యువత అడిగే ప్రశ్నలు
మేము పెళ్లికి ముందే విడిపోవడం మంచిదా? (2వ భాగం)
పెళ్లికి ముందే విడిపోవాలనుకుంటే మీరేమి చేయవచ్చు? సరిగ్గా మాట్లాడుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. ఎలా?
ముందు ఇతరులు మీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో ఆలోచించండి. (మత్తయి 7:12) మీకు ఆ విషయం అందరి ముందు చెప్తే మీరు ఇష్టపడతారా? బహుశా ఇష్టపడరు.
మీరు వాళ్లతో విడిపోవాలనుకుంటున్న సంగతి ఫోన్లోగానీ, మెసేజ్ ద్వారా గానీ, మెయిల్ ద్వారా గానీ వాళ్లకు చెప్పకండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే అలా చేయాలి. ఇలాంటి పెద్దపెద్ద విషయాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి తగిన సమయాన్ని, స్థలాన్ని ఎంచుకోండి.
ఇక మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు ఏం మాట్లాడాలి? క్రైస్తవులు ఒకరితో ఒకరు “నిజమే మాట్లాడవలెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు.—ఎఫెసీయులు 4:25.
అలాంటప్పుడు మీ అభిప్రాయాలను చాకచక్యంగానే అయినా దృఢంగా చెప్పాలి. మీ ఇద్దరి మధ్య సంబంధం చక్కగా కొనసాగదని మీకు ఎందుకు అనిపిస్తుందో స్పష్టంగా వివరించండి.
వాళ్లలో ఉన్న లోపాలు లేక వాళ్లలో మీకు నచ్చని విషయాల లిస్టు చెప్పడం మొదలుపెట్టకండి. నిజానికి “మీరు ఇది చెయ్యరు” లేక “మీరు అది చెయ్యరు” అని చెప్పే బదులు “నాకు ఎలాంటి వ్యక్తి కావాలని అనుకుంటున్నానంటే ...” లేక “మనిద్దరం కలిసి జీవించలేమని నాకు ఎందుకు అనిపిస్తుందంటే ...” లాంటి మాటలతో మీ ఇష్టాయిష్టాలను, భావాలను జాగ్రత్తగా వివరించడానికి ప్రయత్నించండి.
ఈ సమయంలో మీరు మీ అభిప్రాయాల మీద ఊగిసలాడకూడదు. అలాగే అవతలి వాళ్లు మిమ్మల్ని ఒప్పించడానికి చేసే ఏ ప్రయత్నానికి లొంగిపోకూడదు. మీరు చిన్నచిన్న కారణాలను బట్టి విడిపోవట్లేదని గుర్తుంచుకోండి. అవతలి వ్యక్తి మీకు తెలియకుండానే మీ మనసు మార్చే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి వాటికి లొంగిపోకుండా జాగ్రత్తపడండి. లోరీ అనే అమ్మాయి ఇలా అంటుంది, “నేను మా సంబంధాన్ని తెంచేసుకున్నాక నా పాత బాయ్‌ఫ్రెండ్ ఎప్పుడూ కృంగిపోయినట్టే కనిపించేవాడు. నా వల్లే అతను అలా అయిపోయాడని నేను బాధపడడానికే అలా చేసుంటాడు. నేనూ బాధపడ్డాను. కాని అతన్ని చూసి నా నిర్ణయాన్ని మార్చుకోలేదు.” లోరీలాగే మీకేం కావాలో స్పష్టంగా తెలుసుకోండి. మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. వొద్దు అంటే వొద్దు అన్నట్లే ఉండండి.—యాకోబు 5:12.