కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

నేను పచ్చబొట్టు వేయించుకోవచ్చా?

నేను పచ్చబొట్టు వేయించుకోవచ్చా?

 ఎందుకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది?

 “కొన్ని టాటూలు (పచ్చబొట్లు) అద్భుతమైన కళాఖండాలని నాకు అనిపిస్తుంది,” అని రీయన్‌ అనే యువకుడు అంటున్నాడు.

 పచ్చబొట్టు వేయించుకోవడం వెనుకున్న ఉద్దేశం, దాన్ని వేయించుకునే విషయంలో మీ అభిప్రాయంపై ప్రభావం చూపగలదు. ఉదాహరణకు, జిల్యన్‌ అనే టీనేజీ అమ్మాయి ఇలా అంటోంది: “నాతోపాటు చదివిన అమ్మాయి వాళ్ల అమ్మగారు, తన చిన్నప్పుడు చనిపోయారు. ఆ అమ్మాయి టీనేజ్‌కి వచ్చాక, తన మెడ వెనుక వాళ్ల అమ్మగారి పేరును టాటూ వేయించుకుంది. అలాంటి టాటూ చాలా చక్కగా ఉంటుందని నాకు అనిపిస్తుంది.”

 ఉద్దేశం ఏదైనా సరే, మీ చర్మపు పొరల్లో ఒక శాశ్వత ముద్ర వేయించుకునే ముందు దాని గురించి చాలా దూరం, చాలా లోతుగా ఆలోచించాలి. మీరు పచ్చబొట్టు వేయించుకోవాలని అనుకునేముందు, ఏ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి? మంచి నిర్ణయం తీసుకోవడానికి ఏ బైబిలు సూత్రాలు మీకు సహాయం చేస్తాయి?

 జవాబులు తెలుసుకోవాల్సిన ప్రశ్నలు

 ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? “టాటూలు చర్మాన్ని చీల్చుకుని లోపలికి వెళ్తాయి, అంటే చర్మ వ్యాధులు, మరితర సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు.” అని మయో క్లినిక్‌ వెబ్‌సైట్‌ చెప్తోంది. “కొన్నిసార్లు టాటూ చుట్టూ గ్రాన్యులోమస్‌ అనే దద్దుర్లు వస్తాయి. టాటూ వేయించుకోవడం వల్ల, గాట్లు పడ్డచోట కణజాలం పెరిగి చర్మం ఉబ్బెత్తుగా తయారయ్యే అవకాశమూ ఉంది,” అని కూడా ఆ వెబ్‌సైట్‌ చెప్తోంది. అంతేకాదు, ఆ వెబ్‌సైట్‌ ఇంకా ఇలా చెప్తోంది: “మీకు టాటూ వేయడానికి ఉపయోగించిన పరికరం రోగాన్ని కలిగించే రక్తంతో కలుషితమైతే, రక్తం ద్వారా వచ్చే రకరకాల అంటురోగాలు మీకు రావచ్చు.”

 నా గురించి ఎదుటివాళ్లు ఏమనుకుంటారు? మీకు ఇష్టమున్నా, లేకపోయినా మీ కనబడేతీరు, చూసేవాళ్లు మీమీద ఒక అభిప్రాయానికి వచ్చేలా చేస్తుంది. మీరు ఎదిగిన వ్యక్తా లేక పరిణతిలేని వ్యక్తా, నమ్మదగిన వ్యక్తా లేక బాధ్యతలేని వ్యక్తా అనేది మీరు కనిపించే తీరును బట్టి తెలుస్తుంది. “ఎప్పుడైనా ఒంటిమీద టాటూ ఉన్న వ్యక్తి నాకు కనిపిస్తే, అతను తాగుతూ పార్టీలు చేసుకునే టైప్‌ అని నాకు అనిపిస్తుంది,” అని సమంత అనే టీనేజ్‌ అమ్మాయి అంటోంది.

 పద్దెనిమిదేళ్ల మెలనీ, ఇంకో కోణాన్ని గమనించింది. ఆమె ఇలా అంటోంది: “నా దృష్టిలో, టాటూలు మన సహజ అందాన్ని దాచేస్తాయి. వాటిని వేసుకునేవాళ్లు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని చూపించుకోవడానికి ఇష్టపడరు, అందుకే తమను తాము టాటూల వెనుక దాచేసుకుంటారు.”

 ను దాన్ని ఎప్పటికీ ఇష్టపడతానా? కొంతకాలానికి, బరువు పెరిగినా లేదా కాస్త వయసు పెరిగినా పచ్చబొట్టు సాగిపోయి అందవికారంగా తయారయ్యే అవకాశం ఉంది. “కొన్ని దశాబ్దాల తర్వాత, చర్మం మీద టాటూలు ఎలా మారిపోతాయో నేను చూశాను. అవి ఏమాత్రం అందంగా ఉండవు,” అంటున్నాడు జోసెఫ్‌ అనే యువకుడు.

 “టాటూలు సాధారణంగా పాతవైపోతాయి,” అని 21 ఏళ్ల అలన్‌ అంటున్నాడు. అతను ఇంకా ఇలా అంటున్నాడు, “వేయించుకున్నప్పుడు బాగుందనిపించిన టాటూ, కొన్నేళ్లకే అనవసరం అనిపిస్తుంది.”

 అలన్‌ చెప్పింది మంచి పాయింట్‌. నిజమేంటంటే, వయసు పెరిగేకొద్దీ ఆలోచనలు మారతాయి, అభిరుచులు మారతాయి, ఆప్యాయతలు మారతాయి కానీ ఒంటిమీది పచ్చబొట్టు మారదు. “పనికిరాని ఆలోచనల్ని మాత్రమే గుర్తుచేసే ఒక టాటూ వేయించుకుని, కొన్నేళ్ల తర్వాత పశ్చాత్తాపపడాల్సిన విషయాల్లో మరోదాన్ని చేర్చుకోవడం నాకు ఇష్టంలేదు,” అని తరీస అనే యువతి అంటోంది.

 ఉపయోగపడే బైబిలు సూత్రాలు

 పరిణతిగల వ్యక్తి ఒక నిర్ణయం తీసుకునే ముందు, సమయం తీసుకుని అన్ని కారణాల్ని పరిశీలించి, ఆచితూచి అడుగేస్తాడు. (సామెతలు 21:5; హెబ్రీయులు 5:14) కాబట్టి, పచ్చబొట్టుల విషయంలో ఉపయోగపడే ఈ కింది బైబిలు సూత్రాలను పరిశీలించండి.

 •  కొలొస్సయులు 3:20: “పిల్లలారా, అన్ని విషయములలో మీ తలిదండ్రులమాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనతగినది.”

    మీరు మీ ఇంట్లో, తల్లిదండ్రులతో కలిసుంటూ వాళ్ల మాట వినకపోతే, ఎలాంటి ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు?

 •  1 పేతురు 3:3, 4: “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.”

    “హృదయపు అంతరంగ స్వభావము” గురించి బైబిలు ఎందుకు నొక్కిచెప్తుందని మీరు అనుకుంటున్నారు?

 •  1 తిమోతి 2:9: ‘స్త్రీలు అణుకువ, స్వస్థబుద్ధి గలవారై ఉండాలి.’

    అణకువ అంటే ఏమిటి? కాలం గడిచేకొద్దీ, శరీరం మీదుండే డిజైన్ల కంటే అణకువే ఎందుకు ఆకర్షణీయంగా ఉంటుంది?

 •  రోమీయులు 12:1: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి ... ఇట్టి సేవ మీకు యుక్తమైనది.”

    మీరు మీ శరీరాన్ని ఎలా చూసుకుంటున్నారనే విషయాన్ని దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు?

 ఈ కారణాల్ని దృష్టిలో ఉంచుకుని, చాలామంది పచ్చబొట్టు వేయించుకోకూడదని నిర్ణయించుకున్నారు. నిజానికి వాళ్లు టాటూల కంటే మంచి పద్ధతిని కనుగొన్నారు. పైన చెప్పిన తరీస ఇలా అంటోంది: “మీకు నిజంగా నచ్చిన మాటగానీ, వాక్యంగానీ ఉంటే దానికి అనుగుణంగా జీవించండి, మీకు ఒక వ్యక్తి చాలా ముఖ్యమైనవాళ్లైతే వాళ్లు మీకెంత ఇష్టమో వాళ్లతోనే చెప్పండి. మీరు నమ్మినదాన్ని టాటూగా వేయించుకునే బదులు దాన్ని ఆచరణలో పెట్టండి.”