యువత అడిగే ప్రశ్నలు
మేము పెళ్లికి ముందే విడిపోవడం మంచిదా? (1వ భాగం)
కొన్నిసార్లు పెళ్లికి ముందే విడిపోవడం చాలా మంచిది. జిల్ అనుభవాన్ని గమనించండి. ఆమె ఇలా అంటుంది, “మొదట్లో నా బాయ్‌ఫ్రెండ్ నేను ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో ఉన్నాను అని ఎప్పుడూ ఆరా తీయడం నాకు చాలా సంతోషంగా అనిపించేది. కానీ చివరకు అది నేను అతనితో తప్ప మరెవరితోనూ సమయం గడపలేని పరిస్థితికి దారితీసింది. నేను నా కుటుంబ సభ్యులతో, మరిముఖ్యంగా మా నాన్నగారితో సమయం గడిపినప్పుడు అతను చాలా అసూయ పడేవాడు. అతనితో నా సంబంధం తెంచేసుకున్న తర్వాత నా భుజాల మీద నుండి బోలెడంత బరువు దిగిపోయినట్లు అనిపించింది.”
శారాకు కూడా ఇలాంటి అనుభవమే ఉంది. ఆమె డేటింగ్ చేస్తున్న జాన్ వ్యంగ్యంగా మాట్లాడడం, పెత్తనం చేయడం, మొరటుగా ప్రవర్తించడం మెల్లమెల్లగా గమనించింది. ఆమె ఇలా గుర్తు చేసుకుంటుంది, “ఒకసారి తను ఇంటికి మూడు గంటలు ఆలస్యంగా వచ్చాడు. మా అమ్మ తలుపు తెరిచినప్పుడు ఆమెను అస్సలు పట్టించుకోకుండా ఇలా అన్నాడు, ‘వెళ్దాం పద. మనం లేటయ్యాం.’ ‘నేను’ లేటుగా వచ్చాను అనకుండా ‘మనం’ లేటయ్యాం అని అన్నాడు. అతను క్షమాపణ చెప్పడం గానీ, ఎందుకు లేటుగా వచ్చాడో దానికి కారణం చెప్పడం గానీ చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా అతను మా అమ్మను గౌరవించి ఉండాల్సింది.”
నిజమే, ఒక చిన్న పొరపాటు లేక బాధ కలిగించే పని వల్ల సంబంధాన్ని తెంచుకోవాల్సిన అవసరం లేదు. (కీర్తన 130:3) కానీ జాన్ మొరటుగా ప్రవర్తించిన తీరు అతను ఒక్కసారి చేసింది కాదు. అతని ప్రవర్తనే అంత అని ఆమె గ్రహించింది. అతనితో తన సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది.
జిల్, సారాలకులాగే మీరు డేటింగ్ చేసే వ్యక్తి కూడా మీకు తగిన వ్యక్తి కాదని మీకనిపిస్తుందా? అలాగైతే మీ భావాలను కొట్టిపడేయకండి. మీకు కష్టంగా అనిపించినా మీ సంబంధాన్ని తెంచేసుకోవడమే మంచిది. ఎందుకంటే “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును” అని సామెతలు 22:3 చెప్తుంది.
నిజమే, విడిపోవడం అంత సులభం కాదు. కానీ పెళ్లి చిరకాలం ఉండే బంధం. కాబట్టి పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడడం కంటే ఇప్పుడు కొంతకాలం బాధపడడమే మంచిది కదా!