యువత అడిగే ప్రశ్నలు
నాకు మంచిగా నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
మీరు మ్యాథ్స్‌లో ఫెయిల్ అవుతుంటే, ఇంకాస్త ఎక్కువ కష్టపడి చదవాలని మీకు అర్థమౌతుంది. మీరు ఆటల్లో అనుకున్నంత బాగా ఆడలేకపోతుంటే, ఇంకాస్త ఎక్కువ ప్రాక్టీసు చేయాలని మీకు అర్థమౌతుంది. కానీ ఈ రెండు విషయాల్లో మీరు మెరుగవ్వాలంటే మీకు కావాల్సింది, కంటినిండా నిద్ర. ఎందుకో పరిశీలించండి.
మీకు నిద్ర ఎందుకు అవసరం?
సాధారణంగా టీనేజర్లకు రాత్రిపూట దాదాపు ఎనిమిది నుండి పది గంటల నిద్ర అవసరమని నిపుణులు చెప్తున్నారు. మీరు సరిపడేంత నిద్రపోవడం ఎందుకు ప్రాముఖ్యం?
నిద్ర మీ ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతుంది. నిద్రపోవడం అంటే “మెదడుకు శక్తినివ్వడం.” కంటినిండా నిద్రపోవడం వల్ల బాగా చదవగలుగుతారు, ఆటలు బాగా ఆడగలుగుతారు, సమస్యల్ని బాగా పరిష్కరించుకోగలుగుతారు.
మీ ప్రవర్తన, మూడ్ మెరుగౌతాయి. నిద్రలేమితో బాధపడేవారి మూడ్స్ తీవ్రంగా ప్రభావితం అవుతుంటాయి. చిన్నచిన్న విషయాలకే బాధపడిపోతుంటారు, కృంగిపోతుంటారు, నలుగురితో కలవలేకపోతుంటారు.
యాక్సిడెంట్‌లు తప్పించుకుంటారు. నిద్రమత్తు వల్ల యాక్సిడెంట్ పాలయ్యేవాళ్లలో 40 నుండి 59 ఏళ్ల వాళ్లకన్నా, 16 నుండి 24 ఏళ్ల వాళ్లు రెండింతలు ఎక్కువ ఉన్నారని అమెరికాలో చేసిన ఒక పరిశోధన చెప్తుంది.
మరింత ఆరోగ్యంగా ఉంటారు. శరీరానికి అవసరమైన అన్ని రిపేర్లు మనం నిద్రపోతున్న సమయంలోనే జరుగుతాయి. పాడైన కణాలు, కణజాలాలు, రక్తనాళాలు బాగయ్యి శరీరం మంచి స్థితిలో ఉండడానికి నిద్ర సహాయం చేస్తుంది. హాయిగా నిద్రపోవడం వల్ల ఊబకాయం (ఒబెసిటి), మధుమేహం (షుగర్), పక్షవాతం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
ఫోన్ పనిచేస్తూ ఉండాలంటే దానికి ఛార్జింగ్ అవసరం, అదేవిధంగా మీరు చురుగ్గా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి
మీ నిద్రను దూరం చేస్తున్నవి ఏంటి?
ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, చాలామంది టీనేజర్లు సరిపడా నిద్రపోవట్లేదు. ఉదాహరణకు 16 ఏళ్ల ఇలాన్ ఇలా చెప్తోంది:
“టీచర్ మా క్లాస్‌లో వాళ్లను, రోజూ ఎన్ని గంటలకు నిద్రపోతారని అడిగింది. చాలామంది సుమారు ఉదయం 2 గంటలకు అని చెప్పారు. ఇంకొందరు సుమారు ఉదయం 5 గంటలకు అని చెప్పారు. ఒక అబ్బాయి మాత్రమే రాత్రి 9:30కి అని చెప్పాడు.”
దేనివల్ల ఆలస్యంగా నిద్రపోతున్నారు?
స్నేహితులు. “కొన్నిసార్లు ఏం పని లేకపోయినా అర్ధరాత్రి వరకు మేల్కొని సమయం వృథా చేస్తుంటాం. ముఖ్యంగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లినప్పుడు అలా జరుగుతుంటుంది.”—పమేలా.
పనులు. “నాకు నిద్రపోవడమంటే ఇష్టం. కానీ బిజీగా ఉండడం వల్ల సరిపడేంత నిద్రపోవడం కుదరడం లేదు.”—యాన.
టెక్నాలజీ. “నిద్రపోకుండా మేల్కొని ఉండడానికి నా ఫోనే పెద్ద కారణం. బెడ్ మీద పడుకున్నాక ఫోన్ చూడకుండా ఉండడం నా వల్ల కాదు.”—అనీస.
మీరు మంచిగా నిద్రపోవాలంటే ఏం చేయాలి?
నిద్రకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో పరిశీలించుకోండి. బైబిలు ఇలా చెప్తోంది: ‘రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాస ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు.’ (ప్రసంగి 4:6, NW) నిద్రను ఒక అవసరంగా చూడాలే గానీ విలాసంగా కాదు. కంటినిండా నిద్ర లేకపోతే సరిగ్గా పనిచేయలేరు, సరదాగా సమయం గడపలేరు!
నిద్రపోవడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో గుర్తించండి. ఉదాహరణకు, ఫ్రెండ్స్‌తో కలిసి అర్ధరాత్రి వరకు సమయం గడపడం మీకు అలవాటా? హోంవర్క్, ఇతర పనులు ఎక్కువగా ఉంటున్నాయా? ఫోన్ చూస్తూ లేట్‌గా పడుకుంటున్నారా? లేదా పడుకున్నాక మధ్యలో లేచి మెసేజ్‌లు చూస్తున్నారా?
ఆలోచించండి: మీకు ఆటంకంగా ఉన్న అలవాటును మార్చుకోవడానికి కాస్త కష్టపడాల్సి రావచ్చు, కానీ మార్చుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. బైబిలు ఇలా చెప్తుంది: ‘శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి.’ సామెతలు 21:5, NW.
నిజమే, చక్కగా నిద్రపోవడానికి ఒకరికి పనిచేసిన పద్ధతి మరొకరికి పని చేయకపోవచ్చు. ఉదాహరణకు, పగలు కొన్ని నిమిషాలు పడుకుంటే రాత్రి నిద్ర బాగా పడుతుందని కొందరు అంటారు. కానీ కొంతమందికి పగలు కాసేపు పడుకున్నా రాత్రి నిద్రపట్టదు. ఏం చేస్తే మీకు రాత్రి చక్కగా నిద్రపడుతుందో తెలుసుకోండి. బహుశా ఈ సలహాలు ఉపయోగపడతాయేమో చూడండి:
విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. మీరు నిద్రపోయే సమయానికన్నా కాస్త ముందే పనులు ముగించుకొని విశ్రాంతి తీసుకుంటే, త్వరగా నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.
“మీ పనులను, ఇతర బాధ్యతలను ముందుగానే ముగించుకోవడం మంచిది. అలా చేస్తే పడుకునే సమయంలో వాటిగురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.”—మరీయ.
ఏ పని ఎప్పుడు చేయాలో ప్రణాళిక వేసుకోండి. పరిస్థితులు మిమ్మల్ని నియంత్రించకుండా ఉండాలంటే ఏ పని ఎప్పుడు చేయాలో మీరే ప్రణాళిక వేసుకోవాలి. అప్పుడు సరిపడా నిద్రపోవచ్చు.
“నాకు ప్రతీరోజు దాదాపు ఎనిమిది గంటల నిద్ర కావాలి. ఒకవేళ ఏ రోజైనా కాస్త ముందుగా లేవాల్సిన పరిస్థితి వస్తే, ఎన్ని గంటలకు నిద్రపోతే ఎనిమిది గంటలు పడుకోవచ్చో లెక్కపెట్టుకుంటాను.”—విన్సెంట్.
రోజూ ఒకే సమయానికి నిద్రపోయేందుకు ప్రయత్నించండి. మీరు సరైన శిక్షణ ఇస్తే మీ శరీరం మీ మాట వింటుంది. ప్రతీరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. దీన్ని ఒక్క నెల ప్రయత్నిస్తే, ఫలితం మీకే అర్థమౌతుంది.
“రోజూ ఒకే సమయానికి పడుకుంటే, తర్వాతి రోజు మీ మైండ్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు ఏ పనైనా బాగా చేయగలుగుతారు.”—జరెడ్.
స్నేహితులతో గడిపే సమయాన్ని పరిశీలించుకోండి. అలవాట్ల విషయంలో “మితంగా ఉండాలి” అని బైబిలు మనకు చెప్తోంది. కాబట్టి మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తున్నారో పరిశీలించుకోండి.—1 తిమోతి 3:2, 11.
‘నేను సాయంత్రాలు స్నేహితులతో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలని తెలుసుకున్నాను. ఒకవేళ అలా తగ్గించుకోకపోతే తర్వాత ఏదోక విషయానికి సమయం సరిపోదు, సాధారణంగా నిద్రపోయే సమయమే తగ్గుతుంటుంది.’—రెబెక.
మీ ఫోన్‌కు కూడా విశ్రాంతి ఇవ్వండి! పడుకోవడానికి కనీసం గంట ముందే ఫోన్‌ను దూరంపెట్టండి. ఇంటర్నెట్ చూడాలని, స్నేహితులకు మెసేజ్ చేయాలని అనిపించినా ఫోన్ జోలికి వెళ్లకండి. నిజానికి కొంతమంది నిపుణులు ఫోన్, టీవీ లేదా ట్యాబ్ నుండి వచ్చే లైట్ వల్ల రాత్రిళ్లు సరిగా నిద్రపట్టదని చెప్తున్నారు!
“మీరు ఫోన్‌లో 24 గంటలూ తమకు అందుబాటులో ఉండాలని మీ స్నేహితులు అనుకోవచ్చు. కానీ మీకు మంచి విశ్రాంతి దొరకాలంటే ఫోన్‌ను దూరం పెట్టాల్సిందే.”—జూలిస.