీసం తెలీను కూడా తెలీదు. నిజంగా మనిషి శరీరం ఒక అద్భుతం.”—తెరేజా.

 “ఆకాశాన్ని తాకే భవనాలు, పెద్దపెద్ద ఓడలు లేదా కార్లు చూసినప్పుడు ‘వీటిని ఎవరు చేశారు’ అని ఆలోచిస్తుంటాను. తెలివైనవాళ్లు మాత్రమే కారును తయారు చేయగలరు. ఎందుకంటే ఆ కారులో ఉన్న ప్రతీ చిన్న వస్తువు సరిగ్గా పనిచేస్తేనే కారు నడుస్తుంది. ఎవరో ఒకరు తయారు చేస్తేనే కారు వచ్చింది అంటే, మనల్ని కూడా ఎవరో ఒకరు తయారుచేసి ఉండాలి.”—రిచర్డ్‌.

 “ఎంతో తెలివైన మనుషులకు కూడా విశ్వంలోని చాలా చిన్న విషయాలను తెలుసుకోవడానికి వందల ఏళ్లు పట్టింది. మరి అలాంటిది ఈ విశ్వమంతా దానంతటదే వచ్చిందని అనుకోవడంలో అర్థమే లేదు.”—కారన్‌.

 ‘సైన్సు గురించి నేర్చుకునే కొద్దీ జీవం దానంతటదే వచ్చిందని నమ్మడం నాకు చాలా కష్టమైంది. ఉదాహరణకు, సృష్టిలో ప్రతీది చక్కగా అమర్చి ఉన్నాయి. మనుషులను తయారు చేసిన విధానం ముఖ్యంగా మనం ఎవరం, ఎక్కడ నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలు తెలుసుకోవాలనే కోరిక మనలో ఉండడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పరిణామ సిద్ధాంతం మనుషుల్ని కూడా జంతువుల్లానే వివరిస్తుంది. కానీ, మనుషులు జంతువుల కన్నా ఎందుకు ఉన్నతమైన వాళ్లో వివరించలేకపోయింది. సృష్టికర్త ఉన్నాడని నమ్మడం కన్నా సృష్టి దానంతటదే వచ్చిందని నమ్మడమే నాకు కష్టమనిపిస్తుంది.’—ఆంథనీ.

 నా నమ్మకాల్ని ఇలా వివరిస్తాను

 కంటికి కనిపించని దాన్ని ఎలా నమ్ముతావని మీ స్నేహితులు మిమ్మల్ని ఎగతాళి చేస్తే మీరేం చేస్తారు? పరిణామ సిద్ధాంతాన్ని సైన్స్‌ రుజువు చేసిందని వాళ్లంటే మీరేం చెప్తారు?

 ముందుగా, మీరు నమ్ముతున్నది నిజమేనన్న ధైర్యంతో ఉండండి. మీ నమ్మకాల గురించి వేరేవాళ్లతో మాట్లాడడానికి సిగ్గుపడకండి లేదా భయపడకండి. (రోమీయులు 1:16) ఇవి గుర్తుంచుకోండి:

  1.   మీరు మాత్రమే కాదు, దేవుడు ఉన్నాడని చాలామంది నమ్ముతున్నారు. వాళ్లలో చాలా తెలివైనవాళ్లు, బాగా చదువుకున్నవాళ్లు కూడా ఉన్నారు. చాలామంది సైంటిస్టులు కూడా దేవుడున్నాడని నమ్ముతున్నారు.

  2.   దేవున్ని అర్థం చేసుకోలేని వాళ్లే మేము దేవున్ని నమ్మము అని చెప్తారు. వాళ్లు దేవుడు లేడని నిరూపించే బదులు, “దేవుడు నిజంగా ఉంటే లోకంలో ఇన్ని బాధలు ఎందుకున్నాయి?” అని తిరిగి ప్రశ్నిస్తారు. అలా వాళ్లు తెలివితో ఆలోచించాల్సిన విషయాన్ని ఫీలింగ్స్‌తో ముడిపెడతారు.

  3.   తనను తెలుసుకోవాల్సిన అవసరాన్ని దేవుడు ప్రతీ మనిషిలో పెట్టాడు. (మత్తయి 5:3) అంటే, దేవుడు ఉన్నాడని నమ్మాల్సిన అవసరం కూడా మనకు ఉంది. కాబట్టి దేవుడు లేడని ఎవరైనా అంటే, ఆ విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత వాళ్లదేగానీ మీది కాదు.—రోమీయులు 1:18-20.

  4.   దేవుడు ఉన్నాడు, ఆయనే అన్నీ చేశాడు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. జీవం దానంతటదే రాలేదనే విషయాన్ని ఇప్పటికే నిరూపించారు. అయితే, జీవంలేని వాటి నుండి జీవం వచ్చింది అనడానికి ఇప్పటివరకు ఏ ఆధారాలూ లేవు.

 దేవుడు ఉన్నాడనే మీ నమ్మకాన్ని ఎవరైన ప్రశ్నిస్తే మీరేం చేస్తారు? ఇలా చెప్పి చూడండి.

 ఎవరైనా ఇలా అంటే: “చదువుకోనివాళ్లు మాత్రమే దేవున్ని నమ్ముతారు.”

 ఇలా చెప్పి చూడండి: “మీరు నిజంగా అలా అనుకుంటున్నారా? నేనలా అనుకోవట్లేదు. పెద్దపెద్ద యూనివర్సిటీలకు చెందిన 1600 కన్నా ఎక్కువ మంది సైన్స్‌ ప్రొఫెసర్లను సర్వే చేసినప్పుడు, వాళ్లలో దాదాపు 33 శాతం మంది దేవున్ని నమ్ముతాం అన్నారు. a కేవలం దేవున్ని నమ్మినంత మాత్రాన వాళ్లను తెలివిలేనివాళ్లని అంటామా?”

 ఎవరైనా ఇలా అంటే: “దేవుడు నిజంగా ఉంటే లోకంలో ఎందుకు ఇన్ని బాధలు ఉన్నాయి?”

 ఇలా చెప్పి చూడండి: “అంటే దేవుడు మన బాధలను తీసేయడానికి ఏమి చేస్తున్నాడో మీకు అర్థం కావట్లేదని లేదా ఆయన మనకోసం ఏమీ చేయట్లేదని మీకనిపిస్తుంది. అంతేనా? [వాళ్లేమి చెప్తారో వినండి.] మనకు ఇన్ని బాధలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్నకు నేను చక్కని జవాబు తెలుసుకున్నాను. అయితే దాన్ని అర్థం చేసుకోవాలంటే బైబిలు ఏమి చెప్తుందో మనం పరిశీలించాలి. దీని గురించి ఎక్కువ తెలుసుకోవడం మీకిష్టమేనా?”

 జీవం దానంతటదే వచ్చిందని చెప్పే పరిణామ సిద్ధాంతాన్ని రుజువు చేసే సరైన ఆధారాలు ఎందుకు లేవో ఈ సిరీస్‌లోని తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.

a Source: Social Science Research Council, “Religion and Spirituality Among University Scientists,” by Elaine Howard Ecklund, February 5, 2007.